8/30/11

బరువైన కష్టాలు...


హెడ్డింగు చూసేసరికే తెల్సిపోతుందిలెండి దేనిగురించి రాస్తున్నానో...ఇలాంటివి ఇంతకముందు తోటి బ్లాగర్లు రాస్తే చదివి పళ్ళికిలించినవాళ్ళల్లో నేనూ ఒకర్తిని...నేనూ అవి రాసే రోజు వచ్చేసింది...:(
ఎప్పుడో పూర్వకాలం లో తప్ప ఈ మధ్య కాలంలో ఎప్పుడూ మెరుపుతీగలా లేకపోయినా ఫరవాలేదు అంత లావేం కాదు లానే వుంటానని నా ప్రగాఢమైన వుద్దేశం...నా కంటికైతే అలానే అనిపిస్తాను మరి...మనలో మన మాట కాస్త eye site వుంది లెండి ఆ కంటికి...
కొత్త project లోకి వచ్చాక...ఇక్కడ నా colleague తమిళ తంబి...after you came here you have put on weight అన్నాడు ఆ మధ్య...వీడికి నేనంటే కుళ్ళు...అన్నింట్లో నాతో పోటీ కావాలని ఏడిపిద్దామనే అంటున్నాడు అని తేలిగ్గా తీస్కున్నా...రెండు రోజులకే నాతో పోటీలూ...పోలికలూ పెట్టుకునే పనిలేని ఇంకో colleague కూడా అనేశాడు అదే మాట...అప్పుడు కాస్త గుండె ఖలుక్కు మంది.
ఇంక కొత్తగా మా ఇంట్లో చేరిన అమ్మాయి ఐతే ..ఆ పిల్ల రివటలా సన్నంగా పొడుగ్గా వుండి ఇంకా తెగ బాధ పడిపోతోంది నేను లావుగా వున్నా అని...పాపం వోదారుద్దామని నువ్వేమంత లావు వున్నావు చక్కగా సన్నంగా (పుల్లలా) వుంటేనూ అంటే...నీతో పోల్చుకుంటే సన్నమే లే అనేసింది...అలా అన్నందుకు ఏమీ ఫీలు కూడా అవ్వలేదు పై పెచ్చు...అప్పుడు కాస్సేపు హతవిధీ...ఎంతటి పరాభవం....నేను ఆ పిల్ల వున్న ఇంట్లోనే ఎందుకు వుండవలె...వుంటిని ఫో...నా గోల చూసుకోక ఆ పిల్లని వోదార్చాలని ఎందుకనుకోవలే...అని కాస్సేపు వగచి...రోదించి...తర్వాత అలోచించా...ఏవిటి నా తక్షణ కర్తవ్యం అని...
ఎన్నాళ్ళు(ఎన్నేళ్ళు) గానో వాయిదా వేస్తూ వచ్చిన gym మరియు diet plan అమల్లోకి తీసుకురావలసిందే అని గాఠ్ఠి నిర్ణయానికి వచ్చా...
పొద్దున్న పూట regular break fast కార్న్ ఫ్లేక్స్ లేకపోతే  multy grain bread...లంచ్ కి cracked wheat(ఎర్ర గోధుమ) రెండు చెంచాలు మాత్రమే నూనె  బోలెడన్నీ కూరగాయలు వేసి చేస్కున్న వుప్మా(లాంటిది)...సాయంత్రం ఆఫీసునుంచి వచ్చాక కాస్త ఫల హారం(ఫల హారం పేరు పెట్టి snacks లాగించటం కాదు. అచ్చంగా ఫలాలే) తర్వాత ఒక అరగంట జిమ్ము. మొదట్లో పావుగంటకే నీరసం...అయాసం అవేశం అన్నీ వచ్చేసేవి కానీ ఈమధ్య ఫరవాలేదు కాస్త...రాత్రికి వోటు మీలు...ఈ వోటు మీలు దగ్గరే చిక్కంతా...ఒక రెండేళ్ళ క్రితం ఇలాగే ఆవేశం వచ్చి ఒక నెల పాటు వదలకుండా వోట్లే భోంచేసి అవంటే రోత పుట్టి వదిలేశాను...మళ్ళీ ఎప్పుడు తిందామన్నా వాంతి వచ్చినంత పనయ్యేది. మొదటి రోజు మహా sincere గా వోటుమీల్ లో మజ్జిగ మాత్రం పోసుకుని తిన్నానా...కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ. మర్నాడు కాస్త ప్రియా పచ్చడి జోడించే సరికి ఆహా భూ ప్రపంచం మీద మహా రుచికరమైన వస్తువుల్లో ఒకటనిపించిందంటే నమ్మండి. ఆ తర్వాత కాస్త కూర ముక్కలు...ఒక రోజు కాసింత పచ్చడి, ఇన్ని కూర ముక్కలూ ఇలా రకరకాల combination లతో బాగానే నెట్టుకు రాగలుగుతున్నా...వోటు మీలు ప్రయత్నిద్దామనుకునే వాళ్ళకి ఇదే నా వుచిత సలహా మొదటి రోజు వుట్టి మజ్జిగతోనే తినండి...రెండో రోజు నుంచి ఇలాంటి ప్రయోగాలు మొదలెడితే అదే వోటుమీలు దివ్యంగా అనిపించక మానదు..నా diet plan ఇంత సవివరం గా ఎందుకు రాస్తున్నా అంటే నాలాంటి ఔత్సాహికులు చూసి follow అవ్వొచ్చుకదా పాపం అని...దీనిమీద ఎటువంటి copy right నిబంధనా లేదొహో ఎవ్వరైనా వాడుకోవచ్చని బ్లాగ్ముఖంగా తెలియజేస్తున్నా...

ఈ time table ఒక రెండు వారాలు చిన్న చిన్న అవరోధాలతో బాగానే నెట్టుకొచ్చేసాను...కానీ అప్పుడే మొదలైంది కహానీ మె twist...నా తిండి, నా దీక్ష చూసి నన్ను ఏడిపించడం లో ఎటువంటి మినహాయింపు ఇవ్వని మా వారూ, నన్ను అంతగా అవమానించిన నా roomie తో సహా అందరూ తెగ బాధ పడిపోవటం మొదలెట్టారు. అయ్యో పాపం ఏమీ తినదు...రోజూ అదే ఎలా తింటావ్. అస్సలు అన్నమే తినవా అని ఒకటే అంగలార్చెయ్యటం. వాళ్ళ స్నేహితులెవరైనా ఇంటికొస్తే ఒక విచిత్రాన్ని పరిచయం చేసినట్టు "ఏ లడ్కీ కుచ్ భీ నహీ ఖాతీ...పతా నై rice ఖాయే బినా కైసే జీతీ హై" అని వాళ్ళకి చెప్పడం...వాళ్ళంతా ఇంత కళ్ళు చేస్కుని museum లో బొమ్మని చూసినట్టు చూడటం.  పైగా ఆఫీసు నుంచి నేను వచ్చేసరికే ఘుమ ఘుమా వాసనలు వెదజల్లుతూ రోజుకొక కొత్త వంటకం వండుకోవటం. రా కొంచెం తిను కొంచెం తింటే ఏమీ అవ్వదులే అని ఏడిపించటం..మొదట్లో నా రూములోకి వెళ్ళి తలుపేసుకుని control...control అని తపస్సు చేసేదాన్ని కానీ ఈ మధ్య ఫర్వాలేదు వాళ్ళు ఓ పక్క వంట చేస్తుంటే కూడా నేను అవి చూసి...చీ అంత నూనె పోసుకుని ఎలా తింటారో అనుకుంటూ హాయిగా నా వోట్లు తినగలుగుతున్నా...నాకిప్పుడివే రుచి గా అనిపిస్తున్నాయి. తినగ తినగ వేము తియ్యన...సాధనమున పనులు సమకూరు ధరలోన...ఇలాంటి సూక్తులన్నీ వూరికే రాసారా మహానుభావులు...

ఇంతకీ ఈ సుత్తి అంతా ఇక్కడ రాయటానికొక బలమైన (బరువైన కాదు...మీ కళ్ళకలాగే కనిపిస్తుంది నాకు తెలుసు) కారణం వుంది...సిగరెట్టు మానేసేటప్పుడు పదిమందికి చెప్పి మానెయ్యలట...మళ్ళీ కాలిస్తే వాళ్ళు చూసి అడిగితే ఏం చెప్తాం అన్న భయం వల్లైనా మానేస్తారని...అలాగే నా దీక్షా, పట్టుదలా చూసి వోర్వలేక నన్ను నిరుత్సాహ పరిచే వాళ్ళ మాయలో పడకుండా...ముఖ్యం గా కొత్తావకాయ లాంటి వాళ్ళ బ్లాగుల్లో రాసే ఇలాంటి టపాలు చదివేసి నా దీక్ష మధ్యలో విరమించకుండా మీరంతా కూసింత support ఇస్తారనీ...హన్నా అదే మరీ... మీరు అలా అయ్యో అన్నమే తినవా లాంటి డవిలాగులు వేస్తే అస్సలు బాగోదు ముందే చెప్తున్నా

8/18/11

అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకూ...


పొద్దుట్నుంచీ ఆకాశమంతా మబ్బుపట్టి కొంచెం dull గా వుంది. సాయంత్రం ఆరింటికే కాస్త చీకటి గా అనిపిస్తోంది. ఆఫీసు నుంచి వచ్చి కాఫీ పెట్టుకున్నాక ఆ వాతావరణానికి ఏదైనా పాట వింటే కాఫీ ఇంకా బావుంటుంది కదా అనే అలోచనొచ్చింది...wake up sid లో పాట వినాలనిపించింది...ఈమధ్యే ఆ పాట ఎక్కడో వినటంతో మనసులో గింగిరాలు తిరుగుతోంది....వేడి వేడి కాఫీ గుటకలేస్తూ బయటకి చూస్తుంటే ఏదో తెలియని depression...ఆ వాన చూస్తుంటే అమ్మో ఇంక fall ఆ తర్వాత winter...నాకు US వచ్చినదగ్గర్నుంచీ చలికాలం అంటే చెడ్డ చిరాకు...నాలుగవకుండానే కమ్ముకొచ్చేసే చీకటి...ఎప్పుడో కాని దర్శనం ఇవ్వని సూరీడు...ఎముకలు కొరికేసే చలి...మోడు వారిపోయి పాత సినిమాల్లో భగ్న ప్రేమకి చిహ్నాల్లా నించునే చెట్లు అవన్నీ తల్చుకుంటూ...ఆ వాతావరణం నా కళ్ళముందిప్పుడే వాలిపోయిందన్నట్టు దిగులు పడిపోతూ కళ్ళు మూసుకున్నాను...చెవిలోకి పాట సన్నగా దూరుతోంది నా అలోచనలన్నీ చెదరగొడుతూ...

ఎదురుగా పాల మీగడ లాంటి తెల్ల చుడీదార్ వేస్కుని...ఆ వాన లో ఆనందంగా ఎగురుతూ గంతులేస్తూ...తడుస్తున్న ఆకుల్నుంచీ పువ్వుల్లనుంచీ నీటి ముత్యాలేరుకుంటూ...సంతోషంలో తడిసి ముద్దైపోతూ...ఎవరా అమ్మాయి అని కళ్ళు చిట్లించి చూస్తే నా మొహం లానే వుంది...

అమ్మో వానలో తడిస్తే ఇంకేమైనా వుందా...తుమ్ములూ...జలుబు..దగ్గు..జ్వరం...రేపు office కి ఎలా వెళ్తావ్ అని వూహల్లో విహరిస్తున్న మనసుని..మెదడు చెవి మెలేసి లాక్కొచ్చేసింది...computer లో పాట ఆగిపోయింది...కళ్ళు తెరిచే సరికి నా roomie విసుగ్గా మొహం పెట్టి చూస్తోంది..ఎంత సేపు నుంచుటావ్ అక్కడే...stove మీద నీ గిన్ని పక్కకి పెడితే నా వంట చేకుంటా అన్న మాటలన్నీ మొహంలోకే ప్రతిఫలింపచేస్తూ...

అప్పటిదాక వున్న విసుగునుంచి ఏదో తెలియని relief...నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచా...
ఇంతకీ నే విన్న పాట ఏదో చెప్పలేదు కదూ...


नेणा करू बंद बंद....बहजाये बूँद बूँद
तड्पायेरे... क्यो सुनाए गीत मल्हार दे .......


ఏ పాటో చెప్పుకోండి


8/12/11

కష్టానికి కొలతేది??మా వాడికి ఒక్క సంబధమూ కుదరొట్లేదేవిటో...నా బెంగంతా వాడి పెళ్ళి గురించే వొదినా అని ఇరుగింటావిడ అంటే....హ్మ్ మా వాడికి పెళ్ళయినదగ్గర్నుంచీ కోడలి కొంగట్టుకు తిరుగుతూ...మా వూసే పట్టించుకోటం మానేసాడు నా బాధెవడితో చెప్పుకోవాలి అంటుంది పొరుగింటావిడ.
నాకు వుద్యోగం ఎప్పుడొస్తుందోరా మీరంతా హాయిగా సంపాదించుకుంటున్నారు..నేనిలా గాలికి తిరుగుతున్నా అని ఒక స్నేహితుడంటే....ఏమి వుద్యోగమోరా చచ్చేంత పని...ఈ వెట్టి చాకిరీ చెయ్యటం కంటే రాజీనామా చేసి సన్యాసుల్లో కలవటం మంచిదనిపిస్తోంది రా అంటాడు రెండోవాడు
మా పిల్లదానికి చదువబ్బట్లేదని ఒకాయనంటే...మా పిల్లకి చదువెక్కువై మమ్మల్ని వదిలేసి ఎగిరి చక్కా పోయింది...ఒక పలకరింపుకి కూడా ఖాళీ లేదంటుంది అని వాపోతాడు రెండో ఆయన...
నీకేవిరా America చెక్కేసావ్...ఇక్కడ ఈ దుమ్మూ ధూళి లో కొట్టుకుంటున్నాం అని సహోద్యోగి అసూయతో కలిపి తన బాధ వెళ్ళగక్కితే...నీకేం తెల్సురా ఇక్కడ పొద్దున్నలేచి అన్ని పన్లూ నేనే చేస్కునే సరికి చుక్కలు కనపడుతున్నాయి అని విదేశీ భారతీయుడు తన విసుగుని వివరిస్తాడు..
మా ఆయనకి ఏవీ నచ్చవ్...అన్నీ వంకలే...అన్నీ గొడవలే అని అప్పుడే వంటింట్లో బుడి బుడి అడుగులేస్తున్న ఇల్లాలు అంటే...మా ఆయన ఎలా వండినా తినేస్తాడు...చిన్న గొడవ పడదామన్నా దేనికీ ఏమీ అనరు...అదెంత చిరాకో నీకెం తెలుసు అంటుంది ఇంకో పిల్ల...
ఇస్త్రీ నలగని పాంటూ చొక్కా వేసుకుని ఆటో లో కూచున్న soft wear బాబు ని చూసి ఈన పని బావుంది కడుపులో చల్ల కదలకుండా పొద్దస్తమానం AC గదుల్లో కూచుంటాడు అని ఆటో డ్రైవరు అనుకుంటే...పొద్దున్న లేస్తే అన్నీ tension లే వీడి పని బావుంది...తన పని కి తనే రాజా...సంపాదన చూస్తే వీడిదే ఎక్కువలా వుంది అనుకుంటాడు...పైకి దర్జా వొలకబోస్తున్న దొరబాబు...
తిండికి లేక వొకడేడుస్తూ వుంటే...పెట్టెల్నిండా డబ్బులు వంటినిండా రోగాలతో ఏవి తింటే ఏవొస్తుందో అని భయపడుతూ ఏడుస్తూ వుంటాడు ఇంకోడు...

మొత్తానికి ప్రతీ వాడికీ తన కష్టం మాత్రం పాము లాగా...ఎదుటి వాడి కష్టం మాత్రం తాడులాగా...చీపురు పుల్లలాగా కనిపిస్తుంది...

మా అమ్మ కాలునొప్పో తల నొప్పో అంటే ...నాన్నగారు వెంఠనే నాకూ నిన్నట్నుంచీ కాలు నెప్పి...నీలా చెప్పలేదంతే అనేసే వారు తడుముకోకుండా...ఎందుకో ఎవరనా తమ కష్టం చెప్పగానే ఠక్కున మనకి ఇంకా పెద్ద కష్టం వుందని చెప్పెయ్యాలనిపిస్తుంది. కష్టం కూడా ఒక రకమైన prestige issue లాంటిదేమో అనిపిస్తూ వుంటుంది. నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలేడు తీర్చలేడు...కనీసం మన్స్ఫూర్తిగా బాధపడలేడు కూడా...ఐనా సరే మన కష్టం పక్కవాడితో చెప్పగానే వాడు తనకున్న ఇంకా పెద్దకష్టం(తన వుద్దేశం లో) మనకి చెప్తాడు కాబట్టి..చెప్పావ్ లే బడాయి అని పైకి అనుకున్నా లోపల్లోపల అంతర్లీనం గా మన మనసు కాస్త తృప్తి పడుతుందేమో మనకే కాదు కష్టాలున్నవి అని...బాధ పంచుకుంటే గుండె తేలిక పడటం వెనక వున్న philosophy ఇదేనేమో( ఈ అవిడియా రాసే ముందు బుర్రలో లేదు...రాస్తుంటే తట్టేసింది...:D )

ఏవయినా కానీ మనుషుల్ని దగ్గర చేసే శక్తి కష్టానికే ఎక్కువ వుంది...సంతోషం గెలుపూ మనిషిని గాల్లో తేలిపోయేలా చేస్తే,  ఓటమీ, కష్టం ఆ మనిషిని నీ మూలాలు ఇక్కడున్నాయి బాబూ అని గుర్తుచేసి నేలమీదకి లాక్కొస్తాయి. గెలుపు అహం భావాన్ని పెంచితే వోటమి ఆత్మ పరిశీలనకి అవకాశాన్నిస్తుంది. సంతోషం చుట్టం చూపుగా పలకరించి పోతే...కష్టం మాత్రం జీవన సహచరి లా అన్ని వేళలా వెన్నంటి నిలుస్తుంది..

ఒక సమస్య తీరితే రెండో సమస్య కి promotion దొరుకుతుందిట ఎక్కడో చదివాను...కష్టం బాధా లేకపోతే నిన్ను తలవను...ఎల్లవేళలా కష్టాలు వుండేటట్టు చూడు స్వామీ అని గొంతెమ్మ కోరిక కోరిందట కుంతీదేవి...నిజవే కష్టమన్నదే లేకపోతే మనిషిలో ఈ మాత్రం మానవత్వం...మంచితనం కూడా దొరకవు...సుఖానికి విలువా మిగలదు. కష్టానికి కొలతలూ తూనికలూ లేకపోయినా సంతోషానికి విలువ కట్టేది మాత్రం దానితోనే...

మనిషి పుట్టుకా, చావూ వేదనా భరితమే....ఆ రెంటి మధ్య ప్రయాణం భవ సాగరమే...ఆ కష్టాన్నే మన తోడుగా అనుకుని బతకటం నేర్చేసుకుంటే కష్టం ఇంక కష్టమనిపించదేమో...

8/3/11

మూసుకుంటున్న మనసు తలుపులు


నా చిన్నప్పుడు మూడు బుల్లి బుల్లి వరుస గదుల వాటాలో అద్దికుండేవాళ్ళం. ఇంటికి ఎవరైనా వస్తే అందరూ అదే హాల్లో పడుకునేవాళ్ళం. చుట్టాలొచ్చారన్న ఆనందంతో వుక్కిరిబిక్కిరైపోతూ ఇరుక్కుని పడుకున్నా....హాయిగా నిద్దరపట్టేది. వాళ్ళు రోజూ నేను పడుకునే ఫాను కింద చోటు కొట్టేసారు లాంటి అలోచనే దరిచేరేది కాదు.

వేసవి సెలవల్లో 20 కి తగ్గని జనాభా, చిన్న డాబా మీద వరస్సగా పక్కలేసుకుని ఒక చిట్టి table fan పెట్టుకుని, అది నాకేసి ఎప్పుడు తిరుగుతుందా అని ఎదురు చూస్తూ...ఆకాశంలో చుక్కల్లెక్కపెడుతూ...బోలెడు కబుర్లు, వేళాకోళాలు, నీకాలు నా మీద పడిందంటే నువ్వు చెయ్యి అటు పక్కన పెట్టుకో అని యుధ్ధాలు, మధ్యలో దోవల్తో కుస్తీలు పడుతూ పడుకున్నా కంటినిండా నిద్దరోయేవాళ్ళం.

చదువుకునే రోజుల్లో మూడు మంచాలు పట్టాక, ఆ మంచాల చుట్టూ ఒక మనిషి ఒక అడుగు మాత్రం పట్టే  ఖాళీ వున్న బుజ్జి hostel గది లో  భవిష్యత్తు గురించి కలిసి కలలు కంటూ...రేపటిరోజుకోసం ఎవేవో ప్రణాళికలు వేసేస్తూ తెలియకుండానే నిద్దర్లోకి జారుకున్న ఆ రోజుల్లో ఆ ఇరుకు గది మా నిద్దరకి ఏనాడూ అడ్డు రాలేదు.

కానీ ఇప్పుడు... మనిషికో గది, వాటికి తలుపులూ, గొళ్ళాలు, తాళాలు...ఎప్పుడూ చల్లగా AC లు...మెత్తటి పరుపులూ...గదినిండుగా కష్టపడి కొనితెచ్చుకున్న కావలసినంత వొంటరితనం...ఇన్నివున్నా రోజు రోజుకి ఇరుకైపోతున్న మనస్సుతో వూపిరాడక నిద్రాదేవి కరుణా కటాక్షాలకోసం ప్రతి రాత్రీ ఒక తపస్సే...

ఈ మధ్య ఒక స్నేహితురాలు ఏడేళ్ళ తన అక్క కూతురు వాళ్ళమ్మని "Mom don't come into my room with out asking me...I need my privacy" అంటే...ఆవిడ విస్తుబోయి తర్వాత చిన్నబోయి బయటకి నడిచిందని చెబుతుంటే అనిపించింది...మనం ఎక్కడనుంచో అరువుతెచ్చుకుని అలవాటుపడలేక ఆపస్సోపాలు పడుతున్న "Privacy" పాఠాలు తర్వాత తరం వాళ్ళకి మన ప్రమేయం లేకుండానే మన jeans లో కలిపి రంగరించి పంచేస్తున్నామా....వాళ్ళ మనసు తలుపులు ఆఖరికి మనకోసం కూడా తెరుచుకోకుండా మూసుకుపోతున్నాయా అని...