2/20/13

చిలక పలులకులు - 2

నా చిన్నప్పుడు నేనన్న మాటలు...చేసిన చిలిపి పనులు ఇప్పటికీ మా అమ్మ కధలు కధలు గా చెబుతూ వుంటుంది. కానీ నాకు ఇప్పుడే ఏదన్నా వెతుకుతూ వెతుకుతూ అసలేది వెతుకుతున్నానో మర్చిపోవడం, కొంతమంది పేర్లు గుర్తుకు రాకపోవడం వచ్చేసి, నా మెదడు మీద నమ్మకం తగ్గుతోంది ఈ మధ్య. నా కూతురు పెద్దదయ్యాక దాని చిలక పలుకులు దానికి గుర్తుంచుకుని చెప్పగలనో లేదో అని ఇలా రాసి దాచుకుంటున్నాను. ఆ మధ్య మరీ బుజ్జి చిలక పలుకులు రాసుకున్నా..ఇప్పుడు కాస్త తెలిసీ తెలియని చిట్టి పొట్టి మాటలు మాట్లాడే చిలకా ఇంకా దాని నేస్తాల కబుర్లు...
ఇండియా లో ఇంచుమించు రెండేళ్ళు వుండడం వల్ల మా చిట్టితల్లికి తెలుగు చక్కగా వచ్చేసింది. ఇక్కడకొచ్చి డేకేర్ కి వెళ్ళడం మొదలెట్టాక దాని మొదటి ఛాలెంజ్ తోటి పిల్లలతో వాళ్ళకర్ధమయ్యే భాషలో మాట్లాడ్డం. ఇంటికొచ్చాక ప్రతీదీ ఇంగ్లిష్ లో ఎమంటారో అడుగుతూ వుండేది కొన్నాళ్ళు. కాసిని రోజులు గడిచేసరికి సొంత ప్రయోగాలు మొదలెట్టేసింది. మా వాడు పుట్టిన కొత్తలో దాని తో ఆడుకోడానికొచ్హ్చిన పాప where is your bother? what is he doing? అని అడిగింది...మా పిల్ల తడుముకోకుండా చెప్పింది My bother is milking అని...:)

వొకరోజు ఇద్దరు స్నేహితుల కుటుంబాలని భోజనానికి పిలిచాం. పిల్లలంతా కలిసి గోల గోల గా ఆడుకుంటున్నారు. కొంచెం సేపటికి అందులో పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని తప్పించుకుని ఆడుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. మా చిన్నప్పుడు పాపం మా పిన్ని కూతుర్ని ఇలాగే అప్పుడప్పుడూ ఏడిపించే వాళ్ళం :)... మా అమ్మాయి వెళ్ళి అందులో వొక పిల్లాడి తల్లి కి కంప్లయింట్...ఆంటీ అన్న నన్ను ఆడించడం లేదని. ఆవిడ నవ్వి, వెళ్ళి చెప్పూ ఇది మా ఇల్లూ...నన్నాడించకపోతే బయటకి పంపేస్తా అని...అని చెప్పి పంపేసారు...అది పిల్లలున్న గదిలోకి వెళ్ళి గట్టిగా చెప్పింది...ఇదిగో ఇది ఆంటీ వాళ్ళ ఇల్లంట...నన్నాడించకపోతే అందర్నీ బయటకి పంపేస్తా అని చెప్పమన్నారు అని అరిచింది...ఆ పిల్లలకి ఏమీ అర్ధం కాక తెల్ల మొహాలు వేసారు గానీ...పెద్దాళ్ళంతా వొకటే నవ్వు...

మొన్న శనివారం సాయంత్రం పాత స్నేహితులొచ్చారు. వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలు. పెద్దాడికి ఏడేళ్ళూ, చిన్నాడికి రెండున్నరా. అందరూ యధావిధి గా ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇంతలో మా బుడ్డోడు నిద్రకి పడ్డాడు. తమ్ముడు పడుకుంటున్నాడమ్మా గట్టిగా అరవకండీ అని రెండు మూడు సార్లు చెప్పినా మా మాటలు చెవికెక్కించుకునే పరిస్థితుల్లో ఎక్కడా లేరు. మా అమ్మాయి ని కాస్త గట్టిగా అరిచాను గొడవ ఆపమని. చిన్నోడికి వాళ్ళ అన్నని ఏదో అనేస్తున్నా అని కంగారొచ్చేసింది. అప్పటిదాకా ఏదో మూల వొక బొమ్మ పని పడుతున్న వాడల్లా వచ్చేసి నాకేసి కోపంగా వొక చూపు చూసి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని యుధ్ధానికొచ్చినట్టు నించుని stop it. This is my brother. అన్నాడు. వాడి మొహం చూస్తే భలే ముచ్చటేసింది. ఏమంటాడో చూద్దామని. No, this is my daughter. I can shout at her అన్నా మా పిల్ల చెయ్యి పట్టుకుని. వెంఠనే మా పిల్ల రెండో చెయ్యి పట్టుకుని stop it. This is my daughter అన్నాడు అదే చూపు కఅంటిన్యూ చేస్తూ...:)

నిన్న రాత్రి అందరూ పడకకి వుపక్రమించాక నేనింకా వంటింట్లో ఏదో సద్దుతుంటే మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వొక సొరుగు లాగి ఏదో వెతికింది. ఏవిటి వెతుకుతున్నావ్ అంటే చెప్పదు. ఇదేనా అమ్మమ్మా అనుకుంటూ మిరియాల పాకెట్ పట్టికెళ్ళింది పడగ్గదిలోకి. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి అదక్కడ పడేసి ఇంకేదో వెతకడం మొదలెట్టింది. ఏవిటే అని మళ్ళీ కాస్త గొంతు పెంచి అడిగితే అమ్మమ్మ కి ఆవుండలు కావాలంట అంటుంది. ఇంతలో అమ్మ వచ్చింది. ఏవిటి తెమ్మన్నావమ్మా దాన్ని అంటే నేనేవి తెమ్మనలేదే ఆవులింతలొచ్చేస్తున్నాయ్ అన్నా అప్పట్నుండీ ఇలా అన్నీ తెచ్చేస్తోంది అన్నారు. ఆ ముక్క చెవిని పడగానే ఆ అవే ఆవలింతలు కావాలి. అని మొదలెట్టింది. మా అమ్మగారు ఈనో కలుపుకు తాగుతుంటే నాకూ ఆవలింతలు పెట్టమ్మమ్మా అని వొకటే గోల. ఆవలింతలంటే తాగేవో తినేవో కాదమ్మా అంటే వొక పట్టాన వొప్పుకోలేదు...:)

ఈ మధ్య ఇంగ్లిష్ బాగానే మాట్లాడేస్తోంది, తప్పులూ తడకలూ ఎన్ని దొర్లినా...ఇంటికొచ్చాక కూడా అదే భాషలో బాదేస్తుంటే ఎక్కడ చక్కగా వచ్చిన తెలుగు అప్పుడే మర్చిపోతుందో(కొన్నాళ్ళకెలాగూ తప్పదన్న కఠోర వాస్తవం తెలిసినా) అని భయమేసి ఇంటికొచ్చాక తెలుగు లోనే మాట్లాడాలి అని చెప్పాను. వాళ్ళ నాన్న దగ్గరకెళ్ళి అమ్మకి ఇంగ్లిష్ రాదు పాపం. నన్ను తెలుగులోనే మాట్లాడమంటోంది అని తేల్చి పారేసింది.