Showing posts with label నాకూ మనసుకీ మధ్య. Show all posts
Showing posts with label నాకూ మనసుకీ మధ్య. Show all posts

9/12/11

గుప్పెడంత ప్రపంచం



స్కూల్లో చదివే రోజుల్లో హెడ్ మాస్టారితో మొదలుకుని...నాకన్నా పైన, కింద తరగతి విద్యార్ధుల వరకూ తెలుగు మాస్టారి అమ్మాయి అని పిలుస్తుంటే తెగ వుడుక్కునే దాన్ని...నాకు పేరు వుంది గా అని..బురద రోడ్డు మీద జారి పడ్డప్పుడో...మొయ్యలేక మొయ్యలేక ఏ కూరల సంచో మోసుకొస్తున్నప్పుడో అయ్యో నువ్వు మాట్టారి గారి పాపవి కదమ్మా అంటూ చూసి ఎవరైనా వచ్చి సాయం చేసినప్పుడు అడగకుండా అప్పనంగా వచ్చిన ఆ దన్ను గొప్పతనం అప్పుడర్ధం అయ్యేది కాదు..

అమ్మమ్మ వూరికి వెళ్ళినప్పుడు...వుయ్యాలా తాతగారి అమ్మాయీ మనవరాలూనూ...అని దార్లో నే మొదలయ్యే పలకరింపులూ......మామ్మ గారింటికి వెళ్ళేటప్పుడు  మీ  అబ్బాయిగారూ వాళ్ళూ వస్తున్నారండోయ్ అని మాకంటే ముందుగానే ఇల్లు చేరిపోయే కబురులు...ఇవన్నీ చూసినప్పుడు కాస్త గర్వం గానే అనిపించినా ఏమీ కష్టపడకుండా వచ్చేసిన ఆ గుర్తింపు విలువ మాత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదు

జీవితపు నిచ్చెన పైకి ఒక్కో మెట్టూ ఎక్కుతూ......ఇంటి నంబర్లు తప్ప ఫలానా వాళ్ళ ఇల్లు అంటే ఎగా దిగా చూసే metropolitan city లకి తరలి పోతున్న కొద్దీ, ఆప్యాంగా పలకరించే పక్కింటి అత్తయ్య గారూ....ఆపదలో మేమున్నామంటూ తొంగిచూసే ఎదురింటి పిన్ని గారూ.... కష్టం సుఖం విని పెట్టే వెనకింటి వదిన గారూ కనుమరుగైపోతుంటే కొంచెం కొంచెం గా తెలిసొచ్చింది రక్త సంబధాలతో పని లేని ఆ బంధాల విలువ. నాన్నగారు వూరెళితే రాత్రికి సాయం పడుకునే పక్కింటి పెద్దమ్మలూ...అమ్మకి పని పడితే చక్కగా జడలు వేసి స్కూలుకి పంపే పిన్నమ్మలు...ఈ హడావిడి ప్రపంచలో వాళ్ళ వాళ్ళ పనుల్లో పడి పరిగెడుతూ జ్ఞాపకాల్లోనే ఆగిపోయారు...ఆఫీసు నుంచి రావటం కాస్త ఆలస్యం ఐతే పిల్లని చూసుకునే పొరుగింటి అమ్మమ్మలూ...వొంట్లో నలత గా వుంటే కాస్త కూరో నారో వండిచ్చే ఇరుగింటి మామ్మలూ కనిపించక నేటి "ఆధునిక స్త్రీ" ఆఫీసు తలనొప్పులకి తోడుగా కొండంత insecurity ని మనసులో మోసుకుంటూ పైకి గుంభనగా తిరిగేస్తూ ముఫ్ఫై యేళ్ళకే అరవయ్యేళ్ళకి సరిపడా రోగాలన్నీ కొనితెచ్చేసుకుంటోంది.....

ఎక్కడెక్కడి friends నో ఈ social networking పుణ్యమా అని భలేగా కలుస్తున్నాం కదా అంటే.....ఎప్పటివాళ్ళనో కలవటం బానే వుంది గాని నీ పక్కింట్లో వున్న వాళ్ళెవరో నీకు తెలుసా అన్నాడు నా cousin. నిజవే మరి...ఏడాదిన్నర గా అదే ఇంట్లో వుండి నా చుట్టూ వున్న ఇళ్ళల్లో వున్న వాళ్ళ మొహాలు కూడా తెలియని పరిస్థితి..ఇది నా ఒక్క దానిదే కాదు దాదాపు నా generation లో చాలా మందిది. మునుపటి రోజుల్లో వూళ్ళు చదువులు...ఇళ్ళూ ఎన్ని మారినా ఎక్కడికక్కడ కొత్త ప్రపంచం ఏర్పరుచుకో గలిగే వాళ్ళం కాబట్టి పాత స్నేహితులని కొన్నాళ్ళు గుర్తొచ్చి బెంగపడినా నెమ్మదిగా మర్చిపోగలిగేవాళ్ళం ...మరి ఇప్పుడూ ఇంటి చుట్టూ వున్న మొహాల ఆనవాలు తెలియవు...ఆఫీసుకి వెళితే శత్రు సైన్యం తో కలిసి కూచుని చదరంగం ఆడటమే...ఎవరి నవ్వు ముఖం వెనక ఏ ఆపద దాగివుందో తెలుసుకోవటం బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు. పాత స్నేహితులని వెతికి వెతికి పట్టుకుని వాళ్ళతోనే ముచ్చట్లాడుకోవటం వెనక...social networking సైట్లు దిన దిన ప్రవర్ధమానంగా వెలిగిపోవటం వెనక వున్న కారణం పక్కనే వున్న వాడితో సర్దుకుపోలేకపోవటం...రేపు ఏదైనా గొడవొస్తే ఎల్లుండి వాడి మొహమెలా చూడటం అని ఇవాళ ఆ మొహమెలా వుంటుందో తెలుసుకోకపొవటమే మంచిదని వూరుకోవటం. కప్పు పాలు...రెండు స్పూన్ల పంచదార అప్పడగటానికి, శ్రావణ మంగళవారం నోముకి ముత్తైదువులకీ కూడా Networking సైట్లనే పట్టుకుని వేళ్ళాడుతున్నామంటే ...మనకి కరువైన ఇరుగుపొరుగు ప్రపంచం మనల్ని చూసి వెక్కిరించినట్టనిపిస్తుంది...

తాతగారిని మా ఇంట్లో ఇంకో నాలుగు రోజులు వుండమని బ్రతిమాలుతుంటే ఇల్లు ఏమైపోతోందో అని మూడో రోజునుండి నసగడం మొదలెట్టి నాలుగో రోజుకల్లా కట్టిన తిరుగు ప్రయాణాలు..అమ్మమ్మా వాళ్ళని మావయ్య తనుండే చోటుకి తీసుకెళితే అక్కడ వూపిరాడటం లేదని నెలలోనే సొంత గూటివైపు తీసిన పరుగులు...అమ్మని America తీసుకొస్తే...రోజూ నాన్నతో మాట్లాడుతున్నా ఆయన నేను బ్రహ్మాండంగా వున్నానని చెబుతున్నా కాని కిటికీ దగ్గరే నిలబడి బయటకి చూసే తన దిగులు చూపులూ...వైద్య సదుపాయం పేరు చెప్పి పట్టణవాసం లో ఎంతగా ఇమిడిపోయారనుకున్నా...మా వూరికి వెళ్ళాగానే కళకళ్ళాడిపోయే  అత్తగారి మొహం... వీటన్నింటి వెనక తరచి చూస్తే కనబడే మనసుకి నచ్చని నిజం ..... వురకలూ పరుగుల ప్రవాహం లో కొట్టుకుపోతున్న తమ  పిల్లల కాన్నా ఎక్కువగా వాళ్ళంతా "miss" అయ్యింది...అవుతున్నదీ.... ఇవ్వాళేం వండారూ అంటూ చనువుగా తలుపు తోసుకొచ్చే పొరుగింటి పుల్లమ్మలనీ...ఈనాడులో ఏమి రాసాడో చూసారా అని తనతో మాట కలిపే ఎదురింటి సుబ్బారావుల్నీ...తాము సంపాదించి పెట్టుకున్న తమ గుర్తింపుని...పోగుచేసి దాచుకున్న పరిచాయాల పొదరిళ్ళని....నాకేంటంట లాంటి ఆలోచనలెరగని ఆ అనుబంధాలని...

పనసపొట్టు కూర నుంచి పన్నీర్ బట్టర్ మసాలా వరకూ...internet లో వెతికేసుకుని చేసేసుకో గలుగుతున్నాం, గోడ మీదనుంచి కేకేసి వొదినగారిని ఈ కూరలో ఆవ పెడతారా అని అడిగే పనిలేకుండా...వార్తల మీదా...సినిమాల మీద... నచ్చని బాసు మీదా నెట్ లోనే వాదనలూ చర్చలూ చేసేసుకో గలుగుతున్నాం, అరుగుమీద అప్పారావులతో అవసరం పడకుండా...పక్కవాడి జీవితంలో వేళ్ళూ కాళ్ళూ పెట్టకుండా వుండటమే మా గొప్పతనం అని జబ్బలు చరుచుకున్నా...net connection తో పాటే స్ఠంబించిపోయే జీవన సరళి ఎంత ప్రమాదకరమో కూడా అలోచించడం అవసరం....ప్రపంచం కుగ్రామమైపోయింది కానీ...అంతా ఒకే కుటుంబం లా వుండే కుగ్రామాల చిరునామాలు మాత్రం ప్రపంచీకరణలో పడి కొట్టుకుపోతున్నాయి...మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే...

8/18/11

అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకూ...






పొద్దుట్నుంచీ ఆకాశమంతా మబ్బుపట్టి కొంచెం dull గా వుంది. సాయంత్రం ఆరింటికే కాస్త చీకటి గా అనిపిస్తోంది. ఆఫీసు నుంచి వచ్చి కాఫీ పెట్టుకున్నాక ఆ వాతావరణానికి ఏదైనా పాట వింటే కాఫీ ఇంకా బావుంటుంది కదా అనే అలోచనొచ్చింది...wake up sid లో పాట వినాలనిపించింది...ఈమధ్యే ఆ పాట ఎక్కడో వినటంతో మనసులో గింగిరాలు తిరుగుతోంది....వేడి వేడి కాఫీ గుటకలేస్తూ బయటకి చూస్తుంటే ఏదో తెలియని depression...ఆ వాన చూస్తుంటే అమ్మో ఇంక fall ఆ తర్వాత winter...నాకు US వచ్చినదగ్గర్నుంచీ చలికాలం అంటే చెడ్డ చిరాకు...నాలుగవకుండానే కమ్ముకొచ్చేసే చీకటి...ఎప్పుడో కాని దర్శనం ఇవ్వని సూరీడు...ఎముకలు కొరికేసే చలి...మోడు వారిపోయి పాత సినిమాల్లో భగ్న ప్రేమకి చిహ్నాల్లా నించునే చెట్లు అవన్నీ తల్చుకుంటూ...ఆ వాతావరణం నా కళ్ళముందిప్పుడే వాలిపోయిందన్నట్టు దిగులు పడిపోతూ కళ్ళు మూసుకున్నాను...చెవిలోకి పాట సన్నగా దూరుతోంది నా అలోచనలన్నీ చెదరగొడుతూ...

ఎదురుగా పాల మీగడ లాంటి తెల్ల చుడీదార్ వేస్కుని...ఆ వాన లో ఆనందంగా ఎగురుతూ గంతులేస్తూ...తడుస్తున్న ఆకుల్నుంచీ పువ్వుల్లనుంచీ నీటి ముత్యాలేరుకుంటూ...సంతోషంలో తడిసి ముద్దైపోతూ...ఎవరా అమ్మాయి అని కళ్ళు చిట్లించి చూస్తే నా మొహం లానే వుంది...

అమ్మో వానలో తడిస్తే ఇంకేమైనా వుందా...తుమ్ములూ...జలుబు..దగ్గు..జ్వరం...రేపు office కి ఎలా వెళ్తావ్ అని వూహల్లో విహరిస్తున్న మనసుని..మెదడు చెవి మెలేసి లాక్కొచ్చేసింది...computer లో పాట ఆగిపోయింది...కళ్ళు తెరిచే సరికి నా roomie విసుగ్గా మొహం పెట్టి చూస్తోంది..ఎంత సేపు నుంచుటావ్ అక్కడే...stove మీద నీ గిన్ని పక్కకి పెడితే నా వంట చేకుంటా అన్న మాటలన్నీ మొహంలోకే ప్రతిఫలింపచేస్తూ...

అప్పటిదాక వున్న విసుగునుంచి ఏదో తెలియని relief...నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచా...
ఇంతకీ నే విన్న పాట ఏదో చెప్పలేదు కదూ...


नेणा करू बंद बंद....बहजाये बूँद बूँद
तड्पायेरे... क्यो सुनाए गीत मल्हार दे .......


ఏ పాటో చెప్పుకోండి


8/12/11

కష్టానికి కొలతేది??



మా వాడికి ఒక్క సంబధమూ కుదరొట్లేదేవిటో...నా బెంగంతా వాడి పెళ్ళి గురించే వొదినా అని ఇరుగింటావిడ అంటే....హ్మ్ మా వాడికి పెళ్ళయినదగ్గర్నుంచీ కోడలి కొంగట్టుకు తిరుగుతూ...మా వూసే పట్టించుకోటం మానేసాడు నా బాధెవడితో చెప్పుకోవాలి అంటుంది పొరుగింటావిడ.
నాకు వుద్యోగం ఎప్పుడొస్తుందోరా మీరంతా హాయిగా సంపాదించుకుంటున్నారు..నేనిలా గాలికి తిరుగుతున్నా అని ఒక స్నేహితుడంటే....ఏమి వుద్యోగమోరా చచ్చేంత పని...ఈ వెట్టి చాకిరీ చెయ్యటం కంటే రాజీనామా చేసి సన్యాసుల్లో కలవటం మంచిదనిపిస్తోంది రా అంటాడు రెండోవాడు
మా పిల్లదానికి చదువబ్బట్లేదని ఒకాయనంటే...మా పిల్లకి చదువెక్కువై మమ్మల్ని వదిలేసి ఎగిరి చక్కా పోయింది...ఒక పలకరింపుకి కూడా ఖాళీ లేదంటుంది అని వాపోతాడు రెండో ఆయన...
నీకేవిరా America చెక్కేసావ్...ఇక్కడ ఈ దుమ్మూ ధూళి లో కొట్టుకుంటున్నాం అని సహోద్యోగి అసూయతో కలిపి తన బాధ వెళ్ళగక్కితే...నీకేం తెల్సురా ఇక్కడ పొద్దున్నలేచి అన్ని పన్లూ నేనే చేస్కునే సరికి చుక్కలు కనపడుతున్నాయి అని విదేశీ భారతీయుడు తన విసుగుని వివరిస్తాడు..
మా ఆయనకి ఏవీ నచ్చవ్...అన్నీ వంకలే...అన్నీ గొడవలే అని అప్పుడే వంటింట్లో బుడి బుడి అడుగులేస్తున్న ఇల్లాలు అంటే...మా ఆయన ఎలా వండినా తినేస్తాడు...చిన్న గొడవ పడదామన్నా దేనికీ ఏమీ అనరు...అదెంత చిరాకో నీకెం తెలుసు అంటుంది ఇంకో పిల్ల...
ఇస్త్రీ నలగని పాంటూ చొక్కా వేసుకుని ఆటో లో కూచున్న soft wear బాబు ని చూసి ఈన పని బావుంది కడుపులో చల్ల కదలకుండా పొద్దస్తమానం AC గదుల్లో కూచుంటాడు అని ఆటో డ్రైవరు అనుకుంటే...పొద్దున్న లేస్తే అన్నీ tension లే వీడి పని బావుంది...తన పని కి తనే రాజా...సంపాదన చూస్తే వీడిదే ఎక్కువలా వుంది అనుకుంటాడు...పైకి దర్జా వొలకబోస్తున్న దొరబాబు...
తిండికి లేక వొకడేడుస్తూ వుంటే...పెట్టెల్నిండా డబ్బులు వంటినిండా రోగాలతో ఏవి తింటే ఏవొస్తుందో అని భయపడుతూ ఏడుస్తూ వుంటాడు ఇంకోడు...

మొత్తానికి ప్రతీ వాడికీ తన కష్టం మాత్రం పాము లాగా...ఎదుటి వాడి కష్టం మాత్రం తాడులాగా...చీపురు పుల్లలాగా కనిపిస్తుంది...

మా అమ్మ కాలునొప్పో తల నొప్పో అంటే ...నాన్నగారు వెంఠనే నాకూ నిన్నట్నుంచీ కాలు నెప్పి...నీలా చెప్పలేదంతే అనేసే వారు తడుముకోకుండా...ఎందుకో ఎవరనా తమ కష్టం చెప్పగానే ఠక్కున మనకి ఇంకా పెద్ద కష్టం వుందని చెప్పెయ్యాలనిపిస్తుంది. కష్టం కూడా ఒక రకమైన prestige issue లాంటిదేమో అనిపిస్తూ వుంటుంది. నిజం గా ఎవ్వడూ ఎవ్వడి కష్టం ఆర్చలేడు తీర్చలేడు...కనీసం మన్స్ఫూర్తిగా బాధపడలేడు కూడా...ఐనా సరే మన కష్టం పక్కవాడితో చెప్పగానే వాడు తనకున్న ఇంకా పెద్దకష్టం(తన వుద్దేశం లో) మనకి చెప్తాడు కాబట్టి..చెప్పావ్ లే బడాయి అని పైకి అనుకున్నా లోపల్లోపల అంతర్లీనం గా మన మనసు కాస్త తృప్తి పడుతుందేమో మనకే కాదు కష్టాలున్నవి అని...బాధ పంచుకుంటే గుండె తేలిక పడటం వెనక వున్న philosophy ఇదేనేమో( ఈ అవిడియా రాసే ముందు బుర్రలో లేదు...రాస్తుంటే తట్టేసింది...:D )

ఏవయినా కానీ మనుషుల్ని దగ్గర చేసే శక్తి కష్టానికే ఎక్కువ వుంది...సంతోషం గెలుపూ మనిషిని గాల్లో తేలిపోయేలా చేస్తే,  ఓటమీ, కష్టం ఆ మనిషిని నీ మూలాలు ఇక్కడున్నాయి బాబూ అని గుర్తుచేసి నేలమీదకి లాక్కొస్తాయి. గెలుపు అహం భావాన్ని పెంచితే వోటమి ఆత్మ పరిశీలనకి అవకాశాన్నిస్తుంది. సంతోషం చుట్టం చూపుగా పలకరించి పోతే...కష్టం మాత్రం జీవన సహచరి లా అన్ని వేళలా వెన్నంటి నిలుస్తుంది..

ఒక సమస్య తీరితే రెండో సమస్య కి promotion దొరుకుతుందిట ఎక్కడో చదివాను...కష్టం బాధా లేకపోతే నిన్ను తలవను...ఎల్లవేళలా కష్టాలు వుండేటట్టు చూడు స్వామీ అని గొంతెమ్మ కోరిక కోరిందట కుంతీదేవి...నిజవే కష్టమన్నదే లేకపోతే మనిషిలో ఈ మాత్రం మానవత్వం...మంచితనం కూడా దొరకవు...సుఖానికి విలువా మిగలదు. కష్టానికి కొలతలూ తూనికలూ లేకపోయినా సంతోషానికి విలువ కట్టేది మాత్రం దానితోనే...

మనిషి పుట్టుకా, చావూ వేదనా భరితమే....ఆ రెంటి మధ్య ప్రయాణం భవ సాగరమే...ఆ కష్టాన్నే మన తోడుగా అనుకుని బతకటం నేర్చేసుకుంటే కష్టం ఇంక కష్టమనిపించదేమో...

7/28/11

మౌనమంటే అన్నివేళలా అంగీకారమే కాదు...



ఈ మధ్య కొత్తగా మా ఆఫీసులో చేరిన  60 యేళ్ళ అమెరికన్ ఒకావిడ లంచి కి బయటకి వెళ్డాం అని పీకుతుంటే నిన్న సరే అన్నాను. ఆవిడకి ఈ వూరు కొత్త, తన టీములో కూడా ఎవ్వరూ పెద్దగా పరిచయం అవ్వకో ఎమో మరి మాతో ఎక్కువగా మాట్లాడుతూ వుంటుంది. మా టీము లోనే పనిచేసే ఇంకొక తమిళ తంబిని కూడా ఆవిడ మాతో రమ్మని ఆహ్వానించింది. నేను actual గా డబ్బా తెచ్చుకున్నాను, అదే restaurant కి నిన్ననే వెళ్ళాము అని చాలా రకాలుగా గునిసి చివరికి వస్తాను కానీ థాయి టీ మాత్రం తాగుతాను అనే వొప్పందం మీద బయల్దేరాడు. వెళ్ళాక మేము మెనూ చూస్తుంటే ఇక్కడ fried rice బావుంటుంది...I suggest you to take friend rice అని ఇద్దరికి చెరొక పది సార్లు చెప్పాడు...ఇద్దరం పెద్ద పట్టించుకోకుండా మాకు నచ్చినవి ఏవో Order చేసేసరికి ఏమనుకున్నాడో మరి ఏమీ తిననంటూ బయల్దేరిన అతను ఆ fried rice ఏదో తనకే order చేస్కున్నాడు. మరి నీ డబ్బా అన్నాను అతని నిర్ణయం లో హఠాత్తు గా వచ్చిన మార్పుకి కాస్త అవాక్కయినట్టు మొహం పెట్టి...అది రాత్రి మా ఆవిడని తినమని చెప్తా అన్నాడు (పాపం వాళ్ళావిడ అనుకున్నా మనసులో). మా ఆవిడకి rice అంటే ఇష్టం. నాకు అంతగా నచ్చదు అన్నాడు మళ్ళీ cover చేసుకుంటూ.

order వచ్చేలోపు, ఎప్పుడూ ఏదో జ్ఞాన సముపార్జన చేసేద్దాం...అవతలి వాళ్ళనుంచి ఏదో విషయపరిజ్ఞానం సంపాదిచేద్దాం, తన ప్రశ్న అవతలి వాళ్ళ జవాబు అనే ధోరణి లో వుండే నా Team mate మహానుభావుడు మా American colleague ని కబుర్లల్లోకి దింపాడు. ఆవిడ family గురించి ఆరా మొదలెడితే ఆవిడ క్రితం సంవత్సరమే తను విడాకులు తీసుకున్నాను అనే సరికి ఇంక Topic ని America లో విడాకుల  సంస్కృతి Vs India లో విడాకుల సంస్కృతి వేపు మళ్ళించాడు. ఇక్కడ విడాకులు తీస్కుంటే భర్త భార్యకి చాలా డాలర్లు ఇవ్వాలిట కదా అన్నాడు, అలా ఏమి లేదే...మా case లో నేనే చాలా నష్టపొయాను అంది ఆవిడ...అవునా ఇండియా లో ఐతే పెళ్ళాం police station కి వెళ్ళీ ఇలా ఫిర్యాదు చేస్తే చాలు పోలీసులు భర్తని, అతని అమ్మనీ నాన్ననీ, ఇంకా చుట్టాలని పక్కాలని అందర్నీ without any argument జైల్లో వేసేస్తారు అన్నాడు. వాళ్ళ అమ్మని నాన్నని ఎందుకు అని బిక్క మొహం పెట్టింది ఆవిడ..అదంతే అక్కడ అమ్మాయి compliant ఇస్తే పోలీసులు ముందూ వెనకా అలోచించరు...అలా లోపలేసేస్తారు అంతే అన్నాడు. అది తప్పుకదా అంది ఆవిడ...ఐనా అంతే పైగా డబ్బులన్నీ అబ్బాయే ఇవ్వాలి, పిల్లలుంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి అన్నాడు. that is interesting but how అంది ఆవిడ కళ్ళు విప్పార్చి చూస్తూ. ఇంక వూరుకుంటే ఈవిడకి ఈసారి భారత దేశం వెళ్ళి మరీ విడాకులు తీసుకోవాల్సిందే అనే నిర్ణయానికి లాక్కొచ్చేస్తాడేమో అని భయమేసి, అలా కాదు, మా దేశం లో చాలా వరకూ laws women protection కోసం తయారు చేసినవి. అమ్మాయి తనని తన భర్త, అత్త మావలు వేధిస్తున్నారని కేసు పెడితే అప్పుడు arrest చేస్తారు. అది కూడా investigation చేసాకే. కొంత మంది miss use  చేసే వాళ్ళుంటారనుకో. ప్రతీ దానికి positive side negative side, వున్నట్టే దీనికి వున్నాయి అని ఆవిడకి వివరించే సరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.

ఈ లోపు మా order వచ్చేసరికి హమ్మయ్య ఇంక ఇతని నోటికి వేరే పని దొరికింది రా బాబు అనుకునేంతలో నాలుగు స్పూన్లు కడుపులో పడేసి మళ్ళీ మొదలెట్టాదు, అసలు నువ్వెందుకు విడాకులు తీస్కున్నావ్ అన్నాడీసారి. నాకు గుండె గుభేల్ మంది. అసలే ఇక్కడ వాళ్ళకి వాళ్ళ personal విషయాల్లో అవతలి వాళ్ళ జోక్యం అంతగా నచ్చదని ఎప్పుడో విన్నాను. అందుకే అంతకు ముందు పని చేసిన చోట మా manager తో రెండేళ్ళ పైన కలిసి పని చేసినా...రోజూ  ఎన్నో విషయాలు మాట్ళాడుకున్నా గానీ, చచ్చినా ఆయన personal విషయాలు మాత్రం అడిగేదాన్ని కాదు. ఆయనే వచ్చి ఇవాళ మా ఆవిడ ఫలానా పరీక్ష పాసయ్యింది అంటే ఒహో ఈనకి చదువుకునే పెళ్ళాం వుందన్నమాట అనుకునేదాన్ని. I got a call from my kid.  have to run అంటే చదువుకునే పెళ్ళాం కాబట్టి బుడ్డి పిల్లో పిల్లాడో వుండుంటారనుకునేదాన్ని...తీరా నన్ను sendoff lunch కి తీస్కెళ్ళినరోజు తనకి 19, 17, 15 ఏళ్ళున్న ముగ్గురు పిల్లలూ, ఇంకా నాలుగు కుక్కలూ వున్నాయని చెప్పేసరికి..అప్పుడర్ధమయ్యింది ఆయన ఎక్కువగా ఆఫీసులోనే వుండటానికి ఎందుకిష్టపడేవాడో :). ఇప్పుడు ఈవిడ ఏదో ఒకటనే వరకూ ఇతను తన ప్రశ్నోతరాల కార్యక్రమానికి full stop  పెట్టేలా లేడు రా భగవంతుడా అనుకుంటూ మౌనం గా వాళ్ళ మాటలు వింటూ నా పని నేను కానిస్తున్నాను.

ఆవిడ నేననుకున్నంత wild గా ఏమీ  react అవలేదు పాపం.  తన మాజీ భర్తకి తను అయిదో భార్యని అని, అతనితో పెళ్ళయ్యాక తన ఇంట్లో వచ్చి వుండమన్నాడే గానీ, అక్కడ చీపురు పుల్ల కూడా కదపనిచ్చేవాడు కాదని. ఇటు వున్న బల్ల అటు కదపడానికి కూడా అంగీకరించేవాడు కాదనీ, ఆఖరికి తనకి నచ్చిన మొక్క పెంచడానికి కూడా స్వతంత్రం వుండేది కాదనీ, అతనికి అన్నీ తనకి నచ్చినట్టే వుండాలనీ అందుకే విడిపోయాననీ చెప్పింది. దానికతను అవునా...మా ఇల్లంతా మా ఆవిడదే. తను ఇంటికొచ్చిన రోజు నా ఇల్లంతా ఎక్కడివక్కడ పడేసి చిందర వందరగా వుంటే నేను ఇంటికెళ్ళేసరికి తనకి నచ్చినట్టు సద్దేసింది. అయినా నేను పల్లెత్తు మాట కూడా అనలేదు. అసలు వంటిల్లయితే తనదే రాజ్యం. నాకు ఏది ఎక్కడుందో కూడా తెలీదు. తను ఆఫీసు నుంచి రావటం ఎంత ఆలశ్యం అయినా కాఫీ కూడా తనొచ్చి పెట్టాల్సిందే...ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో తనకే తెలుసు కదా అన్నాడు. మా దేశం లో అందరూ అంతే...భార్యలదే ఇంటి మీద హక్కంతా అన్నాడు. తను చెప్పేదానికి బలమయిన support వుంటే బావుంటుందనుకున్నాడేమో నా మానాన్న తిండి తింటున్న నన్ను, నువ్వేమటావ్, మీ ఇంట్లో కూడా ఇంతే కదా అన్నాడు. ఆవిడ తనకి దొరకని స్వేచ్చ గురించి చెబుతుంటే, తను బలవంతం గా తన భార్య మీద రుద్దిన బాధ్యతల్ని ఆమెకి ఈయన ప్రసాదించిన స్వేచ్చగా, హక్కుగా  ఆపాదించి చెబుతుంటే ఇంకేమనాలో అర్ధం కాక, కొంతమందితో వాదించటం కంటే మౌనం గా వుండటమే మంచిదనిపించి తను నన్ను అడిగినది వినపడనట్టు వూరుకున్నాను. తను చెప్పిన దానికి, అతను చెప్పిన దానికి లంకె ఏవిటో అర్ధం కాలేదేమో ఆవిడ కూడా అతని కేసి విచిత్రం గా చూసి మళ్ళీ ఎమి అడుగుతాడో అని పక్కనే వున్న local news paper లో తల దూర్చేసి తినటం లో మునిగిపోయింది.

7/13/10

మట్టి వాసన


సన్నగా మొదలైన వాన చినుకులు నెమ్మదిగా పెద్దవాన గా మారుతున్నాయి. వానని చూస్తూ వేడి వేడి Tea sip చేస్తూ నేనూ, నా roomie patio లో కూచున్నాం. మొహం మీద పడుతున్న నీటి తుంపరలు, ఎండిన మట్టి మీద పడ్డ వానచినుకుల్లోంచి పుట్టిన మట్టివాసన కలిసి మా కబుర్లలోకి ఎన్నో జ్ఞాపకాలని మోసుకొచ్చాయ్. వానా వానా వల్లప్పల గురించి, నీళ్ళ కాలువల్లో వేసిన కాగితం పడవలగురించి నేను చెప్తే...మొత్తం ఇంటిల్లిపాది తొలకరి జల్లులకి మురిసి తడిసిన సంగతులూ...వాన వస్తే చాలు అమ్మ చేసే వేడి వేడి పకోడీల సంగతులు తను నెమరు వేస్కుంది. ఇప్పుడు India లో వానలు పడుతున్నాయ్. ఇంటికి phone చేసినప్పుడల్లా పకోడీలు తిన్నాం ఇవాళ అంటున్నారు..అని బుంగమూతి పెట్టింది తను.చలో యార్ ఘర్ చల్తే హై అంది...రోజుకొకసారైనా ఆమాట అంటూనే వుంటుంది తను.

మన కలలు, ఆశలు వేరు...మనం పరిగెడుతున్న దిశ వేరూ...అనిపించింది. అదే మాట తనతో అన్నాను. అదేంటి అంది.వానొచ్చినప్పుడల్లా అమ్మచేతి పకోడీలు దొరుకుతుంటే మనం ఇంకేవో కలలు కంటూ వాటి వెనకాల పరిగెత్తాం...ఇప్పుడు ఆ పకోడీల వాసనలు కూడా మనకి కలలై కూర్చున్నాయి...కాని తమాషా ఏమిటంటే ఇప్పుడు ఆ కలని నిజం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యటం లేదు మనం అన్నాను...

నువ్వింకా ఇక్కడ ఇలా మీ పాప కి...husband కి దూరం గా వుండి ఇంత కష్టపడి job ఎందుకు చేస్తున్నావో నాకైతే తెలియట్లేదు...హాయిగా అందరూ india వెళిపోయి settle ఐపోవచ్చు కదా అంది తను. నా సంగతి వదిలెయ్యి...ఇప్పుడు నా ఏ నిర్ణయం ఒక్క మనసు తో అలోచించి తీస్కునేది కాదు...దేనికైనా ఇద్దరి అభిప్రాయాలు కలవాలి...దానికి చాలా time పడుతుంది....నువ్వు single...ఏ నిర్ణయమైనా నీ ఇష్టం...దాని ఫలితం నీదే...రోజుకొకసారి india వెళ్దాం పద అంటావ్ కదా...హాయి గా వెళ్ళి అమ్మా నాన్నల తో enjoy చెయ్యొచ్చు గా అన్నాను...ఎప్పట్లాగే ఒక నవ్వు నవ్వి వూరుకుంది.

నవ్వు కొన్ని సార్లు సమాధానం ఐతే...కొన్ని సార్లు చెప్పలేని సమాధానం అవుతుందనిపించింది...

వాన జోరు బాగా పెరిగిపోయింది...మట్టి వాసనా కరిగిపోయింది...వాన ఇప్పుడంత ఆహ్లాదకరం గా అనిపించడంలేదనిపించి ఇద్దరం లోపలకి నడిచాం routine లో పడటానికి...

7/2/10

మౌనమె నీ భాష ఓ మూగ మనసా...



ఈ పాట పాడే నా స్నేహితులంతా నన్ను ఏడిపిస్తూ వుండేవారు ఎప్పుడూ పెద్దగా మాట్లాడనని. మాట్లాడ్డం చేతకాకో, silent girl అన్నది compliment అనిపించో తెలీదు కాని పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అందరూ చేరి ఏ విషయం మీదైనా వాదించేస్కుంటూ వుంటే నేను మాత్రం అందరి వాదనలూ వింటూ కూర్చుని చివరాఖర్న ఏదో ఒక comment పడేస్తూ వుండేదాన్ని. ఆ comment మాత్రం తిరుగు లేకుండా మళ్ళీ వాళ్ళెవరూ నోరెత్తలేకుండా వుండేది చాలా వరకూ. అందుకే silent killer అనే బిరిదు కూడా పడేస్తూ వుండేవారు అడగకుండానే. మా అమ్మ మాత్రం నాకు పూర్తిగా విరుధ్ధం. అవతలవాళ్ళకి ఎక్కడా అవకాశం కూడా ఇవ్వకుండా గలగలా మాట్లాడేస్తూ వుంటుంది. తనకి నేను ఎప్పుడూ వుచిత సలహా ఇస్తూ వుండేదాన్ని అలా అన్నీ మనం మాట్లాడేస్తే అడగకుండానే అవతలవాళ్ళకి మన సంగతులన్నీ తెల్సిపోతాయి, అదే నాకులా అవతలవాళ్ళ సొద అంతా విన్నావంటే వాళ్ళ లోటు పాట్లు అన్నీ మనం తెలిసేసుకోవచ్చు అని. నేను ఏం చెప్పినా వినే రకమా మా అమ్మ...తను నాకు అమ్మ గాని నేను తనకి కాదు కదా...ఎవరైనా మీరు చాలా silent అంటే I am a good listener అని సమర్ధించుకుంటూ వుండేదాన్ని. పెళ్ళయ్యాక మా అత్తారింట్లో వున్న కాసిన్ని రోజులకే చాలా నెమ్మది, పెద్దగా మాట్లాడదు అనే పేరు సంపాదించేసాను. ఇంక US వచ్చాక ఏమీ మాట్లాడవేంటి అసలు అని రోజుకొకసారైనా మావారు అంటూనే వుండేవారు. ఎవరింటికైనా వెళ్ళినా, ఏదైనా party కి వెళ్ళినా ఎవ్వరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. ఎప్పుడూ మా వారి వెనకాలే తిరుగుతూ వుండేదాన్ని. ఎందుకు నాతోనే తిరుగుతావ్, కాస్త అందరినీ పరిచయం చేస్కోవచ్చుకదా, నీకూ ఒక circle అంటూ వుండాలి కదా అంటే వాళ్ళు మాట్లాడే చీరలు నగల Topics నాకు interesting గా లేవనో వాళ్ళు నా Age group కాదనో, నాకు నచ్చితే గాని నేను ఎవరితోనూ కలవలేను అనో ఎవో ఒక ఒంకర టింకర కారణాలు చెప్పి తప్పించుకుంటూ వుండేదాన్ని.

ఇదంతా మూడేళ్ళ కి ముందు. ఈమధ్య ఎప్పుడు మారానో నాకే గుర్తు లేదు గాని తెగ మాట్లాడుతున్నాను. మా వారు ఇంక ఆపు తల్లో అనే దాకా మాట్లాడుతున్నాను. ఈ Topic ఆ Topic అని లేదు, వీళ్ళు నాకు నచ్చారా నచ్చలేదా అని లేదు, నా కన్నా పెద్ద వాళ్ళా చిన్న వాళ్ళా అని లేదు. అందరితోనూ మాట్లాడేస్తున్నాను. అందరికి సలహాలు కూడా తెగ ఇచ్చేస్తున్నాను. ఒక్కోసారి phone లో మాట్లడే టప్పుడు అవతల వాళ్ళు ఏదైనా చెప్పబోతుంటే నా మాటలు పూర్తి అయ్యే దాకా వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాట్లాడేస్తున్నాను. నాకే ఈమధ్య బాగా తెలుస్తోంది నాలో వచ్చిన మార్పు. ఎందుకు ఇంతలా మాట్లాదేస్తున్నాను...ఛీ మునుపట్లా Silent గా వుండాలి అని ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. ఒక్కోసారి నేను ఏమైనా insecurity feel అవుతున్నానా, దాని ప్రభావమా అని లేని పోని అనుమానాలు కూడా వచ్చేస్తున్నాయి.

మొన్న ఒకరోజు family Friends తో మా అమ్మాయి గురించి చెబుతూ India వెళ్ళిన వారం కాస్త బుధ్ధిగా వుంది. తర్వాత నెమ్మదిగా అల్లరి మొదలు పెట్టి ఇప్పుడు అందర్నీ అదుపులో పెట్టేసే level కి వెళ్ళి పోయింది, మొన్న మా ఆడపడుచుల పిల్లలంతా కలిసి అంత్యాక్షరి ఆడుతుంటే ఇది దీనికి తోచిన రాగాలు తీస్తూ వెనకాల కూర్చిందిట, కొంచెం సేపటికి తన పాటలు ఎవరూ పట్టించుకోవట్లేదనిపించి మిగిలిన పిల్లల్ని తోస్కుని ముందుకంటా జరిగి పోయి కూచుని దానికి ఆ పాటలు ఏమి రాకపోయినా..వాళ్ళు పాడే పాటలల్లోంచి ఏదో ఒక ముక్క పట్టుకుని గాఠ్ఠిగా గొంతుపెంచి దానికి నచ్చినట్టు రాగాలు తీస్తూ పాడేసిందిట అని చెప్తే...ఇక్కడ వుండగా ఎప్పుడైనా మా ఇంటికి వస్తే మీ వొళ్ళోంచి దిగేదే కాదు అక్కడకి వెళ్ళి అంత మారిపోయిందా అని ఆవిడ అంటుంటే...వాళ్ళాయన మాత్రం ఒక చక్కటి విశ్లేషణ ఇచ్చారు దాన్లో వచ్చిన మార్పుకి...అక్కడకి వెళ్ళి రెండు రోజులైనా తనకి బాగా తెలిసిన అమ్మా నాన్నా కనిపించలేదు, కాస్త తెల్సిన అమ్మమ్మ కూడా కనిపించటం మానేసింది...ఒహో ఇంక నేను వీళ్ళతోనే వుండాలి అనుకుంది...ఈ తెలియని వాళ్ళ మధ్య నెగ్గుకు రావాలంటే నా ఆధిక్యత చాటుతూ వుండాలి...అందరి దృష్టీ నా మీదే వుండాలి అని అందర్నీ తనే Dominate చెయ్యటం మొదలు పెట్టేసింది, అందుకే పిల్లల దగ్గర్నించి ఎన్నో management పాఠాలు నేర్చుకోవచ్చు అంటారు...మీ అమ్మాయికి అప్పుడే Struggling for Existence అంటే తెల్సిపోయింది అన్నారు...ఆయన మాటలు వింటుంటే నాకు తెలియకుండానే ఒక చిరునవ్వు నా పెదాలమీద..దానికి కారణం మౌనాన్ని అర్ధం చేస్కునే అంత తీరికి ఇప్పుడు ఎవ్వరికీ లేదని, మూగమనసులకి కాలం చెల్లిపోయిందని...నోరు పెట్టుకుని బతకాలని తెలుసుకోవటానికి నాకిన్నేళ్ళు పడితే నా కూతురికి రెండేళ్ళు నిండకుండానే తెల్సిపోయిందే అన్న ఆలోచన కావచ్చు...

5/17/10

పిరికి మనసు



టపా రాయటానికి ప్రేరేపించినది వారాంతంలో నా మనన్సులో రేగిన ఒక చిన్న అలజడి.

టపాకి పేరు పెట్టాక మళ్ళీ ఒక సందేహం వచ్చింది, పిరికి అన్న పదం సరైనదా, భయం అన్న పదం సరైనదా అని. దానికిసమాధానం కూడా నాకే తట్టేసింది. నీళ్ళదాకా వెళ్ళాక, నీళ్ళలో దిగాకా అమ్మో మునిగిపోతామేమో అనిపిస్తే అది భయంఅవుతుంది కానీ, ఇంట్లో కూర్చుని, నీళ్ళు ఎం ప్రమాదకరమైనవో, అమ్మో అక్కడకి వెళ్ళటమే అని అలోచించడాన్నిపిరికితనమే అంటారు అని(బాగా చెప్పానా). నీళ్ళని ఎందుకు వుదాహరించానో టపా చివర్లో తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళ్ళేముందు కాస్త Flash back వినక తప్పదు మీకు.

మా అమ్మానాన్నలకి నేను 14 సంవత్సరాల ఎదురు చూపుల ఫలితం గా పుట్టానట. వూళ్ళో వాళ్ళంతా గారాల పట్టి అంటూ వుండేవారు నన్ను చూసి, గారం మాట దేవుడెరుగు గాని అతి జాగ్రత్త గా మాత్రం పెంచింది మా అమ్మ. మాఅమ్మ కంగారు చూసి కంగారు పడ్డాడేమో దేవుడు, మూడో ఏడు వచ్చేదాకా అసలు నాకు నడవటం రాకుండా జాగ్రత్తపడ్డాడు. దాంతో మా అమ్మకి నేను ఎక్కడ ఏమి ఘనకార్యాలు చేసేస్తున్నానో అని కంగారు పడే గొడవ తప్పింది(వయసులో పిల్లలు ఎన్ని ఘనకార్యాలు చెయ్యగలరో నా కూతురు Liveshow చూసేదాక మా అమ్మకి అనుభవం లోకిరాలేదు). చక్కగా పొద్దున్నే బొబ్బ పోసి వీధి అరుగు మీద కూచో పెడితే మా వీధిలోంచి స్కూలుకెళ్ళే పిల్ల కాయలందరికీ టాటాలు చెపుతూ కూచునేదాన్నట మా అమ్మ పనులన్నీ అయ్యి మళ్ళీ లోపలకి తీస్కెళ్ళేదాకా.

ఇంక కాస్త నడవటం మొదలు పెట్టాకా నన్ను ఆడుకోవటానికి పంపిస్తూ మా వీధిలో పిల్లల్లో కాస్త పెద్ద పిల్లకి నీదే బాధ్యత అని అప్పగింతలు పెట్టి మరీ పంపేది. మా అమ్మ B.P ని అంత దగ్గరగా చూసినవాళ్ళు వూరుకుంటారా, చక్కగా నన్నుఆటలో అరిటిపండు ని చేసి పడేసే వారు. మొదట్లో ఏదో నాకు special treatment ఇస్తున్నారు అనుకుని సంబరపడేదాన్ని కాని, కొన్నాళ్ళకి అర్ధమైంది అది పిచ్చి మొహం, వెర్రి మొహం లాంటి పదాలకి అందమైన పర్యాయపదం అని.

ఇంతలో మా నాన్నగారికి వేరే వూరు transfer అయ్యింది. అదే మా వూరు. అక్కడ నన్ను school లో వేసారు. అది ఎంత చిన్న వూరంటే, స్కూలు మొదటి గంట వినిపించాక ఒక్క పరుగు పెడితే రెండో గంటకి స్కూల్లో వుంటామనమాట. అలాగే స్కూల్లో నేను ఘాట్టిగా తుమ్మానంటే ఇంటికి కూడా వినిపించేంత దగ్గర. కాస్త దూరం కూడా నేను సరిగ్గా నడిచేదాన్నా అంటే, మూల మొదలెడితే ఆమూలకి ఐకోసుగానో, ఐమూలగానో నడిచేదాన్ని. ఈలోపు మన నడకా పాటవాన్ని మా అమ్మకి చేరవెయ్యటానికి బోల్డుమంది గూఢచారులూ, "మీ పాపగారేటండీ బలేగా నడుత్తారు, డాన్సు చేత్తున్నట్టు" అనుకుంటూ. ఇంక వాళ్ళ feed back విన్నాక కూడా మా అమ్మ వూరుకుంటుందా, ఇలా నడు, అలా నడవకు, దిక్కులు చూస్తూ నడవకు, పక్కనే నడు అని రోజుకి రెండు సార్లు ప్రైవేటు చెప్పేసేది. ఇంక school లోపల కాస్త అల్లరి చేద్దాం అంటే, మా స్కూలు పక్కనే హైస్కూలు, అక్కడే మా నాన్న గారు పని చేసే వారు. ఇక్కడ నేను పడినా, పడేసినా, కొట్టినా, కొట్టించుకున్నా అక్కడకి Report వెళిపోతుందని భయం. ఇంత బుధ్ధిగా వున్నా కూడా ఐదు అయ్యాకా TC ఇస్తూ, మీ అమ్మాయి పైకిబుధ్ధిమంతురాలిలా కనిపిస్తుంది కాని, అమ్మో silent గా చాలా అల్లరి చేస్తుంది అని అడక్కుండానే ఒక certificate పడేసారు ఒక మాస్టారు. నాలో మూల చూసారో మరి అల్లరి చెయ్యగల కళ.

high school లో ప్రవేశించిన తర్వాత ఇంక నా పాట్లు చెప్పఖ్ఖర్లేదు. టీచర్లంతా నన్ను తెలుగు మాస్టారి అమ్మాయ్ అనే పిల్చేవారు. ఒక సారి తిక్క రేగి , పోయి, పోయి మా హెడ్ మాస్టారు అలా పిలిచినప్పుడు, నాకంటూ ఒక పేరు వుందండి అనేశాను. ఆయన వూరుకుంటారా, మా నాన్నగారితో, మీ అమ్మాయికి ముక్కుమీదేనండోయ్ కోపం అని అసలు సంగతి (అదే నేను చెబితే చాడీ అంటారు) వూదేసారు. ఎప్పుడైనా అమావాస్యకో, పున్నానికో మాకున్న బుజ్జి ground లో ఏదో అలా చిన్నగా పరిగెట్టినట్టు చూసినా, మీ అమ్మాయి Ground లో పరిగెడుతూ కనపడిందండీ(ఏదో దొంగతనం చేస్తూ దొరికిందండీ అన్నట్టు) చెప్పేస్తూ వుండే వారు.

ఇంకేం చేస్తాం, పరిగెట్టడానికి, అల్లరి చెయ్యటానికి, ఎవరికైనా ఎదురు సమాధానం చెప్పడానికి కూడా ధైర్యం చెయ్యలేక నాకు తెలియకుండానే నెమ్మదస్తురాలిని, మంచి పిల్లని ఐపోయాను. ఇంక పునాది అంత బలంగా పడ్డాక మిగిలిన చదువులో వేగులు అవసరం లేకుండా నేనే అన్నీ మా అమ్మకి పూసగుచ్చినట్టు చెప్పేస్తూ వుండటం, అన్ని పనులూ అమ్మా నాన్నలకి చెప్పి చెయ్యటం అలవాటు ఐపోయింది.

నేను నా విద్యార్ధి దశ లో చేసిన అతి పెద్ద సాహసం ఏమిటయ్యా అంటే post graduation ఆఖరు సంవత్సరం, ఫైనలు పరీక్షలకి 4 రోజుల ముందు ఇంట్లో చెప్పకుండా (వెరే వూరే కదా ఎవరూ చూసే అవకాశం లేదు అనే ధైర్యం తో) cinema కివెళ్ళటం. అక్కడ కూడా నా ప్రాణానికి మా వూరు అమ్మాయి ఒకర్తి చూసి మా అమ్మకి మోసేసింది ఇంకేం పని లేనట్టు.అలా సాహస కృత్యం కూడా అమ్మా, నాన్నల దృష్టి కి వెళ్ళకుండా చెయ్యలేకపోయాను.

ఇవ్విధముగా, నాకు ప్రతి పనికీ ఒకటికి ఫదీ ఫాదిహేను సార్లు అలోచించడం, ఒక అడుగు ముందుకి వేస్తే ఒక ఫదో, వందో అడుగులు వెనక్కి వెయ్యటం అలవాటైపోయింది.

ఇంక ప్రస్తుతం లోకి వస్తే, మొన్న శుక్రవారం నాడు, కొత్తగా నాకు ప్రాప్తించిన Roomie ఆఫీసు లో serious గా పనిచేస్కుంటుంటే Will you be intersted in Rafting? అని ping చేసింది. నేను serious గా What is Rafting అనికొట్టేసి నాలిక్కరుచుకుని, ఛీ నా పరువు నేనే తీసుకోవటం అంటే ఇదే అనుకునేంతలో water rafting అని అటుపక్కనుంచి జవాబు. ఏమి చెప్పావే తల్లీ, ఐనా Google అనే మహత్తరమైన స్నేహితుడు/రాలు వుండగా నాకేల చింత అనుకుని వెతికితే కనపడ్డ ఫోటోలు చూడగానే గుండె ఘుభేల్ మంది. జలపాతాల్లోంచి వచ్చి, బండలూ, కొండలమధ్యలోంచి వంకర టింకర గా ప్రవహిస్తున్న నీళ్ళమీద, ఒక ఆరేడు మంది ఒక పడవ చొప్పున ఎక్కి, తెడ్డేస్కుంటూపోవటమే. Life Jacket ఇస్తారు, అది మాత్రమే మన ప్రాణాన్ని కాపాడే సాధనం. క్షణం లోనైనా చిన్న పాటి పడవ బోల్తా కొట్టొచ్చు, మనం నీళ్ళల్లో జలకాలాదొచ్చు.

చూసినదాన్ని చక్కగా అమ్మాయి ఇలాంటి సాహసాలు చేసే scene నాకు లేదు. నువ్వు proceed ఐపో అని చెప్పొచ్చు కదా. అలా చేస్తే నేను నేను ఎందుకు అవుతాను. మా వారికి call చేసి What is rafting అని అడిగాను, నీవల్ల నా వల్ల అయ్యే పని కాదు అని ఠక్కున వచ్చింది అట్నుండి సమాధానం. హ్మ్...ఏదో వొడ్డూ పొడుగూ బాగున్నాడూ,మంచి ధైర్యస్తుడై వుంటాడూ, నాకు కూడా ఇంతో అంతో ధైర్యం నూరిపోస్తాడు లాంటి అపోహలన్ని పడి మా ఆయన్ని పెళ్ళిచేస్కున్నాను, కానీ చేస్కున్నాక తెల్సింది మా ఆయన మా అమ్మకి మరో రూపం అని.

సరే అమ్మాయికి రాను అని చెప్పాను. ఐనా మనసు వూరుకుంటుందా, అయ్యో నీ బతుకూ ఒక బతుకేనా, నీమొహమేస్కుని అసలు ఎప్పుడైనా ఏమైనా enjoy చేసావా, అని ఒకటే పీకుడు. ఇంటికి చేరాక పిల్ల వూరికే వుండకుండా, నువ్వూ రావచ్చు కదా, Life jacket వుంటుంది కదా, ఏమి ఫరవావుండదు అని మొదలు పెట్టింది. మళ్ళీ మా ఆయనకి Call చేసి గునుస్తుంటే నా బుంగ మూతి phone లోనే కనబడ్డట్టుంది, సర్లే వెళ్తే వెళ్ళు, నీ ఇష్టం(నీ ఖర్మ) అన్నారు. ఆయన సెలవు ఇచ్చిన తరవాత ప్రయత్నాలు మొదలు పెడితే, నాకు తెల్సున్న మొహాలు అందరూ వెళ్ళే slot లో ఇంకఅవకాశం లేదు, వేరే slot లో వెళ్ళటం సమ్మతమైతే నిక్షేపం గా Ticket తీస్కోండి అని సవియంగా మనవి చేస్కున్నారు. తెల్సున్న వాళ్ళతో వెళ్ళటానికే ఇన్ని మీనాలూ, మేషాలు లెక్కపెడుతుంటే, ఇంక ముక్కు మొహం తెలియని వాళ్ళతో వెళ్ళడం కూడానా, దానికి తోడు $60 Ticket ఒకటి. అక్కడి దాకా వెళ్ళాక అయ్యబాబోయ్ ఇన్ని నీళ్ళే అని భయపడితే $60 గోవిందా గోవింద కదా ( ఇలా డబ్బుల విషయంలో చాలా ఎక్కువగా అలోచించడం కూడా మా అమ్మ దయ తో వంశ పారంపర్యం గా వచ్చిన సులక్షణం) మొత్తానికి అలా అమ్మాయి వెళ్ళిపోయింది, నేను ఒక్కర్తినీ ఇంట్లో వుండిపోయాను. ఒంటరిగా కూచుని కాస్సేపు నన్ను నేను తిట్టుకున్నాను, కాస్సేపు మా వారికి call చేసి మీ వల్లే అని సతాయించాను, కొంచెం సేపు బుజ్జగించి చూసారు, ఇంకా వినకపోతే, అసలు నన్నెవడు అడగమన్నాడు, ఇకనుండీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేను ఫలానా చోటికి వెళ్తున్నా అని information ఇయ్యి చాలు అని ఎదురుదాడికి దిగారు. అమ్మపెట్టే రెండూ పడితే గాని నాకు తృప్తిగా వుండదు కదా అనుకుని phone పెట్టేసి కాస్సేపు అసలు తప్పు ఎవరిదా అని అలోచించాను (తప్పు వెంఠనే నిర్ణయం తీస్కోలేని నాదే అని స్పష్టంగా తెలుస్తున్నాసరే ఇంకొకళ్ళు ఎవరో కారణం అనిపించేదాక మనఃశ్శాంతి దొరకదు నాకు) ఎంత తల బద్దలు కొట్టుకున్నా ఎవ్వరూ దొరకక నన్ను అప్పటిదాకా సతాయిస్తున్న నా మనసుని తప్పంతా నీదేనే పిరికిమనసా అనేసి మళ్ళీ దాని మాట వినపడకుండా దుప్పటీ ముసుగు పెట్టేసాను.

కానీ అప్పుడప్పుడూ, అనవసరమైన సాహసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చికుని వాళ్ళ కుటుంబాలకి తీరని దుఃఖాన్ని మిగిల్చినవాళ్ళ సంఘటనల గురించి తెలిసినప్పుడు మాత్రం అనిపిస్తుంది, పిరికిమనసా జిందాబాద్ అని.