8/3/11

మూసుకుంటున్న మనసు తలుపులు


నా చిన్నప్పుడు మూడు బుల్లి బుల్లి వరుస గదుల వాటాలో అద్దికుండేవాళ్ళం. ఇంటికి ఎవరైనా వస్తే అందరూ అదే హాల్లో పడుకునేవాళ్ళం. చుట్టాలొచ్చారన్న ఆనందంతో వుక్కిరిబిక్కిరైపోతూ ఇరుక్కుని పడుకున్నా....హాయిగా నిద్దరపట్టేది. వాళ్ళు రోజూ నేను పడుకునే ఫాను కింద చోటు కొట్టేసారు లాంటి అలోచనే దరిచేరేది కాదు.

వేసవి సెలవల్లో 20 కి తగ్గని జనాభా, చిన్న డాబా మీద వరస్సగా పక్కలేసుకుని ఒక చిట్టి table fan పెట్టుకుని, అది నాకేసి ఎప్పుడు తిరుగుతుందా అని ఎదురు చూస్తూ...ఆకాశంలో చుక్కల్లెక్కపెడుతూ...బోలెడు కబుర్లు, వేళాకోళాలు, నీకాలు నా మీద పడిందంటే నువ్వు చెయ్యి అటు పక్కన పెట్టుకో అని యుధ్ధాలు, మధ్యలో దోవల్తో కుస్తీలు పడుతూ పడుకున్నా కంటినిండా నిద్దరోయేవాళ్ళం.

చదువుకునే రోజుల్లో మూడు మంచాలు పట్టాక, ఆ మంచాల చుట్టూ ఒక మనిషి ఒక అడుగు మాత్రం పట్టే  ఖాళీ వున్న బుజ్జి hostel గది లో  భవిష్యత్తు గురించి కలిసి కలలు కంటూ...రేపటిరోజుకోసం ఎవేవో ప్రణాళికలు వేసేస్తూ తెలియకుండానే నిద్దర్లోకి జారుకున్న ఆ రోజుల్లో ఆ ఇరుకు గది మా నిద్దరకి ఏనాడూ అడ్డు రాలేదు.

కానీ ఇప్పుడు... మనిషికో గది, వాటికి తలుపులూ, గొళ్ళాలు, తాళాలు...ఎప్పుడూ చల్లగా AC లు...మెత్తటి పరుపులూ...గదినిండుగా కష్టపడి కొనితెచ్చుకున్న కావలసినంత వొంటరితనం...ఇన్నివున్నా రోజు రోజుకి ఇరుకైపోతున్న మనస్సుతో వూపిరాడక నిద్రాదేవి కరుణా కటాక్షాలకోసం ప్రతి రాత్రీ ఒక తపస్సే...

ఈ మధ్య ఒక స్నేహితురాలు ఏడేళ్ళ తన అక్క కూతురు వాళ్ళమ్మని "Mom don't come into my room with out asking me...I need my privacy" అంటే...ఆవిడ విస్తుబోయి తర్వాత చిన్నబోయి బయటకి నడిచిందని చెబుతుంటే అనిపించింది...మనం ఎక్కడనుంచో అరువుతెచ్చుకుని అలవాటుపడలేక ఆపస్సోపాలు పడుతున్న "Privacy" పాఠాలు తర్వాత తరం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే మన jeans లో కలిపి రంగరించి పంచేస్తున్నామా....వాళ్ళ మనసు తలుపులు ఆఖరికి మనకోసం కూడా తెరుచుకోకుండా మూసుకుపోతున్నాయా అని...

8 comments:

మనసు పలికే said...

స్ఫురిత గారూ,
ఒక చేదు నిజం కళ్ల ముందు వికటాట్టహాసం చేస్తుంటే, ఏం మాట్లాడాలో తెలియక, దానికి కారణం మనమే అని తెలిసి కూడా ఏం చెయ్యలేక రోజు రోజుకీ ఇంకాస్త మనసు గదుల్లోకి వెళ్లిపోతున్న భావన. నిజమే, ఆ రోజు అద్భుతం నిజంగా. మనసు విశాలంగ ఉన్న రోజులవి. గదులు ఇరుగ్గా ఉన్నా సర్దుకుపోగలవు. మనసు ఇరుకైనప్పుడే కదా విశ్వమంత చోటిచ్చినా ఒంటరిగా మిగిలిపోవలసిన రోజొస్తుంది..
టపా నన్ను చాలా ఆలోచనల్లోకి తీస్కెళ్లింది. గతంలోనుండి తిరిగి రావాలంటే మనసు మొరాయిస్తుంది..

శరత్ కాలమ్ said...

ముందు ముందు పక్క గదుల్లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఏమోకానీ జిపిఎస్ అవసరం పడేలా వుంది. జిపిఎస్ రాకముందు పట్టణం అర్ధమయ్యేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా జిపిఎస్ వుంటే చాలు - అర్ధం అవక్కరలేదు. అలాగే ముందు ముందు (పెద్దపెద్ద) ఇళ్ళళ్ళొ GPS అవసరం అవుతుందేమో అని నా అనుమానం.

Anonymous said...

చాలా బాగా చెప్పారు.

కృష్ణప్రియ said...

So true!

చుట్టాలొస్తే హోరెత్తించి గెంతే వాళ్లం. ఈ పిల్లలు ఎవరైనా వస్తే నిర్లిప్తం గా 'హాయ్' అని చెప్పి వాళ్ల గదుల్లోకి వెళ్లిపోతున్నారు.

అందుకే ఈ మధ్య,..

మేము వారం లో కనీసం ౨-౩ సార్లు నేల మీద చాప, దుప్పటీ వేసి పడుకునే అలవాటు చేశాం.. దానితో ఇప్పుడు చాలా సార్లు వాళ్లే అడుగుతారు.

sphurita mylavarapu said...

@మనసు పలికే, ఎందుకో మీ వ్యాఖ్య చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
@శరత్, Anonymous - వ్యాఖ్య కి ధన్యవాదాలు
@కృష్ణ ప్రియ - మీ పిల్లల గురించి మీరు రాసే కబుర్లు భలే ముచ్చటగా అనిపిస్తాయి...మీరు కాస్త తీరిక చేసుకుని ఒక column పెట్టీ పిల్లల పెంపకంలో చిట్కాలు రాస్తే నాకులాంటి fresher తల్లులకి చాలా వుపయోగం గా వుంటుంది...ఎ అభ్యర్ధనని మన్నిస్తారని ఆశిస్తున్నాను :)

ఆత్రేయ said...

మంచి టపా
నాకూ మూడుగదుల ఇల్లు ఇర్రుక్కొని పడుకోవటం
ఆ తర్వాత పెద్దయ్యాక నా గది లో ఒంటరిగా ఉండటం అన్నీ రీల్ తిరిగాయి
అవే మధురమైన రోజులు.
ఈ రోజులూ మధురమే,
కానీ డయాబెటిక్ ముందు స్వీట్లు పెట్టినట్లున్నాయి

Unknown said...

గదినిండుగా కష్టపడి కొనితెచ్చుకున్న కావలసినంత వొంటరితనం...

మీ టపా చదివాకా ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు.
చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి
మళ్లి ఆ రోజుల్లోకి వెళ్ళిపోగలిగితే బావుండు అని అనిపించింది.

M.PRASOON KUMAR said...

నిజంగా నేనెంత ఆస్థిపరున్నో ఇప్పుదు అర్థం అయ్యింది
ఎందుకంటే ఇప్పటికి నేను ఇండియాలోనేవున్న....