2/17/10

మా పల్లె అందాలు

కను విందైన ఉషోదయాలు, కోడి కూతల సుప్రభాతాలు, తొలకరి మట్టి వాసనలు, ఎర్రగా పండిన గోరింటాకు చేతులు, వెచ్చ వెచ్చని బావి నీళ్ళు, పెరళ్ళ లో ఆడిన గుజ్జిన గూళ్ళు, బంతి పూల కమ్మని వాసనలు, వేప చెట్ల తీపి గాలులు, రంగవల్లులూ, గంగిరెద్దులూ, హరిదాసుల తో కలిసి వచ్చే సంక్రాంతులు వీటి మధ్యనే గడిచింది నా చిన్న తనమంతా. ఆ సుద్ధ పల్లెటూరిలో చదివించి దాని భవిష్యత్తు నాశనం చేస్తున్నావన్న ఎందరో శ్రేయోభిలాషుల సలహాలు పెడ చెవిన పెట్టడం లో గెలిచిన మా నాన్నగారి మమకారం వల్ల బాల్యపు తీపిని, స్వేచ్చనీ, స్వచ్చమైన ప్రకృతిని పూర్తిగా ఆస్వాదిస్తూ పెరిగే అవకాశం నాకు కలిగింది.

నా ప్రాధమిక విద్యాభ్యాసం అంతా దంగేరు అనే వూరిలో జరిగింది. మా నాన్నాగారు కూడా అక్కడి ఉన్నత పాఠశాల లోనే తెలుగు మాస్టారుగా పని చేసేవారు. ఆ ఊరిలో నేను పుట్టక పోయినా, అది మా సొంత వూరు కాకపోయినా ఎక్కువ కాలం అక్కడ వుండడం వల్ల ఆ వూరి పేరు చెప్పగానే మా వూరు అనే వస్తుంది నా నోటి వెంట.

snow falls, fall colors, cherri blosoms మధ్య కొట్టుకు పోతున్న నన్ను, ఈ మధ్య చూసిన మా వూరి ఫొటోలు కొన్ని తట్టి లేపాయి.

గత నెల 14, సంక్ర్రాంతి పండగ రోజున మా school లో ఒక old students meet ఏర్పాటు చేసి గత 53 సంవత్సరాల పూర్వ విద్యార్థులంతా కలిసి, జ్ఞాపకాల్ని కలబొసుకునే అపూర్వ అవకాశాన్ని కల్పించారు. నేను దానికి స్వయం గా హాజరు కాలేకపొయినా మా నాన్నగారి వర్ణన, ఫొటోలు కలిసి మా వూరు వెళ్ళిన అనుభూతి కలిగించాయి.

మా వూరి అందాలు మీ తో కూడా పంచుకోవాలని కొన్ని ఫోటో లు ఇక్కడ పొందు పరిచాను...


ఫొటోలు: శ్రీ మైలవరపు చంద్ర శేఖర్ సాక్షి పత్రిక జర్నలిస్ట్




















2/8/10

జ్ఞాపకాలు చెదిరిన తాతగారితో నా జ్ఞాపకాలు

చెయ్యెత్తు మనిషి, స్ఫురద్రూపి, శాంత మూర్తి ఇలాంటి పదాలన్నింటికి నిర్వచనం లా వుండే వారు మా తాతగారు. ఆయనకి నేను ఒక్క గానొక్క మనవరాలిని. నేను పుట్టగానే చూడటానికి వచ్చిన ఆయన నన్ను ఎత్తుకుని అసలు దింపకపోయేసరికి , అది చూసిన మా పిన్ని దీనికి ఇంక వుయ్యాల వెసే పనే లేదు, మామయ్యగారి అరదండాలే వుయ్యాల లావున్నాయి అందట.

నాకు మూడేళ్ళ వయసు దాకా నడక రాకపోతే, తన పాదాల మీద నా పాదాలు పెట్టుకుని, తను వెనక్కి నడిచి అదిగో మనవరాలు నదిచేస్తోందని సంబరపడిపోయేవారట.

మా మామ్మ సీతారామయ్య గారి మనవరాలు సినిమా చూసి, మనవరాలు అంటే "మన"వరాలుటండీ అంటే అంతే మరీ అనేవారు.

ఎప్పుడైనా మామ్మ మీకు కట్నం ఇచ్చిందా తాతగారూ అంటే మీ మామ్మే నాకు పెద్ద కట్నం, ఇంకా కట్నం కూడా ఎందుకూ అని ఆయన అంటుంటే మామ్మ మొహం లో సిగ్గుతో కలిసిన గర్వం మా చూపుదాటిపొయేది కాదు.

తాతగారు తన పదవీ విరమణ తరవాత ఆఖరు గా పని చేసిన కోరుకొండ లో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. ఆరు గదుల ఇల్లూ, వెనకాల ఇంటికన్నా పెద్ద పెరడు, పెద్ద బావి, తులసి కోట, ముద్దమందారం చెట్టూ, మామిడి చెట్టు, ఇంటిముందు పెద్ద నల్ల గేటు మీదనుంచి డాబాపైకి పాకిన రధామనోహరం చెట్టు నిండా పూల గుత్తులతో, డాబామీద విశాలమైన గది చెక్క కటకటాలు తో, బోలెడు బుల్లి బుల్లి కిటికిటీలతో చిన్ని లైబ్రరీ లా వుండేది ఎన్నో పుస్తకాలతో. ఆయన రచనా వ్యాసంగం అంతా ఆ గదిలోనే సాగేది. డాబా పైనుండి చూస్తే నరసింహ స్వామి కొండా, గుడీ స్పష్టం గా కనిపించేవి. నా జ్ఞాపకల్లో ఇప్పటికీ అది పొదరిల్లే.

తాతగారు మధ్యాహ్నం పూట intermediate పిల్లలకి సంస్కృతం పాఠాలు చెప్పేవారు. పెద్దవాళ్ళంతా సంస్కృతం మాస్టారు అని పిలిస్తే, పిల్లలకి మాత్రం మాది TV తాతగారి ఇల్లే. ఆ వీధి లో మొదట TV కొన్నది ఆయనే ట. Cricket Match వచ్చినప్పుడూ, శనివారం సాయంత్రం తెలుగు సినిమా వచ్చినప్పుడూ చూడాలి మా మధ్యగది చిన్న cinema hall ఐపోయేది.

తాతగారికి ఆ ఇల్లంటే ప్రాణం. నాన్నగారి వుద్యోగరీత్యా మేము వేరేవూరిలో వుండేవాళ్ళం. అన్ని శెలవలకీ, పండగలకీ మేమే తాతగారి వూరికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుదైనా మా వూరు వచ్చినా రెండోరోజు నుంచీ ఇంక బయల్దేరతాం అబ్బాయ్, ఇల్లెలా వుందో అని మొదలు పెట్టే వారు. ఎంత బతిమాలినా ఇంకోరోజు ఆపగలిగే వాళ్ళం, ఆపై మా వల్ల అయ్యేది కాదు.అలాంటిది పూర్తిగా మాదగ్గరకే వచ్చెయ్యండి అంటే ససేమిరా అనేవరాయన. కాలరా తిరగకపోతే వుండలేనబ్బాయ్ అనేవారు ఇరుకు అద్దిళ్ళని చూసి. పైగా తనకి వోపిక వున్నన్నాళ్ళూ తనింట్లో ఎవరిమీదా అధారపడకుండా వుండాలనేది ఆయన కోరిక.

అలాంటిది అయిదేళ్ళ క్రితం కాలు విరగడం తో మాదగ్గరికి రాక తప్పలేదు. కాలు బాగయినా గానీ మతిమరుపు బాగా పెరిగింది. ఎప్పట్నుండో ఏది కావాలో అదే గుర్తురాదు అనే అయనకి వయసురీత్యా వచ్చిన మరుపే అనుకున్నాం కానీ అది రాను రానూ బాగా పెరిగిపోయింది. కొన్నాళ్ళకి కోరుకొండలో నీటి ఎద్దడి అనీ, వైద్య సదుపాయాలు అంతగాలేవనే కరణాలచేత నాన్నగారు ఆ ఇంటిని అమ్మేసారు. తాతగారి అనుమతి తోనే అమ్మినాగాని ఆయన ఆ విషయం మర్చిపోయి రోజూ ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు వుంటాం మనింటికి వెళ్ళిపోదాం అంటూనే వుండేవారు. చూడ్డానికి వచ్చినవాళ్ళు మమ్మల్ని గుర్తు పట్టారా అంటే, నువ్వు జ్ఞాపకం లేకపొవడమేం అని గుంభనగా అనేసి వూరుకునే వారు. కొన్నాళ్ళకి అన్నం తిన్నానన్న సంగతీ, తరవాత అసలు అన్నం తినాలనీ ఒక్కొక్కటే మర్చిపోతూ వచ్చారు. మొదట తెలియక పొయినా పత్రికల్లో చదువుతుంటే ఆయన బాధ పదుతున్నది alzheimers తో అని తెలిసింది. పత్రికల్లో దీనికి కొంతవరకూ చికిత్స వుందనీ, Doctors ని సంప్రదించమనీ రాస్తున్నరు గానీ వయసు మళ్ళిన వారిని ఏ Hospital లోనూ చేర్చుకొవటానికి ముందుకు రారని మాకు స్వానుభవం తోనే తెలిసింది. తాతగారు ఆఖరు దాకా గుర్తుపట్టినది మాత్రం మామ్మాని, నాన్నగారిని. ఆఖరుకి ఇంక మరవటానికి కూడా ఇంక ఏమి లేదని సరిగ్గా పది రోజుల క్రితం ఈలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

alzheimers గురించి చాలానే చదివినా అలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది, ఆ వ్యాధి వచ్చిన పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చని వర్తమానాన్ని మర్చిపోయి తమకి ఇష్టమైన జ్ఞాపకాలలోనే బతుకుతున్నారని. మా తాతగారు భౌతికం గా ఇరుకు Apartment లో వున్నా మానసికం గా మాత్రం తన పొదరింటిలోనే వున్నారు చివరిదాకా.

America వారి Visa నిబంధనల్లో చిక్కుకుని ఆయన్ని చివరిగా చూడనే లేకపొయాను. US సంబధం చేసుకుని వెళిపోతే మిమ్మల్ని చూడడానికి ఎలా రాగలను తాతగారూ అంటే మేమే వచ్చేస్తాం షిప్పు ఎక్కి అన్న ఆయన నవ్వు మొహమే వుండిపోతుంది నా జ్ఞాపకాలలో ఎప్పటికీ.