నల్లటి మెట్లు, మెట్లపక్కన పిట్టగోడ మీదుగా పాకిన సన్నజాజి పందిరి, మెట్ల మళుపుకి పక్కగా నల్లటి ఇనప చువ్వల కటకటాలు, దాని మీదుగా పాకిన రాధా మనోహరాల చెట్టు, వాటి మీదుగా ఇంకాస్త ముందుకి వెళితే బల్లల గది.
గచ్చు బదులు బల్లలు పేర్చి కట్టిన డాబా పైన గది. నాకూ నాతో పాటూ నా cousines ముగ్గురూ, మాతో సమానం గా అల్లరి చేసిన పిన్నిలు, చిన్న మావయ్యా...మా అందరి వూహలకీ రెక్కలొచ్చిన పొదరిల్లు ఆ బల్లల గది.
మా కలల ప్రపంచానికి తలుపులు తెరిచి స్వాగతం పలికిన హరివిల్లు ఆ గది.
కాస్త గట్టిగా నడిచినా పెద్దగా చప్పుడు చేసి, కింద నుంచి పెద్దవాళ్ళ చేత "ఏవిటా అల్లరి?" అని అక్షింతలు వేయించి నవ్వుకున్న చిలిపి కిట్టయ్య లాంటి గది.
చీమల్లా అలికిడి కాకుండా ఆ గదిలో దూరి, కట్టుకున్న పేక మేడలు, చెప్పుకున్న కబుర్లూ, కలబోసుకున్న స్కూలు అనుభవాలూ, చదివిన చందమామ కథలని నాటికలుగా మార్చి రాసుకుని, పెద్దవాళ్ళంతా చాయ్ తాగే వేళకి వాళ్ళముందు మా రాతలకి దృశ్య రూపం ఇచ్చేసి.. బుల్లి నటీ నటులుగా కొట్టించుకున్న చప్పట్లు, పోటా పోటీలుగా ఆడుకున్న అంత్యాక్షరులూ, తాతగారి పందిరి మంచం ఎదురుగా వుండే పెద్ద వుయ్యాలాతో చేసిన ఫీట్లూ, తగిలించుకున్న దెబ్బలూ, తాతగారితో కలిసి పెద్దవాళ్ళకి తీసిపోకుండా ఆడిన పేకాటలు, ఆయన పెద్ద విస్తరాకు కంచం...వెండిపువ్వుల పీట కోసం పడ్డ పోటీలూ, వాటిని తీర్చడానికి పెద్దాళ్ళ ఆపస్సోపాలూ, సంజె వేళ పెరట్లో చేసిన భోజనాలు, ఆటల మధ్య మా అలకలూ,పేచీలూ...మర్నాడు ఉదయానికి ఏమీ ఎరగనట్టు కలిసిపొయిన చిన్నారి స్నేహాలూ...
ఇంచుమించు ఇరవై మంది పూటకో గంట మాత్రం వదిలే కుళాయి నీళ్ళతో సద్దుకుని మహదానందంగా గడిపిన ఎర్రటి ఎండాకాలం సెలవలు...ఆశా సౌధాలకి పునాదులు వేసుకున్న అమ్మమ్మ గారింటి జ్ఞాపకాలు...
*******************************************
పెరటి వేపు నల్లటి పెద్ద గేటు మీద పాకిన రాధామనోహరాలు...
డాబా మీదుగా చూస్తుంటే కనబడే హరేరాం మైదానం, దాని మధ్యలో వుండే రాములవారి కోవెలా, దాని వెనకాలే వుందని నేను చాలా రోజులు భ్రమపడినా, దూరం గా వుండే నరసిమ్హస్వామి కొండ...
డాబాపైన చెక్క కటకటాళ్ళ వరండా...ఒక్కో గోడకీ పది కిటికీలు వాటికి బుల్లి బుల్లి తలుపులూ వుండే కిటికీల గదీ...గది చుట్టూ బీరువాల్లో పేర్చిపెట్టిన తాతగారి అపురూపమైన ఆస్తి ...ఆయన పుస్తక సంపద.
ఇంటి వెనకాల పెద్ద బావీ, పెరడంతా నీడనిస్తూ మావిడి చెట్టూ. పొద్దున్నే పలకరిస్తూ తులసమ్మ ఎదురుగా ముద్దమందారాల చెట్టూ.
సెలవలకి ఎప్పుడొస్తానని నాలుగురోజుల ముందునుంచే వాకబు చేస్తూ , నేను వచ్చిన ఐదునిమిషాల్లో ప్రత్యక్షమయ్యి వాళ్ళతో ఆటలకి లాక్కెళ్ళిపోయే నా బుల్లి నేస్తాలూ.
మధ్యాహ్నం గాళుపు కొడుతోందని ఇంట్లో పెట్టి ఎన్ని గడియలు వేసినా చల్లగా జారుకుని చెట్ల నీడలో ఆడిన గుజ్జినగూళ్ళు, పప్పు బెల్లాలతో చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు.
మామ్మ చెలులతో కలిసి ఆడిన గవ్వలాటలూ.
తాతగారిని మధ్యాహ్నం వేళ కునుకు తియ్యనివ్వకుండా వేసిన యక్ష ప్రశ్నలూ, ఆయన చెయ్యి పట్టుకుని గర్వం గా చేసిన సాయంత్రం షికార్లూ.
వీధరుగు మీద మామ్మ వడిలో తల పెట్టుకుని నూట యాభయ్యో సారి కూడా విసుగు లేకుండా రామాయణ కధ చెప్పించుకున్న వెన్నెల రాత్రులు.
నా కోసం ప్రత్యేకం గా ఫ్రిజ్జు లోంచి గడ్డ పెరుగు తీసి చక్కెర చల్లి ఇచ్చే పక్కవాటాలో అద్దెకుండే ఆంటీ, నన్ను చూసి కేరింతలు కొట్టే ఆంటీ వాళ్ళ చిచ్చరపిడుగూ.
మనసులో మెదిలినప్పుడల్లా కళ్ళలోకి సన్నటి నీటిపొరని మోసుకొచ్చే మామ్మ గారింటి జ్ఞాపకాలు...
*******************************************
ఇప్పుడా బల్లల గది లేదు. కిటికీల గది వుందో లేదో తెలీదు.
భౌతికంగా శిధిలమైపోయినా జ్ఞాపకాల వాకిట్లో మాత్రం ప్రాణం పోసుకుని సజీవంగా వున్నాయి. ఆ రోజులు తిరిగి రాకపోవచ్చు. చెదరని ఆ జ్ఞాపకాల జల్లులు మాత్రం మనసు మీద దాడి చేసినప్పుడల్లా వాటితో పాటుగా బోలెడంత వుత్సాహాన్ని కూడా మూటకట్టుకుని తీసుకొస్తాయి.
మనిషి ప్రయాణం పడమటికే ఐనా మనసు ఎప్పటికప్పుడు తూరుపు వెళ్ళే రైలు ఎక్కేస్తూనే వుంటుంది ఉదయ సంజె వెలుగుల్ని పలకరించి రావటానికి.
మనిషి time machine ఎక్కి వెనక్కి వెళ్ళలేకపోవచ్చు. మనసు మాత్రం ఏ technology తో పని లేకుండా తనకి కావల్సినప్పుడల్లా రోజు వారీ పనుల్లోంచి విరామం తీసుకుని రెక్కలు కట్టుకుని వెనక్కి ఎగిరిపోగలదు. జ్ఞాపకల వీధుల్లో షికార్లు కొట్టి తాజా పరిమళాలనద్దుకుని వర్తమానం వాకిట్లో వాలిపోగలదు...
జ్ఞాపకాలు...కాస్త పరుగాపి చతిగిలబడి కళ్ళు మూసుకుంటే తలపుల ముంగిట్లో ప్రత్యక్షమయ్యే చెక్కు చెదరని స్మృతుల తేనె చినుకులు. ఎప్పటికప్పుడు మనసుకి కొత్త వుత్తేజాన్ని ఇచ్చి పరుగులు పెట్టించడానికి దొరికే పని విరామాలు. తరవాతి తరాలకి "మా చిన్నప్పుడు" అని చెప్పుకోడానికి మనసుపొరల్లో నిక్షిప్తమయ్యే నిధి నిక్షేపాలు. విరగబూసిన రాధామనోహరాల సుగంధాన్ని తమతో పాటు మోసుకొచ్చే సీతాకోక చిలుకలు...
(ఈ మధ్యే అమ్మమ్మ వూరు వెళ్ళొచ్చిన cousine ముఖపుస్తకం లో పెట్టిన update తో...మనసులో మెదిలిన జ్ఞాపకాల పరంపర కి అక్షర రూపం.)