10/17/12

పుట్టినరోజు జేజేలు అరవై అయిదేళ్ళ పసి పిల్లాడికి




నేను పుట్టని క్రితం అమ్మా వాళ్ళూ పొదుపూ మదుపూ అనే బెంగలేమీ లేకుండా హాయిగా వుండేవారట...అలాంటి రోజుల్లో అమ్మ ఒక వారం gap లో రెండు జతల చెప్పులు కొనడం చూసి మా తాతగారు(అమ్మా వాళ్ళా నాన్నగారు) మా నాన్నతో మీకు అరడజను మంది ఆడపిల్లలు పుడితే తెలుస్తుందయ్యా డబ్బు విలువా అని కోప్పడారట. అప్పటికే పిల్లలు లేరని బెంగ పడుతున్న నాన్నగారు...మీ నోటిమాటన అలానే పుడితే బోల్డు సంతోషం అన్నారట.

ఇది జరిగిన చాలా ఏళ్ళకి నేను పుట్టగానే మా తాతగారు ఇన్నాళ్ళ ఎదురుచూపులకి "ఆడపిల్ల"పుట్టిందని నీరసం గా telegram ఇస్తే..మా నాన్నగారు మాత్రం ఎగిరి గంతేసి మహదానందం గా చదువుకుని పరిగెట్టుకుని వచ్చారట నన్ను చూడ్డానికి.

అది మొదలు ఎప్పుడూ నేను ఆడపిల్లని కాబట్టి అన్న feeling నాలో ఏ మూలా కలగకుండా పెంచారు నాన్న. చదవకపోతే అంట్లు తోముకుంటావ్ అని అమ్మ వెంట పడేదే గానీ నాన్న మాత్రం దానికి తెలుసు ఎప్పుడు చదువుకోవాలో అని ఒక్క మాట అనేవారు. ఆ ఒక్కమాటే నాకు బోలెడు responsibility నేర్పింది. school లో బెత్తం పట్టుకుని దబదబా బాదేసే మాస్టార్ల కన్నా...చిన్న మాట కూడా అనకుండా పిల్లల్లో బోలెడంత గౌరవాన్ని సంపాదించుకున్న ఆయన నడవడిక reserved గా వుండటంలోని గొప్పతనాన్ని నేర్పించింది. జీవితంలో అప్పు అన్నది చెయ్యకుండా బతికిన ఆయన జీవన విధానం Life planning నేర్పించింది. అల్ప సంతోషి అని అమ్మ ఎప్పుడూ కసురుకున్నా...చిన్న విషయానికే సంబరపడే ఆయన తత్వం సంతృప్తి లో వుండే ఆనందం, దాని విలువా తెలియజెప్పింది. ఒక వయసు వచ్చాక వాళ్ళకి తెలుసు career planning అని ఎప్పుడూ ఇది చదువు..ఇలానే చెయ్యి అని నిర్బంధించకుండా ఆయన నాకిచ్చిన స్వేఛ్చ నాకు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పించింది.


ఇన్ని నేర్పినా ఏనాడూ నీకింత చేసాను అని గొప్పలు చెప్పుకోని ఆయన వ్యక్తిత్వం నుండి నేర్చుకోవాల్సినది ఇంకా బోలెడంత.

ప్రతీ కూతురికీ నాన్నే మొదటి హీరో...ఇవాళ్టితో అరవై అయిదేళ్ళు నిండుతున్న (ఎప్పటికీ నా దృష్టిలో హీరో) నాన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు

4/11/12

పరుగాపి...




పొద్దున్నే అయిదింటికి అల్లారం లే లే అని కుదిపి కుదిపి, చెవినిల్లు కట్టుకుని పోరేస్తోంది. అసలే చలికాలం...దాని పీక నొక్కి ఇంకొక్క పదినిమిషాలు అని తనలో తనే గొణుక్కుని దుప్పట్లో దూరింది నందిని. నిన్న రాత్రి  కుక్కరు గిన్నెలు పొద్దున్న లేచి తోవుకోవచ్చులే అని బధ్ధకించి వదిలేసిన సంగతి గుర్తురాగానే లేవక తప్పదు బాబోయ్ అనుకుని వంటింట్లోకి పరిగెత్తి నిద్ర మత్తులో చల్ల నీళ్ళ కుళాయి తిప్పేసరికి 0 కన్నా తక్కువ వుష్ణొగ్రతలో నీళ్ళు చేతిమీద సూదుల్లా గుచ్చుకుని మత్తంతా ఒక్క నిమిషం లో వదిలిపోయింది...చలికి ఎండిపోయిన గిన్నెల్ని కసిగా తోవుతుంటే ఎందుకో అమ్మ మాటలు గుర్తొచ్చాయి..."రోజూ తెల్లవారుఝామునే చదువుకోడానికి లేవదీసి బాగా చదువుకుంటే నాకులా ఇలా అంట్లు తోవుకుంటూ బతకక్కర్లేదు...కాలు మీద కాలేసుకుని దర్జాగా వుండొచ్చు. చదువుకుంటాను మొర్రో అన్నా పట్టించుకోకుండా నా తరవాత ఇంకా నలుగురాడపిల్లలున్నారని చిన్నప్పుడే పెళ్ళి చేసి పడేశారు. నీకు అన్నీ అమర్చిపెట్టి చదువుకుని సుఖపడవే అంటే అంత గునుపేవిటే"...పుస్తకం వొళ్ళో పెట్టుకుని కునికిపాట్లు పడే తనకి రోజు వంటింట్లోంచి అదే సుప్రభాతం వినపడేది.
"చదువుకుని సుఖపడవే అంటే" అన్న మాట మళ్ళీ గుర్తొచ్చి చిన్నగా నిట్టూర్చింది కుక్కరు పొయ్యిమీదకెక్కిస్తూ...అదే అమ్మ ఇప్పుడు call చేసినప్పుడల్లా  "మా కన్నా మీరేం సుఖపడుతున్నారే" అని దీర్ఘం తీస్తుంది అని నవ్వుకుంటూ స్నానాలగదిలోకి దూరింది.

ఇంట్లో మిగిలిన ఇద్దర్నీ వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకి పంపి, చివరగా తన బాగ్గు హడావిడిగా సవిరిస్తూ ..ఛా రేపట్నుంచీ అన్నీ రాత్రే సద్దిపెట్టుకోవాలి అని రోజూలాగే తిట్టుకుంటూ, కనపడని ఆఫీసు బాడ్జ్ ని మొత్తానికి సాధించి హడావిడిగా పరిగెట్టి బయటపడింది. ఎప్పట్లాగే కాస్త లేటుగా ఆఫీసు చేరుకుని సీట్లో కూలబడింది, నేనేనా అందరికంటే ఆలస్యం అని కళ్ళతోనే చెక్ చేస్కుంటూ. ఏదో వొకరోజు తొమ్మిదింటికే స్టాటస్ మీటింగు పెట్టేస్తాడు బాసు గారు..నాకు సరదా తీరిపోతుంది అని తనని తనే తిట్టుకుంటూ ల్యాపీ తెరిచింది. మైల్ చెక్ చేస్కుంటూ, "ఒక పక్కన డెలివరీ డేటు దగ్గర పడుతుంటే ఇంకా రెక్వైర్మెంట్స్ మారుస్తున్నారు ఈ బిజినెస్ వాళ్ళకి పనీ పాటా లేదు" అని తిట్టుకుంటూ పనిలో పడింది.

స్వాతి "Lunch?" అని పింగ్ చేసేసరికి అప్పుడే లంచ్ టైం అయ్యిందా అని వాచ్ చూస్కుని, తట్టెడు పనుందికదా పోనీ డెస్కు దగ్గరే కానిచ్చేద్దామా అనుకుని వద్దులే రోజు మొత్తంలో ఈ గంటేగా కాస్త సరదాగా గడిపేది అనుకుని "ok" అని పింగ్ చేసి బాగ్గు తీస్కుని కాఫటేరియా వైపు నడిచింది. అప్పటికే దేసీ గ్రూపులో చాలా మంది చేరిపోయారు అక్కడ...నందినీ, స్వాతీ చాలా రోజులుగా కలిసి పని చేస్తున్నారు...చాలా మంది భారతీయులు అక్కడ చేరినా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక చోట కూచుని లంచ్ చేస్తున్నంత సేపూ పనిలోనూ ఇంట్లోనూ, ఎదురయ్యే కష్ట సుఖాలు కలబోసుకుంటూ వుంటారు.

ఇద్దరూ మాట్లాడుకుంటూ లంచ్ బాక్సులు విప్పుతుంటే వీళ్ళ పక్కనే వచ్చి కూచున్నాడు శ్రీకాంత్ పలకరింపు గా నవ్వుతూ, అతని బాక్సు విప్పుతుంటే ఘుమ ఘుమా వాసన వచ్చేసరికి ఏవి తెచ్చుకున్నాడబ్బా అని కాస్త కుతూహలం గా అతని బాక్సు లోకి తొంగి చూసింది స్వాతి. "ఆహా గుత్తి వంకాయ కూర"  పైకే అనేసింది...అసలే తనకి అదంటే ప్రాణం. అతను రుచి చూడండి, మా ఆవిడ చేసింది అని ఇద్దరికీ తలో కాస్తా వడ్డించాడు. ఈ స్వాతికి అస్సలు బుధ్ధిలేదు అనుకుంటూ మొహమాటం గా నవ్వింది నందిని. ఆ వేసిన కాస్త కూరా నొట్లో పెట్టుకుని చాలా బాగా చేశారండీ మీ ఆవిడ అంది. స్వాతి మాత్రం అంతటితో వదల్లేదు..."మీరెంత అదృష్టవంతులండీ...ఐతే కొత్త పెళ్ళికూతురు వంటలు అదరగొట్టేస్తోందన్నమాట" అంది శ్రీకాంత్ కి కొత్తగా పెళ్ళవడంతో... "ఆ... ఏవదృష్టమో లెండి వంటలొకటే ఆవిడ అదరగొట్టేది" అన్నాడు మహా నిరుత్సాహం గా...అదేవిటీ అలా అనేశాడు అన్నట్టు చూశారిద్దరూ అతనికేసి.

"బోల్డు చదువుకుంది...నిజం చెప్పాలంటే నాకన్నా అన్నీ మంచి గ్రేడులే...చక్కగా ఉద్యోగం చేస్తుంది...బోల్డు విలాసం గా బతకొచ్చు అనుకున్నా ఇప్పుడేమో మనకంత గండకత్తెరోమొచ్చిందీ అంటుంది ఎప్పుడు వుద్యోగం ప్రసక్తి తీస్కొచ్చినా". మరి పెళ్ళికి ముందు మీరు తనని అడగలేదా, స్వాతి అడిగేసింది..."అప్పుడు అవసరమైతే చేస్తానన్నట్టు చెప్పింది...అవసరానిదేవుంది...అదే వస్తుంది...టయోటా కారున్న వాడికి బిఎండబల్యూ కారవసరం...ఫ్యూటానున్న వాడికి లెదరు సోఫా అవసరం...దర్జా గా బతకటం అవసరమని తనే అర్ధం చేస్కుంటుంది లే అనుకున్నా...ఇప్పుడేమో మనకేం తక్కువ...ఇద్దరం రెక్కలు ముక్కలు చేసేస్కుని ఇంట్లో మనశ్శాంతి పోగొట్టేస్కునే కన్నా వున్న దాన్లో ప్రశాంతంగా పొదుపుగా బతకొచ్చుకదా అని వితండవాదం ఎప్పుడూ...ఏవిటో ఇలా అడ్డంగా దొరికిపోయాను" అని తెగ బాధ పడిపోయాడు.

 "బాధ పడకండి శ్రీకాంత్...తొందర్లోనే తను తెల్సుకుంటుంది లెండి...మాకు పరిచయం చెయ్యండి తనని...మమ్మల్నందర్నీ చూశాకా తనకి వుద్యోగం చెయ్యాలనిపిస్తుంది" అని స్వాతి అతన్ని ఓదార్చడం మొదలెట్టింది. ఎందుకో ఇంకక్కడ వుండాలనిపించక నాకు చాలా పనుంది స్వాతీ, అని త్వరగా లంచ్ ముగించేసి తన డెస్కు దగ్గరకొచ్చేసింది నందిని.

తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఎందుకో కాఫటేరియా సంభాషణ మనసుని వదలట్లేదు. శ్రీకాంత్ భార్య చెప్పినదాంట్లో అంత తప్పేవుంది అనిపిస్తోంది.  రోజూ ఈ అష్టావధానం తనవల్ల కావట్లేదని బోల్డు బాధపడుతుంది, ఈ స్వాతి కూడా ఏవిటి అతన్నే వెనకేసుకొస్తుంది...అసలు తామంతా విలాసాలని అవసరం గా పొరబడి బతికేస్తున్నామా...మనసుని వుక్కిరిబిక్కిరి చేస్తూ ఏవో అలోచనలు...అలోచనల్లోంచి మనసు నెమ్మదిగా జ్ఞాపకాలవైపు పరిగెడుతోంది.

తనకప్పుడు ఆరో ఏడో వుంటాయి..అమ్మమ్మ ఇంట్లో ...కరెంటు పోయినప్పుడు... చీకట్లో వుయ్యాలా బల్ల ఎక్కి... తనూ, పెద్దమ్మ కూతురూ...ఇద్దరూ పెద్దయ్యాక ఏమి అవ్వాలో తెగ చర్చించేస్కుంటున్నారు... ఆ గదిలో ఇంకెవ్వరూ లేరనుకుని."నేను బాగా చదువుకుని డాక్టరు అవుతా" అని ఒకళ్ళంటే "డాక్టరు ఐతే ఛీ రక్తం...అన్నీ చూడాలి బాబోయ్" అని అవతలి వాళ్ళూ..."పోనీ టీచరు ఐతే అనుకుంటే మనలాగే పిల్లలు మనల్ని తిట్టుకుంటారు"...అని రెండో వాళ్ళు..ఇలా వాళ్ళకి తెలుసున్న వృతూలన్నింటి గురించి చర్చించుకుంటుంటే ఇంతలోనే కరెంటు వచ్చేసింది...చూసేసరికి ఎదురుగుండా పందిరి మంచం మీద తమ మాటలకి నవ్వుకుంటూ తాతగారు. అయ్యో మా మాటలన్నీ వినేస్తున్నారా ఐతే ఇప్పటిదాకా అని బిక్కమొహాలు వేసిన తామిద్దర్నీ చూసి నవ్వుతూ తాతగారు "ఇలా రండర్రా మీకొక మాట చెప్పాలి" అని దగ్గరికి తీసుకున్నారు.

 అసలూ చదువుకోడం ఎందుకనుకున్నారు? అని అడిగారు...ఇది కూడా తెలీదా అన్నట్టు చూసి...వుద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించడానికి అన్నారిద్దరూ ఏకకంఠంతో...అది కాదర్రా...చదువుకోడం వెనకాల అసలుద్దేశం అది కాదు...జ్ఞానం సంపాదించడం...దాన్ని ఆస్వాదించడం...మన చుట్టూ వున్న వాటి విలువ తెలుసుకోవడం...వాటిని గౌరవించడం...మన జీవితంలో ఎన్నింటికో అర్ధాన్ని వెతకడం...ప్రహల్లాదుడు తన తండ్రి హిరణ్యకశుపుడితో ఏవన్నాడో తెలుసా...

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ

చదువుకున్నాక వుద్యోగం చెయ్యడం అన్నది అవసరం, అభిలాష వీటన్నింటి మీద ఆధారపడి వుంటుంది...కానీ మీరు గుర్తుపెట్టుకోవలసింది చదువు ప్రధానోద్దేశం డబ్బు సంపాదించడం కాదు...సంపాదన కోసమే ఐతే చదువుకోనక్కర్లేదు...మన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవచ్చు...ఆనందాన్ని ఎలా నిపుకోవచ్చు...మనమూ..మన చుట్టూ వుండేవాళ్ళూ సంతోషం గా comfortable గా ఎలా వుండొచ్చూ...ఇవి నేర్పడం విద్య ముఖ్యోద్దేశం...
                   
ఒక్కసారి ఈ లోకం లోకి వచ్చి నందిని టైము చూస్కుని...మళ్ళీ కంప్యూటర్ వైపు తిరిగి పనిలో పడిందే గాని బుర్ర పూర్తిగా పనిలో మునిగిపోలేకపోతోంది...అప్పుడు తాతగారు చెప్పింది వాళ్ళిద్దరికీ ఏమీ అర్ధం కాలేదు...అసలిప్పటికైనా అర్ధమైందా. ఏడేళ్ళ పిల్లల అలోచన కన్నా ఏమి పరిపక్వత వచ్చింది. ఇంకొకళ్ళతో పోల్చుకుంటూ...వాళ్ళ దారిలో పరిగెట్టడమే కానీ నిజంగా తమకేం కావాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించామా...దేనిలో సంతోషముందో అని వెతికి చూసిందా తనూ...అసలైన ఆనందానికి అర్ధమేవిటో ఎప్పుడైనా ఆగి అలోచించిందా తను...తను ఏరోజైనా ప్రశాంతంగా వుందా...తన చుట్టూ వున్నవాళ్ళని వుంచగలిగిందా...నందిని యంత్రం లా పని చేసుకుని పోతోంది...ఆలోచనల దొంతర్లు చెదిరిన గూటిలోంచి చెల్లా చెదరైన తేనెటీగల్లా మనసుని తలో వైపు లాక్కుపోతున్నాయి...

 పనితోనూ...ముంచెత్తుతున్న అలోచనల అలజడితోనూ విసిగిపోయి ఇంటికి చేరింది ఆరున్నరవుతుండగా...అప్పటికే ఇల్లు చేరి బంటిగాడి పేచీ ని పెద్దగా లెఖ్ఖచెయ్యకుండా టీవీ లో వస్తున్న football ని తీక్షణం గా తిలకిస్తున్న కిషోర్ "ఏవిటోయ్ ఇంత లేటు ...కాస్త కాఫీ నా మొహానపడేద్దూ "అన్నాడు నందిని మొహంలో విసుగుతో తనకేమీ సంబధం లేదన్నట్టు...బంటిగాడి అలకతీరుస్తూ వాడికేవో మాటలు చెప్తూ అలానే కాఫీ కలుపుకొచ్చి సోఫా లో కూలబడింది...కాఫీ పూర్తవ్వగానే రాత్రికేం చేస్తున్నావు..."నాకేమైనా మంచి స్పైసీ గా తినాలనిపిస్తోందోయ్...నువ్వు చేస్తావే స్టఫ్ చేసి దొండకాయ కూర అది చెయ్యకూడదూ"...కిషోర్ ఎప్పుడూ ఇది చెయ్యి అని ఆర్దర్ వేసినట్టు మాట్లాడడు...అలా అని చెసేదాకా వదిలీ పెట్టడు, చిన్న చిన్న విషయాలే కాదు..అన్నింటిలోనూ...ఈ సంగతి నందినికి అర్ధమవ్వడానికి పెళ్ళయ్యాక కొంత సమయం పట్టింది...అర్ధం అయ్యాక ఎప్పుడూ అతను ఏదైనా కోరాకా వాదించాలనో, బుజ్జగించాలనో ఎప్పుడూ ప్రయత్నించి కాలం వృధా చెయ్యలేదు. అలాగే అని సోఫాలోంచి లేచి వెళ్తూంటే వెనకనుంచి కిషోర్ "అదే చేత్తో సాంబార్ కూడా వుంటే"...అన్నాడు టీవీ వైపు నుంచి బుర్ర తిప్పకుండానే...

పడుతూ లేస్తూ...పరిగెడుతూ మధ్యలో బంటి గాడి పేచీలు తీరుస్తూ మొత్తానికి తొమ్మిదవుతుంటే వంట పూర్తి చేసి కంచం లో కూరా అన్నం...పక్కన కప్పులో సాంబారు వేసి కిషోర్ ముందు పెట్టి బంటిగాడికి తినిపించడానికి వెళ్ళబోతుంటే "అరెరే అప్పడాలు వేయించలేదా" అన్నాడు కిషోర్ నిరుత్సాహంగా. అప్పటిదాకా పక్కకి నెట్టి, పని కానిచ్చిన విసుగూ కోపం అంతా ఒక్కసారి వరద గోదారిలా కట్టలు తెంచుకున్నాయి నందినికి...ఏవిటి కిషోర్ నువ్వూ చూస్తున్నావ్ గా...వచ్చినదగ్గర్నుంచీ ఒక్క క్షణం కూడా కూచోకుండా చేస్తూనే వున్నాను...ఎంత పరిగెట్టినా తొమ్మిది లోపు బంటి గాడికి అన్నం పెట్టలేకపోతున్నాను. కనీసం వాడిని నా కాళ్ళకడ్డాం పడకుండా ఆడించడం కూడా చెయ్యవ్... ఇలా పొంగుకొస్తున్న కోపం, బాధా అన్నీ కలిపి మాటల్లో చెప్తుంటే, కిషోర్ మాత్రం చాలా ప్రశాంతంగా, "మా అమ్మ మరి సాంబార్ పెట్టినప్పుడల్లా అప్పడాలు వేయించేది ఆ అలవాటుతో" అంటూ, నందిని కళ్ళల్లోకి చూసి అక్కడే ఆపేశాడు.

నందిని వంట గదిలోకి వెళ్ళి బంటిగాడి కోసం అన్నం చల్లారబెడుతుంటే...కిషోర్ మళ్ళీ నెమ్మదిగా ..."మేవేమైనా అన్నీ నెత్తినేసుకుని చెయ్యమన్నావా...మీకంటే మేము అన్నీ చేసెయ్యగలం...మల్టీ టాస్కింగు మాకు వెన్నతో పెట్టిన విద్య అని పోటీకొచ్చి ఇప్పుడు చెయ్యలేక మానలేకా మా మీద గంతులేస్తే..." అని తనలో తనే అనుకుంటున్నట్టు నందినికి వినపడేలా అంటున్నాడు...

బంటిగాడికి అన్నం తినిపిస్తున్న నందిని కి కిషోర్ మాటలు తన చెవులు దాటి మనసుని తాకాయి...అప్పటిదాకా నీరసం...విసుగు వల్ల వచ్చిన కోపం, చికాకు ని పక్కకు నెట్టి  మనసు ఒక్కసారిగా అలోచనలో పడింది.

నిజవే వీళ్ళెప్పుడూ తమతో సమానమైన పనులు చేస్తే మీరు మాతో సమానమని వొప్పుకుంటామని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. మీరు మాపనులు చేస్తే , మేము మీపనులు పంచుకుంటామని ఏ అగ్రీమెంట్లూ రాయలేదు... సంసారపు బండి కి రెండు సమానమైన చక్రాల్ల భార్యా భర్తలు పనిని సమానంగా విభజించుకుని చేస్తున్నా...ఆడవాళ్ళని చిన్న చూపు చూడటం తో...తాము చేసే పని తక్కువ...వీళ్ళకి లాగే మనమూ సంపాదిస్తే నే మనకి గౌరవం అని మేమే అపార్థం చేసుకున్నట్టున్నాం. మీరు చేసేది కూడా మేము చెయ్యగలం అంటే అది కూడా ఆఖరికి వాళ్ళ requirement list లో చేరిపోయింది...

పన్లన్నీ పూర్తిచేసుకుని పక్కమీదకి చేరినా నందిని అలోచనల పరంపర మాత్రం కంటిమీదకి కునుకుని చేరనివ్వడంలేదు. అసలు తనకెన్ని అభిరుచులు వుండేవి...తనకి నచ్చిన ఒక పుస్తకం చదివి ఎన్నాళ్ళైంది..బంటిగాడితో హాయిగా ఆడుకుని ఎన్నాళ్ళైంది...తనూ కిషోర్ పోట్లాడుకోకుండా నవ్వుతూ ఒక గంట కబుర్లు చెప్పుకుని ఎన్నేళ్ళైంది...అమ్మెప్పుడూ వుద్యోగం చేసి సంపాదించుకుంటే స్వేఛ్ఛగా హాఇగా బతకొచ్చు అని నూరిపోస్తూ వుండేది...తను ఎంత స్వేఛ్ఛ్ గా...హాయిగా బతుకుతోంది...తను చదువుకుంది...చుట్టూ ఎవర్ని చూసినా వుద్యోగం చేస్తున్నారు...తనూ చెయ్యాలనుకుంది...కొత్త సంసారం లో , ఇంటి బాధ్యతలు అంత బరువనిపించలేదు..తనకీ సరదాగానే అనిపించింది...కానీ ఇంట్లో పనులు పెరుగుతున్నా అన్నీ చేసెయ్యాలనే అనుకుంది...తన comfort Jone గురంచి...చేస్తున్న పనిలో తృప్తి గురించి అసలు పట్టించుకుందా...తను చేస్తున్న పని వూపిరాడనివ్వని బందిఖానా లా అనిపించినప్పుడు ఇంక తను పొందుతున్న స్వేఛ్ఛ ఏవిటి? ఇలా అలోచనల్లో కొట్టుకుపోతున్న నందిని మనస్సు ఒక్కసారిగా స్ఠిమితపడింది......తను మర్నాడు ఆఫీసుకి వెళ్ళగానే చెయ్యాల్సిన పని ఏవిటో అర్ధమయ్యి...

                                                               *          *          *

అంతదాకా key board మీటల మీద చకచకా కదులుతున్న ధరణి వేళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. తను తీసుకోగలదా ఆ నిర్ణయం....ఇంటి mortgage, bank loan ఇవన్నీ ఇంక నీ బాధ్యతలే అని అంత సులువుగా తను తప్పుకోగలదా...తను రాస్తున్న కథకి ఈ ముగింపు ఇచ్చే హక్కుతనకి వుందా...ఇలా అలోచిస్తుండగానే లోపల్నుండి నీ offshore call అనుకుంటా...cell ఇక్కడ పడేసి అక్కడేం చేస్తున్నావ్...ఇప్పుడే కాస్త నిద్ర పడుతుంటే...అన్న శరత్ కేకతో వొళ్ళో వున్న PC ని పక్కన పడేసి ఒక్క వుదుటన లోపలకి పరిగెట్టింది ధరణి...

                                           

[తోచినవి రాసుకోటం తప్ప...కథ రాయటం నావల్ల కాదనుకున్న నన్ను...కథ రాయి...ప్రయత్నించు...రాయగలవు అని ఎంతగానో ప్రోత్సహించిన మాలతి నిడదవోలు గారికి కృతజ్ఞతలతో...]