మా వాడికి ఒక్క సంబధమూ కుదరొట్లేదేవిటో...నా బెంగంతా వాడి పెళ్ళి గురించే వొదినా అని ఇరుగింటావిడ అంటే....హ్మ్ మా వాడికి పెళ్ళయినదగ్గర్నుంచీ కోడలి కొంగట్టుకు తిరుగుతూ...మా వూసే పట్టించుకోటం మానేసాడు నా బాధెవడితో చెప్పుకోవాలి అంటుంది పొరుగింటావిడ.
నాకు వుద్యోగం ఎప్పుడొస్తుందోరా మీరంతా హాయిగా సంపాదించుకుంటున్నారు..నేనిలా గాలికి తిరుగుతున్నా అని ఒక స్నేహితుడంటే....ఏమి వుద్యోగమోరా చచ్చేంత పని...ఈ వెట్టి చాకిరీ చెయ్యటం కంటే రాజీనామా చేసి సన్యాసుల్లో కలవటం మంచిదనిపిస్తోంది రా అంటాడు రెండోవాడు
మా పిల్లదానికి చదువబ్బట్లేదని ఒకాయనంటే...మా పిల్లకి చదువెక్కువై మమ్మల్ని వదిలేసి ఎగిరి చక్కా పోయింది...ఒక పలకరింపుకి కూడా ఖాళీ లేదంటుంది అని వాపోతాడు రెండో ఆయన...
నీకేవిరా America చెక్కేసావ్...ఇక్కడ ఈ దుమ్మూ ధూళి లో కొట్టుకుంటున్నాం అని సహోద్యోగి అసూయతో కలిపి తన బాధ వెళ్ళగక్కితే...నీకేం తెల్సురా ఇక్కడ పొద్దున్నలేచి అన్ని పన్లూ నేనే చేస్కునే సరికి చుక్కలు కనపడుతున్నాయి అని విదేశీ భారతీయుడు తన విసుగుని వివరిస్తాడు..
మా ఆయనకి ఏవీ నచ్చవ్...అన్నీ వంకలే...అన్నీ గొడవలే అని అప్పుడే వంటింట్లో బుడి బుడి అడుగులేస్తున్న ఇల్లాలు అంటే...మా ఆయన ఎలా వండినా తినేస్తాడు...చిన్న గొడవ పడదామన్నా దేనికీ ఏమీ అనరు...అదెంత చిరాకో నీకెం తెలుసు అంటుంది ఇంకో పిల్ల...
ఇస్త్రీ నలగని పాంటూ చొక్కా వేసుకుని ఆటో లో కూచున్న soft wear బాబు ని చూసి ఈన పని బావుంది కడుపులో చల్ల కదలకుండా పొద్దస్తమానం AC గదుల్లో కూచుంటాడు అని ఆటో డ్రైవరు అనుకుంటే...పొద్దున్న లేస్తే అన్నీ tension లే వీడి పని బావుంది...తన పని కి తనే రాజా...సంపాదన చూస్తే వీడిదే ఎక్కువలా వుంది అనుకుంటాడు...పైకి దర్జా వొలకబోస్తున్న దొరబాబు...
తిండికి లేక వొకడేడుస్తూ వుంటే...పెట్టెల్నిండా డబ్బులు వంటినిండా రోగాలతో ఏవి తింటే ఏవొస్తుందో అని భయపడుతూ ఏడుస్తూ వుంటాడు ఇంకోడు...
మొత్తానికి ప్రతీ వాడికీ తన కష్టం మాత్రం పాము లాగా...ఎదుటి వాడి కష్టం మాత్రం తాడులాగా...చీపురు పుల్లలాగా కనిపిస్తుంది...
మా అమ్మ కాలునొప్పో తల నొప్పో అంటే ...నాన్నగారు వెంఠనే నాకూ నిన్నట్నుంచీ కాలు నెప్పి...నీలా చెప్పలేదంతే అనేసే వారు తడుముకోకుండా...ఎందుకో ఎవరనా తమ కష్టం చెప్పగానే ఠక్కున మనకి ఇంకా పెద్ద కష్టం వుందని చెప్పెయ్యాలనిపిస్తుంది. కష్టం కూడా ఒక రకమైన prestige issue లాంటిదేమో అనిపిస్తూ వుంటుంది. నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలేడు తీర్చలేడు...కనీసం మన్స్ఫూర్తిగా బాధపడలేడు కూడా...ఐనా సరే మన కష్టం పక్కవాడితో చెప్పగానే వాడు తనకున్న ఇంకా పెద్దకష్టం(తన వుద్దేశం లో) మనకి చెప్తాడు కాబట్టి..చెప్పావ్ లే బడాయి అని పైకి అనుకున్నా లోపల్లోపల అంతర్లీనం గా మన మనసు కాస్త తృప్తి పడుతుందేమో మనకే కాదు కష్టాలున్నవి అని...బాధ పంచుకుంటే గుండె తేలిక పడటం వెనక వున్న philosophy ఇదేనేమో( ఈ అవిడియా రాసే ముందు బుర్రలో లేదు...రాస్తుంటే తట్టేసింది...:D )
ఏవయినా కానీ మనుషుల్ని దగ్గర చేసే శక్తి కష్టానికే ఎక్కువ వుంది...సంతోషం గెలుపూ మనిషిని గాల్లో తేలిపోయేలా చేస్తే, ఓటమీ, కష్టం ఆ మనిషిని నీ మూలాలు ఇక్కడున్నాయి బాబూ అని గుర్తుచేసి నేలమీదకి లాక్కొస్తాయి. గెలుపు అహం భావాన్ని పెంచితే వోటమి ఆత్మ పరిశీలనకి అవకాశాన్నిస్తుంది. సంతోషం చుట్టం చూపుగా పలకరించి పోతే...కష్టం మాత్రం జీవన సహచరి లా అన్ని వేళలా వెన్నంటి నిలుస్తుంది..
ఒక సమస్య తీరితే రెండో సమస్య కి promotion దొరుకుతుందిట ఎక్కడో చదివాను...కష్టం బాధా లేకపోతే నిన్ను తలవను...ఎల్లవేళలా కష్టాలు వుండేటట్టు చూడు స్వామీ అని గొంతెమ్మ కోరిక కోరిందట కుంతీదేవి...నిజవే కష్టమన్నదే లేకపోతే మనిషిలో ఈ మాత్రం మానవత్వం...మంచితనం కూడా దొరకవు...సుఖానికి విలువా మిగలదు. కష్టానికి కొలతలూ తూనికలూ లేకపోయినా సంతోషానికి విలువ కట్టేది మాత్రం దానితోనే...
మనిషి పుట్టుకా, చావూ వేదనా భరితమే....ఆ రెంటి మధ్య ప్రయాణం భవ సాగరమే...ఆ కష్టాన్నే మన తోడుగా అనుకుని బతకటం నేర్చేసుకుంటే కష్టం ఇంక కష్టమనిపించదేమో...
7 comments:
నిజం స్ఫురితా, బాగా చెప్పారు. ! కష్టానికి కొలబద్ద లేదు. కొలమానము లేదు.
ఎంత చెట్టుకు అంత గాలి అనుకోవాలో లేక ఎవరి కష్టం వాళ్లకి గొప్ప అనుకోవాలో తెలీదు కొన్ని సార్లు!
చివరి పేరా మరింత బాగుంది.
నిజం! మరొకరి కష్టం విని, మన కష్టాన్ని పోల్చుకుని ఏమూలో తృప్తి పడే తత్త్వం మనలో లేకపోలేదు.. కాకపొతే ఒప్పుకోలేం అంతే.. బాగా రాశారు, ఎప్పటిలాగే..
మీ బ్లాగ్ బాగుందండి నేనీరోజే చూసాను . బాగా రాసారు .
>>>>నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలేడు తీర్చలేడు<<<
ఇది నిజం. బాగా చెప్పారు. కాకపోతే
>>>కనీసం మన్స్ఫూర్తిగా బాధపడలేడు కూడా<<<
ఇది తప్పండి. కొందరు ఎదుటివారి కష్టానికి మనస్ఫూర్తిగా స్పందిస్తారు.
బాగా రాసారు.
"నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలేడు తీర్చలేడు
కనీసం మన్స్ఫూర్తిగా బాధపడలేడు కూడా"
ఇది చాలావరకు కరెక్టే గాని.......పూర్తిగా నిజం కాదేమో అనిపిస్తుంది.
>>కష్టమన్నదే లేకపోతే మనిషిలో ఈ మాత్రం మానవత్వం...మంచితనం కూడా దొరకవు...సుఖానికి విలువా మిగలదు..
నిజం...బాగుంది....!!
సుజాతగారూ, మురళి గారూ, కిరణ్...ధన్యవాదాలు
మాలగారూ...మళ్ళీ స్వాగతం మీకు :)
@అజ్ఞాత, @స్థితప్రజ్ఞుడు....ఎంతైనా మనకష్టానికి బాధ పడ్డట్టు పక్కవాళ్ళది చూసి బాధపడమనిపించి అలా రాసాను...మీరు చెప్పాక నిజమే అనిపిస్తోంది...ధన్యవాదాలు
Post a Comment