4/11/12

పరుగాపి...
పొద్దున్నే అయిదింటికి అల్లారం లే లే అని కుదిపి కుదిపి, చెవినిల్లు కట్టుకుని పోరేస్తోంది. అసలే చలికాలం...దాని పీక నొక్కి ఇంకొక్క పదినిమిషాలు అని తనలో తనే గొణుక్కుని దుప్పట్లో దూరింది నందిని. నిన్న రాత్రి  కుక్కరు గిన్నెలు పొద్దున్న లేచి తోవుకోవచ్చులే అని బధ్ధకించి వదిలేసిన సంగతి గుర్తురాగానే లేవక తప్పదు బాబోయ్ అనుకుని వంటింట్లోకి పరిగెత్తి నిద్ర మత్తులో చల్ల నీళ్ళ కుళాయి తిప్పేసరికి 0 కన్నా తక్కువ వుష్ణొగ్రతలో నీళ్ళు చేతిమీద సూదుల్లా గుచ్చుకుని మత్తంతా ఒక్క నిమిషం లో వదిలిపోయింది...చలికి ఎండిపోయిన గిన్నెల్ని కసిగా తోవుతుంటే ఎందుకో అమ్మ మాటలు గుర్తొచ్చాయి..."రోజూ తెల్లవారుఝామునే చదువుకోడానికి లేవదీసి బాగా చదువుకుంటే నాకులా ఇలా అంట్లు తోవుకుంటూ బతకక్కర్లేదు...కాలు మీద కాలేసుకుని దర్జాగా వుండొచ్చు. చదువుకుంటాను మొర్రో అన్నా పట్టించుకోకుండా నా తరవాత ఇంకా నలుగురాడపిల్లలున్నారని చిన్నప్పుడే పెళ్ళి చేసి పడేశారు. నీకు అన్నీ అమర్చిపెట్టి చదువుకుని సుఖపడవే అంటే అంత గునుపేవిటే"...పుస్తకం వొళ్ళో పెట్టుకుని కునికిపాట్లు పడే తనకి రోజు వంటింట్లోంచి అదే సుప్రభాతం వినపడేది.
"చదువుకుని సుఖపడవే అంటే" అన్న మాట మళ్ళీ గుర్తొచ్చి చిన్నగా నిట్టూర్చింది కుక్కరు పొయ్యిమీదకెక్కిస్తూ...అదే అమ్మ ఇప్పుడు call చేసినప్పుడల్లా  "మా కన్నా మీరేం సుఖపడుతున్నారే" అని దీర్ఘం తీస్తుంది అని నవ్వుకుంటూ స్నానాలగదిలోకి దూరింది.

ఇంట్లో మిగిలిన ఇద్దర్నీ వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకి పంపి, చివరగా తన బాగ్గు హడావిడిగా సవిరిస్తూ ..ఛా రేపట్నుంచీ అన్నీ రాత్రే సద్దిపెట్టుకోవాలి అని రోజూలాగే తిట్టుకుంటూ, కనపడని ఆఫీసు బాడ్జ్ ని మొత్తానికి సాధించి హడావిడిగా పరిగెట్టి బయటపడింది. ఎప్పట్లాగే కాస్త లేటుగా ఆఫీసు చేరుకుని సీట్లో కూలబడింది, నేనేనా అందరికంటే ఆలస్యం అని కళ్ళతోనే చెక్ చేస్కుంటూ. ఏదో వొకరోజు తొమ్మిదింటికే స్టాటస్ మీటింగు పెట్టేస్తాడు బాసు గారు..నాకు సరదా తీరిపోతుంది అని తనని తనే తిట్టుకుంటూ ల్యాపీ తెరిచింది. మైల్ చెక్ చేస్కుంటూ, "ఒక పక్కన డెలివరీ డేటు దగ్గర పడుతుంటే ఇంకా రెక్వైర్మెంట్స్ మారుస్తున్నారు ఈ బిజినెస్ వాళ్ళకి పనీ పాటా లేదు" అని తిట్టుకుంటూ పనిలో పడింది.

స్వాతి "Lunch?" అని పింగ్ చేసేసరికి అప్పుడే లంచ్ టైం అయ్యిందా అని వాచ్ చూస్కుని, తట్టెడు పనుందికదా పోనీ డెస్కు దగ్గరే కానిచ్చేద్దామా అనుకుని వద్దులే రోజు మొత్తంలో ఈ గంటేగా కాస్త సరదాగా గడిపేది అనుకుని "ok" అని పింగ్ చేసి బాగ్గు తీస్కుని కాఫటేరియా వైపు నడిచింది. అప్పటికే దేసీ గ్రూపులో చాలా మంది చేరిపోయారు అక్కడ...నందినీ, స్వాతీ చాలా రోజులుగా కలిసి పని చేస్తున్నారు...చాలా మంది భారతీయులు అక్కడ చేరినా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కూచుని లంచ్ చేస్తున్నంత సేపూ పనిలోనూ ఇంట్లోనూ, ఎదురయ్యే కష్ట సుఖాలు కలబోసుకుంటూ వుంటారు.

ఇద్దరూ మాట్లాడుకుంటూ లంచ్ బాక్సులు విప్పుతుంటే వీళ్ళ పక్కనే వచ్చి కూచున్నాడు శ్రీకాంత్ పలకరింపు గా నవ్వుతూ, అతని బాక్సు విప్పుతుంటే ఘుమ ఘుమా వాసన వచ్చేసరికి ఏవి తెచ్చుకున్నాడబ్బా అని కాస్త కుతూహలం గా అతని బాక్సు లోకి తొంగి చూసింది స్వాతి. "ఆహా గుత్తి వంకాయ కూర"  పైకే అనేసింది...అసలే తనకి అదంటే ప్రాణం. అతను రుచి చూడండి, మా ఆవిడ చేసింది అని ఇద్దరికీ తలో కాస్తా వడ్డించాడు. ఈ స్వాతికి అస్సలు బుధ్ధిలేదు అనుకుంటూ మొహమాటం గా నవ్వింది నందిని. ఆ వేసిన కాస్త కూరా నొట్లో పెట్టుకుని చాలా బాగా చేశారండీ మీ ఆవిడ అంది. స్వాతి మాత్రం అంతటితో వదల్లేదు..."మీరెంత అదృష్టవంతులండీ...ఐతే కొత్త పెళ్ళికూతురు వంటలు అదరగొట్టేస్తోందన్నమాట" అంది శ్రీకాంత్ కి కొత్తగా పెళ్ళవడంతో... "ఆ... ఏవదృష్టమో లెండి వంటలొకటే ఆవిడ అదరగొట్టేది" అన్నాడు మహా నిరుత్సాహం గా...అదేవిటీ అలా అనేశాడు అన్నట్టు చూశారిద్దరూ అతనికేసి.

"బోల్డు చదువుకుంది...నిజం చెప్పాలంటే నాకన్నా అన్నీ మంచి గ్రేడులే...చక్కగా ఉద్యోగం చేస్తుంది...బోల్డు విలాసం గా బతకొచ్చు అనుకున్నా ఇప్పుడేమో మనకంత గండకత్తెరోమొచ్చిందీ అంటుంది ఎప్పుడు వుద్యోగం ప్రసక్తి తీస్కొచ్చినా". మరి పెళ్ళికి ముందు మీరు తనని అడగలేదా, స్వాతి అడిగేసింది..."అప్పుడు అవసరమైతే చేస్తానన్నట్టు చెప్పింది...అవసరానిదేవుంది...అదే వస్తుంది...టయోటా కారున్న వాడికి బిఎండబల్యూ కారవసరం...ఫ్యూటానున్న వాడికి లెదరు సోఫా అవసరం...దర్జా గా బతకటం అవసరమని తనే అర్ధం చేస్కుంటుంది లే అనుకున్నా...ఇప్పుడేమో మనకేం తక్కువ...ఇద్దరం రెక్కలు ముక్కలు చేసేస్కుని ఇంట్లో మనశ్శాంతి పోగొట్టేస్కునే కన్నా వున్న దాన్లో ప్రశాంతంగా పొదుపుగా బతకొచ్చుకదా అని వితండవాదం ఎప్పుడూ...ఏవిటో ఇలా అడ్డంగా దొరికిపోయాను" అని తెగ బాధ పడిపోయాడు.

 "బాధ పడకండి శ్రీకాంత్...తొందర్లోనే తను తెల్సుకుంటుంది లెండి...మాకు పరిచయం చెయ్యండి తనని...మమ్మల్నందర్నీ చూశాకా తనకి వుద్యోగం చెయ్యాలనిపిస్తుంది" అని స్వాతి అతన్ని ఓదార్చడం మొదలెట్టింది. ఎందుకో ఇంకక్కడ వుండాలనిపించక నాకు చాలా పనుంది స్వాతీ, అని త్వరగా లంచ్ ముగించేసి తన డెస్కు దగ్గరకొచ్చేసింది నందిని.

తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఎందుకో కాఫటేరియా సంభాషణ మనసుని వదలట్లేదు. శ్రీకాంత్ భార్య చెప్పినదాంట్లో అంత తప్పేవుంది అనిపిస్తోంది.  రోజూ ఈ అష్టావధానం తనవల్ల కావట్లేదని బోల్డు బాధపడుతుంది, ఈ స్వాతి కూడా ఏవిటి అతన్నే వెనకేసుకొస్తుంది...అసలు తామంతా విలాసాలని అవసరం గా పొరబడి బతికేస్తున్నామా...మనసుని వుక్కిరిబిక్కిరి చేస్తూ ఏవో అలోచనలు...అలోచనల్లోంచి మనసు నెమ్మదిగా జ్ఞాపకాలవైపు పరిగెడుతోంది.

తనకప్పుడు ఆరో ఏడో వుంటాయి..అమ్మమ్మ ఇంట్లో ...కరెంటు పోయినప్పుడు... చీకట్లో వుయ్యాలా బల్ల ఎక్కి... తనూ, పెద్దమ్మ కూతురూ...ఇద్దరూ పెద్దయ్యాక ఏమి అవ్వాలో తెగ చర్చించేస్కుంటున్నారు... ఆ గదిలో ఇంకెవ్వరూ లేరనుకుని."నేను బాగా చదువుకుని డాక్టరు అవుతా" అని ఒకళ్ళంటే "డాక్టరు ఐతే ఛీ రక్తం...అన్నీ చూడాలి బాబోయ్" అని అవతలి వాళ్ళూ..."పోనీ టీచరు ఐతే అనుకుంటే మనలాగే పిల్లలు మనల్ని తిట్టుకుంటారు"...అని రెండో వాళ్ళు..ఇలా వాళ్ళకి తెలుసున్న వృతూలన్నింటి గురించి చర్చించుకుంటుంటే ఇంతలోనే కరెంటు వచ్చేసింది...చూసేసరికి ఎదురుగుండా పందిరి మంచం మీద తమ మాటలకి నవ్వుకుంటూ తాతగారు. అయ్యో మా మాటలన్నీ వినేస్తున్నారా ఐతే ఇప్పటిదాకా అని బిక్కమొహాలు వేసిన తామిద్దర్నీ చూసి నవ్వుతూ తాతగారు "ఇలా రండర్రా మీకొక మాట చెప్పాలి" అని దగ్గరికి తీసుకున్నారు.

 అసలూ చదువుకోడం ఎందుకనుకున్నారు? అని అడిగారు...ఇది కూడా తెలీదా అన్నట్టు చూసి...వుద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించడానికి అన్నారిద్దరూ ఏకకంఠంతో...అది కాదర్రా...చదువుకోడం వెనకాల అసలుద్దేశం అది కాదు...జ్ఞానం సంపాదించడం...దాన్ని ఆస్వాదించడం...మన చుట్టూ వున్న వాటి విలువ తెలుసుకోవడం...వాటిని గౌరవించడం...మన జీవితంలో ఎన్నింటికో అర్ధాన్ని వెతకడం...ప్రహల్లాదుడు తన తండ్రి హిరణ్యకశుపుడితో ఏవన్నాడో తెలుసా...

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ

చదువుకున్నాక వుద్యోగం చెయ్యడం అన్నది అవసరం, అభిలాష వీటన్నింటి మీద ఆధారపడి వుంటుంది...కానీ మీరు గుర్తుపెట్టుకోవలసింది చదువు ప్రధానోద్దేశం డబ్బు సంపాదించడం కాదు...సంపాదన కోసమే ఐతే చదువుకోనక్కర్లేదు...మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవచ్చు...ఆనందాన్ని ఎలా నిపుకోవచ్చు...మనమూ..మన చుట్టూ వుండేవాళ్ళూ సంతోషం గా comfortable గా ఎలా వుండొచ్చూ...ఇవి నేర్పడం విద్య ముఖ్యోద్దేశం...
                   
ఒక్కసారి ఈ లోకం లోకి వచ్చి నందిని టైము చూస్కుని...మళ్ళీ కంప్యూటర్ వైపు తిరిగి పనిలో పడిందే గాని బుర్ర పూర్తిగా పనిలో మునిగిపోలేకపోతోంది...అప్పుడు తాతగారు చెప్పింది వాళ్ళిద్దరికీ ఏమీ అర్ధం కాలేదు...అసలిప్పటికైనా అర్ధమైందా. ఏడేళ్ళ పిల్లల అలోచన కన్నా ఏమి పరిపక్వత వచ్చింది. ఇంకొకళ్ళతో పోల్చుకుంటూ...వాళ్ళ దారిలో పరిగెట్టడమే కానీ నిజంగా తమకేం కావాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించామా...దేనిలో సంతోషముందో అని వెతికి చూసిందా తనూ...అసలైన ఆనందానికి అర్ధమేవిటో ఎప్పుడైనా ఆగి అలోచించిందా తను...తను ఏరోజైనా ప్రశాంతంగా వుందా...తన చుట్టూ వున్నవాళ్ళని వుంచగలిగిందా...నందిని యంత్రం లా పని చేసుకుని పోతోంది...ఆలోచనల దొంతర్లు చెదిరిన గూటిలోంచి చెల్లా చెదరైన తేనెటీగల్లా మనసుని తలో వైపు లాక్కుపోతున్నాయి...

 పనితోనూ...ముంచెత్తుతున్న అలోచనల అలజడితోనూ విసిగిపోయి ఇంటికి చేరింది ఆరున్నరవుతుండగా...అప్పటికే ఇల్లు చేరి బంటిగాడి పేచీ ని పెద్దగా లెఖ్ఖచెయ్యకుండా టీవీ లో వస్తున్న football ని తీక్షణం గా తిలకిస్తున్న కిషోర్ "ఏవిటోయ్ ఇంత లేటు ...కాస్త కాఫీ నా మొహానపడేద్దూ "అన్నాడు నందిని మొహంలో విసుగుతో తనకేమీ సంబధం లేదన్నట్టు...బంటిగాడి అలకతీరుస్తూ వాడికేవో మాటలు చెప్తూ అలానే కాఫీ కలుపుకొచ్చి సోఫా లో కూలబడింది...కాఫీ పూర్తవ్వగానే రాత్రికేం చేస్తున్నావు..."నాకేమైనా మంచి స్పైసీ గా తినాలనిపిస్తోందోయ్...నువ్వు చేస్తావే స్టఫ్ చేసి దొండకాయ కూర అది చెయ్యకూడదూ"...కిషోర్ ఎప్పుడూ ఇది చెయ్యి అని ఆర్దర్ వేసినట్టు మాట్లాడడు...అలా అని చెసేదాకా వదిలీ పెట్టడు, చిన్న చిన్న విషయాలే కాదు..అన్నింటిలోనూ...ఈ సంగతి నందినికి అర్ధమవ్వడానికి పెళ్ళయ్యాక కొంత సమయం పట్టింది...అర్ధం అయ్యాక ఎప్పుడూ అతను ఏదైనా కోరాకా వాదించాలనో, బుజ్జగించాలనో ఎప్పుడూ ప్రయత్నించి కాలం వృధా చెయ్యలేదు. అలాగే అని సోఫాలోంచి లేచి వెళ్తూంటే వెనకనుంచి కిషోర్ "అదే చేత్తో సాంబార్ కూడా వుంటే"...అన్నాడు టీవీ వైపు నుంచి బుర్ర తిప్పకుండానే...

పడుతూ లేస్తూ...పరిగెడుతూ మధ్యలో బంటి గాడి పేచీలు తీరుస్తూ మొత్తానికి తొమ్మిదవుతుంటే వంట పూర్తి చేసి కంచం లో కూరా అన్నం...పక్కన కప్పులో సాంబారు వేసి కిషోర్ ముందు పెట్టి బంటిగాడికి తినిపించడానికి వెళ్ళబోతుంటే "అరెరే అప్పడాలు వేయించలేదా" అన్నాడు కిషోర్ నిరుత్సాహంగా. అప్పటిదాకా పక్కకి నెట్టి, పని కానిచ్చిన విసుగూ కోపం అంతా ఒక్కసారి వరద గోదారిలా కట్టలు తెంచుకున్నాయి నందినికి...ఏవిటి కిషోర్ నువ్వూ చూస్తున్నావ్ గా...వచ్చినదగ్గర్నుంచీ ఒక్క క్షణం కూడా కూచోకుండా చేస్తూనే వున్నాను...ఎంత పరిగెట్టినా తొమ్మిది లోపు బంటి గాడికి అన్నం పెట్టలేకపోతున్నాను. కనీసం వాడిని నా కాళ్ళకడ్డాం పడకుండా ఆడించడం కూడా చెయ్యవ్... ఇలా పొంగుకొస్తున్న కోపం, బాధా అన్నీ కలిపి మాటల్లో చెప్తుంటే, కిషోర్ మాత్రం చాలా ప్రశాంతంగా, "మా అమ్మ మరి సాంబార్ పెట్టినప్పుడల్లా అప్పడాలు వేయించేది ఆ అలవాటుతో" అంటూ, నందిని కళ్ళల్లోకి చూసి అక్కడే ఆపేశాడు.

నందిని వంట గదిలోకి వెళ్ళి బంటిగాడి కోసం అన్నం చల్లారబెడుతుంటే...కిషోర్ మళ్ళీ నెమ్మదిగా ..."మేవేమైనా అన్నీ నెత్తినేసుకుని చెయ్యమన్నావా...మీకంటే మేము అన్నీ చేసెయ్యగలం...మల్టీ టాస్కింగు మాకు వెన్నతో పెట్టిన విద్య అని పోటీకొచ్చి ఇప్పుడు చెయ్యలేక మానలేకా మా మీద గంతులేస్తే..." అని తనలో తనే అనుకుంటున్నట్టు నందినికి వినపడేలా అంటున్నాడు...

బంటిగాడికి అన్నం తినిపిస్తున్న నందిని కి కిషోర్ మాటలు తన చెవులు దాటి మనసుని తాకాయి...అప్పటిదాకా నీరసం...విసుగు వల్ల వచ్చిన కోపం, చికాకు ని పక్కకు నెట్టి  మనసు ఒక్కసారిగా అలోచనలో పడింది.

నిజవే వీళ్ళెప్పుడూ తమతో సమానమైన పనులు చేస్తే మీరు మాతో సమానమని వొప్పుకుంటామని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. మీరు మాపనులు చేస్తే , మేము మీపనులు పంచుకుంటామని ఏ అగ్రీమెంట్లూ రాయలేదు... సంసారపు బండి కి రెండు సమానమైన చక్రాల్ల భార్యా భర్తలు పనిని సమానంగా విభజించుకుని చేస్తున్నా...ఆడవాళ్ళని చిన్న చూపు చూడటం తో...తాము చేసే పని తక్కువ...వీళ్ళకి లాగే మనమూ సంపాదిస్తే నే మనకి గౌరవం అని మేమే అపార్థం చేసుకున్నట్టున్నాం. మీరు చేసేది కూడా మేము చెయ్యగలం అంటే అది కూడా ఆఖరికి వాళ్ళ requirement list లో చేరిపోయింది...

పన్లన్నీ పూర్తిచేసుకుని పక్కమీదకి చేరినా నందిని అలోచనల పరంపర మాత్రం కంటిమీదకి కునుకుని చేరనివ్వడంలేదు. అసలు తనకెన్ని అభిరుచులు వుండేవి...తనకి నచ్చిన ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళైంది..బంటిగాడితో హాయిగా ఆడుకుని ఎన్నాళ్ళైంది...తనూ కిషోర్ పోట్లాడుకోకుండా నవ్వుతూ ఒక గంట కబుర్లు చెప్పుకుని ఎన్నేళ్ళైంది...అమ్మెప్పుడూ వుద్యోగం చేసి సంపాదించుకుంటే స్వేఛ్ఛగా హాఇగా బతకొచ్చు అని నూరిపోస్తూ వుండేది...తను ఎంత స్వేఛ్ఛ్ గా...హాయిగా బతుకుతోంది...తను చదువుకుంది...చుట్టూ ఎవర్ని చూసినా వుద్యోగం చేస్తున్నారు...తనూ చెయ్యాలనుకుంది...కొత్త సంసారం లో , ఇంటి బాధ్యతలు అంత బరువనిపించలేదు..తనకీ సరదాగానే అనిపించింది...కానీ ఇంట్లో పనులు పెరుగుతున్నా అన్నీ చేసెయ్యాలనే అనుకుంది...తన comfort Jone గురంచి...చేస్తున్న పనిలో తృప్తి గురించి అసలు పట్టించుకుందా...తను చేస్తున్న పని వూపిరాడనివ్వని బందిఖానా లా అనిపించినప్పుడు ఇంక తను పొందుతున్న స్వేఛ్ఛ ఏవిటి? ఇలా అలోచనల్లో కొట్టుకుపోతున్న నందిని మనస్సు ఒక్కసారిగా స్ఠిమితపడింది......తను మర్నాడు ఆఫీసుకి వెళ్ళగానే చెయ్యాల్సిన పని ఏవిటో అర్ధమయ్యి...

                                                               *          *          *

అంతదాకా key board మీటల మీద చకచకా కదులుతున్న ధరణి వేళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. తను తీసుకోగలదా ఆ నిర్ణయం....ఇంటి mortgage, bank loan ఇవన్నీ ఇంక నీ బాధ్యతలే అని అంత సులువుగా తను తప్పుకోగలదా...తను రాస్తున్న కథకి ఈ ముగింపు ఇచ్చే హక్కుతనకి వుందా...ఇలా అలోచిస్తుండగానే లోపల్నుండి నీ offshore call అనుకుంటా...cell ఇక్కడ పడేసి అక్కడేం చేస్తున్నావ్...ఇప్పుడే కాస్త నిద్ర పడుతుంటే...అన్న శరత్ కేకతో వొళ్ళో వున్న PC ని పక్కన పడేసి ఒక్క వుదుటన లోపలకి పరిగెట్టింది ధరణి...

                                           

[తోచినవి రాసుకోటం తప్ప...కథ రాయటం నావల్ల కాదనుకున్న నన్ను...కథ రాయి...ప్రయత్నించు...రాయగలవు అని ఎంతగానో ప్రోత్సహించిన మాలతి నిడదవోలు గారికి కృతజ్ఞతలతో...]

34 comments:

chinna said...

akka... katha entha bagundo... nuvvu cheppindi nijame......edi evvaru adagaru chepparu...ala jarigipotuntayi anthe...

జ్యోతిర్మయి said...

స్ఫురిత గారూ కథ బావుందండీ.. ఒక్క చివర పేరానే.. ధరణి, శరత్ ఎవరో అర్ధం కాలేదు.

sphurita mylavarapu said...

జ్యోతిర్మయి గారూ ధరణి ఈ కధ రాస్తోంది...నందిని, కిషోర్ లు ఆమె కథ లో పాత్రలు...ఇది నేనంత clear గా రాయలేదోమో అనిపించి కొంచెం మార్చాను మీ కామెంటు చూశాక....మీకు నచ్చినందుకు థాంకులు

Kottapali said...

good show.

మాలతి said...

స్ఫురితా, నామాట విని కథ రాసినందుకు నీకు ధన్యవాదాలు చెప్పాలి. మంచి కథ రాసేవు కనక, ముందు ముందు ఇంకా మంచి కథలు రాయగలవని ఆశిస్తూ, అభినందనలతో

Laxmi said...

స్ఫురిత చాలా బాగా రాసారు. నా గురించె రాసారెమొ అనిపించింది. ఇప్పటి దాకా ఇలా అలొచించెది నెను ఒక్కదానినెనా అనుకునెదానిని.ఈ కధ చదివిన తరువాత నాకు అర్ధం అయ్యింది , ఇక్కడ వుద్యొగం చెసె ప్రతి ఇల్లలి భాధ ఇదె అని. ఖాని చాల భాధగా కూడా వుంది. మనకి చాలా STRESS అని తెలిసి కూడా మనం ఆ JOB మానెయటానికి ఎందుకు ఇంతగా అలూచిస్తున్నం అని.

జలతారు వెన్నెల said...

I am responding in English, because I have so many thoughts pouring down in my mind and can't really wait and type in English and then translate and look for typos. So please excuse me for that. Here are some of the comments I would like to make on this story.
The story is very well written. You deserve an applause for that.
There are NOT too many people like Kishore (at least from what I have seen for past so many years in USA) right now. Meaning that a husband who is not lending a helping hand to his wife who works just like him. I have seen husbands cook, take care of children, drive them around for their activities and they even do the laundry. I noticed that both husband and wife in fact work very well together to make the best possible living.
However I am not denying there might be fraction of people who are still like Kishore in your story. I have a friend who is living here for past 19 years and I knew her for a long time. She has a husband like Kishore. She decided not to work and take care of the house because she knew she will not get any help from her husband and she would be working 24 X 7 like Nandini. She does not even drive. It is impossible to believe that she does not drive after living in this country for so long. She justifies that if she learns driving she might be ending up driving around for groceries, dropping and picking up kids etc. on the top of what she does at home. Her husband likes eating variety of food and she makes all that for him. So when I asked her once, being an educated female, don't you ever feel like working -you can make more money and have a better standard of living. She replied if that happens I might have to make a choice between my husband or my luxuries -like a bigger home, bmw or anything more money can buy her. She said-she does not have any problem with her husband as he is a great guy, except that he does not cook or do any household work. Since she is happy with him and accepts him for what he is she made a right choices of not working /driving and today as I see her she is very happy in her life.
Yes she is educated, yes she can work and earn more money and yes she has to work day and night if that happens, which is unfair. Nandini in your story has the following choices:

1. Either quit work and stay home and compromise with life and the standard of living she has now.
2.If having a better standard of life is more important for her, continue to work and convince her husband to give her a helping hand and put her foot down and say that she cannot be working like a robot day and night. If this results in relationship problems she needs to think what is important for her- relationship or compromise in life.
Now coming back to why women only have to make certain compromises and not men in such a situation, well that is whole another discussion. But good job ! you have written it so well.

కొత్తావకాయ said...

బాగుందండీ. కథనం చక్కగా నడిపారు. అభినందనలు.

టెంప్లెట్ బాగుంది. :)

Advaitha Aanandam said...

ఇది నిజంగా కథ లాగా లేదు....
ఉద్యోగం చేస్తున్న 80శాతం మంది ఆడవారి వ్యధలాగా ఉంది....

చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు వివరించారు....
కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కొందరికి(అందరికీ) తప్పకుండా వస్తుందని నా అభిప్రాయం....

lalithag said...

I wrote a big comment in Telugu only to lose it.
So, now, in English, as clearly as I can.
Sphurita, first, I should tell you that you have done a good job and you should write more.
My actual reason for commenting is Jalataruvennela garu's comment.
According to that comment, Nandini has some choices to pick from. And, the author of the comment says that the question of why this kind of choice is the burden of women, is topic for another discussion. In my opinion, however, that is the key here. Let me explain what I mean. Just like education should be considered as a goal in intself and not as a means to employment (ideally speaking), so also employment should be noble in itself. That is, a woman choosing to work after marriage should not be looked down upon as if she is choosing some material achievemnt above her family's comfort. And another thing, does Nandini seem to have the independence to make this choice? If the character who is expressing disappointment at his wife not wanting to work is any indication, I sense that the author also wants us to consider if a woman, who might want to opt not to work has the freedom to do so. Even in description of Nandini's situation itself, I think it is mentioned somewhere that employment has become a requirement.
Ultimately, the seeming conclusion that a woman should work only if there is support from the husband instead of encouraging the idea of persuading men to consider that the modern woman has more abilities as well as choices and that respecting that would make their family life more fulfilling seems a little disheartening.
At the same time, I have to agree with the part where Jalataruvennela garu says that there are quite a few husbands who do chores around the house and share family responsibilities.
The idea is to hope that one day it becomes the norm rather than a noble effort on the part of the husband. There are all kinds of men and women and no marriage is perfect. Even the most successful marriage can be pronounced so only with the passage of time. The definition of success varies from family to family and also from time to time (for example, before kids, after kids, after kids graduate and leave the house for education or employment, after marriages of kids, after grandkids and so on and so forth.) Husband and wife have more challenges today because modern woman at least on paper has as many choices as a man has. At the same time, modern family can be that much more fulfilling because both wife and husband are equally capable if they were equally wise as well.

Anonymous said...

మీరు రాసిన కథలోనే చూడండి, చదువు గురించి మీతాత గారు(మగవారు) చెప్పిన అభిప్రాయం, అమ్మ (ఆడవారు)చెప్పిన అభిప్రాయం ఎంత విభిన్నంగా ఉన్నాయో! మీ తాతయ్యకి ఉన్న దూరదృష్ట్టి, పరిణతి అమ్మ పాత్రకి లేవని తెలిసిపోతోంది. మొగుడు ఇంట్లో కూచొని వంటా వార్పు చేసినా, భార్య గారు ఉత్సాహంగా ఉద్యోగం చేస్తుందని అనుకోను.

కాకపోతే మీరు మీకు తెలిసింది చక్కగా రాశారు. మహిళలకు ఆది నుంచి మగవారి మీద ఆరోపణలు చేయటం, బాధలను కథలలో ఏకరువు పెట్టటం అలవాటు. అది వారి అస్తిత్వంలో ఒక భాగం. ఇక
వారికి దూరదృష్ట్టి, జీవితానికి అవసరమైన తెలివి లేవంటే ఒప్పుకోరు. మేము మగవారి తో సమానం అంట్టూ పోటిపడి , మధ్యలోనే తాము పోటి వలన నష్ట్ట పోయామని తెలుసుకొని కాచ్ 22 సిట్యువేషన్లో పడి విలపిస్తూంటారు, ఇతర మహిళల నుంచి సానుభూతి కొరకు కథలను రాసుకొంట్టారు.

జలతారు వెన్నెల said...

Lalitagaaru! I was just trying to suugest a more practical approach which is adaptable in this scoiety as of "today" . I totally agree with you on one point that every educated woman (if she wishes to-there might be expceptions) should be able able to work irrespective of whether she is married or not! Just like how in today's society we just take it as a norm for every man to work, same should be incase of women. Totally agree! However are we there yet? Whether we live in India/abroad have people changed their thinking yet? No! In such situations, we need to look at what choices we have in hand.The moment Kishore realizes that nandini is quitting work because of work load ,may be he would undesrtand that he needs to lend her a helping hand, considering that he might have financial hurdles going forward, if she does not work. And that is a just something probable, but not something he would definetly do. Let me raise one more important point I have noticed in most of women(educated/uneducated).Women are a lot more emotional dependent on men than men are on woman. spuritha gaaru said in her story "కిషోర్ ఎప్పుడూ ఇది చెయ్యి అని ఆర్దర్ వేసినట్టు మాట్లాడడు...అలా అని చెసేదాకా వదిలీ పెట్టడు, చిన్న చిన్న విషయాలే కాదు..అన్నింటిలోనూ...ఈ సంగతి నందినికి అర్ధమవ్వడానికి పెళ్ళయ్యాక కొంత సమయం పట్టింది...అర్ధం అయ్యాక ఎప్పుడూ అతను ఏదైనా కోరాకా వాదించాలనో, బుజ్జగించాలనో ఎప్పుడూ ప్రయత్నించి కాలం వృధా చెయ్యలేదు."
ఎందుకు నందిని కిషోర్ ఏది కోరినా వండిపెడుతుంది కాని అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చెయ్యలేదు? ఒకటి అతను వినడు అని తెలుసు కాబట్టి, రెండు వాదించటం వలన అనవసరంగా గొడవలే కాని, దాని వలన ఒరిగేది ఎమీ లేదని, మూడు భర్త మీద ప్రేమ తో..చేతనైనంత వరకూ చేసిపెడదామని. నందినికి ఓపిక ఉన్నంతవరకూ చేస్తుంది, లేనినాడు బాధ పడుతుంది. అంతే కదా? I think she was very practical here! ఆర్దం చేసుకునే మగవారు ఎప్పుడూ కిషోర్ లాగ ఉండరు. కిషోర్ కి జరుగుతుంది కాబట్టి జరిపించుకుంటున్నాడు. నందినికి కష్టంగా ఉన్నా ఎక్కడో ఇష్ట్టం ఉంది కాబట్టే చేస్తుంది అన్ని పనులు (తన కుట్టుబం అనుకుని). మార్పు రావడం అంత తేలిక కాదంది.మార్పు రావాలని అందరము కోరుకుంటున్నాము. అందుకే స్వార్దం గా అలోచించి నందినిని తన సుఖం చూసుకోమని I concluded with those choices!

మధురవాణి said...

బాగా రాశారు స్ఫురితా.. కథలా కన్నా వాస్తవికంగా అనిపించింది నాకు.
ఇంటి బాధ్యలతకి పరిమితమవ్వడం, ఉద్యోగం చెయ్యడం అనేది వ్యక్తిగతంగా వారి వారి మనస్తత్వాలని, ప్రాధాన్యతలని బట్టి ఉంటుందనుకుంటాను. ఇవాళ్టి రోజున అందరూ ఇలానే అనుకుంటున్నారని జనరలైజ్ చెయ్యలేను గానీ ఇలాంటి సందిగ్ధావస్థలో ఇరుక్కుపోయామన్న భావనలో చాలామందే ఉన్నారనిపిస్తోంది. :)

lalithag said...

జలతారువెన్నెల గారూ,
మీ బ్లాగులో పోస్టులూ, మీ వ్యాఖ్యలూ చదివి మీ అభిప్రాయం గురించి ఒక అభిప్రాయం మెల్లగా ఏర్పడుతోంది. మీ వ్యాఖ్య నన్ను స్పందించేలా చేసిందనే కానీ, మీ వ్యాఖ్యకి నేను అనుకూలమో, వ్యతిరేకమో అని కాదు. అది నేను వ్యాఖ్య వ్రాస్తున్నప్పుడు అర్థమయ్యింది. తెలుగు వ్యాఖ్యలో ఆ విషయం కూడా వ్రాశాను కానీ మళ్ళీ ఇంగ్లీషులో వ్రాసేటప్పుడు ఓపిక లేక వదిలేశాను. స్ఫురిత గారి కథలో నాకు నందిని పాత్ర ఎక్కువ choices లేని పాత్ర లాగా అనిపించింది. నేను ముందు మీ (మొదటి) స్పందన చదివినప్పుడు ఏమీ అనుకోలేదు. తర్వాత తర్వాత ఏదో వ్రాయాలనిపించింది. వ్రాస్తున్నప్పుడు నా ఆలోచనలు నాకే కొత్తగా, ఎక్కువ స్పష్టంగా అనిపించాయి. చదువుకుని ఉద్యోగం చెయ్యకపోతే ప్రభుత్వం దృష్ట్యా కూడా ఒక వనరు పైన పెట్టుబడికి నష్టం కలుగుతుందని చదువుకునే రోజుల్లో ఒక వాదన విన్నప్పుడు నా ఆలోచనలకి ఒక షాక్ తగిలింది. నేను అప్పట్నుంచే ప్రొఫెషనల్ చదువుల కోసం సిద్ధమౌతున్నా పెళ్ళీ, పిల్లల తర్వాత నేను (భర్త సహకారం గురించి కూడా ఆలోచించలేదు. నా వ్యక్తిత్వం దృష్ట్యా) ఉద్యోగం చేస్తానా, చెయ్యకపోతే ఇప్పుడు నేను చదివే చదువూ, నా so called తెలివి తేటలు వృథా చేస్తున్నట్టా అన్న అనుమానానికి అక్కడ ఓ బీజం పడింది. నా ఇష్టపూర్వకంగా నేను మొదటి సంతానం తర్వాత ఉద్యోగం వదిలేసినా అన్నీ చేస్తూ నెగ్గుకొస్తున్నట్టు కనిపించే స్త్రీలని చూస్త్తే నా శక్తి యుక్తుల మీద నాకు అనుమానం కలిగేది. నేను బద్ధకస్తురాలిని అన్న నమ్మకం కూడా ఏర్పడిపోయింది. ఎవరో ఏదో అన్నారన్న భావన కాసేపే. నాకే నా గురించి చులకన భావం ఏర్పడుతోందన్న విషయం గ్రహించుకోవడానికి చాలా ఏళ్ళు, కొన్ని భయంకరమైన అనుభవాలూ కావలిసి వచ్చాయి. మాలతి గారి "చదువుకున్న సరస్వతి" కథ గురించి వ్రాస్తూ ఆమె చెప్పిన మాటలు నా ఆలోచనలో ఒక భాగానికి వ్యక్తీకరణను ఇచ్చాయి. ఇప్పుడు స్ఫురిత గారి కథ, దాని పై మీ స్పందనా నన్ను ఇంకో వైపు కూడా ఆలోచించి నా ఉద్దేశ్యం చదువుకోవాలి కానీ ఉద్యోగం చెయ్యక్కర్లేదు అని చెప్పడం కాదు అని చెప్పాలనిపించింది. అది వ్రాస్తున్నప్పుడు నా ఆలోచనలలో నా మటుకు నాకు ఒక స్పష్టత ఏర్పడింది. అది నాకొక తెరిపినించ్చింది. ఇప్పుడిదంతా వ్రాయడం కూడా ఆ స్పష్టతని ఉపయోగించుకుని పెంచుకునే ప్రయత్నమే. ఈ సందర్భంలో గృహిణుల గురించి ఆలోచిస్తుంటే నాకు తట్టిన ఒక ఆలోచన, గృహిణులు flexibity ని ఇస్తారు. ఇంట్లో వాళ్ళకే కాదు, చుట్టు ప్రక్కల వారికి కూడా. ఇంట్లో సహకారం లేకపోయినా ఉద్యోగం చేసే మహిళలకు చుట్టు ప్రక్కల ఉన్న "గృహిణుల" వలన వెసులుబాటు కలుగుతుంది. అలాగే, ఉద్యోగం చెయ్యదల్చుకున్నప్పుడూ ఇంటి వారి సహాయం ఎంత అవసరమో, చుట్టు ప్రక్కల వారిదీ అంతకన్నా ఎక్కువ అవసరం ఉంటుంది. ofourse గృహిణులకి కూడా అలాంటి అవసరంతో బాటు ఇంట్లో వారి సహాయమూ కావాలి. ఇలా అన్ని వైపులనుంచీ చూడాలి ఈ ఆధునిక "సమస్య" అని అనిపిస్తోంది. ఇం కా వివరంగా, స్పష్టంగా ఎప్పటికైనా నేను రచనలో వ్యక్తపరచాలనే కోరిక కూడా ఉంది. చూద్దాం.

జలతారు వెన్నెల said...

స్పురిత గారు, ముందుగా మీకు ధన్యవాదాలు, నేను, లలిత గారు ఇలా ఇంతేసి రెస్పోన్సెస్ టైప్ చేస్తే పోస్ట్ ఛేసినందుకు, మరియు, మమల్ని ఇంతిలా స్పందించేసే కథ మీరు రాసినందుకు.(మీకు ఇంకొకందుకు కూడా ధన్యవదాలండి, నేను ఇంగ్లీష్ లో రాసినా పొనీలే పాపం అని పబ్లిష్ చేసినందుకు.)
లలిత గారు, నేను మీరు నాకు వ్యతిరేకంగా కమెంట్ పెట్టరని నేను అనుకోలేదండి. ఎమైతేనేంటండి, నా బ్లాగ్ చూసారు కదా..సో మీకు ధన్యవాదాలు.

sphurita mylavarapu said...

నారాయణ స్వామి గారూ, మాలతి గారు, లక్ష్మి గారూ, మాధవి గారూ...మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

మధురా...మీ busy schedule లోనుంచి time తీసుకుని చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు...ఇదే కాదు ఏ సమస్యనీ, generalize చెయ్యలేమని నా అభిప్రాయం...వ్యక్తిని బట్టీ...పరిస్థితులని బట్టీ.. సమస్యలుంటాయి...నాకు తెలిసిన చూసిన అనుభావలనుండి రాసానంతే...

జలతారు వెన్నెల గారూ, లలిత గారూ మీ ఇద్దరి కామెంట్లు చూసాక నేనీ కధలో చెప్పదల్చుకున్నది కాస్త వివరంగా రాద్దామనిపించింది...
మొదటిది...చదువుకున్నాం కనక వుద్యోగం చెయ్యాలి అన్న భావన అంత సరీఇనది కాదని...చదువుకి సార్ధకత సంపాదన మాత్రమే కాదని...
స్త్రీ కి సంపాదన మాత్రమే స్వేఛ్ఛని ఇవ్వగలదన్న అభిప్రాయం అంత correct కాదని...వాళ్ళ అభిరుచిని బట్టీ చెయ్యడం వేరు...కాని నిర్ణయం తీసుకునే స్వతంత్రం లేనప్పుడు అది స్వేఛ్ఛ కిందకి రాదని...ప్రస్తుతం వున్న generation లో చాలా వరకూ చేసే పనులు ఇతరులతో పోలికలూ...పోటీలతోనే సరిపోతున్నాయనీ...మన వోపిక ఎంత...మనకి ఎందులో ఆనందం అని అలోచించి నిర్ణయం తీసుకోగలిగినప్పుడు జీవితం ప్రశాంతం గా వుంటుందని...
మూడోది..ఇలాంటివి రాయగలం, చర్చించగలం కానీ నిర్ణయాలు ఎవ్వరూ(కనీసం చాలామంది) కధల్లో లా అంత తేలిగ్గా తీసుకోలేరని..అందుకే ముగింపు తెగించి వుద్యోగం మానేసింది అని రాయలేక..ధరణి పాత్రని ప్రవేశపెట్టాను...

లలిత గారూ...ఒకరకంగా మాలతి గారి "చదువుకున్న సరస్వతి" కూడా ఈ కధ కి ప్రేరణ...

జలతారు వెన్నెల గారూ...దానిదేముందండీ...నా కథ మిమ్మల్ని ఇంతగా స్పందింపచేసినందుకు చాలా సంతోషం గా వుంది

అజ్ఞాత గారూ...మీ పేరు రాసుంటే బావుండేది...ఏదైనా రాసినప్పుడు తమ చుట్టూ చూస్తున్నవాటికి స్పందించి కొంతమందినైనా అలోచింపచెయ్యగలేమేమో అన్న ఆశతో రాస్తారు...సానుభూతి కోసం రాస్తారన్న మీ అభిప్రాయానికి నవ్వుకున్నాను...కథ లో మగ పాత్ర...తెలివిగా చెప్పింది...ఆడ పాత్ర తెలివి తక్కువగా అలోచించిందన్న మీ విభజనకి ఇంకోసారి నవ్వుకున్నాను...ఏదైనా చదవి అర్ధం చేసుకోవడం వాళ్ళ వాళ్ళ విజ్ఞతని బట్టీ వుంటుంది...
కామెంటినందుకు ధన్యవాదాలు...

Anonymous said...

స్ఫురిత గారూ,
మీ కథా, ఇక్కడ జరిగిన చర్చా చాలా బాగున్నాయి.

నాకు ఒక్క రెండు విషయాలు మాత్రం తడుతున్నాయి.
1. చాలా మంది ఆడవాళ్ళకి వుద్యోగం అవసరం. ఉద్యోగం చేయనా, లేక వదిలేసి ఇల్లు చూసుకోనా అన్న చాయిసే లేని వాళ్ళు చాలా మంది.

2.ఆడ వాళ్ళ ఉద్యోగం కేవలం "డబ్బాశ" వల్లే అన్న అభిప్రాయం నిజంగా సరైనదేనా? ఎన్నోసార్లు చదివాను "డబ్బాశతో ఉద్యోగాలు చేసే ఆలూ-మగలూ" అని. నాఖు తెలిసిన చాలా మంది ఆడవాళ్ళు వృత్తి మీద ఇష్టంతో, దాంతో వచ్చే sense of achievement కొరకూ ఉద్యోగాలు చేస్తారు. డబ్బు అవసరం లేనప్పుడూ కేవలం తమ తృష్ణను తీర్చుకోవటానికి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకి సంఘం నించి లభించే ప్రోత్సాహం ఎంత? (ఇక్కడ నేను సంఘం అన్నప్పుడు తల్లి-తండ్రులూ, అత్త-మామలూ, భర్తా, పిల్లలూ, అందర్నీ కలిపే అంటున్నాను.)
ఇడ్లీలోకి చట్నీ చేయలేదని "మనకి డబ్బుకేం కొదవొచ్చిందిప్పుడు? వుద్యోగం మానేయి" అని ఇంట్లోవాళ్ళన్నప్పుడు పోస్ట్ గ్రేడ్యుయేట్ కోర్సులో బోధించే అధ్యాపకురాలికి ఏమనిపిస్తుండొచ్చు?
(అంటే నేను చిన్న ఉద్యోగస్తులని అవమానిస్తున్నానని కాదు. కానీ, నా ఉద్దేశ్యం, పెద్ద చదువు చదివి, వృత్తిలో ఒక స్థాయి కి రావటానికి ఆ వృత్తిమీద వుండే ఇష్టం కూడా కారణమవుతుంది, కేవలం డబ్బాశే కాదు. అలాటి ప్రొఫెషనల్ ని "ఉద్యోగాలు మీకెందుకు?" అన్నప్పుడు చిరాకెత్తుతుంది.
శారద

రసజ్ఞ said...

చక్కని కథనం. బాగా వ్రాశారు. ఆడపిల్లకి చదువు అవసరమే. కాని ఉద్యోగం అవసరం అని ఎక్కడా లేదు. పరిస్థితిని బట్టీ వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా సహాయపడటంలో తప్పు లేదు అన్నది నా అభిప్రాయం. భర్త బలవంతం చేయనప్పుడు తన ఇష్టం ఉద్యోగం చేయటం చేయకపోవటం. మొదటి సారి అని చెప్పారు కాని బాగా వ్రాశారండీ! నేనెప్పటికి రాస్తానో ఇలాంటి కతలు ప్చ్!

lalithag said...

"ఇలాంటివి రాయగలం, చర్చించగలం కానీ నిర్ణయాలు ఎవ్వరూ(కనీసం చాలామంది) కధల్లో లా అంత తేలిగ్గా తీసుకోలేరని.." ఇలాంటి భావమే నేను వ్రాసి పోస్టు చెయ్యలేకపోయిన వ్యాఖ్యలో ప్రకటించాను. "స్త్రీ కి సంపాదన మాత్రమే స్వేఛ్ఛని ఇవ్వగలదన్న అభిప్రాయం అంత correct కాదని...వాళ్ళ అభిరుచిని బట్టీ చెయ్యడం వేరు...కాని నిర్ణయం తీసుకునే స్వతంత్రం లేనప్పుడు అది స్వేఛ్ఛ కిందకి రాదని..." సరిగ్గా చెప్పారు. నాకిదే అర్థమయ్యింది మీ కథలో. "...మన వోపిక ఎంత...మనకి ఎందులో ఆనందం అని అలోచించి నిర్ణయం తీసుకోగలిగినప్పుడు జీవితం ప్రశాంతం గా వుంటుందని..." ఈ పాయింటు దగ్గర నా అనుభవం చదువుకోండి. నా స్వంత నిర్ణయం ఉద్యోగం మానెయ్యడం అన్నది. అది నాకు ముందునుంచే కొంచెమో గొప్పో తెలుసు నా వ్యక్తిత్వాన్ని బట్టి. ఐనా అది నాకు "ప్రశాంతత" ఇవ్వడానికి చాలా సమయం పట్టింది. మనసులో సంఘర్షణ జరుగుతూనే ఉంది. దానికి నేను ఉద్యోగం మానెయ్యడం వల్ల చెయ్యాలి అనుకున్న పనులు చెయ్యలేకపోవడం, నా చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు నేను నన్ను stretch చేసుకోక పోవడం నా అసమర్థత ఏమో అన్న అనుమానం నన్ను తొలుస్తూ ఉండడం, ఇంకా కొన్ని సూటి పోటి మాటలూ, తక్కువగా చూడబడడాలూ, ఇంట్లో ఉన్నందుకు నా నుంచి ఇతరుల expectations నానుంచి నాకు ఉన్నదానికి వేరేగా ఉండడాలూ ఇలా ఎన్నో. మీ కథ గురించిన చర్చ నాకు వ్యక్తిగతంగా చాలా ఉపయోగపడుతోంది. అందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇలా వ్రాస్తున్నప్పుడే నాకనిపించింది ఇంకొకటి. వ్యక్తులుగా మనం చేసే పనులు చేస్తాం. ప్రతిదీ ఆలోచించి చెయ్యము. కానీ జీవితంలో ఒక్కో సారి ఆగి "ఎందుకు ఇలాంటి choices చేసుకున్నాము?" అని ఆలోచించుకున్నప్పుడు లేదా ఆలోచించుకోవలసి వచ్చినప్పుడు మన core వ్యక్తిత్వం ఏంటో మనకి తెలిసి అప్పుడు"ప్రశాంతత" తో మన choices ని మనం (ఇతరులు కాదు) అంగీకరించగలిగే అవకాశాలు ఉంటాయి. ఒక్కో సారి ఆ choice ని మార్చుకుంటామేమో మరి. నా అనుభవంలో నాకు నా మీద నమ్మకం పెరగడానికి ఉపయోగపడుతోంది నా వెనక చూపు.
నేను నా గురించి ఆలోచించే తీరు మారడంతో ఇతరుల మాటలకు నొచ్చుకోకపోవడం కూడా జరుగుతోంది. ఇంతకు ముందూ నొచ్చుకోకూడదు నేర్చుకోవాలి అనుకునేదాన్ని. కానీ నాలోనే నాకు స్పష్టత లెకపోవడం వల్ల నేను తప్పా రైటా అన్న సంఘర్షణ బాగా కుదిపి వేసేది. ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేదాన్ని. మళ్ళీ వాళ్ళని తప్పుపట్టాలనిపించినప్పుడు మథనపడిపోయేదాన్ని. ఇప్పుడిప్పుడే నన్నూ, ఇతరులనీ ఎవరి స్థానంలో వాళ్ళని మంచి చెడులతో సహా "మార్చే" ప్రయత్నం చెయ్యకుండా ఒప్పుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఇంకా ఎంతో ఎదగాల్సి ఉంది. బ్లాగుల్లో నన్నాకర్షించిన విషయాల పై చర్చలు నాకు ఈ విషయంలో ఉపయోగపడుతుంటాయి. కనుక అందరికీ Thanks.
p.s. నేను ఎంతో తిప్పి తిప్పి చెప్పి స్పష్టంగా చెప్పలేకపోయినవి శారద గారు రెండు పాయింట్లలో చెప్పేశారు.

Anonymous said...

స్పురిత గారు,

మీరేమను కొన్నా సరే నేను గమనించినంత వరకు ఆడవారి తీసుకొనే నిర్ణయాలలో దూరదృష్ట్టి ఉండదు అనేది అనుభవంలోకి వచ్చిన విషయం. వారిది ఎప్పుడు తమ చుట్టుపక్కల వారితో పోటి ఎక్కువ, వారిపైన వారికి అవగాహన తక్కువ. మగవారితో పోలిస్తే మాటకారులు కాబట్టి తమ వాదన బాగా ఆర్టికులేట్ చేస్తారు. దానికి వర్తమాన పరిస్థితులను (దూరదృష్ట్టి లేక పోవటంవలన) పరిగణలోకి తీసుకొని భర్తతో వాదించటం మొదలుపెట్టి తమ మాటను నెగ్గించుకోవటం చేస్తారు. మీతాత గారి తరంలో మగవారి మాట ఇంట్లో చెల్లుబడి అయ్యేది. ఆ తరువాత తరం నుంచి ఆడవారు కుటుంబ నిర్ణయాలలో వేలు పెట్టటం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు అది పరాకాష్ట కు చెరింది.
మాకు తెలిసిన వారి సంగతి చెపుతాను. వారికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మయిని 1985సం|| ఇంజనిరింగ్ చదివించారు, ఇండియాలో ఉద్యోగం వచ్చినా అమేరికాలో చదివి,ఉద్యోగం చేయాలని అమ్మగారి ప్రోద్భలంతో ఆ కోర్కేను నెరవేర్చుకొన్నారు. ఆ అమ్మగారి నస భరించలేక భర్త మౌనంగా ఉండిపోయాడు. అతనికి కూతురును వేరే దేశానికి పంపించటం ఇష్ట్టం లేకపోయినా, భార్యా బాధితుడు కావటం వలన ఎక్కువ చాయిస్ లేక ఒప్పుకొన్నాడు. వారికి డబ్బుల అవసరమేమి లేదు. ఇప్పుడంతా అక్కడే సేటిల్ అయ్యారు. మీరు చెప్పిన అనుభవాలన్ని వారికి అనుభవంలోకి వచ్చాయి. అది కాక ఆమ్మాయి ఆరోగ్యం దెబ్బ తినటం మొదలుపెట్టింది. తమషా ఎమిటంటే ఆ అమ్మాయి అమ్మగారు ఇప్పుడు మళ్లి మొగుడి మీద పడి ఏడుస్తుంది. నేను అలాగా ప్రవర్తిస్తుంటే అప్పుడు నువ్వు గట్టిగా అమ్మాయిని అమేరికాకి పంపించటానికి వీలేదని అడ్డుపడి ఉండవచ్చు కదా అని. ఆమే నస/ఏడుపు అంతటి తో ఆగదు అల్లుడు వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడని కూతురు 2-3 గం ప్రయాణం చేసి ఉద్యోగం చేసొస్తున్నాదని, అల్లుడు సుఖ పడిపోతున్నాడని కుళ్లు కొంట్టూ ఉంటుంది. అసలికి ఇంత పరిస్థితికి కారణం మొదట ఆమే తీసుకొన్న నిర్ణయం అని ఒక్కసారి గ్రహించదు.

Anonymous said...

*మగ పాత్ర...తెలివిగా చెప్పింది...ఆడ పాత్ర తెలివి తక్కువగా అలోచించిందన్న మీ విభజనకి ఇంకోసారి నవ్వుకున్నాను...*

నేను కూడా సరదాగా నవ్వుకొన్నను. ఆడవారు ఎప్పుడు నిజాలను ఒప్పుకోరు గదా!:)). పై కామేంట్లొ చెప్పినట్టు కూతురి ఆరోగ్యం దెబ్బతినేవరకు ఆమేకు తన నిర్ణయం తప్పని పించలేదు. అది తెలుసుకోవటానికి ఆమేకు 25సం|| పట్టింది.

Anonymous said...

*ఆడ వాళ్ళ ఉద్యోగం కేవలం "డబ్బాశ" వల్లే అన్న అభిప్రాయం నిజంగా సరైనదేనా? ఆడ వాళ్ళ ఉద్యోగం కేవలం "డబ్బాశ" వల్లే అన్న అభిప్రాయం నిజంగా సరైనదేనా*

శారద గారు,
ఈ విషయం లో డబ్బాశ అనేది ఆయా వ్యక్తుల వర్గాలను బట్టి ఉంట్టుంది. బ్రాహ్మణ వర్గం తీసుకొంటే ఆ వర్గం లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. కట్నాలు తక్కువ. వారికి మిగతవార్గాల మాదిరిగా లేగసి (వంశలా పేరు ప్రఖ్యాతులు)ని కాపాడుకోవాలన్న బాధ్యత ఎమీ ఉండదు. వారికి ఉండే లేగసి (ఇది ప్రాసేస్ ఒరియెంటేడ్) సంస్కృతి లో ఒక భాగం. సంగీతం,సాహిత్యం,కళలు, సినేమా మొద|| ఆర్ట్స్ లో తమకు నచ్చినంత ప్రవేశం సంపాదించుకొని, చేతనైతే కంట్రిబ్యుట్ చేయటం. లేకపోతే వాటికి అభిమాని గా మారి సంగీత,సాహిత్య సభలలో ప్రేక్షకుడిగా హాజరవటం. వారి ఈ జీవనశైలి లో ఎక్కడా డబ్బు ప్రాముఖ్యత ను వహించేవిధంగా ఉండదు. సంగీత,సాహిత్యాలు ఎక్కడా ఖర్చుతో కుడిన వ్యవహారాలు కావు. ఇక రాజకీయాలలో వారు ఉన్నా డబ్బులు వేనకేసి తరతరాలకు వారి వంశం వారు ఎలా లనే ఉద్దేశం కన్నా, చేతనైనంత దేశసేవ చేద్దామనుకొని వచ్చిన వారు ఉంటారు. కాని గత 30సం|| సమాజం లో వచ్చిన మార్పులవలన చదువుకోవటానికి డబ్బులు ఎంతో అవసరమౌతున్నాయి. అసలికి చదువు యొక్క లక్ష్యం డబ్బు సంపాదించటం కొరకు మాత్రమే అనే విధంగా తయారయింది.
ఆ వర్గాలకు చెందిన మిగతా వర్గాలలో కొంతమంది దగ్గర విపరీతమైన ధనం ఉండటం వలన, చదువు కొన్న మధ్యతరగతి వారు డబ్బులు బాగా సంపాదించి, వారి వర్గాలలోని పైస్థాయి కలవారికి సమానంగా ఎదగాలను కోవటం జరుగుతూంట్టుంది. అందువలన వారి తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా నిరంతరం శ్రమిస్తు, సంపాదిస్తూంటారు. తమ ఈ లక్షాన్ని ఆడవారికి(భార్యలకి) కూడా తిన్నగా అంట్టించి, వారిని తమలాగా మారుస్తారు. వారి తరం లో కాకపోయిన వారి తరువాతి తరం వారైనా, ఆ లక్ష్యన్ని (డబ్బులు సంపాదించి గొప్ప వాడనుకోవాలనే) చేరుకోవటం కొరకు ఒక పిల్ల/పిల్లవాడితో ఆపేయటం మా ఊరిలో 30సం|| క్రితమే గమనించాను. మా అబ్బాయి/అమ్మాయి మంచి ధనవంతుడిగా జీవించాలని, ఒకరితో ఆపేశాం అని చెప్పేవారు. నేను రాసింది ఒక కారణం కావచ్చు. మిగతావి ఎన్నో కనపడని అంశాలు ఉండవచ్చు.

More Entertainment said...

hii.. Nice Post Great job.

Thanks for sharing.

మనసు పలికే said...

చాలా చాలా బాగుంది :)

Anonymous said...

Nice Post, very realistic, you have potrayed the feelings of most of the working women..

For few women, it is a necessity to work, for some it gives sort of independent feeling, for some working is kind of status/prestige symbol..

And just like the way the woman your story was not able to take a decision, the women in the real world are also in the same position...:-)

Hope every working woman knows where to draw the line and acts wisely according to her priorities.

Keep writing..

మురళి said...

nice narration sphurita garu..

Anonymous said...

Very well narrated storyస్ఫురిత.

పైన ఎవరో అన్నట్టు ఈ తరం జంటల లో ఎక్కు శాతం మగవారు ఇంట్లో హెల్ప్ చేయటానికి ముందుకి వస్తున్నారు. కాని ఎంత help చేసిన వర్క్ లైఫ్ , ఇంటి బాధ్యత balance చేయడం అంత తీలికైన పని కాదు.ఇప్పుడు ఆడ వారు కూడా job చేసేది కేవలం job satisfaction కోసమో లేక బ్యాంకు బాలన్సు కోసమో కాదు.ఇది వరకు లాగ Govt jobs ఇప్పుడు ఎవరు చేయటం లేదు. ఎప్పుడు job ఉంటుందో లేదో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని qualifications ఉండి ఇంట్లో కుర్చుని ఉండటం ఎంత వరకు సబబు?
In this recession time, I feel I should keep working so that atleast one of us will have job. This I have learnt on my own experience.

ramakrishna s v s said...

Very nice...

ramakrishna s v s said...

nice staory........

ramakrishna s v s said...

nijamgaa chaalaa baagaa raasaaru.....

భాస్కర్ కె said...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

ramakrishna s v s said...

Thanks andi meeku kudaa maa subhakankshalu.

Chinni said...

muginpu vunTe chaalaa baavundeDi..em conclusion istaaraa ani aaSaga chadivaanu

sphurita mylavarapu said...

చిన్ని గారూ,

ఇలాంటి పరిస్తితులకి ముగింపు ఇది అని ఇవ్వటం కష్టమనే అలా ముగించానండీ