స్కూల్లో చదివే రోజుల్లో హెడ్ మాస్టారితో మొదలుకుని...నాకన్నా పైన, కింద తరగతి విద్యార్ధుల వరకూ తెలుగు మాస్టారి అమ్మాయి అని పిలుస్తుంటే తెగ వుడుక్కునే దాన్ని...నాకు పేరు వుంది గా అని..బురద రోడ్డు మీద జారి పడ్డప్పుడో...మొయ్యలేక మొయ్యలేక ఏ కూరల సంచో మోసుకొస్తున్నప్పుడో అయ్యో నువ్వు మాట్టారి గారి పాపవి కదమ్మా అంటూ చూసి ఎవరైనా వచ్చి సాయం చేసినప్పుడు అడగకుండా అప్పనంగా వచ్చిన ఆ దన్ను గొప్పతనం అప్పుడర్ధం అయ్యేది కాదు..
అమ్మమ్మ వూరికి వెళ్ళినప్పుడు...వుయ్యాలా తాతగారి అమ్మాయీ మనవరాలూనూ...అని దార్లో నే మొదలయ్యే పలకరింపులూ......మామ్మ గారింటికి వెళ్ళేటప్పుడు మీ అబ్బాయిగారూ వాళ్ళూ వస్తున్నారండోయ్ అని మాకంటే ముందుగానే ఇల్లు చేరిపోయే కబురులు...ఇవన్నీ చూసినప్పుడు కాస్త గర్వం గానే అనిపించినా ఏమీ కష్టపడకుండా వచ్చేసిన ఆ గుర్తింపు విలువ మాత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదు
జీవితపు నిచ్చెన పైకి ఒక్కో మెట్టూ ఎక్కుతూ......ఇంటి నంబర్లు తప్ప ఫలానా వాళ్ళ ఇల్లు అంటే ఎగా దిగా చూసే metropolitan city లకి తరలి పోతున్న కొద్దీ, ఆప్యాంగా పలకరించే పక్కింటి అత్తయ్య గారూ....ఆపదలో మేమున్నామంటూ తొంగిచూసే ఎదురింటి పిన్ని గారూ.... కష్టం సుఖం విని పెట్టే వెనకింటి వదిన గారూ కనుమరుగైపోతుంటే కొంచెం కొంచెం గా తెలిసొచ్చింది రక్త సంబధాలతో పని లేని ఆ బంధాల విలువ. నాన్నగారు వూరెళితే రాత్రికి సాయం పడుకునే పక్కింటి పెద్దమ్మలూ...అమ్మకి పని పడితే చక్కగా జడలు వేసి స్కూలుకి పంపే పిన్నమ్మలు...ఈ హడావిడి ప్రపంచలో వాళ్ళ వాళ్ళ పనుల్లో పడి పరిగెడుతూ జ్ఞాపకాల్లోనే ఆగిపోయారు...ఆఫీసు నుంచి రావటం కాస్త ఆలస్యం ఐతే పిల్లని చూసుకునే పొరుగింటి అమ్మమ్మలూ...వొంట్లో నలత గా వుంటే కాస్త కూరో నారో వండిచ్చే ఇరుగింటి మామ్మలూ కనిపించక నేటి "ఆధునిక స్త్రీ" ఆఫీసు తలనొప్పులకి తోడుగా కొండంత insecurity ని మనసులో మోసుకుంటూ పైకి గుంభనగా తిరిగేస్తూ ముఫ్ఫై యేళ్ళకే అరవయ్యేళ్ళకి సరిపడా రోగాలన్నీ కొనితెచ్చేసుకుంటోంది.....
ఎక్కడెక్కడి friends నో ఈ social networking పుణ్యమా అని భలేగా కలుస్తున్నాం కదా అంటే.....ఎప్పటివాళ్ళనో కలవటం బానే వుంది గాని నీ పక్కింట్లో వున్న వాళ్ళెవరో నీకు తెలుసా అన్నాడు నా cousin. నిజవే మరి...ఏడాదిన్నర గా అదే ఇంట్లో వుండి నా చుట్టూ వున్న ఇళ్ళల్లో వున్న వాళ్ళ మొహాలు కూడా తెలియని పరిస్థితి..ఇది నా ఒక్క దానిదే కాదు దాదాపు నా generation లో చాలా మందిది. మునుపటి రోజుల్లో వూళ్ళు చదువులు...ఇళ్ళూ ఎన్ని మారినా ఎక్కడికక్కడ కొత్త ప్రపంచం ఏర్పరుచుకో గలిగే వాళ్ళం కాబట్టి పాత స్నేహితులని కొన్నాళ్ళు గుర్తొచ్చి బెంగపడినా నెమ్మదిగా మర్చిపోగలిగేవాళ్ళం ...మరి ఇప్పుడూ ఇంటి చుట్టూ వున్న మొహాల ఆనవాలు తెలియవు...ఆఫీసుకి వెళితే శత్రు సైన్యం తో కలిసి కూచుని చదరంగం ఆడటమే...ఎవరి నవ్వు ముఖం వెనక ఏ ఆపద దాగివుందో తెలుసుకోవటం బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు. పాత స్నేహితులని వెతికి వెతికి పట్టుకుని వాళ్ళతోనే ముచ్చట్లాడుకోవటం వెనక...social networking సైట్లు దిన దిన ప్రవర్ధమానంగా వెలిగిపోవటం వెనక వున్న కారణం పక్కనే వున్న వాడితో సర్దుకుపోలేకపోవటం...రేపు ఏదైనా గొడవొస్తే ఎల్లుండి వాడి మొహమెలా చూడటం అని ఇవాళ ఆ మొహమెలా వుంటుందో తెలుసుకోకపొవటమే మంచిదని వూరుకోవటం. కప్పు పాలు...రెండు స్పూన్ల పంచదార అప్పడగటానికి, శ్రావణ మంగళవారం నోముకి ముత్తైదువులకీ కూడా Networking సైట్లనే పట్టుకుని వేళ్ళాడుతున్నామంటే ...మనకి కరువైన ఇరుగుపొరుగు ప్రపంచం మనల్ని చూసి వెక్కిరించినట్టనిపిస్తుంది...
తాతగారిని మా ఇంట్లో ఇంకో నాలుగు రోజులు వుండమని బ్రతిమాలుతుంటే ఇల్లు ఏమైపోతోందో అని మూడో రోజునుండి నసగడం మొదలెట్టి నాలుగో రోజుకల్లా కట్టిన తిరుగు ప్రయాణాలు..అమ్మమ్మా వాళ్ళని మావయ్య తనుండే చోటుకి తీసుకెళితే అక్కడ వూపిరాడటం లేదని నెలలోనే సొంత గూటివైపు తీసిన పరుగులు...అమ్మని America తీసుకొస్తే...రోజూ నాన్నతో మాట్లాడుతున్నా ఆయన నేను బ్రహ్మాండంగా వున్నానని చెబుతున్నా కాని కిటికీ దగ్గరే నిలబడి బయటకి చూసే తన దిగులు చూపులూ...వైద్య సదుపాయం పేరు చెప్పి పట్టణవాసం లో ఎంతగా ఇమిడిపోయారనుకున్నా...మా వూరికి వెళ్ళాగానే కళకళ్ళాడిపోయే అత్తగారి మొహం... వీటన్నింటి వెనక తరచి చూస్తే కనబడే మనసుకి నచ్చని నిజం ..... వురకలూ పరుగుల ప్రవాహం లో కొట్టుకుపోతున్న తమ పిల్లల కాన్నా ఎక్కువగా వాళ్ళంతా "miss" అయ్యింది...అవుతున్నదీ.... ఇవ్వాళేం వండారూ అంటూ చనువుగా తలుపు తోసుకొచ్చే పొరుగింటి పుల్లమ్మలనీ...ఈనాడులో ఏమి రాసాడో చూసారా అని తనతో మాట కలిపే ఎదురింటి సుబ్బారావుల్నీ...తాము సంపాదించి పెట్టుకున్న తమ గుర్తింపుని...పోగుచేసి దాచుకున్న పరిచాయాల పొదరిళ్ళని....నాకేంటంట లాంటి ఆలోచనలెరగని ఆ అనుబంధాలని...
పనసపొట్టు కూర నుంచి పన్నీర్ బట్టర్ మసాలా వరకూ...internet లో వెతికేసుకుని చేసేసుకో గలుగుతున్నాం, గోడ మీదనుంచి కేకేసి వొదినగారిని ఈ కూరలో ఆవ పెడతారా అని అడిగే పనిలేకుండా...వార్తల మీదా...సినిమాల మీద... నచ్చని బాసు మీదా నెట్ లోనే వాదనలూ చర్చలూ చేసేసుకో గలుగుతున్నాం, అరుగుమీద అప్పారావులతో అవసరం పడకుండా...పక్కవాడి జీవితంలో వేళ్ళూ కాళ్ళూ పెట్టకుండా వుండటమే మా గొప్పతనం అని జబ్బలు చరుచుకున్నా...net connection తో పాటే స్ఠంబించిపోయే జీవన సరళి ఎంత ప్రమాదకరమో కూడా అలోచించడం అవసరం....ప్రపంచం కుగ్రామమైపోయింది కానీ...అంతా ఒకే కుటుంబం లా వుండే కుగ్రామాల చిరునామాలు మాత్రం ప్రపంచీకరణలో పడి కొట్టుకుపోతున్నాయి...మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే...