ఈ మధ్య కొత్తగా మా ఆఫీసులో చేరిన 60 యేళ్ళ అమెరికన్ ఒకావిడ లంచి కి బయటకి వెళ్డాం అని పీకుతుంటే నిన్న సరే అన్నాను. ఆవిడకి ఈ వూరు కొత్త, తన టీములో కూడా ఎవ్వరూ పెద్దగా పరిచయం అవ్వకో ఎమో మరి మాతో ఎక్కువగా మాట్లాడుతూ వుంటుంది. మా టీము లోనే పనిచేసే ఇంకొక తమిళ తంబిని కూడా ఆవిడ మాతో రమ్మని ఆహ్వానించింది. నేను actual గా డబ్బా తెచ్చుకున్నాను, అదే restaurant కి నిన్ననే వెళ్ళాము అని చాలా రకాలుగా గునిసి చివరికి వస్తాను కానీ థాయి టీ మాత్రం తాగుతాను అనే వొప్పందం మీద బయల్దేరాడు. వెళ్ళాక మేము మెనూ చూస్తుంటే ఇక్కడ fried rice బావుంటుంది...I suggest you to take friend rice అని ఇద్దరికి చెరొక పది సార్లు చెప్పాడు...ఇద్దరం పెద్ద పట్టించుకోకుండా మాకు నచ్చినవి ఏవో Order చేసేసరికి ఏమనుకున్నాడో మరి ఏమీ తిననంటూ బయల్దేరిన అతను ఆ fried rice ఏదో తనకే order చేస్కున్నాడు. మరి నీ డబ్బా అన్నాను అతని నిర్ణయం లో హఠాత్తు గా వచ్చిన మార్పుకి కాస్త అవాక్కయినట్టు మొహం పెట్టి...అది రాత్రి మా ఆవిడని తినమని చెప్తా అన్నాడు (పాపం వాళ్ళావిడ అనుకున్నా మనసులో). మా ఆవిడకి rice అంటే ఇష్టం. నాకు అంతగా నచ్చదు అన్నాడు మళ్ళీ cover చేసుకుంటూ.
order వచ్చేలోపు, ఎప్పుడూ ఏదో జ్ఞాన సముపార్జన చేసేద్దాం...అవతలి వాళ్ళనుంచి ఏదో విషయపరిజ్ఞానం సంపాదిచేద్దాం, తన ప్రశ్న అవతలి వాళ్ళ జవాబు అనే ధోరణి లో వుండే నా Team mate మహానుభావుడు మా American colleague ని కబుర్లల్లోకి దింపాడు. ఆవిడ family గురించి ఆరా మొదలెడితే ఆవిడ క్రితం సంవత్సరమే తను విడాకులు తీసుకున్నాను అనే సరికి ఇంక Topic ని America లో విడాకుల సంస్కృతి Vs India లో విడాకుల సంస్కృతి వేపు మళ్ళించాడు. ఇక్కడ విడాకులు తీస్కుంటే భర్త భార్యకి చాలా డాలర్లు ఇవ్వాలిట కదా అన్నాడు, అలా ఏమి లేదే...మా case లో నేనే చాలా నష్టపొయాను అంది ఆవిడ...అవునా ఇండియా లో ఐతే పెళ్ళాం police station కి వెళ్ళీ ఇలా ఫిర్యాదు చేస్తే చాలు పోలీసులు భర్తని, అతని అమ్మనీ నాన్ననీ, ఇంకా చుట్టాలని పక్కాలని అందర్నీ without any argument జైల్లో వేసేస్తారు అన్నాడు. వాళ్ళ అమ్మని నాన్నని ఎందుకు అని బిక్క మొహం పెట్టింది ఆవిడ..అదంతే అక్కడ అమ్మాయి compliant ఇస్తే పోలీసులు ముందూ వెనకా అలోచించరు...అలా లోపలేసేస్తారు అంతే అన్నాడు. అది తప్పుకదా అంది ఆవిడ...ఐనా అంతే పైగా డబ్బులన్నీ అబ్బాయే ఇవ్వాలి, పిల్లలుంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి అన్నాడు. that is interesting but how అంది ఆవిడ కళ్ళు విప్పార్చి చూస్తూ. ఇంక వూరుకుంటే ఈవిడకి ఈసారి భారత దేశం వెళ్ళి మరీ విడాకులు తీసుకోవాల్సిందే అనే నిర్ణయానికి లాక్కొచ్చేస్తాడేమో అని భయమేసి, అలా కాదు, మా దేశం లో చాలా వరకూ laws women protection కోసం తయారు చేసినవి. అమ్మాయి తనని తన భర్త, అత్త మావలు వేధిస్తున్నారని కేసు పెడితే అప్పుడు arrest చేస్తారు. అది కూడా investigation చేసాకే. కొంత మంది miss use చేసే వాళ్ళుంటారనుకో. ప్రతీ దానికి positive side negative side, వున్నట్టే దీనికి వున్నాయి అని ఆవిడకి వివరించే సరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.
ఈ లోపు మా order వచ్చేసరికి హమ్మయ్య ఇంక ఇతని నోటికి వేరే పని దొరికింది రా బాబు అనుకునేంతలో నాలుగు స్పూన్లు కడుపులో పడేసి మళ్ళీ మొదలెట్టాదు, అసలు నువ్వెందుకు విడాకులు తీస్కున్నావ్ అన్నాడీసారి. నాకు గుండె గుభేల్ మంది. అసలే ఇక్కడ వాళ్ళకి వాళ్ళ personal విషయాల్లో అవతలి వాళ్ళ జోక్యం అంతగా నచ్చదని ఎప్పుడో విన్నాను. అందుకే అంతకు ముందు పని చేసిన చోట మా manager తో రెండేళ్ళ పైన కలిసి పని చేసినా...రోజూ ఎన్నో విషయాలు మాట్ళాడుకున్నా గానీ, చచ్చినా ఆయన personal విషయాలు మాత్రం అడిగేదాన్ని కాదు. ఆయనే వచ్చి ఇవాళ మా ఆవిడ ఫలానా పరీక్ష పాసయ్యింది అంటే ఒహో ఈనకి చదువుకునే పెళ్ళాం వుందన్నమాట అనుకునేదాన్ని. I got a call from my kid. have to run అంటే చదువుకునే పెళ్ళాం కాబట్టి బుడ్డి పిల్లో పిల్లాడో వుండుంటారనుకునేదాన్ని...తీరా నన్ను sendoff lunch కి తీస్కెళ్ళినరోజు తనకి 19, 17, 15 ఏళ్ళున్న ముగ్గురు పిల్లలూ, ఇంకా నాలుగు కుక్కలూ వున్నాయని చెప్పేసరికి..అప్పుడర్ధమయ్యింది ఆయన ఎక్కువగా ఆఫీసులోనే వుండటానికి ఎందుకిష్టపడేవాడో :). ఇప్పుడు ఈవిడ ఏదో ఒకటనే వరకూ ఇతను తన ప్రశ్నోతరాల కార్యక్రమానికి full stop పెట్టేలా లేడు రా భగవంతుడా అనుకుంటూ మౌనం గా వాళ్ళ మాటలు వింటూ నా పని నేను కానిస్తున్నాను.
ఆవిడ నేననుకున్నంత wild గా ఏమీ react అవలేదు పాపం. తన మాజీ భర్తకి తను అయిదో భార్యని అని, అతనితో పెళ్ళయ్యాక తన ఇంట్లో వచ్చి వుండమన్నాడే గానీ, అక్కడ చీపురు పుల్ల కూడా కదపనిచ్చేవాడు కాదని. ఇటు వున్న బల్ల అటు కదపడానికి కూడా అంగీకరించేవాడు కాదనీ, ఆఖరికి తనకి నచ్చిన మొక్క పెంచడానికి కూడా స్వతంత్రం వుండేది కాదనీ, అతనికి అన్నీ తనకి నచ్చినట్టే వుండాలనీ అందుకే విడిపోయాననీ చెప్పింది. దానికతను అవునా...మా ఇల్లంతా మా ఆవిడదే. తను ఇంటికొచ్చిన రోజు నా ఇల్లంతా ఎక్కడివక్కడ పడేసి చిందర వందరగా వుంటే నేను ఇంటికెళ్ళేసరికి తనకి నచ్చినట్టు సద్దేసింది. అయినా నేను పల్లెత్తు మాట కూడా అనలేదు. అసలు వంటిల్లయితే తనదే రాజ్యం. నాకు ఏది ఎక్కడుందో కూడా తెలీదు. తను ఆఫీసు నుంచి రావటం ఎంత ఆలశ్యం అయినా కాఫీ కూడా తనొచ్చి పెట్టాల్సిందే...ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో తనకే తెలుసు కదా అన్నాడు. మా దేశం లో అందరూ అంతే...భార్యలదే ఇంటి మీద హక్కంతా అన్నాడు. తను చెప్పేదానికి బలమయిన support వుంటే బావుంటుందనుకున్నాడేమో నా మానాన్న తిండి తింటున్న నన్ను, నువ్వేమటావ్, మీ ఇంట్లో కూడా ఇంతే కదా అన్నాడు. ఆవిడ తనకి దొరకని స్వేచ్చ గురించి చెబుతుంటే, తను బలవంతం గా తన భార్య మీద రుద్దిన బాధ్యతల్ని ఆమెకి ఈయన ప్రసాదించిన స్వేచ్చగా, హక్కుగా ఆపాదించి చెబుతుంటే ఇంకేమనాలో అర్ధం కాక, కొంతమందితో వాదించటం కంటే మౌనం గా వుండటమే మంచిదనిపించి తను నన్ను అడిగినది వినపడనట్టు వూరుకున్నాను. తను చెప్పిన దానికి, అతను చెప్పిన దానికి లంకె ఏవిటో అర్ధం కాలేదేమో ఆవిడ కూడా అతని కేసి విచిత్రం గా చూసి మళ్ళీ ఎమి అడుగుతాడో అని పక్కనే వున్న local news paper లో తల దూర్చేసి తినటం లో మునిగిపోయింది.