10/23/13

పుస్తకాలతో నాన్నగారి కబుర్లు - 2

అమ్మ కడుపు చల్లగా

రచన -శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారి ఆత్మ కథ

పరిచయం - మైలవరపు యజ్ననాధం



అభిమాన రచయితకొక ఆత్మీయ లేఖ



మాన్య శ్రీ  గొల్లపూడి మారుతీ రావుగారికి,

నమస్తే, ఉభయకుశలోపరి.

ఈమధ్య మీ ఆత్మకథ 'అమ్మ కడుపు చల్లగా' చదివే అవకాశం లభించింది. మీ ఆ రచన వెలువడి సుమార 5 సం ॥ లు గడిచిపోయినా నాకు అది చదివే అవకాశం ఈ మధ్యే దొరికింది. నాకు వచన రచనల్లో ముఖ్యంగా ఆత్మకథలు చాలా ఇష్టం. ఇదివరలో తిరుపతి వేంకట కవుల కథలు - గాథలు, టంగుటూరి వారి నా జీవిత యాత్ర, తిరుమల చంద్ర గారి హంపీ నుండి హరప్పా దాకా, శ్రీపాద వారి అనుభవాలూ - జ్నాపకాలూ, డా. ఉప్పల లక్ష్మణ రావుగారి బ్రతుకు పుస్తకం, బాల్యం లో చిలకమర్తి వారి స్వీయ చరిత్ర, కందుకూరి వారి స్వీయ చరిత్ర కూడా చదివాను. వీరిలో కొందరి రచనా శైలీ, గడుసుతనం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి విలక్షణమైన రీతిమ, తీరూ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వారి రచనలో భేషజం కనపడదు. అత్మాయతా స్పర్శ కనపడుతుంది. ఆ లక్షణం మళ్ళీ మీ రచనలో కాన వచ్చింది. మీ రచన ద్వారా మీరు ఆత్మీయులు గా కనిపించారు. అందుకే మీకీ ఆత్మీయ లేఖ.

'గద్యం కవీనాం వికషం వదన్తి ' అన్నారు పెద్దలు. వచనం రాసి మెప్పించడం కొద్దిమందికే సాధ్యం అయిన విషయం. ఏ రచన గానీ మధ్య లో వొక పేజీ తీసి చదివినా 'ఇది ఫలానా వారి రచన ' అని గుర్తించగలిగిన నాడు, ఆ రచయితకి తిరుగు లేని గుర్తింపు లభించినట్టే. ఆ ముద్ర వేయడం ఏ కొద్దిమందికో గానీ సాధ్యం కాదు. వచన రచనల్లో, స్వీయ చరిత్రలు, నవలలు, కథలు, కథానికలు పలువురివి చదివాను. వాటిలో బేరీజు వేసి చూసినప్పుడు, మీ వొక్కరి రచనా శైలి మాత్రమే శ్రీపాద వారి రచనల సరసన చేరగలదనిపించింది. ఇది మెనమెచ్చు కాదు. నిజాయితీ గా చెప్పిన మాట.

మహా పురుషుల జీవిత చరిత్రలూ, సమాజం లో కొంత పేరు సంపాదించిన వారి చరిత్రలు గ్రంధస్తం చేయబడ్డాయి. కానీ వాటిలో అతిశయోక్తులూ, భట్రాజు పొగడ్తలూ,కొండొకచో విసురులూ చేరి, వాస్తవాలు మరుగున పడవచ్చు.
కానీ స్వీయ చరిత్ర నిజాయితీ గా రచించిన నాడు, అందులో ఆ వ్యక్తి సమగ్ర జీవిత స్వభావ చిత్రణ, వానితో పాటే సమకాలీన సమాజ చిత్రణా - ఇత్యాది అంశాలను చక్కగా గమనించడానికి మంచి అవకాశం దొరుకుతుంది. 

స్వీయ చరిత్రలలో ఆత్మస్తుతి, పరనిందా కాకుండా నిజాయితీగా తమ బలహీనతలను, వోటములనూ కూడా వదలకుండా గ్రంధస్తం చేసినప్పుడు, ఆ మనిషి విలువ మరింత పెరుగుతుంది. మీ జీవిత చరిత్ర కేవలం మీ జీవిత చరిత్ర మాత్రమే కాకుండా ఇటీవలి ఆంధ్ర సారస్వత నాటకచరిత్రలో వచ్చిన పరిణామ క్రమాల దిక్సూచి కూడా.

నిజాయితీగా మీ బలహీనతలనూ, పరాజయాలనూ గ్రంధస్తం చెయ్యడం ద్వారా మీ విలువను మరింత పెంచుకున్నారు.లబ్ధప్రతిష్ఠులయిన వ్యక్తులతో మీ పరిచయాన్నీ, సాన్నిహిత్యాన్ని అలవోకగా ప్రస్తావించి తప్పుకున్నారు. వాటిని hilight చేయడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. మీరు సాధించిన విజయాలను కూడా నమ్రతతోనే ప్రస్తావించడం నన్ను మరింత ఆకట్టుకుంది.

మీ శ్రీమతి యెడల, మీ చిరంజీవుల యెడల మీరు చూపే చిరాకూ, ఒకప్పటి చిత్తూరు నాటక ప్రదర్శనలో స్థానిక తహసిల్దారు మీద మీరు ప్రకటించిన చిరుకోపం, దానిపై శ్రీ బి.కె. రావు (రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి) మిమ్మల్ని సున్నితంగా మందలించిన తీరు - ఇటువంటివి కూడా విడిచిపెట్టకుండా మీ ఆత్మకథ లో స్థానం కల్పించడం మీ సమగ్ర ఆలోచనా విధానానికి మచ్చు తునక.

ముఖ్యంగా మీ కుటుంబం మీద మీకుగల గాఢమైన అనుబంధం చాలా ముచ్చటగొలిపింది. అమ్మగారి యెడల మీకున్న అచంచలమైన భక్తి, చాలామంది మా వంటి వారికి ఆదర్శప్రాయం. అలాగే సహోద్యోగుల మీదా, మీ అభిమానుల మీదా మీకుగల అభిమానం ప్రశంశనీయం.

 అన్నింటికంటే ఎక్కువ నా మనసుని హత్తుకున్నది, స్వర్గస్తులయిన మీ కుమారుడు, శ్రీనివాసుగారిని స్మరిస్తూ, ప్రతిసంవత్సరం మీరు నిర్వహించే స్మారక బహుమతి ప్రదానోత్సవాలు, మొక్కుబడిగా కాకుండా, వారి యెడల మీకుగల ఆప్యాయత చాటుతూ, చలన చిత్ర రంగంలో తెరవెనుక కృషి చేసే సాంకేతిక నిపుణులూ, దర్శకులూ అయిన పలువురు మేధావులను మీరు సత్కరించే విధానం, స్వర్గం నుంచి మీ చిరంజీవి సహస్ర చక్షువులతో చూసి ఆనందిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం.

చలనచిత్ర నటుడిగా, నాటక ప్రయోక్త గా,రంగస్థల నటుడిగా ఇప్పటికే మీరు ఎంతో మంది అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. కోట్లాది అభిమానులని సంపాదించుకున్నారు. మిమ్మల్ని రచయిత గా ఆరాధించినా, విలక్షణమయిన మీ నటన, సాహితీ సేవకు ఎంతమాత్రం తీసిపోదు.

చాలా మంది ఏదో ఒక రంగంలో కృషి చేసి పేరు తెచ్చుకుంటారు. కానీ మీరు రచయితగా, నాటక ప్రయోక్తగా, రంగస్థల నటుడిగా, చలన చిత్ర రంగంలో మాటల రచయితగా, చలనచిత్ర దర్శకునిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చందోబధ్ధమయిన కవితలల్లారు. నాట్యరంగంలో- శాస్త్రీయ సంగీతంలో కూడా తగుపాటి అవగాహన వున్నట్లు మీరు పాల్గొన్న కవిసమ్మేళనాల వల్ల తెలుస్తోంది.

బహుముఖంగా విస్తరించిన, ఇంకా విస్తరిస్తున్న మీ ప్రతిభా సంపత్తులను ఆసక్తిగా గమనిస్తూ, ముందు ముందు సాహితీ సాంస్కృతిక రంగాలలో మీరు చేస్తున్న కృషి మరింత వెలుగొందాలని ఆశిస్తూ మీ అభిమాని అత్మీయ లేఖ.



-యజ్ఞనాధం

గమనిక: ఈ పుస్తకం ప్రస్తుతం కినిగె లో లభ్యం.
             http://kinige.com/kbook.php?id=1355&name=Amma+Kadupu+Challaga