11/29/11

తూర్పు వెళ్ళే మనసు
నల్లటి మెట్లు, మెట్లపక్కన పిట్టగోడ మీదుగా పాకిన సన్నజాజి పందిరి, మెట్ల మళుపుకి పక్కగా నల్లటి ఇనప చువ్వల కటకటాలు, దాని మీదుగా పాకిన రాధా మనోహరాల చెట్టు, వాటి మీదుగా ఇంకాస్త ముందుకి వెళితే బల్లల గది.
గచ్చు బదులు బల్లలు పేర్చి కట్టిన డాబా పైన గది. నాకూ నాతో పాటూ నా cousines ముగ్గురూ, మాతో సమానం గా అల్లరి చేసిన పిన్నిలు, చిన్న మావయ్యా...మా అందరి వూహలకీ రెక్కలొచ్చిన పొదరిల్లు ఆ బల్లల గది.

మా కలల ప్రపంచానికి తలుపులు తెరిచి స్వాగతం పలికిన హరివిల్లు ఆ గది.

కాస్త గట్టిగా నడిచినా పెద్దగా చప్పుడు చేసి, కింద నుంచి పెద్దవాళ్ళ చేత "ఏవిటా అల్లరి?" అని అక్షింతలు వేయించి నవ్వుకున్న చిలిపి కిట్టయ్య లాంటి గది.

చీమల్లా అలికిడి కాకుండా ఆ గదిలో దూరి, కట్టుకున్న పేక మేడలు, చెప్పుకున్న కబుర్లూ, కలబోసుకున్న స్కూలు అనుభవాలూ, చదివిన చందమామ కథలని నాటికలుగా మార్చి రాసుకుని, పెద్దవాళ్ళంతా చాయ్ తాగే వేళకి వాళ్ళముందు మా రాతలకి దృశ్య రూపం ఇచ్చేసి.. బుల్లి నటీ నటులుగా కొట్టించుకున్న చప్పట్లు, పోటా పోటీలుగా ఆడుకున్న అంత్యాక్షరులూ, తాతగారి పందిరి మంచం ఎదురుగా వుండే పెద్ద వుయ్యాలాతో చేసిన ఫీట్లూ, తగిలించుకున్న దెబ్బలూ, తాతగారితో కలిసి పెద్దవాళ్ళకి తీసిపోకుండా ఆడిన పేకాటలు, ఆయన పెద్ద విస్తరాకు కంచం...వెండిపువ్వుల పీట కోసం పడ్డ పోటీలూ, వాటిని తీర్చడానికి పెద్దాళ్ళ ఆపస్సోపాలూ, సంజె వేళ పెరట్లో చేసిన భోజనాలు, ఆటల మధ్య మా అలకలూ,పేచీలూ...మర్నాడు ఉదయానికి ఏమీ ఎరగనట్టు కలిసిపొయిన చిన్నారి స్నేహాలూ...

ఇంచుమించు ఇరవై మంది పూటకో గంట మాత్రం వదిలే కుళాయి నీళ్ళతో సద్దుకుని మహదానందంగా గడిపిన ఎర్రటి ఎండాకాలం సెలవలు...ఆశా సౌధాలకి పునాదులు వేసుకున్న అమ్మమ్మ గారింటి జ్ఞాపకాలు...


                                *******************************************

పెరటి వేపు నల్లటి పెద్ద గేటు మీద పాకిన రాధామనోహరాలు...

డాబా మీదుగా చూస్తుంటే కనబడే హరేరాం మైదానం, దాని మధ్యలో వుండే రాములవారి కోవెలా, దాని వెనకాలే వుందని నేను చాలా రోజులు భ్రమపడినా, దూరం గా వుండే నరసిమ్హస్వామి కొండ...

డాబాపైన చెక్క కటకటాళ్ళ వరండా...ఒక్కో గోడకీ పది కిటికీలు వాటికి బుల్లి బుల్లి తలుపులూ వుండే కిటికీల గదీ...గది చుట్టూ బీరువాల్లో పేర్చిపెట్టిన తాతగారి అపురూపమైన ఆస్తి ...ఆయన పుస్తక సంపద.

ఇంటి వెనకాల పెద్ద బావీ, పెరడంతా నీడనిస్తూ మావిడి చెట్టూ. పొద్దున్నే పలకరిస్తూ తులసమ్మ ఎదురుగా ముద్దమందారాల చెట్టూ.

సెలవలకి ఎప్పుడొస్తానని నాలుగురోజుల ముందునుంచే వాకబు చేస్తూ , నేను వచ్చిన ఐదునిమిషాల్లో ప్రత్యక్షమయ్యి వాళ్ళతో ఆటలకి లాక్కెళ్ళిపోయే నా బుల్లి నేస్తాలూ.

మధ్యాహ్నం గాళుపు కొడుతోందని ఇంట్లో పెట్టి ఎన్ని గడియలు వేసినా చల్లగా జారుకుని చెట్ల నీడలో ఆడిన గుజ్జినగూళ్ళు, పప్పు బెల్లాలతో చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు.

మామ్మ చెలులతో కలిసి ఆడిన గవ్వలాటలూ.

తాతగారిని మధ్యాహ్నం వేళ కునుకు తియ్యనివ్వకుండా వేసిన యక్ష ప్రశ్నలూ, ఆయన చెయ్యి  పట్టుకుని గర్వం గా చేసిన సాయంత్రం షికార్లూ.

వీధరుగు మీద మామ్మ వడిలో తల పెట్టుకుని నూట యాభయ్యో సారి కూడా విసుగు లేకుండా రామాయణ కధ చెప్పించుకున్న వెన్నెల రాత్రులు.

నా కోసం ప్రత్యేకం గా ఫ్రిజ్జు లోంచి గడ్డ పెరుగు తీసి చక్కెర చల్లి ఇచ్చే పక్కవాటాలో అద్దెకుండే ఆంటీ, నన్ను చూసి కేరింతలు కొట్టే ఆంటీ వాళ్ళ చిచ్చరపిడుగూ.

మనసులో మెదిలినప్పుడల్లా కళ్ళలోకి సన్నటి నీటిపొరని మోసుకొచ్చే మామ్మ గారింటి జ్ఞాపకాలు...


                                       *******************************************


ఇప్పుడా బల్లల గది లేదు. కిటికీల గది వుందో లేదో తెలీదు.

భౌతికంగా శిధిలమైపోయినా జ్ఞాపకాల వాకిట్లో మాత్రం ప్రాణం పోసుకుని సజీవంగా వున్నాయి. ఆ రోజులు తిరిగి రాకపోవచ్చు. చెదరని ఆ జ్ఞాపకాల జల్లులు మాత్రం మనసు మీద దాడి చేసినప్పుడల్లా వాటితో పాటుగా బోలెడంత వుత్సాహాన్ని కూడా మూటకట్టుకుని తీసుకొస్తాయి.

మనిషి ప్రయాణం పడమటికే ఐనా మనసు ఎప్పటికప్పుడు తూరుపు వెళ్ళే రైలు ఎక్కేస్తూనే వుంటుంది ఉదయ సంజె వెలుగుల్ని పలకరించి రావటానికి.

మనిషి time machine ఎక్కి వెనక్కి వెళ్ళలేకపోవచ్చు. మనసు మాత్రం ఏ technology తో పని లేకుండా తనకి కావల్సినప్పుడల్లా రోజు వారీ పనుల్లోంచి విరామం తీసుకుని  రెక్కలు కట్టుకుని వెనక్కి ఎగిరిపోగలదు. జ్ఞాపకల వీధుల్లో షికార్లు కొట్టి తాజా పరిమళాలనద్దుకుని వర్తమానం వాకిట్లో వాలిపోగలదు...


 జ్ఞాపకాలు...కాస్త పరుగాపి చతిగిలబడి కళ్ళు మూసుకుంటే తలపుల ముంగిట్లో ప్రత్యక్షమయ్యే చెక్కు చెదరని  స్మృతుల తేనె చినుకులు. ఎప్పటికప్పుడు మనసుకి కొత్త వుత్తేజాన్ని ఇచ్చి పరుగులు పెట్టించడానికి దొరికే పని విరామాలు. తరవాతి తరాలకి "మా చిన్నప్పుడు" అని చెప్పుకోడానికి మనసుపొరల్లో నిక్షిప్తమయ్యే నిధి నిక్షేపాలు. విరగబూసిన రాధామనోహరాల సుగంధాన్ని తమతో పాటు మోసుకొచ్చే సీతాకోక చిలుకలు...

(ఈ మధ్యే అమ్మమ్మ వూరు వెళ్ళొచ్చిన cousine ముఖపుస్తకం లో పెట్టిన update తో...మనసులో మెదిలిన జ్ఞాపకాల పరంపర కి అక్షర రూపం.)

11/21/11

కనువిందు చేసిన బాపూ గీసిన రామరాజ్యం
నేనెప్పుడూ సినిమా రివ్యూ రాయలేదు...రాద్దామని ఏనాడూ అనుకోనూలేదు. ఇప్పుడు రాస్తున్నది రివ్యూ అనికూడా అనుకోవడంలేదు...శ్రీరామరాజ్యం చిత్రం చూసిన తర్వాత రెండురోజులయినా విడిచిపెట్టని ఒక అనుభూతిని నా బ్లాగుచదివే కొంతమందితోనయినా పంచుకోవాలని రాస్తున్నానంతే

రమణ గారి హంసగీతం అని ఒకాయన రాసిన రివ్యూలాంటిది చదివాక చూసితీరాలనిపించి మావారిని బతిమాలి మరీ లాక్కెళ్ళాను శనివారం సాయంత్రం...మావారు పెద్దగా సినిమాలమీద research ఏమి చెయ్యరు నాలాగ. రాముడి పాత్రలో కూడా బాలకృష్ణ తొడగొడతాడు చూడు అని ఏడిపిస్తూనే వున్నారు సినిమా మొదలయ్యేవరకూ...

ఒక్కసారి సినిమా మొదలయ్యాక మాత్రం రాముడూ సీతలమధ్యకి మమ్మల్నీ లాక్కువెళిపోయింది...చూస్తున్నంతసేపూ పెద్దగా analysis ల వైపు పోలేదు బుర్ర. చాలాకాలం తర్వాత లీనమైపోయాననిపించిన సినిమా...తెలుసున్న సీతారాముల కథే ఐనా రెండు మూడు చోట్ల కళ్ళు చెమర్చాయి. ఒక సినిమా చూస్తూ ఆ పాత్రకి connect ఐపోయి ఆ పాత్ర కష్టానికి కంటతడి పెట్టిన సినిమా ఈమధ్య కాలంలో చూసిన గుర్తు లేదు.(కొన్ని పాత సినిమాలు మళ్ళీ చూసినప్పుడు ఆ అనుభూతి మళ్ళీ కలిగిన సందర్భాలు చాలానే వున్నాయనుకోండి)

చూసి ఇంటికొచ్చినదగ్గరనుండీ ఆ పాటలే వింటున్నాం. అదీ సంగీతం...వాటి సాహిత్యం గురించి చెప్పాలంటే. చిన్న చిన్న మాటలతో ఎంతో అర్ధవంతం గా రాసిన జొన్నవిత్తుల గారి సాహిత్యానికి ఇళయరాజా ఇచ్చిన సంగీతం నాకైతే చాలా నచ్చింది. ఎక్కడా వాయిద్యాలు సాహిత్యాన్ని మించిపోయి మాట వినపడకుండా చెయ్యలేదు. చిన్న పిల్లలు కూడా చక్కగా పట్టుకుని పాడుకునేలా వున్నాయి పాటలు. బొమ్మాళీ నిన్నొదలా వొదలా అని నా కూతురు TV చూసి పాడేస్తుంటే చూసి బెంగపడే నాలాంటి తల్లులకి ఒక చిన్న relief.  ఈ పాటలు కొన్నిరోజులైనా TV ల్లో మారుమ్రోగితే ఇవి కాస్తైనా వంటపట్టించుకుటారుకదా పిల్లలు అన్న ఆశ.

సినిమా చూస్తున్నంత సేపూ అందులో నటులెవ్వరూ గుర్తురాలేదు...ఆ పాత్రలే కనిపించాయి. ఒక image వచ్చేసిన నటులందరితో వాళ్ళ మ్యానరిజంస్ ఎక్కడా బయటకీ రాకుండా నటింపచేసిన బాపూ గారికీ ఆయనకి గౌరవం ఇచ్చి, తోచినట్టు కాకుండా చెప్పినట్టూ , ఆయన గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా నటించిన పెద్ద పెద్ద నటులందరికీ కూడా జోహార్లు చెప్పి తీరాలి.

ముఖ్యంగా చెప్పాల్సింది నయనతార గురించే. మిగిలిన వాళ్ళందరికీ పౌరాణికాల్లో కాస్తో కూస్తో అనుభవమైనా వుంది. నయనతార అనగానే ఇంక చూసినట్టే అనుకున్నవాళ్ళల్లో  నేనూ వున్నాను. కానీ చూస్తున్నంతసేపూ సీతమ్మే కనిపించింది. ఎంతో గౌరవం కూడా కలిగింది. చాలా హుందాగా తను సీత బాధని అనుభవించి మరీ చేసిందనిపించింది. అలాగే బాలహనుమంతుడిగా వేసిన చిన్నపిల్లాడు కూడా ఒదిగిపోయాడు. హనుమంతుడు మారువేషంలో సీతమ్మతో పాటే వుండిపోయాడని చేసిన మార్పు ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. పైపెచ్చు ఇలాగే చేసి వుంటాడేమో అనిపించింది. తాను గీసిన బొమ్మలతో పూర్వ రామాయణం మొత్తం పేర్లు పడుతున్నంత సేపూ చూపించటం కూడా ఎంతో చక్కగా వుంది.

మాటలగురించి చెప్పాల్సినదేముంది. రమణ గారి బుడుగు చదువుతూ పెరిగినదాన్ని. అది చిన్నపిల్లకోసం రాసినట్టే ఈ కాలం పిల్లలకి వాళ్ళకర్ధమవ్వటానికి ఆయన రాసిన సీతారాముల కధ అనిపించింది.

క్రితం సంవత్సరం మేము india వెళ్ళినప్పుడు దసరా రోజున  పండగ సందర్భంగా ఒక channel లోలవకుశ  వేస్తుంటే, పిల్లలకి ఆ సినిమా చూపించటానికి పెద్దవాళ్ళంతా నానా తంటాలు పడ్డారు. ఆఖరికి భయపెట్టి మరీ కూచోపెట్టాల్సొచ్చింది. కూచున్నారే గానీ బుంగమూతులు పెట్టుకుని ఎప్పుడైపోతుందిరా భగవంతుడా అన్నట్టు కూచుని మధ్యలో ప్రకటనలొచ్చినప్పుడు జాగ్రత్తగా ఒక్కొకళ్ళూ తుర్రుమన్నారు. వాళ్ళకి ఆ సినిమాలో మాటలు greek, latin లా అనిపించడంలో చిత్రమేమీ లేదు. లవకుశేగా మళ్ళీ తియ్యటమెందుకూ అనుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఇదేనేమో అనిపించింది. ప్రతీ తరంలో ఆ సమయానికి తగ్గట్టు ఒకసారి ఇలాంటి చిత్రాలు తీయటం మంచిదని. ఈ తరానికి కూడా తాము ఎంతగానో నమ్మిన సీతారాముల కధని చేర్చడమనే బాధ్యత తమ భుజాలపై వేసుకున్నారు బాపూరమణలు.

కనులకి విందు
చెవులకి ఇంపు
మనసుకి మధురానుభూతి...

ఇది రమణ రాసి...బాపూ గీసిన సీతారామ చరితం..

9/12/11

గుప్పెడంత ప్రపంచంస్కూల్లో చదివే రోజుల్లో హెడ్ మాస్టారితో మొదలుకుని...నాకన్నా పైన, కింద తరగతి విద్యార్ధుల వరకూ తెలుగు మాస్టారి అమ్మాయి అని పిలుస్తుంటే తెగ వుడుక్కునే దాన్ని...నాకు పేరు వుంది గా అని..బురద రోడ్డు మీద జారి పడ్డప్పుడో...మొయ్యలేక మొయ్యలేక ఏ కూరల సంచో మోసుకొస్తున్నప్పుడో అయ్యో నువ్వు మాట్టారి గారి పాపవి కదమ్మా అంటూ చూసి ఎవరైనా వచ్చి సాయం చేసినప్పుడు అడగకుండా అప్పనంగా వచ్చిన ఆ దన్ను గొప్పతనం అప్పుడర్ధం అయ్యేది కాదు..

అమ్మమ్మ వూరికి వెళ్ళినప్పుడు...వుయ్యాలా తాతగారి అమ్మాయీ మనవరాలూనూ...అని దార్లో నే మొదలయ్యే పలకరింపులూ......మామ్మ గారింటికి వెళ్ళేటప్పుడు  మీ  అబ్బాయిగారూ వాళ్ళూ వస్తున్నారండోయ్ అని మాకంటే ముందుగానే ఇల్లు చేరిపోయే కబురులు...ఇవన్నీ చూసినప్పుడు కాస్త గర్వం గానే అనిపించినా ఏమీ కష్టపడకుండా వచ్చేసిన ఆ గుర్తింపు విలువ మాత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదు

జీవితపు నిచ్చెన పైకి ఒక్కో మెట్టూ ఎక్కుతూ......ఇంటి నంబర్లు తప్ప ఫలానా వాళ్ళ ఇల్లు అంటే ఎగా దిగా చూసే metropolitan city లకి తరలి పోతున్న కొద్దీ, ఆప్యాంగా పలకరించే పక్కింటి అత్తయ్య గారూ....ఆపదలో మేమున్నామంటూ తొంగిచూసే ఎదురింటి పిన్ని గారూ.... కష్టం సుఖం విని పెట్టే వెనకింటి వదిన గారూ కనుమరుగైపోతుంటే కొంచెం కొంచెం గా తెలిసొచ్చింది రక్త సంబధాలతో పని లేని ఆ బంధాల విలువ. నాన్నగారు వూరెళితే రాత్రికి సాయం పడుకునే పక్కింటి పెద్దమ్మలూ...అమ్మకి పని పడితే చక్కగా జడలు వేసి స్కూలుకి పంపే పిన్నమ్మలు...ఈ హడావిడి ప్రపంచలో వాళ్ళ వాళ్ళ పనుల్లో పడి పరిగెడుతూ జ్ఞాపకాల్లోనే ఆగిపోయారు...ఆఫీసు నుంచి రావటం కాస్త ఆలస్యం ఐతే పిల్లని చూసుకునే పొరుగింటి అమ్మమ్మలూ...వొంట్లో నలత గా వుంటే కాస్త కూరో నారో వండిచ్చే ఇరుగింటి మామ్మలూ కనిపించక నేటి "ఆధునిక స్త్రీ" ఆఫీసు తలనొప్పులకి తోడుగా కొండంత insecurity ని మనసులో మోసుకుంటూ పైకి గుంభనగా తిరిగేస్తూ ముఫ్ఫై యేళ్ళకే అరవయ్యేళ్ళకి సరిపడా రోగాలన్నీ కొనితెచ్చేసుకుంటోంది.....

ఎక్కడెక్కడి friends నో ఈ social networking పుణ్యమా అని భలేగా కలుస్తున్నాం కదా అంటే.....ఎప్పటివాళ్ళనో కలవటం బానే వుంది గాని నీ పక్కింట్లో వున్న వాళ్ళెవరో నీకు తెలుసా అన్నాడు నా cousin. నిజవే మరి...ఏడాదిన్నర గా అదే ఇంట్లో వుండి నా చుట్టూ వున్న ఇళ్ళల్లో వున్న వాళ్ళ మొహాలు కూడా తెలియని పరిస్థితి..ఇది నా ఒక్క దానిదే కాదు దాదాపు నా generation లో చాలా మందిది. మునుపటి రోజుల్లో వూళ్ళు చదువులు...ఇళ్ళూ ఎన్ని మారినా ఎక్కడికక్కడ కొత్త ప్రపంచం ఏర్పరుచుకో గలిగే వాళ్ళం కాబట్టి పాత స్నేహితులని కొన్నాళ్ళు గుర్తొచ్చి బెంగపడినా నెమ్మదిగా మర్చిపోగలిగేవాళ్ళం ...మరి ఇప్పుడూ ఇంటి చుట్టూ వున్న మొహాల ఆనవాలు తెలియవు...ఆఫీసుకి వెళితే శత్రు సైన్యం తో కలిసి కూచుని చదరంగం ఆడటమే...ఎవరి నవ్వు ముఖం వెనక ఏ ఆపద దాగివుందో తెలుసుకోవటం బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు. పాత స్నేహితులని వెతికి వెతికి పట్టుకుని వాళ్ళతోనే ముచ్చట్లాడుకోవటం వెనక...social networking సైట్లు దిన దిన ప్రవర్ధమానంగా వెలిగిపోవటం వెనక వున్న కారణం పక్కనే వున్న వాడితో సర్దుకుపోలేకపోవటం...రేపు ఏదైనా గొడవొస్తే ఎల్లుండి వాడి మొహమెలా చూడటం అని ఇవాళ ఆ మొహమెలా వుంటుందో తెలుసుకోకపొవటమే మంచిదని వూరుకోవటం. కప్పు పాలు...రెండు స్పూన్ల పంచదార అప్పడగటానికి, శ్రావణ మంగళవారం నోముకి ముత్తైదువులకీ కూడా Networking సైట్లనే పట్టుకుని వేళ్ళాడుతున్నామంటే ...మనకి కరువైన ఇరుగుపొరుగు ప్రపంచం మనల్ని చూసి వెక్కిరించినట్టనిపిస్తుంది...

తాతగారిని మా ఇంట్లో ఇంకో నాలుగు రోజులు వుండమని బ్రతిమాలుతుంటే ఇల్లు ఏమైపోతోందో అని మూడో రోజునుండి నసగడం మొదలెట్టి నాలుగో రోజుకల్లా కట్టిన తిరుగు ప్రయాణాలు..అమ్మమ్మా వాళ్ళని మావయ్య తనుండే చోటుకి తీసుకెళితే అక్కడ వూపిరాడటం లేదని నెలలోనే సొంత గూటివైపు తీసిన పరుగులు...అమ్మని America తీసుకొస్తే...రోజూ నాన్నతో మాట్లాడుతున్నా ఆయన నేను బ్రహ్మాండంగా వున్నానని చెబుతున్నా కాని కిటికీ దగ్గరే నిలబడి బయటకి చూసే తన దిగులు చూపులూ...వైద్య సదుపాయం పేరు చెప్పి పట్టణవాసం లో ఎంతగా ఇమిడిపోయారనుకున్నా...మా వూరికి వెళ్ళాగానే కళకళ్ళాడిపోయే  అత్తగారి మొహం... వీటన్నింటి వెనక తరచి చూస్తే కనబడే మనసుకి నచ్చని నిజం ..... వురకలూ పరుగుల ప్రవాహం లో కొట్టుకుపోతున్న తమ  పిల్లల కాన్నా ఎక్కువగా వాళ్ళంతా "miss" అయ్యింది...అవుతున్నదీ.... ఇవ్వాళేం వండారూ అంటూ చనువుగా తలుపు తోసుకొచ్చే పొరుగింటి పుల్లమ్మలనీ...ఈనాడులో ఏమి రాసాడో చూసారా అని తనతో మాట కలిపే ఎదురింటి సుబ్బారావుల్నీ...తాము సంపాదించి పెట్టుకున్న తమ గుర్తింపుని...పోగుచేసి దాచుకున్న పరిచాయాల పొదరిళ్ళని....నాకేంటంట లాంటి ఆలోచనలెరగని ఆ అనుబంధాలని...

పనసపొట్టు కూర నుంచి పన్నీర్ బట్టర్ మసాలా వరకూ...internet లో వెతికేసుకుని చేసేసుకో గలుగుతున్నాం, గోడ మీదనుంచి కేకేసి వొదినగారిని ఈ కూరలో ఆవ పెడతారా అని అడిగే పనిలేకుండా...వార్తల మీదా...సినిమాల మీద... నచ్చని బాసు మీదా నెట్ లోనే వాదనలూ చర్చలూ చేసేసుకో గలుగుతున్నాం, అరుగుమీద అప్పారావులతో అవసరం పడకుండా...పక్కవాడి జీవితంలో వేళ్ళూ కాళ్ళూ పెట్టకుండా వుండటమే మా గొప్పతనం అని జబ్బలు చరుచుకున్నా...net connection తో పాటే స్ఠంబించిపోయే జీవన సరళి ఎంత ప్రమాదకరమో కూడా అలోచించడం అవసరం....ప్రపంచం కుగ్రామమైపోయింది కానీ...అంతా ఒకే కుటుంబం లా వుండే కుగ్రామాల చిరునామాలు మాత్రం ప్రపంచీకరణలో పడి కొట్టుకుపోతున్నాయి...మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే...

8/30/11

బరువైన కష్టాలు...


హెడ్డింగు చూసేసరికే తెల్సిపోతుందిలెండి దేనిగురించి రాస్తున్నానో...ఇలాంటివి ఇంతకముందు తోటి బ్లాగర్లు రాస్తే చదివి పళ్ళికిలించినవాళ్ళల్లో నేనూ ఒకర్తిని...నేనూ అవి రాసే రోజు వచ్చేసింది...:(
ఎప్పుడో పూర్వకాలం లో తప్ప ఈ మధ్య కాలంలో ఎప్పుడూ మెరుపుతీగలా లేకపోయినా ఫరవాలేదు అంత లావేం కాదు లానే వుంటానని నా ప్రగాఢమైన వుద్దేశం...నా కంటికైతే అలానే అనిపిస్తాను మరి...మనలో మన మాట కాస్త eye site వుంది లెండి ఆ కంటికి...
కొత్త project లోకి వచ్చాక...ఇక్కడ నా colleague తమిళ తంబి...after you came here you have put on weight అన్నాడు ఆ మధ్య...వీడికి నేనంటే కుళ్ళు...అన్నింట్లో నాతో పోటీ కావాలని ఏడిపిద్దామనే అంటున్నాడు అని తేలిగ్గా తీస్కున్నా...రెండు రోజులకే నాతో పోటీలూ...పోలికలూ పెట్టుకునే పనిలేని ఇంకో colleague కూడా అనేశాడు అదే మాట...అప్పుడు కాస్త గుండె ఖలుక్కు మంది.
ఇంక కొత్తగా మా ఇంట్లో చేరిన అమ్మాయి ఐతే ..ఆ పిల్ల రివటలా సన్నంగా పొడుగ్గా వుండి ఇంకా తెగ బాధ పడిపోతోంది నేను లావుగా వున్నా అని...పాపం వోదారుద్దామని నువ్వేమంత లావు వున్నావు చక్కగా సన్నంగా (పుల్లలా) వుంటేనూ అంటే...నీతో పోల్చుకుంటే సన్నమే లే అనేసింది...అలా అన్నందుకు ఏమీ ఫీలు కూడా అవ్వలేదు పై పెచ్చు...అప్పుడు కాస్సేపు హతవిధీ...ఎంతటి పరాభవం....నేను ఆ పిల్ల వున్న ఇంట్లోనే ఎందుకు వుండవలె...వుంటిని ఫో...నా గోల చూసుకోక ఆ పిల్లని వోదార్చాలని ఎందుకనుకోవలే...అని కాస్సేపు వగచి...రోదించి...తర్వాత అలోచించా...ఏవిటి నా తక్షణ కర్తవ్యం అని...
ఎన్నాళ్ళు(ఎన్నేళ్ళు) గానో వాయిదా వేస్తూ వచ్చిన gym మరియు diet plan అమల్లోకి తీసుకురావలసిందే అని గాఠ్ఠి నిర్ణయానికి వచ్చా...
పొద్దున్న పూట regular break fast కార్న్ ఫ్లేక్స్ లేకపోతే  multy grain bread...లంచ్ కి cracked wheat(ఎర్ర గోధుమ) రెండు చెంచాలు మాత్రమే నూనె  బోలెడన్నీ కూరగాయలు వేసి చేస్కున్న వుప్మా(లాంటిది)...సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక కాస్త ఫల హారం(ఫల హారం పేరు పెట్టి snacks లాగించటం కాదు. అచ్చంగా ఫలాలే) తర్వాత ఒక అరగంట జిమ్ము. మొదట్లో పావుగంటకే నీరసం...అయాసం అవేశం అన్నీ వచ్చేసేవి కానీ ఈమధ్య ఫరవాలేదు కాస్త...రాత్రికి వోటు మీలు...ఈ వోటు మీలు దగ్గరే చిక్కంతా...ఒక రెండేళ్ళ క్రితం ఇలాగే ఆవేశం వచ్చి ఒక నెల పాటు వదలకుండా వోట్లే భోంచేసి అవంటే రోత పుట్టి వదిలేశాను...మళ్ళీ ఎప్పుడు తిందామన్నా వాంతి వచ్చినంత పనయ్యేది. మొదటి రోజు మహా sincere గా వోటుమీల్ లో మజ్జిగ మాత్రం పోసుకుని తిన్నానా...కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ. మర్నాడు కాస్త ప్రియా పచ్చడి జోడించే సరికి ఆహా భూ ప్రపంచం మీద మహా రుచికరమైన వస్తువుల్లో ఒకటనిపించిందంటే నమ్మండి. ఆ తర్వాత కాస్త కూర ముక్కలు...ఒక రోజు కాసింత పచ్చడి, ఇన్ని కూర ముక్కలూ ఇలా రకరకాల combination లతో బాగానే నెట్టుకు రాగలుగుతున్నా...వోటు మీలు ప్రయత్నిద్దామనుకునే వాళ్ళకి ఇదే నా వుచిత సలహా మొదటి రోజు వుట్టి మజ్జిగతోనే తినండి...రెండో రోజు నుంచి ఇలాంటి ప్రయోగాలు మొదలెడితే అదే వోటుమీలు దివ్యంగా అనిపించక మానదు..నా diet plan ఇంత సవివరం గా ఎందుకు రాస్తున్నా అంటే నాలాంటి ఔత్సాహికులు చూసి follow అవ్వొచ్చుకదా పాపం అని...దీనిమీద ఎటువంటి copy right నిబంధనా లేదొహో ఎవ్వరైనా వాడుకోవచ్చని బ్లాగ్ముఖంగా తెలియజేస్తున్నా...

ఈ time table ఒక రెండు వారాలు చిన్న చిన్న అవరోధాలతో బాగానే నెట్టుకొచ్చేసాను...కానీ అప్పుడే మొదలైంది కహానీ మె twist...నా తిండి, నా దీక్ష చూసి నన్ను ఏడిపించడం లో ఎటువంటి మినహాయింపు ఇవ్వని మా వారూ, నన్ను అంతగా అవమానించిన నా roomie తో సహా అందరూ తెగ బాధ పడిపోవటం మొదలెట్టారు. అయ్యో పాపం ఏమీ తినదు...రోజూ అదే ఎలా తింటావ్. అస్సలు అన్నమే తినవా అని ఒకటే అంగలార్చెయ్యటం. వాళ్ళ స్నేహితులెవరైనా ఇంటికొస్తే ఒక విచిత్రాన్ని పరిచయం చేసినట్టు "ఏ లడ్కీ కుచ్ భీ నహీ ఖాతీ...పతా నై rice ఖాయే బినా కైసే జీతీ హై" అని వాళ్ళకి చెప్పడం...వాళ్ళంతా ఇంత కళ్ళు చేస్కుని museum లో బొమ్మని చూసినట్టు చూడటం.  పైగా ఆఫీసు నుంచి నేను వచ్చేసరికే ఘుమ ఘుమా వాసనలు వెదజల్లుతూ రోజుకొక కొత్త వంటకం వండుకోవటం. రా కొంచెం తిను కొంచెం తింటే ఏమీ అవ్వదులే అని ఏడిపించటం..మొదట్లో నా రూములోకి వెళ్ళి తలుపేసుకుని control...control అని తపస్సు చేసేదాన్ని కానీ ఈ మధ్య ఫర్వాలేదు వాళ్ళు ఓ పక్క వంట చేస్తుంటే కూడా నేను అవి చూసి...చీ అంత నూనె పోసుకుని ఎలా తింటారో అనుకుంటూ హాయిగా నా వోట్లు తినగలుగుతున్నా...నాకిప్పుడివే రుచి గా అనిపిస్తున్నాయి. తినగ తినగ వేము తియ్యన...సాధనమున పనులు సమకూరు ధరలోన...ఇలాంటి సూక్తులన్నీ వూరికే రాసారా మహానుభావులు...

ఇంతకీ ఈ సుత్తి అంతా ఇక్కడ రాయటానికొక బలమైన (బరువైన కాదు...మీ కళ్ళకలాగే కనిపిస్తుంది నాకు తెలుసు) కారణం వుంది...సిగరెట్టు మానేసేటప్పుడు పదిమందికి చెప్పి మానెయ్యలట...మళ్ళీ కాలిస్తే వాళ్ళు చూసి అడిగితే ఏం చెప్తాం అన్న భయం వల్లైనా మానేస్తారని...అలాగే నా దీక్షా, పట్టుదలా చూసి వోర్వలేక నన్ను నిరుత్సాహ పరిచే వాళ్ళ మాయలో పడకుండా...ముఖ్యం గా కొత్తావకాయ లాంటి వాళ్ళ బ్లాగుల్లో రాసే ఇలాంటి టపాలు చదివేసి నా దీక్ష మధ్యలో విరమించకుండా మీరంతా కూసింత support ఇస్తారనీ...హన్నా అదే మరీ... మీరు అలా అయ్యో అన్నమే తినవా లాంటి డవిలాగులు వేస్తే అస్సలు బాగోదు ముందే చెప్తున్నా

8/18/11

అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకూ...


పొద్దుట్నుంచీ ఆకాశమంతా మబ్బుపట్టి కొంచెం dull గా వుంది. సాయంత్రం ఆరింటికే కాస్త చీకటి గా అనిపిస్తోంది. ఆఫీసు నుంచి వచ్చి కాఫీ పెట్టుకున్నాక ఆ వాతావరణానికి ఏదైనా పాట వింటే కాఫీ ఇంకా బావుంటుంది కదా అనే అలోచనొచ్చింది...wake up sid లో పాట వినాలనిపించింది...ఈమధ్యే ఆ పాట ఎక్కడో వినటంతో మనసులో గింగిరాలు తిరుగుతోంది....వేడి వేడి కాఫీ గుటకలేస్తూ బయటకి చూస్తుంటే ఏదో తెలియని depression...ఆ వాన చూస్తుంటే అమ్మో ఇంక fall ఆ తర్వాత winter...నాకు US వచ్చినదగ్గర్నుంచీ చలికాలం అంటే చెడ్డ చిరాకు...నాలుగవకుండానే కమ్ముకొచ్చేసే చీకటి...ఎప్పుడో కాని దర్శనం ఇవ్వని సూరీడు...ఎముకలు కొరికేసే చలి...మోడు వారిపోయి పాత సినిమాల్లో భగ్న ప్రేమకి చిహ్నాల్లా నించునే చెట్లు అవన్నీ తల్చుకుంటూ...ఆ వాతావరణం నా కళ్ళముందిప్పుడే వాలిపోయిందన్నట్టు దిగులు పడిపోతూ కళ్ళు మూసుకున్నాను...చెవిలోకి పాట సన్నగా దూరుతోంది నా అలోచనలన్నీ చెదరగొడుతూ...

ఎదురుగా పాల మీగడ లాంటి తెల్ల చుడీదార్ వేస్కుని...ఆ వాన లో ఆనందంగా ఎగురుతూ గంతులేస్తూ...తడుస్తున్న ఆకుల్నుంచీ పువ్వుల్లనుంచీ నీటి ముత్యాలేరుకుంటూ...సంతోషంలో తడిసి ముద్దైపోతూ...ఎవరా అమ్మాయి అని కళ్ళు చిట్లించి చూస్తే నా మొహం లానే వుంది...

అమ్మో వానలో తడిస్తే ఇంకేమైనా వుందా...తుమ్ములూ...జలుబు..దగ్గు..జ్వరం...రేపు office కి ఎలా వెళ్తావ్ అని వూహల్లో విహరిస్తున్న మనసుని..మెదడు చెవి మెలేసి లాక్కొచ్చేసింది...computer లో పాట ఆగిపోయింది...కళ్ళు తెరిచే సరికి నా roomie విసుగ్గా మొహం పెట్టి చూస్తోంది..ఎంత సేపు నుంచుటావ్ అక్కడే...stove మీద నీ గిన్ని పక్కకి పెడితే నా వంట చేకుంటా అన్న మాటలన్నీ మొహంలోకే ప్రతిఫలింపచేస్తూ...

అప్పటిదాక వున్న విసుగునుంచి ఏదో తెలియని relief...నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచా...
ఇంతకీ నే విన్న పాట ఏదో చెప్పలేదు కదూ...


नेणा करू बंद बंद....बहजाये बूँद बूँद
तड्पायेरे... क्यो सुनाए गीत मल्हार दे .......


ఏ పాటో చెప్పుకోండి


8/12/11

కష్టానికి కొలతేది??మా వాడికి ఒక్క సంబధమూ కుదరొట్లేదేవిటో...నా బెంగంతా వాడి పెళ్ళి గురించే వొదినా అని ఇరుగింటావిడ అంటే....హ్మ్ మా వాడికి పెళ్ళయినదగ్గర్నుంచీ కోడలి కొంగట్టుకు తిరుగుతూ...మా వూసే పట్టించుకోటం మానేసాడు నా బాధెవడితో చెప్పుకోవాలి అంటుంది పొరుగింటావిడ.
నాకు వుద్యోగం ఎప్పుడొస్తుందోరా మీరంతా హాయిగా సంపాదించుకుంటున్నారు..నేనిలా గాలికి తిరుగుతున్నా అని ఒక స్నేహితుడంటే....ఏమి వుద్యోగమోరా చచ్చేంత పని...ఈ వెట్టి చాకిరీ చెయ్యటం కంటే రాజీనామా చేసి సన్యాసుల్లో కలవటం మంచిదనిపిస్తోంది రా అంటాడు రెండోవాడు
మా పిల్లదానికి చదువబ్బట్లేదని ఒకాయనంటే...మా పిల్లకి చదువెక్కువై మమ్మల్ని వదిలేసి ఎగిరి చక్కా పోయింది...ఒక పలకరింపుకి కూడా ఖాళీ లేదంటుంది అని వాపోతాడు రెండో ఆయన...
నీకేవిరా America చెక్కేసావ్...ఇక్కడ ఈ దుమ్మూ ధూళి లో కొట్టుకుంటున్నాం అని సహోద్యోగి అసూయతో కలిపి తన బాధ వెళ్ళగక్కితే...నీకేం తెల్సురా ఇక్కడ పొద్దున్నలేచి అన్ని పన్లూ నేనే చేస్కునే సరికి చుక్కలు కనపడుతున్నాయి అని విదేశీ భారతీయుడు తన విసుగుని వివరిస్తాడు..
మా ఆయనకి ఏవీ నచ్చవ్...అన్నీ వంకలే...అన్నీ గొడవలే అని అప్పుడే వంటింట్లో బుడి బుడి అడుగులేస్తున్న ఇల్లాలు అంటే...మా ఆయన ఎలా వండినా తినేస్తాడు...చిన్న గొడవ పడదామన్నా దేనికీ ఏమీ అనరు...అదెంత చిరాకో నీకెం తెలుసు అంటుంది ఇంకో పిల్ల...
ఇస్త్రీ నలగని పాంటూ చొక్కా వేసుకుని ఆటో లో కూచున్న soft wear బాబు ని చూసి ఈన పని బావుంది కడుపులో చల్ల కదలకుండా పొద్దస్తమానం AC గదుల్లో కూచుంటాడు అని ఆటో డ్రైవరు అనుకుంటే...పొద్దున్న లేస్తే అన్నీ tension లే వీడి పని బావుంది...తన పని కి తనే రాజా...సంపాదన చూస్తే వీడిదే ఎక్కువలా వుంది అనుకుంటాడు...పైకి దర్జా వొలకబోస్తున్న దొరబాబు...
తిండికి లేక వొకడేడుస్తూ వుంటే...పెట్టెల్నిండా డబ్బులు వంటినిండా రోగాలతో ఏవి తింటే ఏవొస్తుందో అని భయపడుతూ ఏడుస్తూ వుంటాడు ఇంకోడు...

మొత్తానికి ప్రతీ వాడికీ తన కష్టం మాత్రం పాము లాగా...ఎదుటి వాడి కష్టం మాత్రం తాడులాగా...చీపురు పుల్లలాగా కనిపిస్తుంది...

మా అమ్మ కాలునొప్పో తల నొప్పో అంటే ...నాన్నగారు వెంఠనే నాకూ నిన్నట్నుంచీ కాలు నెప్పి...నీలా చెప్పలేదంతే అనేసే వారు తడుముకోకుండా...ఎందుకో ఎవరనా తమ కష్టం చెప్పగానే ఠక్కున మనకి ఇంకా పెద్ద కష్టం వుందని చెప్పెయ్యాలనిపిస్తుంది. కష్టం కూడా ఒక రకమైన prestige issue లాంటిదేమో అనిపిస్తూ వుంటుంది. నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలేడు తీర్చలేడు...కనీసం మన్స్ఫూర్తిగా బాధపడలేడు కూడా...ఐనా సరే మన కష్టం పక్కవాడితో చెప్పగానే వాడు తనకున్న ఇంకా పెద్దకష్టం(తన వుద్దేశం లో) మనకి చెప్తాడు కాబట్టి..చెప్పావ్ లే బడాయి అని పైకి అనుకున్నా లోపల్లోపల అంతర్లీనం గా మన మనసు కాస్త తృప్తి పడుతుందేమో మనకే కాదు కష్టాలున్నవి అని...బాధ పంచుకుంటే గుండె తేలిక పడటం వెనక వున్న philosophy ఇదేనేమో( ఈ అవిడియా రాసే ముందు బుర్రలో లేదు...రాస్తుంటే తట్టేసింది...:D )

ఏవయినా కానీ మనుషుల్ని దగ్గర చేసే శక్తి కష్టానికే ఎక్కువ వుంది...సంతోషం గెలుపూ మనిషిని గాల్లో తేలిపోయేలా చేస్తే,  ఓటమీ, కష్టం ఆ మనిషిని నీ మూలాలు ఇక్కడున్నాయి బాబూ అని గుర్తుచేసి నేలమీదకి లాక్కొస్తాయి. గెలుపు అహం భావాన్ని పెంచితే వోటమి ఆత్మ పరిశీలనకి అవకాశాన్నిస్తుంది. సంతోషం చుట్టం చూపుగా పలకరించి పోతే...కష్టం మాత్రం జీవన సహచరి లా అన్ని వేళలా వెన్నంటి నిలుస్తుంది..

ఒక సమస్య తీరితే రెండో సమస్య కి promotion దొరుకుతుందిట ఎక్కడో చదివాను...కష్టం బాధా లేకపోతే నిన్ను తలవను...ఎల్లవేళలా కష్టాలు వుండేటట్టు చూడు స్వామీ అని గొంతెమ్మ కోరిక కోరిందట కుంతీదేవి...నిజవే కష్టమన్నదే లేకపోతే మనిషిలో ఈ మాత్రం మానవత్వం...మంచితనం కూడా దొరకవు...సుఖానికి విలువా మిగలదు. కష్టానికి కొలతలూ తూనికలూ లేకపోయినా సంతోషానికి విలువ కట్టేది మాత్రం దానితోనే...

మనిషి పుట్టుకా, చావూ వేదనా భరితమే....ఆ రెంటి మధ్య ప్రయాణం భవ సాగరమే...ఆ కష్టాన్నే మన తోడుగా అనుకుని బతకటం నేర్చేసుకుంటే కష్టం ఇంక కష్టమనిపించదేమో...

8/3/11

మూసుకుంటున్న మనసు తలుపులు


నా చిన్నప్పుడు మూడు బుల్లి బుల్లి వరుస గదుల వాటాలో అద్దికుండేవాళ్ళం. ఇంటికి ఎవరైనా వస్తే అందరూ అదే హాల్లో పడుకునేవాళ్ళం. చుట్టాలొచ్చారన్న ఆనందంతో వుక్కిరిబిక్కిరైపోతూ ఇరుక్కుని పడుకున్నా....హాయిగా నిద్దరపట్టేది. వాళ్ళు రోజూ నేను పడుకునే ఫాను కింద చోటు కొట్టేసారు లాంటి అలోచనే దరిచేరేది కాదు.

వేసవి సెలవల్లో 20 కి తగ్గని జనాభా, చిన్న డాబా మీద వరస్సగా పక్కలేసుకుని ఒక చిట్టి table fan పెట్టుకుని, అది నాకేసి ఎప్పుడు తిరుగుతుందా అని ఎదురు చూస్తూ...ఆకాశంలో చుక్కల్లెక్కపెడుతూ...బోలెడు కబుర్లు, వేళాకోళాలు, నీకాలు నా మీద పడిందంటే నువ్వు చెయ్యి అటు పక్కన పెట్టుకో అని యుధ్ధాలు, మధ్యలో దోవల్తో కుస్తీలు పడుతూ పడుకున్నా కంటినిండా నిద్దరోయేవాళ్ళం.

చదువుకునే రోజుల్లో మూడు మంచాలు పట్టాక, ఆ మంచాల చుట్టూ ఒక మనిషి ఒక అడుగు మాత్రం పట్టే  ఖాళీ వున్న బుజ్జి hostel గది లో  భవిష్యత్తు గురించి కలిసి కలలు కంటూ...రేపటిరోజుకోసం ఎవేవో ప్రణాళికలు వేసేస్తూ తెలియకుండానే నిద్దర్లోకి జారుకున్న ఆ రోజుల్లో ఆ ఇరుకు గది మా నిద్దరకి ఏనాడూ అడ్డు రాలేదు.

కానీ ఇప్పుడు... మనిషికో గది, వాటికి తలుపులూ, గొళ్ళాలు, తాళాలు...ఎప్పుడూ చల్లగా AC లు...మెత్తటి పరుపులూ...గదినిండుగా కష్టపడి కొనితెచ్చుకున్న కావలసినంత వొంటరితనం...ఇన్నివున్నా రోజు రోజుకి ఇరుకైపోతున్న మనస్సుతో వూపిరాడక నిద్రాదేవి కరుణా కటాక్షాలకోసం ప్రతి రాత్రీ ఒక తపస్సే...

ఈ మధ్య ఒక స్నేహితురాలు ఏడేళ్ళ తన అక్క కూతురు వాళ్ళమ్మని "Mom don't come into my room with out asking me...I need my privacy" అంటే...ఆవిడ విస్తుబోయి తర్వాత చిన్నబోయి బయటకి నడిచిందని చెబుతుంటే అనిపించింది...మనం ఎక్కడనుంచో అరువుతెచ్చుకుని అలవాటుపడలేక ఆపస్సోపాలు పడుతున్న "Privacy" పాఠాలు తర్వాత తరం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే మన jeans లో కలిపి రంగరించి పంచేస్తున్నామా....వాళ్ళ మనసు తలుపులు ఆఖరికి మనకోసం కూడా తెరుచుకోకుండా మూసుకుపోతున్నాయా అని...

7/28/11

మౌనమంటే అన్నివేళలా అంగీకారమే కాదు...ఈ మధ్య కొత్తగా మా ఆఫీసులో చేరిన  60 యేళ్ళ అమెరికన్ ఒకావిడ లంచి కి బయటకి వెళ్డాం అని పీకుతుంటే నిన్న సరే అన్నాను. ఆవిడకి ఈ వూరు కొత్త, తన టీములో కూడా ఎవ్వరూ పెద్దగా పరిచయం అవ్వకో ఎమో మరి మాతో ఎక్కువగా మాట్లాడుతూ వుంటుంది. మా టీము లోనే పనిచేసే ఇంకొక తమిళ తంబిని కూడా ఆవిడ మాతో రమ్మని ఆహ్వానించింది. నేను actual గా డబ్బా తెచ్చుకున్నాను, అదే restaurant కి నిన్ననే వెళ్ళాము అని చాలా రకాలుగా గునిసి చివరికి వస్తాను కానీ థాయి టీ మాత్రం తాగుతాను అనే వొప్పందం మీద బయల్దేరాడు. వెళ్ళాక మేము మెనూ చూస్తుంటే ఇక్కడ fried rice బావుంటుంది...I suggest you to take friend rice అని ఇద్దరికి చెరొక పది సార్లు చెప్పాడు...ఇద్దరం పెద్ద పట్టించుకోకుండా మాకు నచ్చినవి ఏవో Order చేసేసరికి ఏమనుకున్నాడో మరి ఏమీ తిననంటూ బయల్దేరిన అతను ఆ fried rice ఏదో తనకే order చేస్కున్నాడు. మరి నీ డబ్బా అన్నాను అతని నిర్ణయం లో హఠాత్తు గా వచ్చిన మార్పుకి కాస్త అవాక్కయినట్టు మొహం పెట్టి...అది రాత్రి మా ఆవిడని తినమని చెప్తా అన్నాడు (పాపం వాళ్ళావిడ అనుకున్నా మనసులో). మా ఆవిడకి rice అంటే ఇష్టం. నాకు అంతగా నచ్చదు అన్నాడు మళ్ళీ cover చేసుకుంటూ.

order వచ్చేలోపు, ఎప్పుడూ ఏదో జ్ఞాన సముపార్జన చేసేద్దాం...అవతలి వాళ్ళనుంచి ఏదో విషయపరిజ్ఞానం సంపాదిచేద్దాం, తన ప్రశ్న అవతలి వాళ్ళ జవాబు అనే ధోరణి లో వుండే నా Team mate మహానుభావుడు మా American colleague ని కబుర్లల్లోకి దింపాడు. ఆవిడ family గురించి ఆరా మొదలెడితే ఆవిడ క్రితం సంవత్సరమే తను విడాకులు తీసుకున్నాను అనే సరికి ఇంక Topic ని America లో విడాకుల  సంస్కృతి Vs India లో విడాకుల సంస్కృతి వేపు మళ్ళించాడు. ఇక్కడ విడాకులు తీస్కుంటే భర్త భార్యకి చాలా డాలర్లు ఇవ్వాలిట కదా అన్నాడు, అలా ఏమి లేదే...మా case లో నేనే చాలా నష్టపొయాను అంది ఆవిడ...అవునా ఇండియా లో ఐతే పెళ్ళాం police station కి వెళ్ళీ ఇలా ఫిర్యాదు చేస్తే చాలు పోలీసులు భర్తని, అతని అమ్మనీ నాన్ననీ, ఇంకా చుట్టాలని పక్కాలని అందర్నీ without any argument జైల్లో వేసేస్తారు అన్నాడు. వాళ్ళ అమ్మని నాన్నని ఎందుకు అని బిక్క మొహం పెట్టింది ఆవిడ..అదంతే అక్కడ అమ్మాయి compliant ఇస్తే పోలీసులు ముందూ వెనకా అలోచించరు...అలా లోపలేసేస్తారు అంతే అన్నాడు. అది తప్పుకదా అంది ఆవిడ...ఐనా అంతే పైగా డబ్బులన్నీ అబ్బాయే ఇవ్వాలి, పిల్లలుంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి అన్నాడు. that is interesting but how అంది ఆవిడ కళ్ళు విప్పార్చి చూస్తూ. ఇంక వూరుకుంటే ఈవిడకి ఈసారి భారత దేశం వెళ్ళి మరీ విడాకులు తీసుకోవాల్సిందే అనే నిర్ణయానికి లాక్కొచ్చేస్తాడేమో అని భయమేసి, అలా కాదు, మా దేశం లో చాలా వరకూ laws women protection కోసం తయారు చేసినవి. అమ్మాయి తనని తన భర్త, అత్త మావలు వేధిస్తున్నారని కేసు పెడితే అప్పుడు arrest చేస్తారు. అది కూడా investigation చేసాకే. కొంత మంది miss use  చేసే వాళ్ళుంటారనుకో. ప్రతీ దానికి positive side negative side, వున్నట్టే దీనికి వున్నాయి అని ఆవిడకి వివరించే సరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.

ఈ లోపు మా order వచ్చేసరికి హమ్మయ్య ఇంక ఇతని నోటికి వేరే పని దొరికింది రా బాబు అనుకునేంతలో నాలుగు స్పూన్లు కడుపులో పడేసి మళ్ళీ మొదలెట్టాదు, అసలు నువ్వెందుకు విడాకులు తీస్కున్నావ్ అన్నాడీసారి. నాకు గుండె గుభేల్ మంది. అసలే ఇక్కడ వాళ్ళకి వాళ్ళ personal విషయాల్లో అవతలి వాళ్ళ జోక్యం అంతగా నచ్చదని ఎప్పుడో విన్నాను. అందుకే అంతకు ముందు పని చేసిన చోట మా manager తో రెండేళ్ళ పైన కలిసి పని చేసినా...రోజూ  ఎన్నో విషయాలు మాట్ళాడుకున్నా గానీ, చచ్చినా ఆయన personal విషయాలు మాత్రం అడిగేదాన్ని కాదు. ఆయనే వచ్చి ఇవాళ మా ఆవిడ ఫలానా పరీక్ష పాసయ్యింది అంటే ఒహో ఈనకి చదువుకునే పెళ్ళాం వుందన్నమాట అనుకునేదాన్ని. I got a call from my kid.  have to run అంటే చదువుకునే పెళ్ళాం కాబట్టి బుడ్డి పిల్లో పిల్లాడో వుండుంటారనుకునేదాన్ని...తీరా నన్ను sendoff lunch కి తీస్కెళ్ళినరోజు తనకి 19, 17, 15 ఏళ్ళున్న ముగ్గురు పిల్లలూ, ఇంకా నాలుగు కుక్కలూ వున్నాయని చెప్పేసరికి..అప్పుడర్ధమయ్యింది ఆయన ఎక్కువగా ఆఫీసులోనే వుండటానికి ఎందుకిష్టపడేవాడో :). ఇప్పుడు ఈవిడ ఏదో ఒకటనే వరకూ ఇతను తన ప్రశ్నోతరాల కార్యక్రమానికి full stop  పెట్టేలా లేడు రా భగవంతుడా అనుకుంటూ మౌనం గా వాళ్ళ మాటలు వింటూ నా పని నేను కానిస్తున్నాను.

ఆవిడ నేననుకున్నంత wild గా ఏమీ  react అవలేదు పాపం.  తన మాజీ భర్తకి తను అయిదో భార్యని అని, అతనితో పెళ్ళయ్యాక తన ఇంట్లో వచ్చి వుండమన్నాడే గానీ, అక్కడ చీపురు పుల్ల కూడా కదపనిచ్చేవాడు కాదని. ఇటు వున్న బల్ల అటు కదపడానికి కూడా అంగీకరించేవాడు కాదనీ, ఆఖరికి తనకి నచ్చిన మొక్క పెంచడానికి కూడా స్వతంత్రం వుండేది కాదనీ, అతనికి అన్నీ తనకి నచ్చినట్టే వుండాలనీ అందుకే విడిపోయాననీ చెప్పింది. దానికతను అవునా...మా ఇల్లంతా మా ఆవిడదే. తను ఇంటికొచ్చిన రోజు నా ఇల్లంతా ఎక్కడివక్కడ పడేసి చిందర వందరగా వుంటే నేను ఇంటికెళ్ళేసరికి తనకి నచ్చినట్టు సద్దేసింది. అయినా నేను పల్లెత్తు మాట కూడా అనలేదు. అసలు వంటిల్లయితే తనదే రాజ్యం. నాకు ఏది ఎక్కడుందో కూడా తెలీదు. తను ఆఫీసు నుంచి రావటం ఎంత ఆలశ్యం అయినా కాఫీ కూడా తనొచ్చి పెట్టాల్సిందే...ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో తనకే తెలుసు కదా అన్నాడు. మా దేశం లో అందరూ అంతే...భార్యలదే ఇంటి మీద హక్కంతా అన్నాడు. తను చెప్పేదానికి బలమయిన support వుంటే బావుంటుందనుకున్నాడేమో నా మానాన్న తిండి తింటున్న నన్ను, నువ్వేమటావ్, మీ ఇంట్లో కూడా ఇంతే కదా అన్నాడు. ఆవిడ తనకి దొరకని స్వేచ్చ గురించి చెబుతుంటే, తను బలవంతం గా తన భార్య మీద రుద్దిన బాధ్యతల్ని ఆమెకి ఈయన ప్రసాదించిన స్వేచ్చగా, హక్కుగా  ఆపాదించి చెబుతుంటే ఇంకేమనాలో అర్ధం కాక, కొంతమందితో వాదించటం కంటే మౌనం గా వుండటమే మంచిదనిపించి తను నన్ను అడిగినది వినపడనట్టు వూరుకున్నాను. తను చెప్పిన దానికి, అతను చెప్పిన దానికి లంకె ఏవిటో అర్ధం కాలేదేమో ఆవిడ కూడా అతని కేసి విచిత్రం గా చూసి మళ్ళీ ఎమి అడుగుతాడో అని పక్కనే వున్న local news paper లో తల దూర్చేసి తినటం లో మునిగిపోయింది.

7/10/11

నేనొక మెరుపుని చూసాను


రెక్కలొచ్చిన స్వేఛ్ఛ ని చూసాను

అమాయకత్వం లో వుండే ప్రేమని చూసాను

కొత్త ప్రపంచాన్ని వింతగా చూస్తున్న అనుభూతిని చూసాను

తమచుట్టూ వున్న ప్రపంచం అందమయినదనే ఒక నమ్మకాన్ని చూసాను

తెలియని తనంలో వుండే ఆసక్తిని చూసాను

రేపటి రోజు మాదేనన్న ఆత్మ విశ్వాసాన్ని చూసాను

నాకే అంతా తెలుసునన్న అహంకారం,

నీకేం తెలుసులే అన్న వెటకారం,

ఇంక నేను తెలుసుకోవటానికేం లేదన్న నిరాసక్తత,

ఈ ప్రపంచం తనని గుర్తించటంలేదన్న వైరాగ్యం,

తెచ్చిపెట్టుకున్న చిరునవ్వులు,

తప్పక చెప్పే పలకరింపులు,

అనునిత్యం వీటితోనే నిండిన కళ్ళని చూడటానికి అలవాటు పడిపోయిన నా కళ్ళు

ఆశ్చర్యం తో నిండిన ఆ కళ్ళలో మెరుపు వెలుగుకి

తెలియకుండానే మూతపడ్డాయి

తమలోనుండి ఆ మెరుపు మాయమై ఎన్ని రోజులైందా అని అలోచనలో పడ్డాయి

(India నుంచి మొన్ననే వచ్చిన ఒక కొత్త జంటని కలిసినప్పుడు మనసులో మెదిలిన మాటలు)

6/1/11

ఈ ప్రశ్న కి మీ జవాబు...?రాయిని, రప్పని పూజించగలిగిన మనిషి,
చెట్టుమీదా, పుట్టమీదా జాలిపడగలిగిన మనిషి,
చదువుని, పదవిని అమితంగా ఆరాధించగల మనిషి,
పాటల్నీ, ఆటల్నీ అభిమానించగల మనిషి,
కాగితపు కట్టల్నీ, లోహపు ముద్దల్నీ ప్రాణాధికంగా ప్రేమించగల మనిషి,
మృగాన్ని కూడా అక్కునచేర్చుకోగలిగిన మనిషి,
సాటి మనిషి విషయంలో మాత్రం ఎందుకంత కర్కశంగా మారిపోతాడు?
తోటి మనిషి గెలుపు చూసి ఎందుకంత గింజుకుంటాడు?
ఎదుటి మనిషి ఆవేదన చూసి ఎందుకంతానందిస్తాడు?
సాటి మనిషి నిస్సహాయతని ఎందుకంత అవహేళన చేస్తాడు?
నా మెదడుని తొలిచేస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ నా బుర్రకి తట్టిన ఒకే ఒక్క సమాధానం
మిగిలిన వేటితోనూ వీడికి పోటీ, పోలికా లేవు కాబట్టి...
మరి మీ జవాబు?

4/12/11

నేను మాలతిగారిని కలిసానోచ్
చిన్నప్పుడు నా స్నేహితులంతా ఎవరో హీరో నో , హీరోఇన్ నో ఆరాధించేస్తుంటే చూసి నవ్వుకునేదాన్ని. నా classmate ఒకడు తన అభిమాన హీరో పుట్టినరోజు అని క్లాసు రూములో నే కేకు కటింగ్ గట్రా చెయ్యబోతే చాలా తీవ్రం గా అడ్డుకున్నాను. అలాంటి అభిమానులని చూసి సదరు సినెమా వాళ్ళకి కూడా మనకిలాగే రెండు కాళ్ళు, రెండు చేతులే గా వున్నాయి అని వెక్కిరించేదాన్ని. నన్నెవరైనా నువ్వెవరి fan అని అడిగితే చచ్చేంత కోపం వచ్చేది. ఎవరు తీసినా, రాసినా, వేసినా బావుంటే చూస్తాం, చదువుతాం, అది వాళ్ళ పని అనే సమాధానం వచ్చేది నా దగ్గరనుంచి. నేనేంటి అలా ఒకళ్ళని follow అవ్వటమేమిటి అని కాస్త పొగరు కూడా వుండేది. ఇలాంటి so called పెద్దవాళ్ళంతా వాళ్ళు రాసినట్టు, వేసినట్టు నిజం గా వుండరనేది కూడా నా అభిప్రాయం.

మా ఆఖరు పిన్నికీ నాకు వయసులో మరీ అంతరం లేకపోవటం తో స్నేహితుల్లా వుండేవాళ్ళం. తను ఒక రచయిత ని బాగా అభిమానించేది. ఒక సారి అతను వూళ్ళో ఏదో సభకి వచ్చాడని తెలిసి ఆ సభకి వెళ్ళాం. అక్కడ నిర్వాహకుల్లో తనకి తెలిసిన ఆయన్ని పట్టుకుని ఆ రచయిత తో మాట్లాడే అవకాశం సంపాదించింది తను. తన కూడా వెళ్ళి వెనకాల నుంచున్నానే గానీ అతన్ని చూసి చిన్న ప్లాస్టిక్కు నవ్వుకూడా నవ్వలేదు. మా పిన్ని మాత్రం చాలా excite అయిపోయి ఆయనకి తను ఎంత పెద్ద అభిమానో, ఆయన రచనలు ఎందుకు నచ్చుతాయో తన excitement అంతా మాటల్లోకి, మొహం లోకి transfer చేసేసి మరీ చెప్పేస్తోంది...ఆయన మాత్రం ఒక నిర్వికారమైన మొహం పెట్టి ఆహా అలాగా అని పొడి పొడి గా రెండు ముక్కలు అనేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తర్వాత సభలో కూచున్నాం గానీ మా పిన్ని మొహంలో ఒకలాంటి నిరాసక్తత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంటికి వెళ్ళే దార్లో నెమ్మదిగా తనతో చెప్పాను...ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళు రాసే రచనల్లో పాత్రలంత గొప్పగా ఏం వుండరు అని. తనకి ఎందుకో నా మాటలు వూరటనిచ్చాయి. తన మనసులో పడుతున్న ఘర్షణ చెప్పకుండానే నేను తెల్సుకున్నందుకో..ఆ సదరు రచయిత మీద తనకి వచ్చిన కోపం సరైనదే అని నేను justify చేసినందుకో తెలీదు గాని తను కాస్త చల్లబడిందనిపించింది నా మాటలతో. ఆ సంఘటన తర్వాత నా అభిప్రాయం ఇంకాస్త బలపడింది...తర్వాత ఎప్పుడూ ఒక brand name కి ఆకర్షితురాలినయ్యిన గుర్తులేదు.

అమెరికాకి వచ్చాక ఒక రోజు అసలు internet లో తెలుగు రచనలు వుంటాయా అని వెతికితే మొదటగా నా కంట పడినది, ఈమాట అనే ఈ పత్రిక. నేను చూసిన సంచికలో నాకు బాగా నచ్చినది మాలతి గారి(మాలతి నిడదవోలు) కధ. అలా ఈమాట సంచికల్లో ఆవిడవి రెండు మూడు కధలు చదివాక ఆవిడ రచనా సైలి ఎందుకో తెలీదు గానీ బాగా ఆకట్టుకుంది. ఆవిడ కధలు చదువుతూ నేను వూహించుకున్న ఆవిడ రూపం చీర కట్టుకుని, సిగ వేసుకుని, పెద్ద కళ్ళజోడు పెట్టుకుని ఇంచుమించు గుప్పెడు మనసు సినిమాలో సుజాతలా :). ఈమాట లో ఆవిడ పేరుతో వెతికి ఆ పత్రిక లో ప్రచురించబడ్డ ఆవిడ కధలన్నీ చదివేసాను. తర్వాత ఆవిడ పేరుతో internet లో వెతికితేనో అని ఉపాయం తట్టి అలా వెతికితే ఆవిడ కధల PDF దొరికింది ముందుగా. అది కూడా చదివాక ఆవిడ బ్లాగు తూలిక నా కంట పడింది. ఆ రకంగా తెలుగులో నేను చూసిన మొట్ట మొదటి బ్లాగు మాలతి గారిదే. ఆవిడ బ్లాగులో లంకెలు పట్టుకునే బ్లాగు ప్రపంచంలోకి అడుగు పెట్టాను. కొన్నాళ్ళు ఆ ప్రపంచంలో విహరించాక నేనూ రాస్తే అన్న వూహ చిగురేసి, మొగ్గేసి ఆఖరికి పువ్వులు పూసింది. రాద్దామన్న ఆలోచన వచ్చాక నన్ను ఎక్కువ భయపెట్టింది కూడా మాలతిగారి రచనలే.

మొత్తానికి ఒక రోజు తెగించి నేను కూడా ఒక బ్లాగు మొదలెట్టేసాను. మొదలు పెట్టిన కొన్నాళ్ళకి ధైర్యం చేసి మాలతి గారికి నా బ్లాగు చూడమని ఒక మైల్ పంపాను. ఎందు చేతో ఆవిడ ఆ mail చూడలేదు. ఆ అంత పెద్ద రచయిత్రికి నా రాతలేం నచ్చుతాయి లే అని సరిపెట్టుకున్నాను. కొన్నాళ్ళకి ఆవిడ బ్లాగులో నేను పెట్టిన కామెంటు చూసి అనుకుంటా నా బ్లాగులోకి వచ్చి వ్యాఖ్య రాసారు. ఆ రోజు నా ఆనందం చెప్పలేను. ఇంటికి ఫోను చేసి అమ్మకి, నాన్నగారికి...ఇక్కడ మావారికి అందరికీ చెప్పేసాను. తరవాత ఆవిడ నా టపాలన్నీ ఇంచుమించు చదువుతూ వ్యాఖ్య రాస్తూ వుండేవారు. కొన్నాళ్లకి ఆవిడ బ్లాగు రోలు లో నా బ్లాగు చూసిన రోజు నా రాతల మీద మొదటి సారి కాస్త నమ్మకం ఏర్పడింది.

ఈ మధ్య మాలతి గారు రాస్తున్న మార్పు ద్వారా Dallas వచ్చారని తెల్సుకుని..మా వారూ అక్కడే వుండడంతో ఈ సారి వచ్చినప్పుడు కలవొచ్చా అని మైల్ పెట్టాను తటపటాయిస్తూనే. ఆవిడనుంచి వెంటనే తప్పకుండా అని తన నంబరు తో సహా ప్రత్యుత్తరం చూసి ఆశ్చర్యపోయాను. గత వారాంతం లో అనుకోకుండా డల్లస్ వెళ్ళిన నేను ఆవిడకి పొద్దున్నే ఫోను చేస్తే రెండు నుంచి నాలుగు వరకూ తెలుగు క్లాసు వుంది...దానికి ముందు గాని వెనక గానీ రండి అన్నారు. సరే సాయంత్రం వస్తాం అని చెప్పి ఫోను పెట్టేసాను. మా సంభాషణ ముక్కలు ముక్కలు గా విన్న మా వారు ఇప్పుడే రమ్మన్నారని అర్ధం చేస్కుని బండి కట్టేసారు. ఎక్కడికి అని అడగకుండానే కారెక్కి కూచున్నాను నేను. సాయంత్రం మాలతి గారిని కలిసినప్పుడు ఏమి మాటాడాలి అని ఇప్పట్నుంచే అలోచించేస్తూ మధ్యదార్లో అడిగాను మా వారిని ఎక్కడికెళ్తున్నాం అని. వచ్చినప్పట్నుంచీ మాలతి గార్ని కలవాలని జపం చేస్తున్నవ్, తీరా వెళ్తుంటే ఎక్కడికంటావేంటి అన్నారు, అది సాయంత్రం కదా అనేసి, తనకి ఆ ముక్క చెప్పలేదని గుర్తొచ్చి నాలిక్కరుచుకుని మళ్ళీ మా వారు నరసిమ్హావతారం ఎత్తకముందే పోన్లే ఇప్పుడే వెళ్దాం, రెండింటి వరకూ వుంటా అన్నారు కదా అనుకునీ నోరు మూస్కుని కూచున్నాను. మధ్యలో మళ్ళీ ఆవిడకి కాలు చేసి ఇప్పుడే వస్తున్నాం అని చెబ్దామని కూడా తట్టలేదు ఆ కంగారులో. తీరా వాళ్ళింటి ముందుకి వెళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. నాకు చెప్పలేనంత నీరసం వచ్చేసింది, నా ఆలోచనలకి విరుధ్ధం గా నేను అంతగా అభిమానించిన ఆవిడని చూడనేలేకపోయాను అని. మా వారు ఏదయినా ఒకసారి fail అయితే మళ్ళీ ఆ పని అంత త్వరగా చెయ్యరు. ఇంక తను మళ్ళీ ఇక్కడికి తీస్కురారని అర్ధమైపోయింది. నీ planning ఇంత అందం గా వుంటుంది అని అక్షింతలు వేస్తూనే దగ్గర్లో వున్న ఆంజనేయ స్వామి గుడికి లాక్కెళ్ళారు. కొంచెం సేపు బుర్ర పని చెయ్యలేదు. ఇద్దరం పక్క పక్కనే కూచుని ఇంత miss communication ఎలా సాధ్యం అని ఒక పక్కా. నేను ఆశ పడ్డదేది జరగదు లాంటి ఆలోచన ఒక పక్కా...గుడిలో హనుమాన్ చాలీసా పారాయణ, అక్కడే భోజనం అన్నీ అయ్యాక silent mode లో వున్న ఫోను చూస్కుంటే మూడు Voice messages. ఏమనుకున్నారో ఏమో పోనీ ఇప్పుడు మళ్ళీ ఫోను చేసి చూడు వుంటే వెళ్దాం అన్నారు. అప్పటికే 1:15. మధ్యలో ట్రాఫిక్కు జాము దాటుకుని వెళ్ళేసరికి పావుతక్కువ రెండు అయింది. ఇంకేముంది...నాకు టైము అయిపోయంది అని వెళిపోతారు అనుకుంటూనే వెళ్ళాను.

నా సందేహాలన్నీ పటా పంచలు చేస్తూ బయ్టకి వచ్చి మరీ నవ్వుత్తూ స్వాగతం పలికారు. అప్పటివరకూ నా మీద రుస రుసలాడిన మావారు, మాది విశాఖపట్నం అనగానే నాకంటే ఎక్కువగా ఆవిడతో కబుర్లలో పడిపోయారు. ఆవిడని కలిస్తే ఇలా మాట్లాడాలి, ఇవి చెప్పాలి, ఇవి అడగాలి అని తయ్యారు చేకున్నవేమీ గుర్తు రాలేదు. నాకు బాగా పరిచయం వున్న వాళ్ళింటికి వెళ్ళినట్టే అనిపించింది. ఇప్పుడే భోజనం చేసాం అంటున్నా వినకుండా మా ఇంటికి వచ్చి కాఫీ వద్దంటారా అని కమ్మటి కాఫీ రుచి చూపించారు. మీకు క్లాసుకి time అయిపోతోందేమో అంటే ఫరవాలేదు లే కాస్త late అయినా అని మాకోసం అరగంట late గా వెళ్ళారు. ఆవిడ ఇంకా కూచోండి అంటున్నా ఆవిడకి క్లాసుకి time అయ్యిందని మా కర్మ యోగి గారు( తనవైనా పక్కవాళ్ళవైనా సరే పనులు సమయానికి అవ్వాలనుకోవటం, అయ్యేలా చూడటం చేసేవాళ్ళని అలా అంటారని ఎక్కడో చదివాను) లాక్కొచ్చేసారు. మళ్ళీ వచ్చినప్పుడు తీరిగ్గా కలుద్దాం అని చెప్పుకుని విడిపోయాం.

మొత్తానికి అలా నేను మాలతిగారిని కలిసానోచ్(కొంచెం గర్వం నిండిన స్వరం తో)

4/4/11

ఎన్నాళ్ళో వేచిన ఉదయం...

తెల తెలవారుతూ వుండగానే నిద్ర లేచి...స్నానం చేసేసి...దేవుడికో దణ్ణం కూడా పెట్టేస్కుని...వేడి వేడి coffee mug చేత్తో పట్టుకుని balcony లో కూచుని చిరు చలికి చిన్నగా వణుకుతూ మళ్ళీ కొత్తగా పుట్టేస్తున్న బాలభానుడిని చూస్తూ మధ్య లో వేడి coffee గుటకలు వేస్తూ ఎర్రటి ఆకాశాన్నీ..తొలి వెలుగు రేఖల్నీ...నీరెండ పడి వొళ్ళు విరుచుకుంటున్న మొక్కల్నీ చూడాలన్నది ఎప్పట్నుంచో నా కల...ఏవిటీ ఇది కూడా కలేనా అని పెదవి విరిచేస్తున్నారా...ఐతే మీరు తప్పకుండా IT (information technology) లో పని చెయ్యట్లేదన్నమాట...ఈ conditions అన్నీ కలిపి ఆస్వాదించిన రోజు నాకైతే గుర్తు లేదు మరి. ఈ కలని నిజం చేస్కోవటానికే ఎప్పుడు ఇల్లు మారినా balcony వుండి తీరాలని పట్టు పట్టేదాన్ని. మేము వున్న చోట బాల్కనీ అంటే luxury లోకి వస్తుంది మరి...దానికి మళ్ళీ కాస్త వడ్డింపు ఇంకో లడ్డూ కావాలా నాయనా అనుకుంటూ. balcony వున్న ఇల్లు ఐతే తీస్కుంటాం గాని అంత పొద్దున్నే లేచిన పాపాన్నైతే పోలేదు ఇప్పటివరకూ. ఎలాగూ ఈ దేశం లో 6 నెలలు చిరు చలి వుండదు...అంటే చలి ఉండదని కాదు, భయంకరమైన చలి వుంటుంది...అప్పుడు balcony లో కూచుని coffee తాగటం అన్నది కల కాదు..సాహసం అవుతుంది...అంటే అప్పుడు నేను పొద్దున్నే నిద్ర లేచేస్తా అని కాదు..లేవకపోఅవటం లో నా తప్పు లేదు అని చెప్పటం అనమాట. మిగిలిన 6 నెలల కాలం లో వారం లో పనికెళ్ళే 5 రోజుల్లో లేవటం పడుకోవటం అనేది మన చేతుల్లో వుండే పని కాదు. ఇంక సూర్యోదయం...సూర్యాస్తమయం లాంటివాటి గురించి అలోచించినట్టు తేల్సినా మా manager కి అనుమానం వచ్చేస్తుంది నేను పని పంపిణీ లో ఎమయినా లోపాలు చేస్తున్నానా అని. వారాంతపు సెలవలు అంటే అయిదు రోజులు వుధ్ధరించేసిన పనికి బోలెడు విశ్రాంతి తీసేస్కోవాలనే బలమయిన అభిప్రాయంతో రోజూ కన్నా ఇంకో రెండు..మూడు..గంటలు(ఇంకా ఎక్కువ లెక్కపెడితే మరీ నా గురించి నిజాలు తెలిసిపోఅవూ...)నిద్దర తీస్తాం కదా అదన్నమాట. ఏంటమ్మా మరీ కబుర్లు చెప్తున్నావ్...మీకు అస్సలు పనీ పాటా లేకుండా ఆఫీసుల్లో ఆడుకుని వచ్చే రోజులు బోల్డుంటాయని మాకు తెలీదనుకున్నావా అనేస్తున్నారా...అదే మరి...అలా మధ్యలో పని లేని రోజుల్లో అలవాట్లు మార్చేస్కుంటే హఠాత్తుగా పనొచ్చి మీద పడ్డప్పుడు కష్టం కదా అని సమయ పాలనలో మార్పులు చెయ్యబడవ్. చూసారా eమత ముందు చూపో ... :)

ఇంతకీ ఇంత సుత్తి ఎందుకు చెప్తున్నా అనే కదా మీ అనుమానం...వస్తున్నా అక్కడికే వస్తున్నా...మొన్న మనవాళ్ళు ఆడిన world cup final మాకు ఇక్కడ తెల్లవారుఝామున 4:00 గంటలకి మొదలు. ముందు రోజు నీలం రంగు వస్త్రాలని ధరించి భారత జట్టుని ప్రోత్సహించవలసిందొహో అని లేఖలు పంపినా...గాడిద గుడ్డేం కాదూ...అని తీసి పడేసి పైగా శ్రీలంక జట్టు వాళ్ళు వేస్కునే ముదురు నీలం రంగు jeans వేస్కుని మరీ office కి వెళ్ళిన నేను, ఆ... అంత పొద్దున్నే ఎవడు లేస్తాడూ చూస్తే రెండో innings చూస్తా అని friends దగ్గర బింకాలు పోయిన నేను, నాలుగింటికి అల్లారం పెట్టుకుంటున్న మా వారిని చూసి పరీక్షలప్పుడు ఎప్పుడైనా ఇంత tension పడ్డారా అని వెక్కిరించిన నేను...పొద్దున్నే జనగణమణ వినపడగానే, లోపలెక్కడో ఓ మూల నిద్దరోతున్న నా లోపలి Indian ఒక్కసారిగా మత్తువదిలి ఒక్కటివ్వడంతో...లేచి హాల్లోకి పరిగెట్టా... ఒక 15 నిమిషాలు చూసి వచ్చి మళ్ళీ పడుకుందాం లే అని బధ్ధకం వదలని నా మనసుకి నచ్చచెప్తూనే computer ముందు చతికిల పడ్డాను. ఇంచుమించు అయిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇదే చూడటం కిరికెట్టు ( మా మామ్మ అలాగే అంటుంది మరి). మనవాళ్ళు నేను చూడటం మానేసాక ఇంతలా improve అయిపోయారా అనుకుంటూ అలాగే చూస్తూ వుండిపోయాను. ఇంక అంత బాగా ఆడుతుంటే నా అతిప్రియమైన నిద్దరని కూడా నాకు తెలియకుండానే మర్చిపోయా. ఇంక ఎలాగూ లేచాం కదా అని అయిదున్నరకి స్నానం చేసేసి దేముడి దగ్గర దీపం పెట్టేస్కుని, పన్లో పని భారత్ నెగ్గెయ్యాలని కూడా దేవుడికి వినతి పత్రం సమర్పించేసి(చిన్నప్పుడు ఇలాగే India నెగ్గాలని, నచ్చిన cinema వస్తున్నప్పుడు power cut అవ్వకూడదని దణ్ణాలు పెట్టేస్కుంటూ వుండేదాన్ని...ఇంకా ఆ అమాయకత్వం ఎక్కడో బతికే వుందనుకుంటా)..టిఫినూ కాఫీ తయారు చేసేసే సరికి...ఆరు...అప్పుడు కిటికీ లోంచి ఎర్రటి ఆకాశం రారమ్మని అని పాట మొదలెట్టింది...ఆట ఎంత రసవత్తరం గా వున్నా...మళ్ళీ ఈ అవకాశం ఎప్పటికి వస్తుందో అని నా కల సాకారం చేసేస్కున్నా...అదన్నమాట విషయం...ఈ శనివారం వుదయం 28 ఏళ్ళ భారత జట్టు ఎదురుచూపులేకాదు...నా కలా(ఎన్నాళ్ళు గా ఎదురుచూస్తున్నానో సరిగ్గా గుర్తు లేదు)..మా వారి కల కూడా నిజమైపోయాయ్...మధ్యలో మా వారి కల ఏమిటా అనుకుంటున్నారా...పెళ్ళవ్వగానే పెళ్ళాం అనబడేది పొద్దున్నే ఆయనగారు లేచేసరికి తలకి పిడప పెట్టేస్కుని(స్నానం చేసైనా కావొచ్చు, చెయ్యకుండానైనా కావొచ్చు) చేతిలో వేడి వేడి coffee cup తో చిరునవ్వులు వొలకపోస్తూ సుభోదయాలు చెప్పేస్తుందనేది ఆయన కల(తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తే అలాంటి కలలే వస్తాయి మరి)...ఆరింటికి టిఫెనూ, కాఫీ చేతిలో పెట్టేసరికి...ఈరోజు నువ్వేమన్నా పట్టించుకోను లాంటి వరాలిచ్చెయ్యటానికి కూడా సిధ్ధపడిపోయారు పాపం.

ఇంతకీ మర్నాడు ఎన్నింటికి లేచావ్ అంటారా...అలాంటి పన్లు అప్పుడప్పుడూ చేస్తేనే అంత సంతోషం, ఆశ్చర్యం, ఆనందం లాంటి అనుభూతులన్నీ కట్ట కట్టుకుని వస్తాయి...రోజూ చేసేస్తే అలవాటైపోయి బోరు కొట్టెయ్యదూ...

3/23/11

కధ మళ్ళీ మొదలైంది


చేరుకోలేకపోయిన తీరాలనుంచీ
ఎదగలేకపోయిన ఎత్తులనుంచీ
పొందలేకపోయిన ప్రేమలనుంచీ
గెలుచుకోలేకపోయిన మనసులనుంచీ
దూరమయిపోయిన మనుషులనుంచీ
పోటీ పడలేకపోయిన సహచరులనుంచీ
ఆవిరైపోయిన ఆశలనుంచీ
కరిగిపోయిన కలలనుంచీ
తీర్చుకోలేకపోయిన కోరికలనుంచీ
ఒప్పుకోలేకపోతున్న ఓటములనుంచీ
సర్దుకోలేకపోతున్న జీవితం నుంచీ
దూరంగా పారిపోవాలని
అలోచనలే దరిచేరనంత వేగంగా పరుగెడుతూ
అలిసిపోయి ఆగిపోయిన నిమిషం లో
ఇదే అదనన్నట్టు తలపులన్నీ దాడి చేసి
మనసుని వుక్కిరిబిక్కిరి చేస్తుంటే...
ముసిరిన జ్ఞాపకాల తుఫానులోంచొక బాల్యస్మృతి వెక్కిరించింది
"నాన్నగారెప్పుడూ చిర్రు బుర్రులాడుతూ వుంటారు
నేను పెద్దయ్యాక అస్సలు నాన్నగారిలా వుండను"
తన అమాయకత్వాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని నవ్వుకుంటుంటే
పక్క గదిలోంచి బాబిగాడి గుసగుసలు
నాన్నగారికెప్పుడూ ఖాళీ వుండదు...నాతో కబుర్లే చెప్పరు
పెద్దయ్యాక అస్సలు నాన్న గారిలా వుండను
మనసు చిన్నగా నిట్టూర్చించి
కధ మళ్ళీ మొదలయ్యిందని

3/19/11

అనుకోని బహుమతి


నీలహంస బ్లాగు లో నిర్వహించిన ఉగాది కవితల పోటీ కి పంపిన నా కవితని ఉత్తమ కవితల్లో ఒకటి గా ఎంపిక చేసి ఇచ్చిన ప్రశంసా పత్రం. నీల హంస బ్లాగు నిర్వహిస్తున్న సత్య గారికి, నా కవిత ని అభిమానించిన అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు.

3/9/11

ఆకు లో అకునై...

నీల హంస బ్లాగు లో ఆకు కవితా వస్తువుగా నిర్వహిస్తున్న పోటీ కి పంపిన నా కవితలు ఇక్కడ
తోచిన రాతలు రాయటం తప్ప ఒక అంశం మీద రాయటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నీలహంస బ్లాగ్ నిర్వహిస్తున్న సత్య గారి ఆహ్వానంతో కాస్త ఉత్సాహం వచ్చి ఇలా ప్రయత్నించాను.


ఆత్మ ఘోష


నునులేత చిగురు సొగసులకు పులకించి కవితలల్లిననాడు
మౌనం గానే వుంది...
తన నీడన సేద తీరి చల్లని తల్లివన్ననాడు
మౌనం గానే వుంది...
ప్రాణవాయువునిచ్చిన నీవే దేవతవన్ననాడు
మౌనంగానే వుంది...
నేల రాలటానికి సిధ్ధమైన తనని చూసి మొహం తిప్పుకున్ననాడూ
మౌనం గానే వుంది...
చివరి శ్వాస వరకూ తన పని తను చేస్తూనే వుంది అచ్చు అమ్మలాగ
కాని తన తల్లివేరును నిర్దాక్షిణ్యం గా నరికిన నాడు
నేలకొరిగిన ఎండుటాకులు ఎగిరెగిరి పడ్డాయి...
గోల గోల చేశాయు...
బహుశా అది
మనిషి అజ్ఞానాన్ని చూసి చేస్తున్న వికటాట్టహాసం కావొచ్చు
జాగ్రత్తపడు నాయనా అని చేస్తున్న హెచ్చరిక కావొచ్చు...
ఆకు ఆత్మఘోష కావచ్చు...మౌన సాక్షులు


వాన చినుకుల్లో తడిసిపోతూ మురిసిపోతున్నాయి చిగురు రెమ్మలు
తడి ఆకుల మీంచి రాలి పడుతున్న నీటి ముత్యాలని దోసిళ్ళలో నింపుకుంటోందొక ముద్దబంతి
ఆ ముద్దుగుమ్మ ముగ్ధత్వానికి మైమరచి, పారేసుకున్న మనసుని వెతుక్కుంటోందొక మొగలి రేకు
నాలుగు కళ్ళూ కలిసిన క్షణాన సిగ్గుల మొగ్గలైన ఆ జంట తడబాటుని చూసి...
ముసి ముసి నవ్వులు రువ్వాయా లేత చిగుళ్ళు

ప్రేమ జంట గుస గుసలకి గుబురుగా మారి తావునిచ్చాయి...
వారి సరాగాలకు తోడు రమ్మని కోయిలమ్మలకి కబురంపాయి
ఇరువురు ఒక్కటైన శుభవేళ, మంగళతోరణాలయ్యాయి...
చేతిలో చెయ్యేసి బాసలు చేసుకున్నవేళ, అరచేత కెంపులై పూసాయి
తలమీద చెయ్యి వేసి శ్రీరస్తూ..శుభమస్తూ అని దీవెనలందించాయి
పండువెన్నెల్లో పవళించిన రేయి, సద్దు చేయొద్దని చిరుగాలికి మనవి చేసాయి
ఆ జంట అన్యోన్యతకి గుర్తుగా తాంబూలమై పండాయి
జీవిత పోరాటం లో అలసి సొలసిన వేళ, వింజామరలై వీచాయి
జీవన సంధ్యకు చేరువైన వేళ సూరీడికి నచ్చ చెప్పి నీడగా మారాయి
జీవన గమనంలో అడుగడుగునా వెన్నంటి వుండి
అంతులేని వారి అనురాగానికి మౌన సాక్షులయ్యాయి

నీల హంస బ్లాగ్ లో మరిన్ని కవితలు చూడొచ్చు
http://neelahamsa.blogspot.com/2011/03/blog-post_05.html

3/8/11

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Happy woman's Day... ఉదయాన్నే శ్రీవారి అభినందనలు
చూసావా నేనెంత మంచివాణ్ణో...నువ్వేరోజైనా ఇలా గుర్తుంచుకుని చెప్పావా...వెన్నంటే ఆయన గారి చురక
364 రోజులు రోజూ చెప్పాలంటే కొంచెం కష్టం కదా... నా సమాధానం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

2/28/11

చిలకపలుకులు
చిన్నప్పుడు ప్రతీపిల్లలూ ముద్దు మాటలాడతారు...ప్రతీ బుడుగు మాటలు చాలావరకూ unique గానే వుంటాయి అనిపిస్తుంది నాకు. ఆ వయసులో వాళ్ళ సౄజనాత్మకి కొలతలు లేకపోవటం..మూసల్లో పోసి వారి తెలివితేటల్ని నియత్రించే బోధనా పధ్ధతుల్లో ఇంకా ఇరుక్కుపోకపోవటం కారణాలు కావొచ్చు. నా చిట్టి తల్లి ముద్దు మాటలు అది పెద్దదయ్యాక దానికి గుర్తు చెయ్యాలన్న ఆశతో ఇక్కడ దాచుకుంటున్నాను...మళ్ళీ మర్చిపోకుండా

వద్దా... మానై...

పగెడతానే...

నా నాన్న నిన్నే కొడతాడు.

మామ్మకి ఎన్ని మాటలొచ్చేసాయో!

hello అమానాన్నా తాతగారు అల్లరి చేస్తున్నారు కర్ర పెట్టి కొట్టెయ్

ఏం చేస్తున్నావ్ అని అడిగితే ...నేను బాగా అల్లరి చేస్తున్నాను(పాపం అస్సలు అబధ్ధమాడదు)

అదేంటి...దాని ప్రశ్న...అదీ table సమాధానం...టేబులా...మళ్ళీ అన్నీ confirm చేసుంటుంది


మౌక్తికా... అక్కడ నీళ్ళొంపేసింది( అది చేసిన పాడు పన్లన్నీ ఎవరో చేసినట్టు వాళ్ళ మామ్మకి కంప్లైంట్ లు)

పిల్లకి అస్సలు స్థిరం లేదు(వాళ్ళ మామ్మని imitate చేస్తూ)

మౌక్తిక కి కావాల్ట(దానికి ఏది కావాలన్నా, అది ఎం అల్లరి పనుకు చేసినా తోసెయ్యటానికి అది పెట్టుకున్న dummy...మళ్ళీ మౌక్తిక ఎవరూ అంటే నేనూ అని గుండెలమీద చెయ్యేస్కుని మరీ చూపించేస్కుంటుంది)

బావుందీ...(ఏం పెట్టినా నచ్చినా నచ్చకపోయినా మొదటి ముద్దకి మాత్రం పొగిడేస్తుంది...రెండో ముద్దనుంచీ ఆ తినిపించే వాళ్ళ పాట్లు ఇంక అడక్కండి)

కాకి బావా...కాకి బావా పాట బాగా పడతావేం అన్నాడు...ఏనుగూ తొండం తో బొబ్బ పోసేసిందీ...అనుమానూ(హనుమాన్) రాచ్చసి ముక్కూ చెవులూ కోసేత్తాడు(అది విన్న మూడు కథలు కలిపి తన సొంత కధ ఇలా అల్లింది...పైగా దాని ఉద్దేశం లో హనుమంతుడు సూర్ఫణఖ ముక్కూ చెవులూ కోసేస్తాడు)


జలుబు చేసి తగ్గాక...మళ్ళీ ice cream తింటావా అని కోప్పడితే...strawberry తిననా...(strawberry flavor తిననా) దాని సమాధానం

మామ్మా ice cream తినకూ, దగ్గొస్తుందీ...(మామ్మకి జాగ్రత్తలు బాగా చెబుతుంది)

చద్దక్కేది(శ్రధ్ధక్క)...బబ్బుంది...బబ్బుందా...దివ్యక్కేదీ...బబ్బుంది...బబ్బుందా
(రోజూ పడుకునే ముందు ఒక అరగంట సేపు దాని బుల్లి బుర్రలో వున్న database లో అందర్నీ తల్చుకుంటుంది...దాన్ని జోకొట్టే వాళ్ళు అలా అది పడుకునే దాకా సమాధానం చెప్తూనే వుండాలి)

2/24/11

నా కళాపోషణ - 3

పెయింట్ బ్రష్ తో వేసిన మరి కొన్ని చిత్రాలు...
కళ్ళు చెప్పే ఊసులు
2/17/11

కల కానిదీ...
అనగనగా ఒక మామూలు అమ్మాయి. ఆ అమ్మాయి కలలు కూడా తన లాగే సాదా సీదా. తనకి కాబోయే భర్త, తను ముగ్గేస్తే చూసి ముచ్చట పడాలి, పాట పాడితే విని మురిసిపోవాలి, వంట చేస్తుంటే కూడా తిరుగుతూ కబుర్లాడాలి, ఇద్దరూ కవితలు, కధలు చదివి వాదించుకోవాలి ఇలా...తన తోటి అమ్మాయిల "costly" కలలతో పోల్చుకుని తనవి గగన కుసుమాలేం కావులే అని తృప్తి పడేది. అవి నిజం కావటం అంత కష్టమేమీ కాదని సంబరపడేది. ఒక శుభముహూర్తాన పెద్దవాళ్ళు ఒక చక్కటి అబ్బాయిని చూసి ఆ అమ్మాయికి పెళ్ళి చేసారు.

ఆ అమ్మాయి ముగ్గేసాను చూడమంటే, coffee late అయ్యిందని అలిగాడు అబ్బాయి, కూనిరాగం తీస్తే TV volume వినిపించట్లేదని విసుక్కున్నాడు, తనతో కబుర్లు చెప్పొచ్చు కదా అంటే నాకు బోలెడు పని వుందని కసురుకున్నాడు, తనకి నచ్చిన పుస్తకాలు చూపిస్తే పనికొచ్చే books చదవచ్చు కదా అని సలహా చెప్పాడు.
తన
కలలు, అంత మామూలు కలలు కూడా కల్లలైపోయాయని ఆ అమ్మాయి బోలెడు బాధ పడిపోయింది. కొన్నాళ్ళకి తనకి లాగే ఆ అబ్బాయికి కూడా కలలుండేవని తెలుసుకుంది. తన భార్య పేధ్ధ వుద్యోగం చేసెయ్యాలని, మారిపోతున్న technology ని ఎప్పటికప్పుడు అందిపుచ్చేసుకుంటూ వుండాలని, తను కట్టుకుంటున్న ఆశా సౌధాలకి చేదోడు వాదోడు గా వుండాలని...లాంటి కలలు అబ్బాయివి. ఇద్దరికి తమ Qualification లు ఒకటే కాని కలలు కన్న జీవితాలు వేరని అర్ధమయ్యి చాలా చింతించారు...తమ ఆశలు ఆవిరైపోయాయని దఃఖించారు...ఇద్దరికి ప్రపంచం శూన్యం అనిపించింది...ప్రపంచం లో తమంత దురదృష్టవంతులు లేరనిపించింది...తాము తప్ప అందరు సుఖసంతోషాలతో కళ కళలాడిపోతున్నారనిపించింది...ఫలితంగా పొరుగింటి గోడలకి బోలేడు చెవులు మొలిచాయి.

ఇదంతా గతం...ప్రస్తుతం లోకి వస్తే...

ఇప్పుడు ఆ అమ్మాయి పాట పాడితే చప్పట్లు కొట్టే ఒక చిన్నారి వుంది, కబుర్లు చెప్పుకోవటానికి తనకంటూ ఒక "circle" వుంది, తనకి నచ్చిన పుస్తకాలు చదివి చర్చించుకోవటానికి ఒక group వుంది. తన భార్య వుద్యోగం వేన్నీళ్ళకి చన్నీళ్ళలా తోడైంది కదా అని సర్దుకున్నాడు అబ్బాయి. వాళ్ళ ఇల్లు ప్రశాంతమైన ముంగిలి అయ్యింది...ఈ పరిణామానికి కారణం వాళ్ళిద్దరికి ఇప్పుడు యుధ్ధం కన్నా సంధి గొప్పదని, మాట కన్నా మౌనం లోనే శాంతి వుందని, గెలుపు కన్నా శాంతి మనసుకి ఎక్కువ హాయిని ఇస్తుందనీ తెలుసు. నవ్వుతూ కనిపించిన వాళ్ళందరూ సంతోషం గా వున్నట్టు కాదని తెలుసు. కష్టం అన్నది ప్రతీ జీవితం లో భాగమని తెలుసు. కలిసి బతకాలంటే ఇద్దరి కలలూ ఒకటి కావఖర్లేదనీ, ఒకళ్ళ కలల్ని ఇంకొకరు గౌరవిస్తే చాలని తెలుసు. కళ్ళు తెరిచి కనే కలలు తియ్యగావుంటాయి గాని అవి నిజం అయ్యి తీరాలనుకోకూడదని తెలుసు...జీవితం అంటే కల కాదని తెలుసు...