Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

4/8/14

మా తాతగారి సుందరకాండము








ఎన్నాళ్ళు గానో రాయాలనున్నా ఎలా మొదలు పెట్టాలో తెలియక వాయిదా వేస్తూ వస్తున్నాను.
మొదటిగా నేను కొంచెం కన్ఫెస్ చెయ్యాలి. మన మధ్యే మనతోనే వున్న వాళ్ళ విలువ మనకి అంతగా తెలియదు. మనకి చాలా ఆక్సెసిబిల్ గా వుండే సరికి ఎప్పుడన్నా తెలుసుకోవచ్చులే అన్న నిర్లక్ష్యం వచ్చేస్తుంది. తాతగారు సంస్కృతం పాఠాలు చాలా బాగా చెప్పేవారు. నా చిన్నప్పుడు బాచ్ లు బాచ్ లు గా ఇంటర్మీడియట్ పిల్లలు ప్రైవేట్ కి వస్తూ రోజంతా ఎక్కడా ఖాళీ లేకుండా వుండే తాతగారు బాగా గుర్తే. సంస్కృతం పాఠాలు ఎంత బాగా చెప్పేవారో, ఇంగ్లీష్ పాఠాలు కూడా అంత బాగా చెప్పేవారు.

నేను ఇంటర్ కి వచ్చాక ఇంగ్లీష్ పొయెట్రీ బాగా చెప్పించుకునేదాన్ని గానీ సంస్కృతం అంటే మాత్రం మహా నిర్లక్ష్యం గా వుండే దాన్ని. సంస్కృతం లో ప్రశ్నలకి మొత్తం జవాబు తెలుగులో రాసేసి అక్కడక్కడా సంస్కృతం కొటేషన్ లు రాసేవాళ్ళం. మాతో నాలుగు రోజులు వుందామని వచ్చిన తాతగారు అలా కాదని ఒక పాఠం మొత్తానికి సంస్కృతంలోనే నోట్స్ ప్రిపేర్ చేసి నేను కాలేజీ నుంచి వచ్చేసరికి నాకు చెప్పాలని ఎదురు చూస్తున్నారు. నాకు ఆయన చెప్పేది ఛాదస్తం లాగే అనిపించింది అప్పుడు. అవతల నా బుర్రకెక్కని లెక్కలు, ఫిసిక్స్, కెమిస్ట్రీ భయంకరంగా భయపెడుతుంటే సంస్క్రుతం కోసం ఇంత టైమ్ వేస్ట్ చెయ్యాలా అనిపించింది. ఆయనకేదో సాకు చెప్పి తప్పించేసుకున్నాను.

నేను ఎంత మంచి అవకాశాలు వదిలేసుకున్నానో. ఎన్ని తెలుసుకోకుండా అందరితో పాటూ కొట్టుకుపోవడానికే మొగ్గు చూపించానో తెలుసుకునే పరిపక్వత నాకు వచ్చేసరికి తాతగారు నాకు అందనంత దూరం వెఌపోయారు.

ఇంక ప్రస్తుతంలోకి వస్తే రెండేళ్ళ క్రితం అనుకుంటా మా నాన్నగారు చాలా సంబరంగా చెప్పారు తన బాల్య మితృడు, తాతగారి శిష్యుడూ తనని చూడడానికి వచ్చారనీ, మాటల మధ్యలో తాతగారు రాసిన సుందర కాండ పుస్తకం చూసి దీనిని పునర్ముద్రిద్దాం అన్నారనీ.

నాకెంత, నాకేంటీ అనే మనుషుల మధ్య, ఇంచుమించు అదే మనస్తత్వం ఆకఌంపు చేసేసుకుని అదే సరైన పధ్ధతి అన్న మైండ్ సెట్ లోకి వెఌపోయిన నాకు, "ఆ ఏదో అంటారు గానీ" అనే అనిపించింది.

కానీ నేననుకున్నట్టూ కాకుండా, నా ఆలోచనా ధోరణి తప్పని నిరూపిస్తూ ఆ ప్రోజెక్ట్ ని చాలా వేగంగానే కార్యాచరణ లోకి తీసుకొచ్చారు. అప్పటివరకూ రిటైర్ ఐపోయాను, ఇంకేముందిలే అన్నట్టు కాస్త నిరుత్సాహంగా వుండే నాన్నగారు కూడా వుత్సాహంగా దీనికోసం పని చెయ్యడం మొదలెట్టారు. ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చెలాకీగా పుస్తకం విశేషాలు చెప్పేవారు.

ఈ మొత్తం ప్రోసెస్ లో ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటి తో, లుక్ తో పుస్తకం రూపు దిద్దడంలో ప్రముఖంగా చెప్పుకోవలసినది శ్రీ తులసి సుబ్బారావు గారి గురించి. 8 వాల్యూములుగా వచ్చినదాన్ని 3 పుస్తకాలుగా మార్చారు. అలోచనా, ఆచరణా ఆయనవైతే, మా నాన్నగారి ఇంకొక మితృలు శ్రీమాన్ తూపురాణి నమ్మళ్వార్ మరియూ మా నాన్నగారివి సహాయ సహకారాలు.

చాలా అందంగా ముస్తాబు చేసిన ఆ పుస్తకాన్ని గత ఫిబ్రవరి లో హైదరాబాద్ లో శ్రీ తులసి సుబ్బారావు గారి ఇంట్లో చక్కటి ఆత్మీయ వాతావరణం లో ఆవిష్కరించారు.

500 కాపీలు వేసి అందులో 150 నాన్నగారికి ఇచ్చారు. అవి ఇంటికి తీసుకొచ్చాక వస్తున్న స్పందన కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. చాలా మంది ఎంతో ఆసక్తి తో వచ్చి అడిగి తీసుకుంటున్నారు. చాలా కష్టపడితే గానీ అప్పాయిమెంటు కూడా దొరకని కొందరు కూడా ఈ పుస్తకం ఇవ్వాలని వెఌతే చాలా సేపు మాట్లాడి,  అభినందిస్తున్నారని అమ్మా, నాన్నగారూ మురిసిపోతూ చెబుతున్నారు.

తాతగారు అప్పట్లో అంత కష్టపడి రాసినా, 8 వాల్యూములు ఒకేసారి ముద్రణ జరగకపోవడం వల్ల రావలసినంత ఆదరణ రాలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు అనుకున్నకన్నా చాలా మంచి స్పందన వస్తోంది. ఇంత మంచి శిష్యులని సంపాదించారూ అంటే తాతగారు ఎంత గొప్ప గురువో కదా అనిపిస్తోంది ఇప్పుడు.

అమ్మా నాన్నగారూ చెప్తున్న విశేషాలు వింటుంటే కలుగుతున్న ఆనందాన్ని మీతో పంచుకోవాలనీ. ఈ పుస్తకం విషయం లో శ్రీ తులసి సుబ్బారావు గారూ, శ్రీమాన్ తూపురాణ్ నమ్మాళ్వార్ గారూ చేసిన కృషికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ ఈ టపా రాస్తున్నాను.

ఈ పుస్తకం గురించి నాన్నగారి మాటలు ఇక్కడ..












4/3/13

శ్రధ్ధాంజలి

వాళ్ళ నాన్న గారి చిటికెన వేలు పట్టుకుని బజార్లో అది కావాలీ...ఇది కావాలి అని పేచీలు పెడుతున్న బుల్ల్లి బావ, ఇంకా నాన్నగారి మనసులో మెదులుతూనే వున్నాడు...

నాన్నతో పాటు పెళ్ళి చూపులకొచ్చిన చిట్టి అల్లరి పిడుగు, అమ్మ కళ్ళల్లో ఇంకా కదులుతూనే వున్నాడు...

నీ పేరేవిటే 'స్ఫురించడం' లేదూ అంటూ ఆటపట్టించే తన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా పెదవులమీద చిరునవ్వులు పూయిస్తూనే వున్నాయి...

నా పెళ్ళికి అడక్కుండానే రెండు రోజుల ముందు సెలవు పెట్టుకుని వచ్చి...నీకు సాయం చేద్దామని ముందే ఇంటికి వచ్చా బావా అని ఫోన్ చేసి చెప్పినప్పుడు నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం, ధైర్యం ఇంకా నా జ్ఞాపకాల్లో సజీవంగా అలానే వున్నాయి...

ఎవరి పనుల్లో వాళ్ళు పడి చెల్లాచెదురైపోయిన బంధువులందర్నీ ఒక చోటకి చేర్చి ఫామిలీ రీయూనియన్ అని తను చేసిన సందడి అందరి గుండెల్లో ఇంకా భద్రంగానే వుంది...

మెరుపులా ప్రత్యక్షమయ్యి...నాకోసమేనా అక్కా పకోడీలు చేస్తున్నావ్ అని చనువుగా వంటింట్లో అమ్మని పలకరించేసి...నాన్నతో నాలుగు కబుర్లు చెప్పేసి...ఫోన్ లో నన్ను పలకరించేసి అప్పటివరకూ వుదాసీనం గా వున్న మా మనసుల్లో వుత్సాహం నింపేసి...ఏదో పని గుర్తొచ్చిందంటూ చటుక్కున మాయం అయిపోయే ఆ అనుకోని అతిధి పలకరింపులు, ఇంక కనపడవని నమ్మడానికి  వొప్పుకోనని మనసు మొరాయిస్తోంది...

తను ఈ ప్రపంచం తో సంబంధం తెంచేసుకుని పదిరోజులు దాటిపోయినా ... ఎప్పుడూ నవ్వుతూ పలకరించే తన గొంతు మా చెవుల్లో పదిలంగానే వుండిపోయింది...పైకి వేలాకోళాలాడినా... తన మాటల వెనక వున్న అభిమానం మా గుండెల్లో చెక్కు చెదరకుండా అలాగే వుంది...

మరణం మనిషితో పాటూ ప్రాణం ఒక్కటే తీస్కుకుపోతుందా అంటే...కొందరి జీవితాల్లో సంతోషం, నమ్మకం, ఆసరా కూడా ఆ ప్రాణం తనతో పాటూ లాక్కెళ్ళిపోతుంది...కొందరు మనుషులు మాత్రం...మృత్యువుకతీతంగా  తమదైన ముద్ర  తోటివారికి విడిచిపెట్టి  మన మధ్యలోనుండి చెప్పకుండానే మాయమైపోయినా... మనసు పొరల్లో గూడు కట్టుకుని మన చుట్టూనే తిరుగుతూ వుంటారు...

నువ్వు మా మధ్య లేకపోయినా, వున్నన్నాళ్ళూ నవ్వుతూ నవ్విస్తూ చేతనైన సాయం చేస్తూ బతకాలని... 'నన్ను చూసి నేర్చుకో' అని నోటితో చెప్పకుండానే ...జీవించి చూపించి నువ్వు ఇచ్చిన స్ఫూర్తి మాతో ఎప్పటికీ వుండిపోతుంది....

(పది రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన మా శర్మ మావయ్యకి శ్రద్ధాంజలి...ఆయన కుటుంబానికి...ఈ లోటుని తట్టుకునే శక్తి ని, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ...)




2/20/13

చిలక పలులకులు - 2

నా చిన్నప్పుడు నేనన్న మాటలు...చేసిన చిలిపి పనులు ఇప్పటికీ మా అమ్మ కధలు కధలు గా చెబుతూ వుంటుంది. కానీ నాకు ఇప్పుడే ఏదన్నా వెతుకుతూ వెతుకుతూ అసలేది వెతుకుతున్నానో మర్చిపోవడం, కొంతమంది పేర్లు గుర్తుకు రాకపోవడం వచ్చేసి, నా మెదడు మీద నమ్మకం తగ్గుతోంది ఈ మధ్య. నా కూతురు పెద్దదయ్యాక దాని చిలక పలుకులు దానికి గుర్తుంచుకుని చెప్పగలనో లేదో అని ఇలా రాసి దాచుకుంటున్నాను. ఆ మధ్య మరీ బుజ్జి చిలక పలుకులు రాసుకున్నా..ఇప్పుడు కాస్త తెలిసీ తెలియని చిట్టి పొట్టి మాటలు మాట్లాడే చిలకా ఇంకా దాని నేస్తాల కబుర్లు...
ఇండియా లో ఇంచుమించు రెండేళ్ళు వుండడం వల్ల మా చిట్టితల్లికి తెలుగు చక్కగా వచ్చేసింది. ఇక్కడకొచ్చి డేకేర్ కి వెళ్ళడం మొదలెట్టాక దాని మొదటి ఛాలెంజ్ తోటి పిల్లలతో వాళ్ళకర్ధమయ్యే భాషలో మాట్లాడ్డం. ఇంటికొచ్చాక ప్రతీదీ ఇంగ్లిష్ లో ఎమంటారో అడుగుతూ వుండేది కొన్నాళ్ళు. కాసిని రోజులు గడిచేసరికి సొంత ప్రయోగాలు మొదలెట్టేసింది. మా వాడు పుట్టిన కొత్తలో దాని తో ఆడుకోడానికొచ్హ్చిన పాప where is your bother? what is he doing? అని అడిగింది...మా పిల్ల తడుముకోకుండా చెప్పింది My bother is milking అని...:)

వొకరోజు ఇద్దరు స్నేహితుల కుటుంబాలని భోజనానికి పిలిచాం. పిల్లలంతా కలిసి గోల గోల గా ఆడుకుంటున్నారు. కొంచెం సేపటికి అందులో పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని తప్పించుకుని ఆడుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. మా చిన్నప్పుడు పాపం మా పిన్ని కూతుర్ని ఇలాగే అప్పుడప్పుడూ ఏడిపించే వాళ్ళం :)... మా అమ్మాయి వెళ్ళి అందులో వొక పిల్లాడి తల్లి కి కంప్లయింట్...ఆంటీ అన్న నన్ను ఆడించడం లేదని. ఆవిడ నవ్వి, వెళ్ళి చెప్పూ ఇది మా ఇల్లూ...నన్నాడించకపోతే బయటకి పంపేస్తా అని...అని చెప్పి పంపేసారు...అది పిల్లలున్న గదిలోకి వెళ్ళి గట్టిగా చెప్పింది...ఇదిగో ఇది ఆంటీ వాళ్ళ ఇల్లంట...నన్నాడించకపోతే అందర్నీ బయటకి పంపేస్తా అని చెప్పమన్నారు అని అరిచింది...ఆ పిల్లలకి ఏమీ అర్ధం కాక తెల్ల మొహాలు వేసారు గానీ...పెద్దాళ్ళంతా వొకటే నవ్వు...

మొన్న శనివారం సాయంత్రం పాత స్నేహితులొచ్చారు. వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు. పెద్దాడికి ఏడేళ్ళూ, చిన్నాడికి రెండున్నరా. అందరూ యధావిధి గా ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇంతలో మా బుడ్డోడు నిద్రకి పడ్డాడు. తమ్ముడు పడుకుంటున్నాడమ్మా గట్టిగా అరవకండీ అని రెండు మూడు సార్లు చెప్పినా మా మాటలు చెవికెక్కించుకునే పరిస్థితుల్లో ఎక్కడా లేరు. మా అమ్మాయి ని కాస్త గట్టిగా అరిచాను గొడవ ఆపమని. చిన్నోడికి వాళ్ళ అన్నని ఏదో అనేస్తున్నా అని కంగారొచ్చేసింది. అప్పటిదాకా ఏదో మూల వొక బొమ్మ పని పడుతున్న వాడల్లా వచ్చేసి నాకేసి కోపంగా వొక చూపు చూసి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని యుధ్ధానికొచ్చినట్టు నించుని stop it. This is my brother. అన్నాడు. వాడి మొహం చూస్తే భలే ముచ్చటేసింది. ఏమంటాడో చూద్దామని. No, this is my daughter. I can shout at her అన్నా మా పిల్ల చెయ్యి పట్టుకుని. వెంఠనే మా పిల్ల రెండో చెయ్యి పట్టుకుని stop it. This is my daughter అన్నాడు అదే చూపు కఅంటిన్యూ చేస్తూ...:)

నిన్న రాత్రి అందరూ పడకకి వుపక్రమించాక నేనింకా వంటింట్లో ఏదో సద్దుతుంటే మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వొక సొరుగు లాగి ఏదో వెతికింది. ఏవిటి వెతుకుతున్నావ్ అంటే చెప్పదు. ఇదేనా అమ్మమ్మా అనుకుంటూ మిరియాల పాకెట్ పట్టికెళ్ళింది పడగ్గదిలోకి. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి అదక్కడ పడేసి ఇంకేదో వెతకడం మొదలెట్టింది. ఏవిటే అని మళ్ళీ కాస్త గొంతు పెంచి అడిగితే అమ్మమ్మ కి ఆవుండలు కావాలంట అంటుంది. ఇంతలో అమ్మ వచ్చింది. ఏవిటి తెమ్మన్నావమ్మా దాన్ని అంటే నేనేవి తెమ్మనలేదే ఆవులింతలొచ్చేస్తున్నాయ్ అన్నా అప్పట్నుండీ ఇలా అన్నీ తెచ్చేస్తోంది అన్నారు. ఆ ముక్క చెవిని పడగానే ఆ అవే ఆవలింతలు కావాలి. అని మొదలెట్టింది. మా అమ్మగారు ఈనో కలుపుకు తాగుతుంటే నాకూ ఆవలింతలు పెట్టమ్మమ్మా అని వొకటే గోల. ఆవలింతలంటే తాగేవో తినేవో కాదమ్మా అంటే వొక పట్టాన వొప్పుకోలేదు...:)

ఈ మధ్య ఇంగ్లిష్ బాగానే మాట్లాడేస్తోంది, తప్పులూ తడకలూ ఎన్ని దొర్లినా...ఇంటికొచ్చాక కూడా అదే భాషలో బాదేస్తుంటే ఎక్కడ చక్కగా వచ్చిన తెలుగు అప్పుడే మర్చిపోతుందో(కొన్నాళ్ళకెలాగూ తప్పదన్న కఠోర వాస్తవం తెలిసినా) అని భయమేసి ఇంటికొచ్చాక తెలుగు లోనే మాట్లాడాలి అని చెప్పాను. వాళ్ళ నాన్న దగ్గరకెళ్ళి అమ్మకి ఇంగ్లిష్ రాదు పాపం. నన్ను తెలుగులోనే మాట్లాడమంటోంది అని తేల్చి పారేసింది.



11/29/11

తూర్పు వెళ్ళే మనసు




నల్లటి మెట్లు, మెట్లపక్కన పిట్టగోడ మీదుగా పాకిన సన్నజాజి పందిరి, మెట్ల మళుపుకి పక్కగా నల్లటి ఇనప చువ్వల కటకటాలు, దాని మీదుగా పాకిన రాధా మనోహరాల చెట్టు, వాటి మీదుగా ఇంకాస్త ముందుకి వెళితే బల్లల గది.
గచ్చు బదులు బల్లలు పేర్చి కట్టిన డాబా పైన గది. నాకూ నాతో పాటూ నా cousines ముగ్గురూ, మాతో సమానం గా అల్లరి చేసిన పిన్నిలు, చిన్న మావయ్యా...మా అందరి వూహలకీ రెక్కలొచ్చిన పొదరిల్లు ఆ బల్లల గది.

మా కలల ప్రపంచానికి తలుపులు తెరిచి స్వాగతం పలికిన హరివిల్లు ఆ గది.

కాస్త గట్టిగా నడిచినా పెద్దగా చప్పుడు చేసి, కింద నుంచి పెద్దవాళ్ళ చేత "ఏవిటా అల్లరి?" అని అక్షింతలు వేయించి నవ్వుకున్న చిలిపి కిట్టయ్య లాంటి గది.

చీమల్లా అలికిడి కాకుండా ఆ గదిలో దూరి, కట్టుకున్న పేక మేడలు, చెప్పుకున్న కబుర్లూ, కలబోసుకున్న స్కూలు అనుభవాలూ, చదివిన చందమామ కథలని నాటికలుగా మార్చి రాసుకుని, పెద్దవాళ్ళంతా చాయ్ తాగే వేళకి వాళ్ళముందు మా రాతలకి దృశ్య రూపం ఇచ్చేసి.. బుల్లి నటీ నటులుగా కొట్టించుకున్న చప్పట్లు, పోటా పోటీలుగా ఆడుకున్న అంత్యాక్షరులూ, తాతగారి పందిరి మంచం ఎదురుగా వుండే పెద్ద వుయ్యాలాతో చేసిన ఫీట్లూ, తగిలించుకున్న దెబ్బలూ, తాతగారితో కలిసి పెద్దవాళ్ళకి తీసిపోకుండా ఆడిన పేకాటలు, ఆయన పెద్ద విస్తరాకు కంచం...వెండిపువ్వుల పీట కోసం పడ్డ పోటీలూ, వాటిని తీర్చడానికి పెద్దాళ్ళ ఆపస్సోపాలూ, సంజె వేళ పెరట్లో చేసిన భోజనాలు, ఆటల మధ్య మా అలకలూ,పేచీలూ...మర్నాడు ఉదయానికి ఏమీ ఎరగనట్టు కలిసిపొయిన చిన్నారి స్నేహాలూ...

ఇంచుమించు ఇరవై మంది పూటకో గంట మాత్రం వదిలే కుళాయి నీళ్ళతో సద్దుకుని మహదానందంగా గడిపిన ఎర్రటి ఎండాకాలం సెలవలు...ఆశా సౌధాలకి పునాదులు వేసుకున్న అమ్మమ్మ గారింటి జ్ఞాపకాలు...


                                *******************************************

పెరటి వేపు నల్లటి పెద్ద గేటు మీద పాకిన రాధామనోహరాలు...

డాబా మీదుగా చూస్తుంటే కనబడే హరేరాం మైదానం, దాని మధ్యలో వుండే రాములవారి కోవెలా, దాని వెనకాలే వుందని నేను చాలా రోజులు భ్రమపడినా, దూరం గా వుండే నరసిమ్హస్వామి కొండ...

డాబాపైన చెక్క కటకటాళ్ళ వరండా...ఒక్కో గోడకీ పది కిటికీలు వాటికి బుల్లి బుల్లి తలుపులూ వుండే కిటికీల గదీ...గది చుట్టూ బీరువాల్లో పేర్చిపెట్టిన తాతగారి అపురూపమైన ఆస్తి ...ఆయన పుస్తక సంపద.

ఇంటి వెనకాల పెద్ద బావీ, పెరడంతా నీడనిస్తూ మావిడి చెట్టూ. పొద్దున్నే పలకరిస్తూ తులసమ్మ ఎదురుగా ముద్దమందారాల చెట్టూ.

సెలవలకి ఎప్పుడొస్తానని నాలుగురోజుల ముందునుంచే వాకబు చేస్తూ , నేను వచ్చిన ఐదునిమిషాల్లో ప్రత్యక్షమయ్యి వాళ్ళతో ఆటలకి లాక్కెళ్ళిపోయే నా బుల్లి నేస్తాలూ.

మధ్యాహ్నం గాళుపు కొడుతోందని ఇంట్లో పెట్టి ఎన్ని గడియలు వేసినా చల్లగా జారుకుని చెట్ల నీడలో ఆడిన గుజ్జినగూళ్ళు, పప్పు బెల్లాలతో చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు.

మామ్మ చెలులతో కలిసి ఆడిన గవ్వలాటలూ.

తాతగారిని మధ్యాహ్నం వేళ కునుకు తియ్యనివ్వకుండా వేసిన యక్ష ప్రశ్నలూ, ఆయన చెయ్యి  పట్టుకుని గర్వం గా చేసిన సాయంత్రం షికార్లూ.

వీధరుగు మీద మామ్మ వడిలో తల పెట్టుకుని నూట యాభయ్యో సారి కూడా విసుగు లేకుండా రామాయణ కధ చెప్పించుకున్న వెన్నెల రాత్రులు.

నా కోసం ప్రత్యేకం గా ఫ్రిజ్జు లోంచి గడ్డ పెరుగు తీసి చక్కెర చల్లి ఇచ్చే పక్కవాటాలో అద్దెకుండే ఆంటీ, నన్ను చూసి కేరింతలు కొట్టే ఆంటీ వాళ్ళ చిచ్చరపిడుగూ.

మనసులో మెదిలినప్పుడల్లా కళ్ళలోకి సన్నటి నీటిపొరని మోసుకొచ్చే మామ్మ గారింటి జ్ఞాపకాలు...


                                       *******************************************


ఇప్పుడా బల్లల గది లేదు. కిటికీల గది వుందో లేదో తెలీదు.

భౌతికంగా శిధిలమైపోయినా జ్ఞాపకాల వాకిట్లో మాత్రం ప్రాణం పోసుకుని సజీవంగా వున్నాయి. ఆ రోజులు తిరిగి రాకపోవచ్చు. చెదరని ఆ జ్ఞాపకాల జల్లులు మాత్రం మనసు మీద దాడి చేసినప్పుడల్లా వాటితో పాటుగా బోలెడంత వుత్సాహాన్ని కూడా మూటకట్టుకుని తీసుకొస్తాయి.

మనిషి ప్రయాణం పడమటికే ఐనా మనసు ఎప్పటికప్పుడు తూరుపు వెళ్ళే రైలు ఎక్కేస్తూనే వుంటుంది ఉదయ సంజె వెలుగుల్ని పలకరించి రావటానికి.

మనిషి time machine ఎక్కి వెనక్కి వెళ్ళలేకపోవచ్చు. మనసు మాత్రం ఏ technology తో పని లేకుండా తనకి కావల్సినప్పుడల్లా రోజు వారీ పనుల్లోంచి విరామం తీసుకుని  రెక్కలు కట్టుకుని వెనక్కి ఎగిరిపోగలదు. జ్ఞాపకల వీధుల్లో షికార్లు కొట్టి తాజా పరిమళాలనద్దుకుని వర్తమానం వాకిట్లో వాలిపోగలదు...


 జ్ఞాపకాలు...కాస్త పరుగాపి చతిగిలబడి కళ్ళు మూసుకుంటే తలపుల ముంగిట్లో ప్రత్యక్షమయ్యే చెక్కు చెదరని  స్మృతుల తేనె చినుకులు. ఎప్పటికప్పుడు మనసుకి కొత్త వుత్తేజాన్ని ఇచ్చి పరుగులు పెట్టించడానికి దొరికే పని విరామాలు. తరవాతి తరాలకి "మా చిన్నప్పుడు" అని చెప్పుకోడానికి మనసుపొరల్లో నిక్షిప్తమయ్యే నిధి నిక్షేపాలు. విరగబూసిన రాధామనోహరాల సుగంధాన్ని తమతో పాటు మోసుకొచ్చే సీతాకోక చిలుకలు...

(ఈ మధ్యే అమ్మమ్మ వూరు వెళ్ళొచ్చిన cousine ముఖపుస్తకం లో పెట్టిన update తో...మనసులో మెదిలిన జ్ఞాపకాల పరంపర కి అక్షర రూపం.)

11/21/11

కనువిందు చేసిన బాపూ గీసిన రామరాజ్యం




నేనెప్పుడూ సినిమా రివ్యూ రాయలేదు...రాద్దామని ఏనాడూ అనుకోనూలేదు. ఇప్పుడు రాస్తున్నది రివ్యూ అనికూడా అనుకోవడంలేదు...శ్రీరామరాజ్యం చిత్రం చూసిన తర్వాత రెండురోజులయినా విడిచిపెట్టని ఒక అనుభూతిని నా బ్లాగుచదివే కొంతమందితోనయినా పంచుకోవాలని రాస్తున్నానంతే

రమణ గారి హంసగీతం అని ఒకాయన రాసిన రివ్యూలాంటిది చదివాక చూసితీరాలనిపించి మావారిని బతిమాలి మరీ లాక్కెళ్ళాను శనివారం సాయంత్రం...మావారు పెద్దగా సినిమాలమీద research ఏమి చెయ్యరు నాలాగ. రాముడి పాత్రలో కూడా బాలకృష్ణ తొడగొడతాడు చూడు అని ఏడిపిస్తూనే వున్నారు సినిమా మొదలయ్యేవరకూ...

ఒక్కసారి సినిమా మొదలయ్యాక మాత్రం రాముడూ సీతలమధ్యకి మమ్మల్నీ లాక్కువెళిపోయింది...చూస్తున్నంతసేపూ పెద్దగా analysis ల వైపు పోలేదు బుర్ర. చాలాకాలం తర్వాత లీనమైపోయాననిపించిన సినిమా...తెలుసున్న సీతారాముల కథే ఐనా రెండు మూడు చోట్ల కళ్ళు చెమర్చాయి. ఒక సినిమా చూస్తూ ఆ పాత్రకి connect ఐపోయి ఆ పాత్ర కష్టానికి కంటతడి పెట్టిన సినిమా ఈమధ్య కాలంలో చూసిన గుర్తు లేదు.(కొన్ని పాత సినిమాలు మళ్ళీ చూసినప్పుడు ఆ అనుభూతి మళ్ళీ కలిగిన సందర్భాలు చాలానే వున్నాయనుకోండి)

చూసి ఇంటికొచ్చినదగ్గరనుండీ ఆ పాటలే వింటున్నాం. అదీ సంగీతం...వాటి సాహిత్యం గురించి చెప్పాలంటే. చిన్న చిన్న మాటలతో ఎంతో అర్ధవంతం గా రాసిన జొన్నవిత్తుల గారి సాహిత్యానికి ఇళయరాజా ఇచ్చిన సంగీతం నాకైతే చాలా నచ్చింది. ఎక్కడా వాయిద్యాలు సాహిత్యాన్ని మించిపోయి మాట వినపడకుండా చెయ్యలేదు. చిన్న పిల్లలు కూడా చక్కగా పట్టుకుని పాడుకునేలా వున్నాయి పాటలు. బొమ్మాళీ నిన్నొదలా వొదలా అని నా కూతురు TV చూసి పాడేస్తుంటే చూసి బెంగపడే నాలాంటి తల్లులకి ఒక చిన్న relief.  ఈ పాటలు కొన్నిరోజులైనా TV ల్లో మారుమ్రోగితే ఇవి కాస్తైనా వంటపట్టించుకుటారుకదా పిల్లలు అన్న ఆశ.

సినిమా చూస్తున్నంత సేపూ అందులో నటులెవ్వరూ గుర్తురాలేదు...ఆ పాత్రలే కనిపించాయి. ఒక image వచ్చేసిన నటులందరితో వాళ్ళ మ్యానరిజంస్ ఎక్కడా బయటకీ రాకుండా నటింపచేసిన బాపూ గారికీ ఆయనకి గౌరవం ఇచ్చి, తోచినట్టు కాకుండా చెప్పినట్టూ , ఆయన గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా నటించిన పెద్ద పెద్ద నటులందరికీ కూడా జోహార్లు చెప్పి తీరాలి.

ముఖ్యంగా చెప్పాల్సింది నయనతార గురించే. మిగిలిన వాళ్ళందరికీ పౌరాణికాల్లో కాస్తో కూస్తో అనుభవమైనా వుంది. నయనతార అనగానే ఇంక చూసినట్టే అనుకున్నవాళ్ళల్లో  నేనూ వున్నాను. కానీ చూస్తున్నంతసేపూ సీతమ్మే కనిపించింది. ఎంతో గౌరవం కూడా కలిగింది. చాలా హుందాగా తను సీత బాధని అనుభవించి మరీ చేసిందనిపించింది. అలాగే బాలహనుమంతుడిగా వేసిన చిన్నపిల్లాడు కూడా ఒదిగిపోయాడు. హనుమంతుడు మారువేషంలో సీతమ్మతో పాటే వుండిపోయాడని చేసిన మార్పు ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. పైపెచ్చు ఇలాగే చేసి వుంటాడేమో అనిపించింది. తాను గీసిన బొమ్మలతో పూర్వ రామాయణం మొత్తం పేర్లు పడుతున్నంత సేపూ చూపించటం కూడా ఎంతో చక్కగా వుంది.

మాటలగురించి చెప్పాల్సినదేముంది. రమణ గారి బుడుగు చదువుతూ పెరిగినదాన్ని. అది చిన్నపిల్లకోసం రాసినట్టే ఈ కాలం పిల్లలకి వాళ్ళకర్ధమవ్వటానికి ఆయన రాసిన సీతారాముల కధ అనిపించింది.

క్రితం సంవత్సరం మేము india వెళ్ళినప్పుడు దసరా రోజున  పండగ సందర్భంగా ఒక channel లోలవకుశ  వేస్తుంటే, పిల్లలకి ఆ సినిమా చూపించటానికి పెద్దవాళ్ళంతా నానా తంటాలు పడ్డారు. ఆఖరికి భయపెట్టి మరీ కూచోపెట్టాల్సొచ్చింది. కూచున్నారే గానీ బుంగమూతులు పెట్టుకుని ఎప్పుడైపోతుందిరా భగవంతుడా అన్నట్టు కూచుని మధ్యలో ప్రకటనలొచ్చినప్పుడు జాగ్రత్తగా ఒక్కొకళ్ళూ తుర్రుమన్నారు. వాళ్ళకి ఆ సినిమాలో మాటలు greek, latin లా అనిపించడంలో చిత్రమేమీ లేదు. లవకుశేగా మళ్ళీ తియ్యటమెందుకూ అనుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఇదేనేమో అనిపించింది. ప్రతీ తరంలో ఆ సమయానికి తగ్గట్టు ఒకసారి ఇలాంటి చిత్రాలు తీయటం మంచిదని. ఈ తరానికి కూడా తాము ఎంతగానో నమ్మిన సీతారాముల కధని చేర్చడమనే బాధ్యత తమ భుజాలపై వేసుకున్నారు బాపూరమణలు.

కనులకి విందు
చెవులకి ఇంపు
మనసుకి మధురానుభూతి...

ఇది రమణ రాసి...బాపూ గీసిన సీతారామ చరితం..

4/12/11

నేను మాలతిగారిని కలిసానోచ్




చిన్నప్పుడు నా స్నేహితులంతా ఎవరో హీరో నో , హీరోఇన్ నో ఆరాధించేస్తుంటే చూసి నవ్వుకునేదాన్ని. నా classmate ఒకడు తన అభిమాన హీరో పుట్టినరోజు అని క్లాసు రూములో నే కేకు కటింగ్ గట్రా చెయ్యబోతే చాలా తీవ్రం గా అడ్డుకున్నాను. అలాంటి అభిమానులని చూసి సదరు సినెమా వాళ్ళకి కూడా మనకిలాగే రెండు కాళ్ళు, రెండు చేతులే గా వున్నాయి అని వెక్కిరించేదాన్ని. నన్నెవరైనా నువ్వెవరి fan అని అడిగితే చచ్చేంత కోపం వచ్చేది. ఎవరు తీసినా, రాసినా, వేసినా బావుంటే చూస్తాం, చదువుతాం, అది వాళ్ళ పని అనే సమాధానం వచ్చేది నా దగ్గరనుంచి. నేనేంటి అలా ఒకళ్ళని follow అవ్వటమేమిటి అని కాస్త పొగరు కూడా వుండేది. ఇలాంటి so called పెద్దవాళ్ళంతా వాళ్ళు రాసినట్టు, వేసినట్టు నిజం గా వుండరనేది కూడా నా అభిప్రాయం.

మా ఆఖరు పిన్నికీ నాకు వయసులో మరీ అంతరం లేకపోవటం తో స్నేహితుల్లా వుండేవాళ్ళం. తను ఒక రచయిత ని బాగా అభిమానించేది. ఒక సారి అతను వూళ్ళో ఏదో సభకి వచ్చాడని తెలిసి ఆ సభకి వెళ్ళాం. అక్కడ నిర్వాహకుల్లో తనకి తెలిసిన ఆయన్ని పట్టుకుని ఆ రచయిత తో మాట్లాడే అవకాశం సంపాదించింది తను. తన కూడా వెళ్ళి వెనకాల నుంచున్నానే గానీ అతన్ని చూసి చిన్న ప్లాస్టిక్కు నవ్వుకూడా నవ్వలేదు. మా పిన్ని మాత్రం చాలా excite అయిపోయి ఆయనకి తను ఎంత పెద్ద అభిమానో, ఆయన రచనలు ఎందుకు నచ్చుతాయో తన excitement అంతా మాటల్లోకి, మొహం లోకి transfer చేసేసి మరీ చెప్పేస్తోంది...ఆయన మాత్రం ఒక నిర్వికారమైన మొహం పెట్టి ఆహా అలాగా అని పొడి పొడి గా రెండు ముక్కలు అనేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తర్వాత సభలో కూచున్నాం గానీ మా పిన్ని మొహంలో ఒకలాంటి నిరాసక్తత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంటికి వెళ్ళే దార్లో నెమ్మదిగా తనతో చెప్పాను...ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళు రాసే రచనల్లో పాత్రలంత గొప్పగా ఏం వుండరు అని. తనకి ఎందుకో నా మాటలు వూరటనిచ్చాయి. తన మనసులో పడుతున్న ఘర్షణ చెప్పకుండానే నేను తెల్సుకున్నందుకో..ఆ సదరు రచయిత మీద తనకి వచ్చిన కోపం సరైనదే అని నేను justify చేసినందుకో తెలీదు గాని తను కాస్త చల్లబడిందనిపించింది నా మాటలతో. ఆ సంఘటన తర్వాత నా అభిప్రాయం ఇంకాస్త బలపడింది...తర్వాత ఎప్పుడూ ఒక brand name కి ఆకర్షితురాలినయ్యిన గుర్తులేదు.

అమెరికాకి వచ్చాక ఒక రోజు అసలు internet లో తెలుగు రచనలు వుంటాయా అని వెతికితే మొదటగా నా కంట పడినది, ఈమాట అనే ఈ పత్రిక. నేను చూసిన సంచికలో నాకు బాగా నచ్చినది మాలతి గారి(మాలతి నిడదవోలు) కధ. అలా ఈమాట సంచికల్లో ఆవిడవి రెండు మూడు కధలు చదివాక ఆవిడ రచనా సైలి ఎందుకో తెలీదు గానీ బాగా ఆకట్టుకుంది. ఆవిడ కధలు చదువుతూ నేను వూహించుకున్న ఆవిడ రూపం చీర కట్టుకుని, సిగ వేసుకుని, పెద్ద కళ్ళజోడు పెట్టుకుని ఇంచుమించు గుప్పెడు మనసు సినిమాలో సుజాతలా :). ఈమాట లో ఆవిడ పేరుతో వెతికి ఆ పత్రిక లో ప్రచురించబడ్డ ఆవిడ కధలన్నీ చదివేసాను. తర్వాత ఆవిడ పేరుతో internet లో వెతికితేనో అని ఉపాయం తట్టి అలా వెతికితే ఆవిడ కధల PDF దొరికింది ముందుగా. అది కూడా చదివాక ఆవిడ బ్లాగు తూలిక నా కంట పడింది. ఆ రకంగా తెలుగులో నేను చూసిన మొట్ట మొదటి బ్లాగు మాలతి గారిదే. ఆవిడ బ్లాగులో లంకెలు పట్టుకునే బ్లాగు ప్రపంచంలోకి అడుగు పెట్టాను. కొన్నాళ్ళు ఆ ప్రపంచంలో విహరించాక నేనూ రాస్తే అన్న వూహ చిగురేసి, మొగ్గేసి ఆఖరికి పువ్వులు పూసింది. రాద్దామన్న ఆలోచన వచ్చాక నన్ను ఎక్కువ భయపెట్టింది కూడా మాలతిగారి రచనలే.

మొత్తానికి ఒక రోజు తెగించి నేను కూడా ఒక బ్లాగు మొదలెట్టేసాను. మొదలు పెట్టిన కొన్నాళ్ళకి ధైర్యం చేసి మాలతి గారికి నా బ్లాగు చూడమని ఒక మైల్ పంపాను. ఎందు చేతో ఆవిడ ఆ mail చూడలేదు. ఆ అంత పెద్ద రచయిత్రికి నా రాతలేం నచ్చుతాయి లే అని సరిపెట్టుకున్నాను. కొన్నాళ్ళకి ఆవిడ బ్లాగులో నేను పెట్టిన కామెంటు చూసి అనుకుంటా నా బ్లాగులోకి వచ్చి వ్యాఖ్య రాసారు. ఆ రోజు నా ఆనందం చెప్పలేను. ఇంటికి ఫోను చేసి అమ్మకి, నాన్నగారికి...ఇక్కడ మావారికి అందరికీ చెప్పేసాను. తరవాత ఆవిడ నా టపాలన్నీ ఇంచుమించు చదువుతూ వ్యాఖ్య రాస్తూ వుండేవారు. కొన్నాళ్లకి ఆవిడ బ్లాగు రోలు లో నా బ్లాగు చూసిన రోజు నా రాతల మీద మొదటి సారి కాస్త నమ్మకం ఏర్పడింది.

ఈ మధ్య మాలతి గారు రాస్తున్న మార్పు ద్వారా Dallas వచ్చారని తెల్సుకుని..మా వారూ అక్కడే వుండడంతో ఈ సారి వచ్చినప్పుడు కలవొచ్చా అని మైల్ పెట్టాను తటపటాయిస్తూనే. ఆవిడనుంచి వెంటనే తప్పకుండా అని తన నంబరు తో సహా ప్రత్యుత్తరం చూసి ఆశ్చర్యపోయాను. గత వారాంతం లో అనుకోకుండా డల్లస్ వెళ్ళిన నేను ఆవిడకి పొద్దున్నే ఫోను చేస్తే రెండు నుంచి నాలుగు వరకూ తెలుగు క్లాసు వుంది...దానికి ముందు గాని వెనక గానీ రండి అన్నారు. సరే సాయంత్రం వస్తాం అని చెప్పి ఫోను పెట్టేసాను. మా సంభాషణ ముక్కలు ముక్కలు గా విన్న మా వారు ఇప్పుడే రమ్మన్నారని అర్ధం చేస్కుని బండి కట్టేసారు. ఎక్కడికి అని అడగకుండానే కారెక్కి కూచున్నాను నేను. సాయంత్రం మాలతి గారిని కలిసినప్పుడు ఏమి మాటాడాలి అని ఇప్పట్నుంచే అలోచించేస్తూ మధ్యదార్లో అడిగాను మా వారిని ఎక్కడికెళ్తున్నాం అని. వచ్చినప్పట్నుంచీ మాలతి గార్ని కలవాలని జపం చేస్తున్నవ్, తీరా వెళ్తుంటే ఎక్కడికంటావేంటి అన్నారు, అది సాయంత్రం కదా అనేసి, తనకి ఆ ముక్క చెప్పలేదని గుర్తొచ్చి నాలిక్కరుచుకుని మళ్ళీ మా వారు నరసిమ్హావతారం ఎత్తకముందే పోన్లే ఇప్పుడే వెళ్దాం, రెండింటి వరకూ వుంటా అన్నారు కదా అనుకునీ నోరు మూస్కుని కూచున్నాను. మధ్యలో మళ్ళీ ఆవిడకి కాలు చేసి ఇప్పుడే వస్తున్నాం అని చెబ్దామని కూడా తట్టలేదు ఆ కంగారులో. తీరా వాళ్ళింటి ముందుకి వెళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. నాకు చెప్పలేనంత నీరసం వచ్చేసింది, నా ఆలోచనలకి విరుధ్ధం గా నేను అంతగా అభిమానించిన ఆవిడని చూడనేలేకపోయాను అని. మా వారు ఏదయినా ఒకసారి fail అయితే మళ్ళీ ఆ పని అంత త్వరగా చెయ్యరు. ఇంక తను మళ్ళీ ఇక్కడికి తీస్కురారని అర్ధమైపోయింది. నీ planning ఇంత అందం గా వుంటుంది అని అక్షింతలు వేస్తూనే దగ్గర్లో వున్న ఆంజనేయ స్వామి గుడికి లాక్కెళ్ళారు. కొంచెం సేపు బుర్ర పని చెయ్యలేదు. ఇద్దరం పక్క పక్కనే కూచుని ఇంత miss communication ఎలా సాధ్యం అని ఒక పక్కా. నేను ఆశ పడ్డదేది జరగదు లాంటి ఆలోచన ఒక పక్కా...గుడిలో హనుమాన్ చాలీసా పారాయణ, అక్కడే భోజనం అన్నీ అయ్యాక silent mode లో వున్న ఫోను చూస్కుంటే మూడు Voice messages. ఏమనుకున్నారో ఏమో పోనీ ఇప్పుడు మళ్ళీ ఫోను చేసి చూడు వుంటే వెళ్దాం అన్నారు. అప్పటికే 1:15. మధ్యలో ట్రాఫిక్కు జాము దాటుకుని వెళ్ళేసరికి పావుతక్కువ రెండు అయింది. ఇంకేముంది...నాకు టైము అయిపోయంది అని వెళిపోతారు అనుకుంటూనే వెళ్ళాను.

నా సందేహాలన్నీ పటా పంచలు చేస్తూ బయ్టకి వచ్చి మరీ నవ్వుత్తూ స్వాగతం పలికారు. అప్పటివరకూ నా మీద రుస రుసలాడిన మావారు, మాది విశాఖపట్నం అనగానే నాకంటే ఎక్కువగా ఆవిడతో కబుర్లలో పడిపోయారు. ఆవిడని కలిస్తే ఇలా మాట్లాడాలి, ఇవి చెప్పాలి, ఇవి అడగాలి అని తయ్యారు చేకున్నవేమీ గుర్తు రాలేదు. నాకు బాగా పరిచయం వున్న వాళ్ళింటికి వెళ్ళినట్టే అనిపించింది. ఇప్పుడే భోజనం చేసాం అంటున్నా వినకుండా మా ఇంటికి వచ్చి కాఫీ వద్దంటారా అని కమ్మటి కాఫీ రుచి చూపించారు. మీకు క్లాసుకి time అయిపోతోందేమో అంటే ఫరవాలేదు లే కాస్త late అయినా అని మాకోసం అరగంట late గా వెళ్ళారు. ఆవిడ ఇంకా కూచోండి అంటున్నా ఆవిడకి క్లాసుకి time అయ్యిందని మా కర్మ యోగి గారు( తనవైనా పక్కవాళ్ళవైనా సరే పనులు సమయానికి అవ్వాలనుకోవటం, అయ్యేలా చూడటం చేసేవాళ్ళని అలా అంటారని ఎక్కడో చదివాను) లాక్కొచ్చేసారు. మళ్ళీ వచ్చినప్పుడు తీరిగ్గా కలుద్దాం అని చెప్పుకుని విడిపోయాం.

మొత్తానికి అలా నేను మాలతిగారిని కలిసానోచ్(కొంచెం గర్వం నిండిన స్వరం తో)

4/4/11

ఎన్నాళ్ళో వేచిన ఉదయం...

తెల తెలవారుతూ వుండగానే నిద్ర లేచి...స్నానం చేసేసి...దేవుడికో దణ్ణం కూడా పెట్టేస్కుని...వేడి వేడి coffee mug చేత్తో పట్టుకుని balcony లో కూచుని చిరు చలికి చిన్నగా వణుకుతూ మళ్ళీ కొత్తగా పుట్టేస్తున్న బాలభానుడిని చూస్తూ మధ్య లో వేడి coffee గుటకలు వేస్తూ ఎర్రటి ఆకాశాన్నీ..తొలి వెలుగు రేఖల్నీ...నీరెండ పడి వొళ్ళు విరుచుకుంటున్న మొక్కల్నీ చూడాలన్నది ఎప్పట్నుంచో నా కల...ఏవిటీ ఇది కూడా కలేనా అని పెదవి విరిచేస్తున్నారా...ఐతే మీరు తప్పకుండా IT (information technology) లో పని చెయ్యట్లేదన్నమాట...ఈ conditions అన్నీ కలిపి ఆస్వాదించిన రోజు నాకైతే గుర్తు లేదు మరి. ఈ కలని నిజం చేస్కోవటానికే ఎప్పుడు ఇల్లు మారినా balcony వుండి తీరాలని పట్టు పట్టేదాన్ని. మేము వున్న చోట బాల్కనీ అంటే luxury లోకి వస్తుంది మరి...దానికి మళ్ళీ కాస్త వడ్డింపు ఇంకో లడ్డూ కావాలా నాయనా అనుకుంటూ. balcony వున్న ఇల్లు ఐతే తీస్కుంటాం గాని అంత పొద్దున్నే లేచిన పాపాన్నైతే పోలేదు ఇప్పటివరకూ. ఎలాగూ ఈ దేశం లో 6 నెలలు చిరు చలి వుండదు...అంటే చలి ఉండదని కాదు, భయంకరమైన చలి వుంటుంది...అప్పుడు balcony లో కూచుని coffee తాగటం అన్నది కల కాదు..సాహసం అవుతుంది...అంటే అప్పుడు నేను పొద్దున్నే నిద్ర లేచేస్తా అని కాదు..లేవకపోఅవటం లో నా తప్పు లేదు అని చెప్పటం అనమాట. మిగిలిన 6 నెలల కాలం లో వారం లో పనికెళ్ళే 5 రోజుల్లో లేవటం పడుకోవటం అనేది మన చేతుల్లో వుండే పని కాదు. ఇంక సూర్యోదయం...సూర్యాస్తమయం లాంటివాటి గురించి అలోచించినట్టు తేల్సినా మా manager కి అనుమానం వచ్చేస్తుంది నేను పని పంపిణీ లో ఎమయినా లోపాలు చేస్తున్నానా అని. వారాంతపు సెలవలు అంటే అయిదు రోజులు వుధ్ధరించేసిన పనికి బోలెడు విశ్రాంతి తీసేస్కోవాలనే బలమయిన అభిప్రాయంతో రోజూ కన్నా ఇంకో రెండు..మూడు..గంటలు(ఇంకా ఎక్కువ లెక్కపెడితే మరీ నా గురించి నిజాలు తెలిసిపోఅవూ...)నిద్దర తీస్తాం కదా అదన్నమాట. ఏంటమ్మా మరీ కబుర్లు చెప్తున్నావ్...మీకు అస్సలు పనీ పాటా లేకుండా ఆఫీసుల్లో ఆడుకుని వచ్చే రోజులు బోల్డుంటాయని మాకు తెలీదనుకున్నావా అనేస్తున్నారా...అదే మరి...అలా మధ్యలో పని లేని రోజుల్లో అలవాట్లు మార్చేస్కుంటే హఠాత్తుగా పనొచ్చి మీద పడ్డప్పుడు కష్టం కదా అని సమయ పాలనలో మార్పులు చెయ్యబడవ్. చూసారా eమత ముందు చూపో ... :)

ఇంతకీ ఇంత సుత్తి ఎందుకు చెప్తున్నా అనే కదా మీ అనుమానం...వస్తున్నా అక్కడికే వస్తున్నా...మొన్న మనవాళ్ళు ఆడిన world cup final మాకు ఇక్కడ తెల్లవారుఝామున 4:00 గంటలకి మొదలు. ముందు రోజు నీలం రంగు వస్త్రాలని ధరించి భారత జట్టుని ప్రోత్సహించవలసిందొహో అని లేఖలు పంపినా...గాడిద గుడ్డేం కాదూ...అని తీసి పడేసి పైగా శ్రీలంక జట్టు వాళ్ళు వేస్కునే ముదురు నీలం రంగు jeans వేస్కుని మరీ office కి వెళ్ళిన నేను, ఆ... అంత పొద్దున్నే ఎవడు లేస్తాడూ చూస్తే రెండో innings చూస్తా అని friends దగ్గర బింకాలు పోయిన నేను, నాలుగింటికి అల్లారం పెట్టుకుంటున్న మా వారిని చూసి పరీక్షలప్పుడు ఎప్పుడైనా ఇంత tension పడ్డారా అని వెక్కిరించిన నేను...పొద్దున్నే జనగణమణ వినపడగానే, లోపలెక్కడో ఓ మూల నిద్దరోతున్న నా లోపలి Indian ఒక్కసారిగా మత్తువదిలి ఒక్కటివ్వడంతో...లేచి హాల్లోకి పరిగెట్టా... ఒక 15 నిమిషాలు చూసి వచ్చి మళ్ళీ పడుకుందాం లే అని బధ్ధకం వదలని నా మనసుకి నచ్చచెప్తూనే computer ముందు చతికిల పడ్డాను. ఇంచుమించు అయిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇదే చూడటం కిరికెట్టు ( మా మామ్మ అలాగే అంటుంది మరి). మనవాళ్ళు నేను చూడటం మానేసాక ఇంతలా improve అయిపోయారా అనుకుంటూ అలాగే చూస్తూ వుండిపోయాను. ఇంక అంత బాగా ఆడుతుంటే నా అతిప్రియమైన నిద్దరని కూడా నాకు తెలియకుండానే మర్చిపోయా. ఇంక ఎలాగూ లేచాం కదా అని అయిదున్నరకి స్నానం చేసేసి దేముడి దగ్గర దీపం పెట్టేస్కుని, పన్లో పని భారత్ నెగ్గెయ్యాలని కూడా దేవుడికి వినతి పత్రం సమర్పించేసి(చిన్నప్పుడు ఇలాగే India నెగ్గాలని, నచ్చిన cinema వస్తున్నప్పుడు power cut అవ్వకూడదని దణ్ణాలు పెట్టేస్కుంటూ వుండేదాన్ని...ఇంకా ఆ అమాయకత్వం ఎక్కడో బతికే వుందనుకుంటా)..టిఫినూ కాఫీ తయారు చేసేసే సరికి...ఆరు...అప్పుడు కిటికీ లోంచి ఎర్రటి ఆకాశం రారమ్మని అని పాట మొదలెట్టింది...ఆట ఎంత రసవత్తరం గా వున్నా...మళ్ళీ ఈ అవకాశం ఎప్పటికి వస్తుందో అని నా కల సాకారం చేసేస్కున్నా...అదన్నమాట విషయం...ఈ శనివారం వుదయం 28 ఏళ్ళ భారత జట్టు ఎదురుచూపులేకాదు...నా కలా(ఎన్నాళ్ళు గా ఎదురుచూస్తున్నానో సరిగ్గా గుర్తు లేదు)..మా వారి కల కూడా నిజమైపోయాయ్...మధ్యలో మా వారి కల ఏమిటా అనుకుంటున్నారా...పెళ్ళవ్వగానే పెళ్ళాం అనబడేది పొద్దున్నే ఆయనగారు లేచేసరికి తలకి పిడప పెట్టేస్కుని(స్నానం చేసైనా కావొచ్చు, చెయ్యకుండానైనా కావొచ్చు) చేతిలో వేడి వేడి coffee cup తో చిరునవ్వులు వొలకపోస్తూ సుభోదయాలు చెప్పేస్తుందనేది ఆయన కల(తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తే అలాంటి కలలే వస్తాయి మరి)...ఆరింటికి టిఫెనూ, కాఫీ చేతిలో పెట్టేసరికి...ఈరోజు నువ్వేమన్నా పట్టించుకోను లాంటి వరాలిచ్చెయ్యటానికి కూడా సిధ్ధపడిపోయారు పాపం.

ఇంతకీ మర్నాడు ఎన్నింటికి లేచావ్ అంటారా...అలాంటి పన్లు అప్పుడప్పుడూ చేస్తేనే అంత సంతోషం, ఆశ్చర్యం, ఆనందం లాంటి అనుభూతులన్నీ కట్ట కట్టుకుని వస్తాయి...రోజూ చేసేస్తే అలవాటైపోయి బోరు కొట్టెయ్యదూ...

2/28/11

చిలకపలుకులు




చిన్నప్పుడు ప్రతీపిల్లలూ ముద్దు మాటలాడతారు...ప్రతీ బుడుగు మాటలు చాలావరకూ unique గానే వుంటాయి అనిపిస్తుంది నాకు. ఆ వయసులో వాళ్ళ సౄజనాత్మకి కొలతలు లేకపోవటం..మూసల్లో పోసి వారి తెలివితేటల్ని నియత్రించే బోధనా పధ్ధతుల్లో ఇంకా ఇరుక్కుపోకపోవటం కారణాలు కావొచ్చు. నా చిట్టి తల్లి ముద్దు మాటలు అది పెద్దదయ్యాక దానికి గుర్తు చెయ్యాలన్న ఆశతో ఇక్కడ దాచుకుంటున్నాను...మళ్ళీ మర్చిపోకుండా

వద్దా... మానై...

పగెడతానే...

నా నాన్న నిన్నే కొడతాడు.

మామ్మకి ఎన్ని మాటలొచ్చేసాయో!

hello అమానాన్నా తాతగారు అల్లరి చేస్తున్నారు కర్ర పెట్టి కొట్టెయ్

ఏం చేస్తున్నావ్ అని అడిగితే ...నేను బాగా అల్లరి చేస్తున్నాను(పాపం అస్సలు అబధ్ధమాడదు)

అదేంటి...దాని ప్రశ్న...అదీ table సమాధానం...టేబులా...మళ్ళీ అన్నీ confirm చేసుంటుంది


మౌక్తికా... అక్కడ నీళ్ళొంపేసింది( అది చేసిన పాడు పన్లన్నీ ఎవరో చేసినట్టు వాళ్ళ మామ్మకి కంప్లైంట్ లు)

పిల్లకి అస్సలు స్థిరం లేదు(వాళ్ళ మామ్మని imitate చేస్తూ)

మౌక్తిక కి కావాల్ట(దానికి ఏది కావాలన్నా, అది ఎం అల్లరి పనుకు చేసినా తోసెయ్యటానికి అది పెట్టుకున్న dummy...మళ్ళీ మౌక్తిక ఎవరూ అంటే నేనూ అని గుండెలమీద చెయ్యేస్కుని మరీ చూపించేస్కుంటుంది)

బావుందీ...(ఏం పెట్టినా నచ్చినా నచ్చకపోయినా మొదటి ముద్దకి మాత్రం పొగిడేస్తుంది...రెండో ముద్దనుంచీ ఆ తినిపించే వాళ్ళ పాట్లు ఇంక అడక్కండి)

కాకి బావా...కాకి బావా పాట బాగా పడతావేం అన్నాడు...ఏనుగూ తొండం తో బొబ్బ పోసేసిందీ...అనుమానూ(హనుమాన్) రాచ్చసి ముక్కూ చెవులూ కోసేత్తాడు(అది విన్న మూడు కథలు కలిపి తన సొంత కధ ఇలా అల్లింది...పైగా దాని ఉద్దేశం లో హనుమంతుడు సూర్ఫణఖ ముక్కూ చెవులూ కోసేస్తాడు)


జలుబు చేసి తగ్గాక...మళ్ళీ ice cream తింటావా అని కోప్పడితే...strawberry తిననా...(strawberry flavor తిననా) దాని సమాధానం

మామ్మా ice cream తినకూ, దగ్గొస్తుందీ...(మామ్మకి జాగ్రత్తలు బాగా చెబుతుంది)

చద్దక్కేది(శ్రధ్ధక్క)...బబ్బుంది...బబ్బుందా...దివ్యక్కేదీ...బబ్బుంది...బబ్బుందా
(రోజూ పడుకునే ముందు ఒక అరగంట సేపు దాని బుల్లి బుర్రలో వున్న database లో అందర్నీ తల్చుకుంటుంది...దాన్ని జోకొట్టే వాళ్ళు అలా అది పడుకునే దాకా సమాధానం చెప్తూనే వుండాలి)

6/6/10

సూరీడు ఇక సెలవంటే

కనురెప్ప వెయ్యడానికి కూడా మనసొప్పని అద్భుతం...
సూరీడు ఇక ఈరోజుకి సెలవంటూ వెనుదిరిగిన ఆ క్షణం...

Memorial week end కి key west లో తీసిన కొన్ని చిత్రాలు అందరితో పంచుకోవాలని...










5/5/10

పిచ్చి తల్లి


తాళం తీసి ఇంట్లోకి వస్తుంటే ఇల్లంతా మూగబోయినట్టుగా అనిపించింది. తలుపు చప్పుడు వినగానే గజేంద్రమోక్షం లో విష్ణు మూర్తి అంత హడావిడి గా పరిగెట్టుకుంటూ వచ్చేసి నన్ను చుట్టేసి పొద్దుట్నుంచీ ఎక్కడికి వెళిపొయావ్ నన్ను వదిలేసి? అని బుంగమూతి పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు ఇంట్లో అని పదే పదే గుర్తు వచ్చి నాకు తెలియకుండానే కళ్ళు సజలాలయ్యయి. బోసిగా, నా వంటరి తనాన్ని వెక్కిరిస్తున్నట్టు గా వున్న ఇంట్లోకి వస్తుంటే మనసంతా ఎదోదిగులు...

ఎందుకు ఈ బెంగ...ఈ బాధ..ఏపని చెయ్యాలనిపించని నిస్సత్తువ...

ఏపని చెయ్యనివ్వకుండా వెనకాలే తిరిగి, విసిగిస్తూ, సద్దిన ప్రతీది పీకి పడేస్తూ విసిగించే వాళ్ళు లేరు...హాయిగా ఇల్లంతా చక్కగా మనసుకి నచ్చినట్టూ సద్దుకోవచ్చు..కానీ ఇదేమిటి నాకు కనీసం కాలికి అడ్డం గా పడి వున్న చిన్న వస్తువుకూడా పక్కకు తీసి పెట్టాలనిపించడం లేదు.

ఒక్క program కూడా సరిగ్గా చూడనివ్వకుండా, ఏదయినా చాలా interesting గా చూస్తుంటే చటుక్కున channel మర్చేసి Remote నీకు ఇవ్వను గాక ఇవ్వను అని మంకు పట్టు పట్టే వాళ్ళూ లేరు. ఎంతసేపయినా అడ్డూ ఆపూలేకుండా TV చూస్కోవచ్చు. కాని ఇదేమిటి చిత్రం గా అసలు TV పెట్టడానికి కూడా మనసు రావటం లేదు ఇవాళ.

వంట కూడా సరిగ్గా చెయ్యనివ్వకుండా కాళ్ళకి, చేతులకి అడ్డం పడిపొయే వాళ్ళెవ్వరూ లేరు. నచ్చింది హాయిగావండుకుని, పరిగెదుతూ నో, ఎక్కడ ఏమి కొంప మునుగుతోందో అన్న కంగారుతోనో కాకుండా ప్రశాంతంగా కూర్చుని, మంచి పాటలు పెట్టుకుని వింటూ మరీ భోంచేసే అంత తీరిక. కాని ఇదేమిటి నాకు ఇవాళ అసలు ఆకలే అనిపించడం లేదు.

అర్ధరాత్రి నిద్దరలేచి తన అలక తీర్చే వరకూ క్షమిచేది లేదని పేచీలు పెట్టే వాళ్ళు లేరు. కంటినిండా నెద్దరోవచ్చు. కానీచిన్న కునుకు కూడా కరుణించదేం ఈరోజు? అసలు నేను నేనేనా...ఎప్పుడు ఇలా మారిపొయాను...తల్చుకుంటుంటే ఎన్నో జ్ఞాపకాలు తెరలు తెరలు గా...

అసలు మొదటి సారి తన రూపం చూసినప్పుడే కదా నాకు ప్రేమ అన్న అనుభూతి ఎలా వుంటుందో తెలిసింది.అవును...ప్రేమ...అలాంటిది ఈ భూప్రపంచం మీద ఎక్కడా లేదని వుంటే గింటే అకర్షణ లేకపోతే అవసరం అని అడ్డంగా వాదించే నాకు ఆ స్పర్శే కదా ప్రేమ ని పరిచయం చేసింది. శ్రీవారినితొలిసారి చూసినప్పుడు కలిగింది ప్రేమో, ఆకర్షణో, భయమో, నమ్మకమో ఏది సరిగ్గా తేల్చుకోలేకపొయాను కాని తననిచూసినప్పుడు కలిగిన ఆ అవ్యక్తానుభూతి మాత్రం ప్రేమే అని మనసు బల్ల గుద్ది మరీ చెప్పేసింది. నాకు తెలియకుండానే తన మాయలో పడేసింది.

ఆ చిట్టి రూపం...బుల్లి బుల్లి పెదాలు...మూసి వున్న ఆ కళ్ళరెప్పలు....ఓహ్..Your daughter has beautiful eye lashes అని nurse చెపుతుంటే పాపని పెద్ద ఆరిందాలా ఎత్తుకుని మురిసిపోతున్న నన్ను చూసి అప్పుడే లోపలకి వచ్చిన తను, పిల్లల్ని ఎత్తుకోవటమే రాదంటావ్ అన్నారు ఆశ్చర్యం గా. అవును నిజమే...నేనసలు ఇంత చిన్న పిల్లల్నిఎత్తుకోవటం మాట దేవుడెరుగు చూడటం కూడా అదే మొదలు. కానీ ఆ క్షణం నాకు ఆ విషయమే గుర్తు రాలేదు.తొమ్మిది నెలలు పడ్డ కష్టం అంతా its worth అంటోంది నా మనసు మూసివున్న బుజ్జి గుప్పిళ్ళు చూస్తూ.

కాస్త జ్ఞానం వచ్చాక నా కన్నా చిన్న పిల్లల్ని ఎప్పుడూ ముద్దు చేసి ఎరగను నేను. వాళ్ళ ఏడుపులు, పేచీలు బాబోయ్అని ఆమడ దూరం లో వుండేదాన్ని ఎప్పుడూ...కాని తన రాకతో ఒక్క తన మీదే కాదు మొత్తం గా పిల్లలంటే నే ఇష్టంవచ్చేసేంతలా మత్తు మందు జల్లేసింది ఆ పసిది. మా అమ్మ ఎంత ఓర్పుగా నన్ను పెంచిందో కూడా నా ఓర్పు కి పరీక్షపెట్టి మరీ నేర్పింది కూడా నా చిట్టి తల్లే.

వాళ్ళ పిల్లల గొప్పల గురించి చెప్పుకుంటుంటే విని, ఎవళ్ళ పిల్లలు వాళ్ళకి గొప్ప అవతల వాళ్ళకి ఏం interest వుంటుంది, అని కూడా అలోచించరు అని పెద్ద జ్ఞాని లా నవ్వుకునే నేను, మీ పాప ఎలా వుంది అన్న ఒక్క ప్రశ్న కి అది చేసే అల్లరి,దాని ఆటలు 15 నిమిషాలకి తగ్గకుండా ఏకరువు పెట్టేస్తున్నా ఈ మధ్య , నీకులాగే అవతల వాళ్ళూ నవ్వుకుంటారే అని అంతరాత్మ ఘొషిస్తున్నా కూడా ఎక్కడా వినిపించుకోకుండా.

India కి పంపి తప్పు చేసావ్ అని మనసులో ఒక భాగం పోరు పెడుతూనే వుంది. ఇక్కడ వుంటే పొద్దున్నంతా day careలో వుంటుంది, రాత్రి వచ్చాక ఇంటి పనుల్లో దాన్ని పట్టించుకో లేవు. పైగా day care లో తొందరగా ఏదో ఒక infections వస్తాయి. India లో ఐతే అందరు చుట్టలూ, పక్కాల మధ్య స్వేచ్చ గా ఆడుకుంటుంది అని మనసులో ఇంకో భాగం సమాధాన పరుస్తోంది. అంతర్మథనం అంటే ఇదే కాబోలు.

ఎదో chocolate ఇస్తే అది తినే సంతోషం లో వెనకాల నేను కూడా వస్తున్నా అనుకుని అమ్మతో పాటు Security check లోకి వెళిపోయింది. నేను లేనని చూసాక ఎంత గొడవ చేసి వుంటుందో, ఎంత ఏడ్చి వుంటుందో. అసలు India కి వెళ్ళాక అక్కడ ఇమడ గలదా. అక్కడకి వెళ్ళాక అమ్మ కావాలని ఏడిస్తే, బెంగ పెట్టుకుంటే..మాకున్న visa చిక్కుల్లో నేనుగాని, తను గాని వెళ్ళగలమా. కంటికి చిన్న కునుకు కూడా పట్టకపొయినా, పనులన్నీ యాంత్రికం గా జరిగిపోతున్నా,మనసు మాత్రం జ్ఞాపకాల తడిలో, అలోచనల జోలపాట తో చల్లగా జోగుతోంది. ఇంకా ఆ నిద్రావస్థ నుండి బయటపడకుండానే తననుంచి Phone, నీ కూతురు India చేరిపొయిందిటోయ్. మీ అమ్మగారికి call చేసి మాట్లాడు. ఈ పాటికి ఇంటికి కూడా చేరి పోయి వుంటారు అని. అప్పుడే నా చిట్టి తల్లి అంత దూరం వెళిపొయిందా...అందరూ కొత్త వాళ్ళని చూసి, ఎంత కంగారు పడిపోతోందో...నా కోసం వెతుక్కుంటోందేమో...ఏడ్చి ఏడ్చి అందర్నీ కంగారు పెట్టేస్తోందేమో...Phone ring అవుతుంటే ఎత్తి మాట్లడే వరకూ కూడా ఆగ కుండా తొందరపెట్టేస్తూ ఒకటే అలోచనల పరంపర. అమ్మ phone ఎత్తడమే తణువు, అమ్మా బాగా ఏడ్చిందా, గొడవ చేసిందా అని నేనే అడిగేస్తున్నా, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా..ఏమీ అంత గొడవ చెయ్యలేదే, మొదటి Flight లో అంతా కొత్తగా వుండి, చెవులకి పెట్టుకోవటానికి ఇస్తారుగా ఏమిటవీ, అవి అన్నీ పీకి లాగి ఆడుకుంది. దీన్ని చూసి ఇంకో ఇద్దరు పిల్లలు కూడా దీని దగ్గరకి వచ్చి ఆడించారు, రెండో Flight లోకొచ్చేసరికి బాగా నిద్దర తీసింది. నన్ను మాత్రం కదలనివ్వలేదు, bathroom కి కూడా వెళ్ళనివ్వలేదనుకో. అదే కొంచెం ఇబ్బందిఅయ్యింది. అమ్మ ఇంకా ఏదో చెప్తోంది. కానీ నాకు అసలవేమి చెవికి ఎక్కటం లేదు. అస్సలు నా కోసం ఏడవలేదా...ఇదే అలోచన. ఇంకా ఆగ లేక, అక్కడకి వెళ్ళాక అందర్నీ చూసి ఏడ్చిందామ్మా...నన్ను వెతుక్కుంటోందా అని మళ్ళీ అడిగాను. ఏమీ లేదే, మొదట కాస్త గునిసి, అవతల వాళ్ళని observe చేసి అప్పుడు వెళ్తోంది. నీ కూతురు ఎక్కడయినా నెట్టుకొచ్చెయ్యగల రకమే, పైగా ఇక్కడ మీ ఆడపదుచు గారి పిల్లలు వున్నారు గా, వాళ్ళతో తొందరగానే కల్సిపోయింది, ఇంకా దానికి స్నానం చేయించాలి తర్వాత మత్లాడతాను అని పెట్టేసింది అమ్మ.

హమ్మయ్య పిల్ల అనుకున్నంత ఇబ్బంది పెట్టకుండా చేరిపొయింది. బెంగలూ, గింగలూ లేకుండా హాయిగా ఆడుకుంటోంది,చాలా సంతోషించాల్సిన విషయం. కాని సంతోషం స్థానం లో మళ్ళీ మనసులో దిగులు. అసలు నా గురించి బెంగే లేదుట.అప్పుడే నన్ను మర్చిపోయిందా, ఈ ప్రశ్నే పట్టి పీడిస్తోంది నా మనసుని. అదే మాట ఆయనకి call చేసి అంటే నీకు ఏమయినా పిచ్చా? చిన్న పిల్ల ఐనా అది మన పరిస్థితి అర్థం చేస్కున్నట్టుగా మనమీద బెంగ పెట్టుకోకుండా సర్దుకుపోతుంటే, నిన్ను మర్చిపోయిందని ఏడుస్తున్నవా అని నాకే నాలుగు అక్షింతలు వేసి phone పెట్టేసారు. నాకు పిచ్చికాబట్టే కదా మీకు చెప్పి, అడిగి మరీ తిట్టించుకున్నాను అని నన్ను నేను తిట్టుకుంటుంటే హఠాత్తుగా ఒక విషయం గుర్తువచ్చింది. నాకు పెళ్ళైన కొత్తలో అమ్మ నా మీద బెంగ పెట్టుకుని బాధ పడుతుంటే పోని Visa processing చేయించమటావా అమ్మా, ఇక్కడకి వచ్చి మా దగ్గర కొన్నాళ్ళు వుండి వెళ్దువు గాని, నాన్న అక్కడ ఎలాగో సర్దుకుంటారు లే అంటే, ఎప్పుడూ నా బెంగ గురించి మాట్లాదతావ్ గాని ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నువ్వు నా మీద బెంగ పెట్టుకున్నా అని చెప్పలేదు. నువ్వు బెంగ పడి వుంటే ఎన్ని పాట్లైనా పడి వచ్చేసి వుండేదాన్ని కానీ, ఇప్పుడు నేను రాను అన్నఅమ్మని చూసి, నేను బెంగ లేకుండా వున్నానని సంతోషించాలి గాని ఇలా అలుగుతుందేమిటి పిచ్చి అమ్మ అని నవ్వుకున్నాను. ఆ విషయం గుర్తు వచ్చి నా మనసులో రేగుతున్న నాకే అర్ధం కాని, ఏ లాజిక్కులకి అందని పిచ్చిప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేసింది నువ్వూ ఇప్పుడు పిచ్చి తల్లివి అయిపొయావే పిచ్చి తల్లీ అని. ఇంతలోనే అమ్మ అనే ఇంకో మాట కూడా గుర్తొచ్చింది. పిల్లల మీద ప్రేమ ఎప్పుడూ పల్లం వైపు ప్రవాహం లాంటిది అంటూవుండేది...నిజమే...అమ్మని నిన్ను అది ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని అడగలేదు, కనీసం తను చెప్తుంటే కూడా పట్టించుకోలేదు నేను....నా కూతురు పెద్దదయ్యాక, అన్నీ తెలిసాక నన్ను ప్రేమిస్తుందేమో, కానీ ఇంత పిచ్చి గా మాత్రం తన పిల్లల్ని మాత్రమే ప్రేమించగలదేమో.

3/11/10

నా తొలి చూపుల్లో అమెరికా


ఈ పోస్ట్ మొదలు పెట్టే ముందు చాలామంది ఇలా వాళ్ళ అనుభవాలు రాసేసి వుంటారు కదా అనిపించింది, కానీ ఎవరి పిల్ల వాళ్లకి ముద్దు అన్నట్టు నా అనుభవాలు నాకూ అని మొదలు పెట్టేసా.

చాలా మంది అమ్మాయిలలాగా నేను కూడా పెళ్లి చేస్కోవటం అనే కారణం చేత మాత్రమే అమెరికా కి వచ్చాను. చెప్పొచ్చేదేంటంటే నాకు అమెరికా మీద విపరీతమైన ప్రేమ గాని, కనీసం ఆకర్షణ గాని ఏమి లేవూ అనీ, కేవలం అబ్బాయి నచ్చడం చేతనే గానీ, అమెరికా లో ఉన్నాడన్న కారణం చేత మాత్రమే పెళ్లి చేస్కున్న జాబితాకి చెందననీ అన్నమాట. వచ్చిన మొదటి రోజే ఎప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతానురా బాబూ అనిపించింది చాలా మందికి లాగానే. ఇక్కడికి రావటమే తమ జీవితాశయం అనుకుని వచ్చిన వాళ్లకి కూడా అలాగే అనిపిస్తుందిట లెండి అది వేరే విషయం.

వచ్చిన కొత్తల్లో ఒకసారి restaurant కి వెళ్ళాం. అక్కడ ఎవరో ఇండియన్స్ కనపడగానే ఆహా మనవాళ్ళూ అనుకుని హి హి హి అని ఒక నవ్వు నవ్వేసా. నేనేమో మన దేశం వదిలేసి ఇంత దూరం లో వున్నాం కదా,  ఇంక మనవాళ్ళు కనపడగానే ఎప్పుడొచ్చావ్, మా ఇంటికి రండి వీలు చూస్కుని అని పలకరించేస్తారు అనుకునేదాన్ని. వాళ్ళు నన్ను ఒకసారి పైనించి కిందకి విచిత్రం గా చూసి వెళ్ళిపోయారు. ఇంకొంచెం ముందుకి వెళ్ళగానే అక్కడ ఒక అమెరికన్ నన్ను చూసి hello, how are you? అంటూ పలకరించేసాడు. వీడిని ఈ జన్మ లో చుసిన జ్ఞాపకం నాకెక్కడా రావట్లేదే. నా క్షేమ సమాచారాలన్నీ అడుగుతున్నాడు అనుకుని ఒక నవ్వు నవ్వానో లేదో తెలియకుండా ఒక expression ఇచ్చి వచ్చేసా. తర్వాత మా వారు చెప్తే తెలిసింది అలా ఎదురుపడిన వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళ కష్టం సుఖం కనుక్కోవటం వాళ్ళ సంప్రదయంట. ఇంక మనవాళ్ళ చూపుకి అర్ధం ఏమిటి అంటే ఇక్కడవాళ్ళని చూసే నవ్వలేక చస్తున్నాం ఇంకా నిన్ను చూసి కుడా నవ్వాలా తల్లీ అనిట. ఆ restaurant నుంచి బయటకు వస్తుంటే మా వారు తలుపు పట్టుకుని ఆగారు, నేను తర్వాత ఆ తలుపు వదిలేసి మామూలుగా వచ్చేస్తే నా వెనక వస్తున్నవాడు పడబోయి ఆపుకుని నానా తంటాలు పడ్డాడు. నేను పట్టుకున్నా కదా నువ్వెందుకు వదిలేసావ్ అంటారు ఆయన. నాకేం తెలుసు అది కూడా వాళ్ళ సంప్రదాయమని. తనేదో నా మీద ప్రేమతో పట్టుకున్నారని అపోహ పడ్డాను. అరిటిపండు వొలిచి పెట్టినట్టు చెప్తే కదా తెలిసేది అనే టైపు నేనైతే చూసి అల్లుకు పోవాలి అనే తత్త్వం ఆయనది. ఎం చేస్తాం. ఇలాంటి వాళ్ళ సాంప్రదాయాలు, చిలక పలకరింపులు, ఐనదానికి కాని దానికి చెప్పేసే Sorry లు Thank you లు చూసి ఆహా వీళ్ళెంత సంస్కార వంతులో, ఎంత నెమ్మదస్తులో అనుకునేదాన్ని మొదట్లో.

మధ్యాహ్నం నువ్వు ఇచ్చిన స్వీట్ తినేసి, చేసిన పని పొగిడేసి అదే రోజు సాయంత్రం అబ్బాయి ఇంక నీతో పని ఐపోయింది, రేపట్నుండి ఆఫీసు కి రానవసరం లేదు, నీ భవిష్యత్తు మూడు పువ్వులు ఆరు కాయలు గా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాఅని చల్లగా చెప్పగలిగేటంత మంచి వాళ్ళని తర్వాత్తర్వాత తెలిసింది. లేదు, కాదు, బాగాలేదు లాంటి పరుషమైన మాటల్ని కూడా గొంతులో పంచదార పోస్కున్నంత తియ్యగా నవ్వుతూ చెప్పేస్తారు. వీళ్ళకి emotions ఉండవో లేక పొతే అందరూ ఏమైనా మాస్కు లు వేస్కుని తిరుగుతారో తెలియదు మరి.

మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత లో సామాన్లన్నీ మోస్కుని మా తొలి గృహ ప్రవేశం చేసిన రోజు తెలిసింది మొదటి సారిగా dignity of labor కి అర్ధం ఏమిటో. ఆ తర్వాత చాలా సార్లే తెలిసిందనుకోండి. ఆఫీసు అయ్యాక ఇంటికి వచ్చి ఈ ఇంటి పన్లన్నీ చెయ్యలేక పోతున్నాను బాబోయ్ అంటే మీ దేశం లో లాగ ఇక్కడ బానిసలు దొరకరు అంటారు తను ( మా వారికి అసలు తను అమెరికన్ ని అనీ తప్పిపోయి ఇండియా లో వుండేవాణ్ణనీ ఒక బలమైన అభిప్రాయం లెండి). బానిసలు అని ఎందుకు అనుకోవాలి ఇంకొకళ్ళకి మనకి చేతనైనంతలో జీవనోపాధి కల్పిస్తున్నాం అనుకోవచ్చుగా అంటాను నేను. ఇక్కడ కూడా కల్పించొచ్చు అనుకోండి కాని మాలాంటి వలస జీవుల వల్ల అయ్యే పని కాదు.

ఇంక ఇండియా కి call చేసినప్పుడు, అక్కడకి వెళ్ళినప్పుడు చూడాలి వాళ్ళ కుతూహలం. అక్కడ అదెలా వుంటుంది, ఇదెలా వుంటుంది అని ఎవరి ఇంటికి వెళ్లినా చిన్న చిన్న interview లు చేసి పడేసేవారు. వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నప్పుడు అనిపించేది అబ్బో నాకూ ఇంత తెలుసా అమెరికా గురించి అని. కాని చాలా మంది మాటల్లో అనిపించింది ఏంటంటే వాళ్ళ దృష్టి లో అమెరికా అంటే ఇంకా భూతల స్వర్గమే, బంగారు లోకమే.

కాని ఇక్కడ కూడా ఆర్ధిక అసమానతలు, జాతి, మత వైషమ్యాలు వున్నాయి. 200 అంతస్తుల భవంతుల ఎదురుగుండానే అడుక్కునే వాళ్ళూ వున్నారు. పోలీసు వ్యవస్థ ఎంత బలంగా వుందో అని సంతోష పడే లోపు నేర వ్యవస్థ ఎంత బలం గా వుందోనూ కనబడుతూనే వుంటుంది. school bus ఆగగానే వెనకాల, ముందు traffic అంతా ఆగి పోయి పిల్లలకి రోడ్ మీద కల్పిస్తున్న భద్రత చూసి సంబరపడిపోయే లోపే ఇంట్లోనే వాళ్లకి వుండే అభద్రత గురించి తెలిసి మనసు చివుక్కుమంటుంది. పోనీ ఇక్కడ traffic rules ని ఎంత బాగా follow అవుతున్నారో అని మురిసిపోయే లోపే accident లు వెక్కిరిస్తూనే ఉంటాయి. అబ్బో ఎన్ని medical facilities ఉన్నాయో అనుకుందాం అంటే insurance లేందే Doctor చూడడు, ఒక వేళ చూసినా వాడి బిల్లు జీవితాంతం తీర్చినా తరగదు. insurance ఉండాలంటే ఉద్యోగం వుండాలి, పొద్దున్న లేస్తే అది వుంటుందో వూడుతుందో తెలియదు. ఆ tentions తో ఇంకొన్ని కొత్త రోగాలు... ఇవన్నీ ఉన్నాక అది స్వర్గం ఎలా అవుతుంది. నా దృష్టిలో స్వర్గం అంటే మనుషులందరికీ సమానం గా డబ్బు, సంతోషం వుండాలి. భయం అన్నది వుండకూడదు. పసిపాపలు పంజరాల్లోను, పెద్దల కనుసన్నల్లోను కాకుండా స్వేచ్చగా హాయిగా ఆడుకోగలగాలి. ఇక్కడ పెద్దవాళ్ళతో సహా అంతా పంజరాల్లోనే వున్నారనిపిస్తింది. భౌతికమైన సుఖాలు కొన్ని వున్నప్పటికీ దాన్ని మించిన మానసిక ఆందోళనా, అశాంతీ. కముకు దెబ్బల్లాగ అనమాట. అన్ని దేశాల్లాగా ఈ దేశం కూడా సుఖః దుఃఖాలు, కలిమి లేములు, మంచీ చెడుల సమ్మేళనం అంతే అనిపిస్తుంది నాకు.

ఇవన్నీయిక్కడ నా తొలి రోజుల్లో అనుభవాలు. అంటే ఇప్పుడు నీకు అంతా బాగానే అన్పిస్తోందా అంటే ఏమో మరి, బహుశా అలవాటు అయిపోయి వుంటుంది. నన్ను మొదటిసారి హైదరాబాదు లో project work కోసం అని దింపటానికి వచ్చి ఇది ఇక్కడ ఈ ఉరకలూ పరుగుల మధ్య ఎలా నెగ్గుకొస్తుందో అని మా అమ్మ కంగారు పడిపోతుంటే, అమీర్ పేట లో ప్రతీ institute కి కట్టిన banner ని వింతగా చూస్కుంటూ నడిచే ప్రతి అమ్మాయి, అబ్బాయి నీ కూతురు లా కొత్తగా వచ్చిన వాళ్ళే వదినా అన్నారు మా బాబాయ్ ఒకాయన. అదే బాబాయ్ తో ఈమధ్యే మా పిన్ని, తన కూతురు గురించి మా అమ్మ లాగే కంగారు పడిపోతుంటే నీకు లాగే, వదిన కూడా బోల్డు కంగారు పడిపోయింది స్ఫురిత ని దింపడానికి వచ్చినపుడు, ఇప్పుడు చూడు అది అమెరికా లో కుడా ఏలేస్తోంది అన్నారట. మా అమ్మ గర్వం గా నాతో చెప్పింది ఈమధ్య. అంతేనేమో ఏదైనా కొత్తలో భయం గాను, వింతగాను అనిపిస్తుంది. నిన్నటి దిన పత్రిక లాగే ప్రతీది రేపటికి పాత బడి పోతుంది. ఒక్కటి మాత్రం అనిపిస్తుంది, ఇక్కడ ఎన్నాళ్ళు వున్నా ఇండియా కి వెళ్లిపోయినపుడు,ఇక్కడికి వచ్చాక ఇండియా మీద బెంగ పడినట్టు అమెరికా మీద బెంగ పెట్టేసుకోమేమో అని. కన్నతల్లి మీద ప్రేమ , మాతృ భూమి మీద మమకారం అంటే అదేనేమో.

2/8/10

జ్ఞాపకాలు చెదిరిన తాతగారితో నా జ్ఞాపకాలు

చెయ్యెత్తు మనిషి, స్ఫురద్రూపి, శాంత మూర్తి ఇలాంటి పదాలన్నింటికి నిర్వచనం లా వుండే వారు మా తాతగారు. ఆయనకి నేను ఒక్క గానొక్క మనవరాలిని. నేను పుట్టగానే చూడటానికి వచ్చిన ఆయన నన్ను ఎత్తుకుని అసలు దింపకపోయేసరికి , అది చూసిన మా పిన్ని దీనికి ఇంక వుయ్యాల వెసే పనే లేదు, మామయ్యగారి అరదండాలే వుయ్యాల లావున్నాయి అందట.

నాకు మూడేళ్ళ వయసు దాకా నడక రాకపోతే, తన పాదాల మీద నా పాదాలు పెట్టుకుని, తను వెనక్కి నడిచి అదిగో మనవరాలు నదిచేస్తోందని సంబరపడిపోయేవారట.

మా మామ్మ సీతారామయ్య గారి మనవరాలు సినిమా చూసి, మనవరాలు అంటే "మన"వరాలుటండీ అంటే అంతే మరీ అనేవారు.

ఎప్పుడైనా మామ్మ మీకు కట్నం ఇచ్చిందా తాతగారూ అంటే మీ మామ్మే నాకు పెద్ద కట్నం, ఇంకా కట్నం కూడా ఎందుకూ అని ఆయన అంటుంటే మామ్మ మొహం లో సిగ్గుతో కలిసిన గర్వం మా చూపుదాటిపొయేది కాదు.

తాతగారు తన పదవీ విరమణ తరవాత ఆఖరు గా పని చేసిన కోరుకొండ లో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. ఆరు గదుల ఇల్లూ, వెనకాల ఇంటికన్నా పెద్ద పెరడు, పెద్ద బావి, తులసి కోట, ముద్దమందారం చెట్టూ, మామిడి చెట్టు, ఇంటిముందు పెద్ద నల్ల గేటు మీదనుంచి డాబాపైకి పాకిన రధామనోహరం చెట్టు నిండా పూల గుత్తులతో, డాబామీద విశాలమైన గది చెక్క కటకటాలు తో, బోలెడు బుల్లి బుల్లి కిటికిటీలతో చిన్ని లైబ్రరీ లా వుండేది ఎన్నో పుస్తకాలతో. ఆయన రచనా వ్యాసంగం అంతా ఆ గదిలోనే సాగేది. డాబా పైనుండి చూస్తే నరసింహ స్వామి కొండా, గుడీ స్పష్టం గా కనిపించేవి. నా జ్ఞాపకల్లో ఇప్పటికీ అది పొదరిల్లే.

తాతగారు మధ్యాహ్నం పూట intermediate పిల్లలకి సంస్కృతం పాఠాలు చెప్పేవారు. పెద్దవాళ్ళంతా సంస్కృతం మాస్టారు అని పిలిస్తే, పిల్లలకి మాత్రం మాది TV తాతగారి ఇల్లే. ఆ వీధి లో మొదట TV కొన్నది ఆయనే ట. Cricket Match వచ్చినప్పుడూ, శనివారం సాయంత్రం తెలుగు సినిమా వచ్చినప్పుడూ చూడాలి మా మధ్యగది చిన్న cinema hall ఐపోయేది.

తాతగారికి ఆ ఇల్లంటే ప్రాణం. నాన్నగారి వుద్యోగరీత్యా మేము వేరేవూరిలో వుండేవాళ్ళం. అన్ని శెలవలకీ, పండగలకీ మేమే తాతగారి వూరికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుదైనా మా వూరు వచ్చినా రెండోరోజు నుంచీ ఇంక బయల్దేరతాం అబ్బాయ్, ఇల్లెలా వుందో అని మొదలు పెట్టే వారు. ఎంత బతిమాలినా ఇంకోరోజు ఆపగలిగే వాళ్ళం, ఆపై మా వల్ల అయ్యేది కాదు.అలాంటిది పూర్తిగా మాదగ్గరకే వచ్చెయ్యండి అంటే ససేమిరా అనేవరాయన. కాలరా తిరగకపోతే వుండలేనబ్బాయ్ అనేవారు ఇరుకు అద్దిళ్ళని చూసి. పైగా తనకి వోపిక వున్నన్నాళ్ళూ తనింట్లో ఎవరిమీదా అధారపడకుండా వుండాలనేది ఆయన కోరిక.

అలాంటిది అయిదేళ్ళ క్రితం కాలు విరగడం తో మాదగ్గరికి రాక తప్పలేదు. కాలు బాగయినా గానీ మతిమరుపు బాగా పెరిగింది. ఎప్పట్నుండో ఏది కావాలో అదే గుర్తురాదు అనే అయనకి వయసురీత్యా వచ్చిన మరుపే అనుకున్నాం కానీ అది రాను రానూ బాగా పెరిగిపోయింది. కొన్నాళ్ళకి కోరుకొండలో నీటి ఎద్దడి అనీ, వైద్య సదుపాయాలు అంతగాలేవనే కరణాలచేత నాన్నగారు ఆ ఇంటిని అమ్మేసారు. తాతగారి అనుమతి తోనే అమ్మినాగాని ఆయన ఆ విషయం మర్చిపోయి రోజూ ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు వుంటాం మనింటికి వెళ్ళిపోదాం అంటూనే వుండేవారు. చూడ్డానికి వచ్చినవాళ్ళు మమ్మల్ని గుర్తు పట్టారా అంటే, నువ్వు జ్ఞాపకం లేకపొవడమేం అని గుంభనగా అనేసి వూరుకునే వారు. కొన్నాళ్ళకి అన్నం తిన్నానన్న సంగతీ, తరవాత అసలు అన్నం తినాలనీ ఒక్కొక్కటే మర్చిపోతూ వచ్చారు. మొదట తెలియక పొయినా పత్రికల్లో చదువుతుంటే ఆయన బాధ పదుతున్నది alzheimers తో అని తెలిసింది. పత్రికల్లో దీనికి కొంతవరకూ చికిత్స వుందనీ, Doctors ని సంప్రదించమనీ రాస్తున్నరు గానీ వయసు మళ్ళిన వారిని ఏ Hospital లోనూ చేర్చుకొవటానికి ముందుకు రారని మాకు స్వానుభవం తోనే తెలిసింది. తాతగారు ఆఖరు దాకా గుర్తుపట్టినది మాత్రం మామ్మాని, నాన్నగారిని. ఆఖరుకి ఇంక మరవటానికి కూడా ఇంక ఏమి లేదని సరిగ్గా పది రోజుల క్రితం ఈలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.

alzheimers గురించి చాలానే చదివినా అలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది, ఆ వ్యాధి వచ్చిన పెద్దవాళ్ళు వాళ్ళకి నచ్చని వర్తమానాన్ని మర్చిపోయి తమకి ఇష్టమైన జ్ఞాపకాలలోనే బతుకుతున్నారని. మా తాతగారు భౌతికం గా ఇరుకు Apartment లో వున్నా మానసికం గా మాత్రం తన పొదరింటిలోనే వున్నారు చివరిదాకా.

America వారి Visa నిబంధనల్లో చిక్కుకుని ఆయన్ని చివరిగా చూడనే లేకపొయాను. US సంబధం చేసుకుని వెళిపోతే మిమ్మల్ని చూడడానికి ఎలా రాగలను తాతగారూ అంటే మేమే వచ్చేస్తాం షిప్పు ఎక్కి అన్న ఆయన నవ్వు మొహమే వుండిపోతుంది నా జ్ఞాపకాలలో ఎప్పటికీ.