7/15/13

పుస్తకాలతో నాన్నగారి కబుర్లు


అందరూ పుస్తకాలు పరిచయం చేసేస్తూ, పుస్తకాల గురించి తెగ కబుర్లు చెప్పేస్తూ వుంటే...నేను కూడా బోల్డు పుస్తకాలు చదివేసి ఆ కబుర్లన్నీ రాసెయ్యాలి అనుకునేదాన్ని...ఒక్క పుస్తకం కూడా చివరి పేజీ నంబరు చూసిన పాపాన్న పోలేదు ఇంతవరకూ...

మీ నాన్నగారికేం అలా పుస్తకాల్లో మునిగి తేలుతూ వుంటారు..ఆయనకివేం పట్టవ్...లాంటి కంప్లైంట్లు అమ్మ దగ్గర చాలా కామన్ గా వినబడుతూ వుంటాయి...ఆ మధ్య ఒక పుస్తకాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు నాన్నా అంటే...అటూ ఇటు గా మూడు నాలుగు రోజుల్లో అయిపోతుందమ్మా అన్నారు...అప్పుడు నా బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది...నేను పుస్తకం చదివి దాని గురించి రాయడం అన్నది ఇప్పట్లో జరిగే పనిలా ఎలాగూ కనిపించడం లేదు...నాన్నారు ఇలా చదివి అలా విసిరి పడేస్తున్నారు కదా...పడేసే ముందు దాని గురించి కాసిన్ని కబుర్లు రాసి పెడితే అవి నేను ఆయన పేరు మీద కొత్త బ్లాగు తెరిచి రాద్దాం(టైపు చేద్దాం) అనుకున్నా...మళ్ళీ కొత్త బ్లాగు అంటే నా బ్లాగుకున్న ట్రాఫిక్కే అంతంత మాత్రం...దాన్ని పూర్తిగా పైకి తీసుకురాగలనో అనే అనుమానం రావడంతో...నా బ్లాగులో నే ఒక శీర్షిక లో వేద్దాం అని తీర్మానించా...

నా ఈ మెరుపులాంటి ( మరి తళుక్కుమంది కదా) అలోచన చెప్పగానే...మా నాన్నగారు చాలా సంతోషించారు...వొక వారంలో తను అప్పుడు చదువుతూ వున్న పుస్తకం కబుర్లు రాసి, ఇంటర్ నెట్ కేఫ్ కి వెళ్ళి...స్కాన్ తీయించి పంపేసారు (ఇలాంటివి చెయ్యమంటే మీ నాన్నగారికి ఎక్కడలేని వుత్సాహం వచ్చేస్తుంది అని అమ్మ ఇచ్చిన సర్టిఫికెట్టు తీసుకుని మరీ). అది పంపి ఒక రెండు మూడు నెలలు అయ్యింది...కానీ నా చేతుల్లో దానికిప్పటి వరకూ మోక్షం దొరకలేదు పాపం...ఫోన్ చేసినప్పుడల్లా అడిగీ అడిగీ విసిగిపోయి ఈ మధ్య అడగడం కూడా మానేసారు...ఛీ మీ నాన్న కోసం ఈ మాత్రం కూడా చెయ్యలేవు అని ఇవాళ నా అంతరాత్మ తీవ్రం గా నిరశించే సరికి మొతానికి మొదలెట్టా ...

మొదటి పుస్తకం కబుర్లు - సృష్టి లో మధురిమలు 
రచన - శ్రీ గిడుగు రాజేశ్వరరావు
పరిచయం - మైలవరపు యఙ్ననాధమ్

కవి గురించి :
 శ్రీ గిడుగు రాజేశ్వరరావు గారు ఇదివరలో వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. కధానికలు, సంక్షిప్త జీవిత చరిత్రలు, నాటికలు వగైరా. వీరి నాటికలు కొన్ని ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి శ్రీమతి శారదా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రసారమయ్యాయి. అంతేకాకుండా శ్రీ రాజేశ్వరరావుగారు వ్యావహారిక భాషోద్యమ రధ సారధి. గ్రాంధిక భాషా వాదుల పట్ల సింహస్వప్నం అనదగ్గ,  రావు సాహెబ్ గిడుగు రామ్మూర్తి పంతులు గారి మనుమలు. కానీ చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవలసిన అవసరం మాత్రం వీరికి ఏనాడూ కలగలేదు. వారే స్వయంగా చేయి తిరిగిన రచయితా, మేధావీ...

 పుస్తక పరిచయం:
సగటు పాఠకుడు పద్యం - వచనం- నవల - కథ వీటిలో చక చకా సాగిపోయే నవలో, లేక కథల వైపో ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. పద్యం అనేసరికి ఒక రకమైన భయం - బెరుకు వుంటాయి.

ఐతే పద్యం మీద సహజంగా ఉండే ఆ భయాన్ని పోగొట్టే ఒక పద్య సంపుటిని ఈ మధ్యే చదవడం జరిగింది. అదే 'సృష్టి లో మధురిమలు '. సప్తవర్ణ దృస్యమాలికతో అనుసంధానమైన రచన. ఇందులోని రచనలు - గేయాలు కావు, వచన కవితలు కావు. తేట యైన తేటగీతుల సంపుటి.

తాను వివిధ సందర్భాలలో, వివిధ ప్రదేశాలలో వీక్షించి పరవశించిన ప్రకృతి చిత్రాలను, సప్త వర్ణాత్మక ఛాయా చిత్రాలుగా బంధించి...వాటితో పాటు పొందు పరిచిన పద్యాల విరిమాల ఈ సంపుటి.

ఈ పద్యాలలో ఎలాంటి శబ్దాడంబరాలు, అలంకారాభరణాలు, అన్వయ కాఠిన్యాలూ లేవు. సూటిగా, సహజ సుందరంగా, నిరాడంబరంగా ఉన్నాయి. ఇవి ముక్తకాలు. ఏ పద్యానికి ఆ పద్యం చదివి ఆనందించవచ్చు. ప్రకృతి గురించి, మానవుల
స్వభావ వైచిత్రి గురించి, అదే సమయంలో ప్రకృతిలో పశు, పక్ష్యాదుల నిర్హేతుకమైన, అవ్యాజ్యానురాగాల గురించి కవి చేసిన విశ్లేషణ చాలా చక్కగా, ఎక్కడా విభేదించే అవకాశం లేని విధంగా వుంది.

కాలం నీటి ధారలా వేళ్ళ సందుల్లోనుంచి జారిపోతుంటే, మధురమైన క్షణాలని మరిచిపోకుండా భద్రపరిచిన తీపి గురుతుల పేటిక వంటి ఈ సంపుటి, ద్రాక్షా పాకం. అన్ని ద్రాక్షలూ వుదాహరణ యోగ్యమే అయినా, మచ్చుకి కొన్ని ఇక్కడ వుంచుతున్నాను.

ప్రకృతి ఒడి లో శిశువుగా పరవశించే వేళ కేరింతలుగా వచ్చిన తేటగీతి ఇది.

ప్రకృతి ఒడిలోన శిశువునై పరవశించచు
వేళ, కేరింతలై నోట వెడలి వచ్చె
తేటగీతుల రూపాన తియ్యనైనన
పద్యములు - తల్లి అందాలు ప్రస్తుతింప

కొన్ని మచ్చు తునకలు
 నిరంతరం తిరిగే సృష్టి చక్రానికి కందెన ప్రేమ తత్వమే కానీ, పగా - ద్వేషం కాదు. మానవుడు ప్రకృతికి దూరం గా జరిగిపోతున్నాడని 'డేవిస్ ' వందేళ్ళ క్రితమే విచారించాడు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే చెప్పలేనంత దూరమే జరిగిపోయాడాన్నది కళ్ళ ముందున్న చేదు నిజం. ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడం, పంచ భూతాలను, పశుపక్ష్యాలను, శిలలనూ కూడా దైవాలకు ప్రతిరూపాలుగా భావించి అర్చించడం అనూచానంగా వస్తున్న మన హైందవ భావన. ఈ భావననే మరొక రకంగా సృష్టిలోని మధురిమలని గుర్తించి, ప్రకృతిని ఆరాధించడం కూడా ఉత్తమ భక్తి మార్గమని నమ్ముతునానన్న శ్రీ గిడుగు చక్కని ఈ భావన సర్వదా సవ్యధా శిరోధార్యం.

మానవునిలో పెరిగిపోతున్న నిర్హేతుక క్రోధం, పగ, ద్వేషం అంతరించాలని, మన బుధ్ధి సత్యమైన మార్గంలో పయనించి శాంతి, సహృదయత వెల్లి విరియాలని, ఆ సుగుణాలని అలవరుచుకోడానికి ఇటువంటి రచనలు కొంతవరకైనా వుపకరిస్తాయని ఆశ, ఆకాంక్ష..


     5 comments:

శిశిర said...

బాగుందండీ మీ ఆలోచన.

Sree said...

the thought is great.. naanna nerpincheste internet usage, aayana teluguki inkaasta nyaayam chestaaremo anpinchindi.. anta spashtamaina bhaasa choosi chaaaaaaaaaala rojulayyindi mari.

sphurita mylavarapu said...

శిశిర గారూ ధన్యవాదాలు..

శ్రీ గారు చాలా ధన్యవాదాలు...మీరన్నది నిజమండీ...చాలా మంది తెలుగు మీద మంచి పట్టు వున్న పెద్దవాళ్ళకి ఇంతర్నెట్ పరిజ్నానం వుండి వుంటే ఎంత బావుండేది అని చాలా సార్లు అనిపించేది. ఏదైనా బ్లాగు పోస్ట్ చదివినప్పుడు ఇది నాన్నగారు చదివితే enjoy చేసే వారు కదా అని చాలా సార్లు అనిపించేది. చాలా నచ్చినవి printout తీసి india వెళ్ళేటప్పుడు పట్టికెళ్ళేదాన్ని...ఈ మధ్య పోరగా పోరగా ఇంటర్నెట్ పెట్టించి మైల్స్ చెక్ చేసుకోటమ్, చెయ్యడం కాస్త నేర్చుకున్నారు...తనే బ్లాగు నడిపే దాకా నేర్చుకోవాలన్నదే నా కోరిక...అంతదాకా నాకు సాధ్యమయినంత వరకూ ఇలా ఆయన రచనలు నలుగురితో పచుకోవాలని అనుకుంటున్నాను...

శ్యామలీయం said...

స్ఫురితగారూ

ఇంకా బాగా పోరు పెట్టండి!

మీ నాన్నగారి వంటి పెద్దలు కూడా ఇంటర్నెట్ ప్రపంచాన్ని పరిపుష్టం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది తెలుగు చదువరులకు!

మీ‌ ప్రయత్నం‌ ఫలించాలని మనస్ఫూర్తిగా అబిలషిస్తున్నాను.

sphurita mylavarapu said...

@శ్యామలీయం, తప్పకుండానండీ...మీ అందరి అభిమానం, ఆయన రచనకి వచ్చిన ప్రశంశలు ఆయనకీ తెలియజేస్తాను...ఇవి ఇంకా ఆయన్ని వుత్తేజపరుస్తాయనుకుంటున్నాను...