5/24/10
5/17/10
పిరికి మనసు
ఈ టపా రాయటానికి ప్రేరేపించినది ఈ వారాంతంలో నా మనన్సులో రేగిన ఒక చిన్న అలజడి.
టపాకి పేరు పెట్టాక మళ్ళీ ఒక సందేహం వచ్చింది, పిరికి అన్న పదం సరైనదా, భయం అన్న పదం సరైనదా అని. దానికిసమాధానం కూడా నాకే తట్టేసింది. నీళ్ళదాకా వెళ్ళాక, నీళ్ళలో దిగాకా అమ్మో మునిగిపోతామేమో అనిపిస్తే అది భయంఅవుతుంది కానీ, ఇంట్లో కూర్చుని, నీళ్ళు ఎం త ప్రమాదకరమైనవో, అమ్మో అక్కడకి వెళ్ళటమే అని అలోచించడాన్నిపిరికితనమే అంటారు అని(బాగా చెప్పానా). నీళ్ళని ఎందుకు వుదాహరించానో ఈ టపా చివర్లో తెలుస్తుంది.
అసలు విషయం లోకి వెళ్ళేముందు కాస్త Flash back వినక తప్పదు మీకు.
మా అమ్మానాన్నలకి నేను 14 సంవత్సరాల ఎదురు చూపుల ఫలితం గా పుట్టానట. వూళ్ళో వాళ్ళంతా గారాల పట్టి అంటూ వుండేవారు నన్ను చూసి, గారం మాట దేవుడెరుగు గాని అతి జాగ్రత్త గా మాత్రం పెంచింది మా అమ్మ. మాఅమ్మ కంగారు చూసి కంగారు పడ్డాడేమో దేవుడు, మూడో ఏడు వచ్చేదాకా అసలు నాకు నడవటం రాకుండా జాగ్రత్తపడ్డాడు. దాంతో మా అమ్మకి నేను ఎక్కడ ఏమి ఘనకార్యాలు చేసేస్తున్నానో అని కంగారు పడే గొడవ తప్పింది(ఆవయసులో పిల్లలు ఎన్ని ఘనకార్యాలు చెయ్యగలరో నా కూతురు Liveshow చూసేదాక మా అమ్మకి అనుభవం లోకిరాలేదు). చక్కగా పొద్దున్నే బొబ్బ పోసి వీధి అరుగు మీద కూచో పెడితే మా వీధిలోంచి స్కూలుకెళ్ళే పిల్ల కాయలందరికీ టాటాలు చెపుతూ కూచునేదాన్నట మా అమ్మ పనులన్నీ అయ్యి మళ్ళీ లోపలకి తీస్కెళ్ళేదాకా.
ఇంక కాస్త నడవటం మొదలు పెట్టాకా నన్ను ఆడుకోవటానికి పంపిస్తూ మా వీధిలో పిల్లల్లో కాస్త పెద్ద పిల్లకి నీదే బాధ్యత అని అప్పగింతలు పెట్టి మరీ పంపేది. మా అమ్మ B.P ని అంత దగ్గరగా చూసినవాళ్ళు వూరుకుంటారా, చక్కగా నన్నుఆటలో అరిటిపండు ని చేసి పడేసే వారు. మొదట్లో ఏదో నాకు special treatment ఇస్తున్నారు అనుకుని సంబరపడేదాన్ని కాని, కొన్నాళ్ళకి అర్ధమైంది అది పిచ్చి మొహం, వెర్రి మొహం లాంటి పదాలకి అందమైన పర్యాయపదం అని.
ఇంతలో మా నాన్నగారికి వేరే వూరు transfer అయ్యింది. అదే మా వూరు. అక్కడ నన్ను school లో వేసారు. అది ఎంత చిన్న వూరంటే, స్కూలు మొదటి గంట వినిపించాక ఒక్క పరుగు పెడితే రెండో గంటకి స్కూల్లో వుంటామనమాట. అలాగే స్కూల్లో నేను ఘాట్టిగా తుమ్మానంటే ఇంటికి కూడా వినిపించేంత దగ్గర. ఆ కాస్త దూరం కూడా నేను సరిగ్గా నడిచేదాన్నా అంటే, ఈ మూల మొదలెడితే ఆమూలకి ఐకోసుగానో, ఐమూలగానో నడిచేదాన్ని. ఈలోపు మన నడకా పాటవాన్ని మా అమ్మకి చేరవెయ్యటానికి బోల్డుమంది గూఢచారులూ, "మీ పాపగారేటండీ బలేగా నడుత్తారు, డాన్సు చేత్తున్నట్టు" అనుకుంటూ. ఇంక వాళ్ళ feed back విన్నాక కూడా మా అమ్మ వూరుకుంటుందా, ఇలా నడు, అలా నడవకు, దిక్కులు చూస్తూ నడవకు, ఈ పక్కనే నడు అని రోజుకి రెండు సార్లు ప్రైవేటు చెప్పేసేది. ఇంక school లోపల కాస్త అల్లరి చేద్దాం అంటే, మా స్కూలు పక్కనే హైస్కూలు, అక్కడే మా నాన్న గారు పని చేసే వారు. ఇక్కడ నేను పడినా, పడేసినా, కొట్టినా, కొట్టించుకున్నా అక్కడకి Report వెళిపోతుందని భయం. ఇంత బుధ్ధిగా వున్నా కూడా ఐదు అయ్యాకా TC ఇస్తూ, మీ అమ్మాయి పైకిబుధ్ధిమంతురాలిలా కనిపిస్తుంది కాని, అమ్మో silent గా చాలా అల్లరి చేస్తుంది అని అడక్కుండానే ఒక certificate పడేసారు ఒక మాస్టారు. నాలో ఏ మూల చూసారో మరి అల్లరి చెయ్యగల కళ.
high school లో ప్రవేశించిన తర్వాత ఇంక నా పాట్లు చెప్పఖ్ఖర్లేదు. టీచర్లంతా నన్ను తెలుగు మాస్టారి అమ్మాయ్ అనే పిల్చేవారు. ఒక సారి తిక్క రేగి , పోయి, పోయి మా హెడ్ మాస్టారు అలా పిలిచినప్పుడు, నాకంటూ ఒక పేరు వుందండి అనేశాను. ఆయన వూరుకుంటారా, మా నాన్నగారితో, మీ అమ్మాయికి ముక్కుమీదేనండోయ్ కోపం అని అసలు సంగతి (అదే నేను చెబితే చాడీ అంటారు) వూదేసారు. ఎప్పుడైనా అమావాస్యకో, పున్నానికో మాకున్న బుజ్జి ground లో ఏదో అలా చిన్నగా పరిగెట్టినట్టు చూసినా, మీ అమ్మాయి Ground లో పరిగెడుతూ కనపడిందండీ(ఏదో దొంగతనం చేస్తూ దొరికిందండీ అన్నట్టు) చెప్పేస్తూ వుండే వారు.
ఇంకేం చేస్తాం, పరిగెట్టడానికి, అల్లరి చెయ్యటానికి, ఎవరికైనా ఎదురు సమాధానం చెప్పడానికి కూడా ధైర్యం చెయ్యలేక నాకు తెలియకుండానే నెమ్మదస్తురాలిని, మంచి పిల్లని ఐపోయాను. ఇంక పునాది అంత బలంగా పడ్డాక మిగిలిన చదువులో ఏ వేగులు అవసరం లేకుండా నేనే అన్నీ మా అమ్మకి పూసగుచ్చినట్టు చెప్పేస్తూ వుండటం, అన్ని పనులూ అమ్మా నాన్నలకి చెప్పి చెయ్యటం అలవాటు ఐపోయింది.
నేను నా విద్యార్ధి దశ లో చేసిన అతి పెద్ద సాహసం ఏమిటయ్యా అంటే post graduation ఆఖరు సంవత్సరం, ఫైనలు పరీక్షలకి 4 రోజుల ముందు ఇంట్లో చెప్పకుండా (వెరే వూరే కదా ఎవరూ చూసే అవకాశం లేదు అనే ధైర్యం తో) cinema కివెళ్ళటం. అక్కడ కూడా నా ప్రాణానికి మా వూరు అమ్మాయి ఒకర్తి చూసి మా అమ్మకి మోసేసింది ఇంకేం పని లేనట్టు.అలా ఆ సాహస కృత్యం కూడా అమ్మా, నాన్నల దృష్టి కి వెళ్ళకుండా చెయ్యలేకపోయాను.
ఇవ్విధముగా, నాకు ప్రతి పనికీ ఒకటికి ఫదీ ఫాదిహేను సార్లు అలోచించడం, ఒక అడుగు ముందుకి వేస్తే ఒక ఫదో, వందో అడుగులు వెనక్కి వెయ్యటం అలవాటైపోయింది.
ఇంక ప్రస్తుతం లోకి వస్తే, మొన్న శుక్రవారం నాడు, కొత్తగా నాకు ప్రాప్తించిన Roomie ఆఫీసు లో serious గా పనిచేస్కుంటుంటే Will you be intersted in Rafting? అని ping చేసింది. నేను serious గా What is Rafting అనికొట్టేసి నాలిక్కరుచుకుని, ఛీ నా పరువు నేనే తీసుకోవటం అంటే ఇదే అనుకునేంతలో water rafting అని అటుపక్కనుంచి జవాబు. ఏమి చెప్పావే తల్లీ, ఐనా Google అనే మహత్తరమైన స్నేహితుడు/రాలు వుండగా నాకేల చింత అనుకుని వెతికితే కనపడ్డ ఫోటోలు చూడగానే గుండె ఘుభేల్ మంది. జలపాతాల్లోంచి వచ్చి, బండలూ, కొండలమధ్యలోంచి వంకర టింకర గా ప్రవహిస్తున్న నీళ్ళమీద, ఒక ఆరేడు మంది ఒక పడవ చొప్పున ఎక్కి, తెడ్డేస్కుంటూపోవటమే. Life Jacket ఇస్తారు, అది మాత్రమే మన ప్రాణాన్ని కాపాడే సాధనం. ఏ క్షణం లోనైనా ఆ చిన్న పాటి పడవ బోల్తా కొట్టొచ్చు, మనం నీళ్ళల్లో జలకాలాదొచ్చు.
చూసినదాన్ని చక్కగా అమ్మాయి ఇలాంటి సాహసాలు చేసే scene నాకు లేదు. నువ్వు proceed ఐపో అని చెప్పొచ్చు కదా. అలా చేస్తే నేను నేను ఎందుకు అవుతాను. మా వారికి call చేసి What is rafting అని అడిగాను, నీవల్ల నా వల్ల అయ్యే పని కాదు అని ఠక్కున వచ్చింది అట్నుండి సమాధానం. హ్మ్...ఏదో వొడ్డూ పొడుగూ బాగున్నాడూ,మంచి ధైర్యస్తుడై వుంటాడూ, నాకు కూడా ఇంతో అంతో ధైర్యం నూరిపోస్తాడు లాంటి అపోహలన్ని పడి మా ఆయన్ని పెళ్ళిచేస్కున్నాను, కానీ చేస్కున్నాక తెల్సింది మా ఆయన మా అమ్మకి మరో రూపం అని.
సరే ఆ అమ్మాయికి రాను అని చెప్పాను. ఐనా మనసు వూరుకుంటుందా, అయ్యో నీ బతుకూ ఒక బతుకేనా, నీమొహమేస్కుని అసలు ఎప్పుడైనా ఏమైనా enjoy చేసావా, అని ఒకటే పీకుడు. ఇంటికి చేరాక ఆ పిల్ల వూరికే వుండకుండా, నువ్వూ రావచ్చు కదా, Life jacket వుంటుంది కదా, ఏమి ఫరవావుండదు అని మొదలు పెట్టింది. మళ్ళీ మా ఆయనకి Call చేసి గునుస్తుంటే నా బుంగ మూతి phone లోనే కనబడ్డట్టుంది, సర్లే వెళ్తే వెళ్ళు, నీ ఇష్టం(నీ ఖర్మ) అన్నారు. ఆయన సెలవు ఇచ్చిన తరవాత ప్రయత్నాలు మొదలు పెడితే, నాకు తెల్సున్న మొహాలు అందరూ వెళ్ళే slot లో ఇంకఅవకాశం లేదు, వేరే slot లో వెళ్ళటం సమ్మతమైతే నిక్షేపం గా Ticket తీస్కోండి అని సవియంగా మనవి చేస్కున్నారు. తెల్సున్న వాళ్ళతో వెళ్ళటానికే ఇన్ని మీనాలూ, మేషాలు లెక్కపెడుతుంటే, ఇంక ముక్కు మొహం తెలియని వాళ్ళతో వెళ్ళడం కూడానా, దానికి తోడు $60 Ticket ఒకటి. అక్కడి దాకా వెళ్ళాక అయ్యబాబోయ్ ఇన్ని నీళ్ళే అని భయపడితే ఆ $60 గోవిందా గోవింద కదా ( ఇలా డబ్బుల విషయంలో చాలా ఎక్కువగా అలోచించడం కూడా మా అమ్మ దయ తో వంశ పారంపర్యం గా వచ్చిన సులక్షణం) మొత్తానికి అలా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, నేను ఒక్కర్తినీ ఇంట్లో వుండిపోయాను. ఒంటరిగా కూచుని కాస్సేపు నన్ను నేను తిట్టుకున్నాను, కాస్సేపు మా వారికి call చేసి మీ వల్లే అని సతాయించాను, కొంచెం సేపు బుజ్జగించి చూసారు, ఇంకా వినకపోతే, అసలు నన్నెవడు అడగమన్నాడు, ఇకనుండీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేను ఫలానా చోటికి వెళ్తున్నా అని information ఇయ్యి చాలు అని ఎదురుదాడికి దిగారు. అమ్మపెట్టే రెండూ పడితే గాని నాకు తృప్తిగా వుండదు కదా అనుకుని phone పెట్టేసి కాస్సేపు అసలు తప్పు ఎవరిదా అని అలోచించాను (తప్పు వెంఠనే నిర్ణయం తీస్కోలేని నాదే అని స్పష్టంగా తెలుస్తున్నాసరే ఇంకొకళ్ళు ఎవరో కారణం అనిపించేదాక మనఃశ్శాంతి దొరకదు నాకు) ఎంత తల బద్దలు కొట్టుకున్నా ఎవ్వరూ దొరకక నన్ను అప్పటిదాకా సతాయిస్తున్న నా మనసుని తప్పంతా నీదేనే పిరికిమనసా అనేసి మళ్ళీ దాని మాట వినపడకుండా దుప్పటీ ముసుగు పెట్టేసాను.
కానీ అప్పుడప్పుడూ, అనవసరమైన సాహసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చికుని వాళ్ళ కుటుంబాలకి తీరని దుఃఖాన్ని మిగిల్చినవాళ్ళ సంఘటనల గురించి తెలిసినప్పుడు మాత్రం అనిపిస్తుంది, పిరికిమనసా జిందాబాద్ అని.