కిటికీ వూచలు పట్టుకుని వేలాడుతూ చెయ్యి బయటకి చాపి, సన్నగా పడుతున్న వాన తుంపరలని పట్టుకుంటూ ఆడుతోంది చిట్టి. చిట్టీ వాళ్ల నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ పల్లెటూరికి వారం క్రితమే వచ్చారు. ఇన్నాళ్ళూ మామ్మ తాతా, బాబాయ్ పిన్నీ, గున గునా తన వెంటే పరిగెడుతూ అల్లరి చేసే బుజ్జి బంటిగాడూ, ఇంతమంది మధ్యలో అల్లరి చేస్తూ చిలో పొలో మంటూ తిరిగిన చిట్టికి ఇక్కడేం తోచడం లేదు. అసలే శుధ్ధ పల్లెటూరు, ఊళ్ళో కట్టుబాట్లూ, ఆచార వ్యవహారాలు ఎక్కువగా వున్నాయని కనిపెట్టిన చిట్టీ వాళ్ళమ్మ, చిట్టిని ఆటలకని ఎక్కడకీ కదలనివ్వడం లేదు.
పోనీ ఇంటిగల మామ్మగారితోనో, తాతగారితోనో కాస్సేపు కబుర్లు చెబ్దామా అంటే ఏవిటో ఎప్పుడూ మహా సీరియస్సు గా వుంటారు. వచ్చిన రెండో రోజు పెరట్లో ఎన్ని రకాల పూల మొక్కలున్నాయో అని చూసి మురిసిపోతుంటే ఒక బుల్లి సన్నజాజుల దండ చేతిలో పెట్టి...ఓయ్ పిల్లా ఎప్పుడూ పువ్వులు కొయ్యకేమ్. నన్నడుగు ఎప్పుడైనా కావాలంటే అని జాగర్త చెప్పేసారు మామ్మగారు. మీరెప్పుడైనా వూరెళ్తేనో...చనువుగా అడిగేసింది కనకాంబరాలకేసీ పందిరి మల్లెల కేసి మెరిసే కళ్ళతో చూస్తూ అమ్మ చేత ఎంత పెద్ద పువ్వుల జెడ కుట్టించుకోవచ్చో మనసులో లెక్కలేసేసుకుంటూ. ఆవిడకి మాత్రం నచ్చినట్టులేదు అలా అడగడం. మేవు వూరెళ్ళిమనా సరే. మొక్క మీద వేలెయ్యడానికి వీల్లేదు. నేనొచ్చేసరికి రాలిపోయి పడున్నా ఫరవాలేదు అని చెప్పేసి విస విసా లోపలకెళ్ళిపోయింది. ఆ మర్నాడు మధ్యాన్నం వేళ, వున్న ఆ బుల్లి మూడు గదుల ఇంట్లో వీధి గదిలో నుంచి వంటింట్లో కి రైమని కాస్త పరిగెట్టిందో లేదో పక్క వాటా లోనుంచి "యేయ్ అమ్మాయ్ ఏవిటా అల్లరి...చెవులు చిల్లులు పడిపోతాయ్ ఇక్కడ" అని తాతగారి గొంతు ఖంగు మనడంతో హడిలిపోయిన చిట్టికి ఏడుపొచ్చినంత పనయ్యింది. చిట్టీ వాళ్ళమ్మ చిట్టిని దగ్గరకి తీసుకుని, మన మామ్మా తాతగారూ కాదు కదమ్మా నువ్వు అల్లరి చేస్తే ముద్దు చెయ్యడానికి. వాళ్ళకి కొంచెం ఛాదస్తం ఎక్కువలాగుంది. నువ్వు బుధ్ధి గా వుండాలి, మంచి పిల్ల అనిపించుకోవాలి అని నచ్చ చెప్పింది. ఏమర్ధమయినా అవ్వకపోయినా "మంచి పిల్ల అనిపించుకోవాలి" అన్న మాట అర్ధం అవుతుందనీ. దానికోసం చిట్టి ఏమైనా చేస్తుందనీ వాళ్ళమ్మకి తెలుసు.
ఆ రోజునుంచీ చిట్టికి ఆ ఇంట్లో బాగా నచ్చిన చోటు, వీధి గది గోడకి వున్న బుల్లి కిటికీ. దాన్లో కూచోడానికి ఒక చిన్న గట్టు లా కూడా వుండటంతో చదివేసే మహా మూడో తరగతికీ ఇచ్చిన కాస్త హోమ్ వర్కూ అందులో కూచునే చేసుకునేది. మిగతా టైమ్ అంతా ఆ కిటికీ లోంచి బయటకి చూస్తూ గడపటమే. ఎండయినా వానయినా, మబ్బయినా ఆ కిటికీ లోనుండి కనపడేవే చిట్టికి. ఆ కిటికీ లో నుంచి చూస్తే కనపడే రెండు ఇళ్ళే చిట్టి ప్రపంచం, కాలక్షేపం. స్కూలు నుంచి వచ్చి, తన పని అయిపోయాకా ఆ ఇళ్ళవాళ్ళని గమనిస్తూ కూచునేది. "ఎప్పుడూ ఆ కిటికీ పట్టుకునే వేళ్ళడతావేవిటే" అని చిట్టీ వాళ్ళమ్మ ఎప్పుడైనా కేకలేసినా, పోన్లే పాపం దానికీ అంతకంటే తోచుబాటు ఏముంది అని చిట్టీ వాళ్ళనాన్న వెనకేసుకొస్తూ వుండేవారు. చిట్టికి కనపడే ఆ బుల్లి ప్రపంచమే దాని చిన్ని బుర్రకి ఒక టీవీ ఐపోయింది, టీవీలు ఇంకా ప్రతీ ఇంటిలోనూ భాగం అయిపోని ఆ రోజుల్లో.
ఆ రెండు ఇళ్ళల్లో ఒక ఇల్లు బాగా వెనకగా వుండి ముందంతా పెద్ద పెరడు వుండేది. ఆ ఇంట్లో వోణీలు వేసుకునే వయసమ్మాయి రోజూ సాయంకాలం పూట ఆ పెరడంతా తుడిచి, కళ్ళాపి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెడూతూ వుండేది. తుడవడం మొదలు ముగ్గు పూర్తయ్యేవరకూ ఆ మొత్తం పని చిట్టికి కి మహా సరదాగా అనిపించేది. అప్పుడప్పుడూ చిట్టి ముగ్గు చూడ్డం గమనించీ "ఏం బుజ్జీ, బాగా యెట్టానా ముగ్గూ ..." అని పలకరించేది. ఆ పలకరింపుకి చిట్టి లోపలకి తుర్రుమని పరిగెట్టేది.

రెండో ఇల్లు మాత్రం బాగా ముందుకి వుండేది. పేడతో అలికిన నేలా, మట్టి గోడలతో వుండే పెంకుటిల్లు. ఇంటి ముందు పెద్ద అరుగు వుండేది. పొద్దున్న లేచింది మొదలూ ఎప్పుడు చూసినా ఆ అరుగు చివర గొంతుక్కూచుని ఇంచుమించు అరవయ్యో పడిలో వున్న ఒకతను వుండేవాడు. అతన్ని చూడగానే, మొహం లో మొట్టమొదట కొట్టొచ్చినట్టు కనపడేవి పెద్ద పెద్ద తెల్లటి బుంగ మీసాలు. ఆ వయసులో కూడా మనిషి బలంగా, మంచి దిట్టంగా వుండేవాడు. అతనే ఆ ఇంటి పెద్ద. లోపల ఒక్కోగదిలో ఒక్కోసంసారం చొప్పున ముగ్గురు కొడుకులూ, కోడళ్ళూ పిల్లలతో వుండేవారు. అతని పేరేవిటో తెలియదు గానీ అందరూ అతని గురించి మీసాలాడు అనే చెప్పుకునేవారు. ఆ దారే పోయేవాళ్ళందర్నీ ఏదో ఒక మాటని వేళాకోళం చేసేవాడు. చాలా వరకూ అందరూ తలొంచుకునో, ఎటో చూస్తూనో అతన్ని తప్పించుకుని పారిపోవాలనే చూసేవారు. అయినా మొత్తానికి దొరికిపోయేవారు. ఎవరోగానీ వాళ్ళంతట వాళ్ళు అతన్ని పలకరించే ద్యైర్యం చేసేవాళ్ళు కాదు. తననంతగా భయపెట్టే ఇంటిగల తాతగారు కూడా అతన్ని చూసి తప్పించుకుని తిరగటానికి చూడటం మాత్రం చిట్టికి భలే అనిపించేది.
అతని భార్య పేరూ ఎవరికీ తెలీదు. మీసాలాడి పెళ్ళాం అనే చెప్పుకునేవారు. గడకర్రకి చీరకట్టినట్టు పొడవుగా సన్నంగా వుండేది. చింపిరి జుట్టూ, నలిగిపోయిన చీర. ఎప్పుడూ రెండో మూడో చీరలు కనపడేవి ఆవిడ వంటి మీద. మనిషి మొహంలో ఏ భావమూ లేకుండా నిర్వికారంగా వుండేది. తన పని తను చేసుకు పోవడం తప్ప పెద్దగా ఎవ్వరితోనూ మాటాడినట్టు కనిపించేది కాదు. వారానికో పదిరోజులకో ఇల్లంతా పేడతో అలికి ముగ్గు కర్ర పట్టుకుని, తిన్నంగా గీతలు గీస్తూ , వంచిన నడుము ఎత్తకుండా ఇల్లంతా ముగ్గు పెట్టేది. ఆ గీతల మధ్య కొల్చినట్టున్న ఖాళీ, కాస్త కూడా వంకర పోకుండా ఉన్ననిట్టనిలువు రేఖలూ తను స్కేలు పెట్టి గీసినా గియ్యలేదు, ఆవిడ ఎలా గీస్తుందో అని చిట్టి ఆశ్చర్యంగా గమనిస్తూ వుండేది. ఆ రెండు ఇళ్ళల్లో చిట్టికి ఆవిడే ఎక్కువ ఆసక్తి కలిగించేది. ఎప్పుడూ నవ్వదు, కోప్పడదు, ఏడవదు అసలు అలా ఎలా వుంటుందో అస్సలు అర్ధమయ్యేది కాదు.
మీసాలాడు మధ్యాన్నం పూట మాత్రం ఓ గంటా రెండు గంటలు బజారు మీద పడి కొట్ల వాళ్ళతో ఆ కబురూ ఈ కబురూ చెప్పి కూరో నారో పట్టుకొచ్చి పడేస్తూ వుండేవాడు. అతనలా వెళ్ళినప్పుడు మాత్రమే అతని కోడళ్ళు వీధరుగు మీదకొచ్చి ఇరుగమ్మతోటీ పొరుగమ్మతోటీ పిచ్చాపాటీ మాట్లాడుతూ వుండేవారు. ఆదివారాలు చిట్టీ వాళ్ళమ్మ కునుకు తీస్తుంటే, చిట్టి పుస్తకాలు వొళ్ళో వేసుకుని తన స్థావరం లో చతిగిలపడేది. ఇంటిగల మామ్మగారు కూడా పని చక్కపెట్టుకుని తాతగారు బయటకి వెళ్ళిన రోజు ఆ టైముకి వీధరుగు మీద చేరి, ఆ బాతాఖానీ లో మాటకలుపుతూ వుండేవారు.
"అసలు మా మావ, మా అత్త వల్లే అలా తయ్యారయ్యాడండీ...వండిందంతా ఆడికే వూడిచి పెట్టి మేపుతా వుంటదీ. పోనీ కదా అని మేవేమన్నా ఇచ్చినా ఆడికే ఎట్టేత్తదీ." లాంటి మాటలు వాళ్ళ కబుర్ల మధ్య దొర్లుతూ వుండేవి. పుస్తకాలు ముందేసుక్కూచ్చుని ఏ బొమ్మలో వేసుకుంటున్న చిట్టి చెవులకి వాళ్ళ కబుర్లు రేడియో నాటకంలా వినపడుతూ అర్ధమయ్యీ అవనట్టు వుండేవి.
మూడో తరగతి లోంచి చిట్టి ఏడో తరగతిలోకి వచ్చేసింది కానీ, ఎదురింటి దినచర్యలో ఏ మార్పూ రాలేదు. ఒక రోజు చిట్టి స్కూలు నుంచి ఇంటికి వస్తుంటే ఎదురింటి అరుగుమీద ఒక చిన్న చీరల మూట వాడినీ, వాడి చుట్టూ చేరి బేరాలాడుతున్న అమ్మలక్కలనీ చూసింది. "ఒక్క సీరే కదే తీసుకో. నీ సీరలు బాగా సిరుగు పట్టేసినియ్. ఏవనడులే" ఆంటోంది పెద్ద కోడలు. అప్రయత్నంగా చిట్టి మీసాలాడి పెళ్ళాం మొహం లోకి చూసింది. కొత్త చీర వొళ్ళో పెట్టుకుని అపురూపరంగా తడుముతున్న ఆమె మొహంలో ఒక చిన్న వెలుగు. ఆమె మొహం చూడగానే చిట్టికి ఎందుకో మనసులో సంతోషం గా అనిపించింది. "అది కాదే దీనికి పైసలు ఏడ్నించి తేవాలా" అంటోంది ఆమె. ఇన్నేళ్ళల్లో చిట్టి ఆవిడ గొంతు వినడం బహుశా అదే మొదటిసారి. "అంతా ఇప్పుడే ఇచ్చెయ్యమన్నానేటమ్మా. వారం వారం కొంత కొంత సొప్పున ఇద్దువులే" అంటున్నాడు చీరలబ్బాయ్.
ఆ రోజు రాత్రి, చిట్టీ వాళ్ళు అన్నాలు తినేసాకా కరెంటు పోవడంతో వీధి గదిలో కూచుని దీపం వెలుగులో లెక్కలు చేసుకుంటుంటే ఎదురింట్లోనుండి పెద్ద పెద్దగా కేకలూ తిట్లూ. వీధి మొత్తం వినబడేలా అరుస్తున్నాడు. అది మీసాలతని గొంతే. "నీ మొహానికి కొత్త సీర కావలిసొచ్చిందేటి, రేపాసీరలోడి మొగాన్న ఇది కొట్టకపోయావో కాళ్ళిరగ్గొడతా"అని ఇంకా ఏవేవో తిట్లు తిడుతూ గట్టిగట్టిగా అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. లోపలనుంచి సన్నగా అతని పెళ్ళాం ఏడుపు వినపడుతూనే వుంది.ఆ ఇంట్లోంచి ఇంకెవ్వరి మాటా వినపడట్లేదు. తిట్టడమే కాదు కొట్టాడేమో కూడా. ఆ అలోచన రాగానే.చిట్టికి ఏమీ చదవబుధ్ధి కాలేదు. చదువుతున్నది కళ్ళ వరకే చేరుతోంది. బుర్రలోకి ఏదీ ఎక్కడంలేదు.గుండె లో ఏదో గుబులుగా అనిపించింది. ఏదో తెలియని నిస్సహాయత, ఇదని తెలియని బాధా ఆ చిన్ని గుండెని చుట్టుముట్టాయి...
అది జరిగిన వారం రోజులకి చిట్టి స్కూలునుండి వస్తూ వీధి మళుపు తిరిగేసరికి, తమ ఇంటి అరుగుల నిండా, ఎదురింటి చుట్టూ జనాలు మూగి వున్నారు. ఏవిటా ఇంతమంది వున్నారు అనుకుంటూ నడుస్తున్న చిట్టికి దగ్గరకి వచ్చేసరికి మీసాలాడి కూతురి ఏడుపు పెద్దగా వినపడింది. ఇంటికి దగ్గరవుతున్నకొద్దీ, మనసు ఏదో కీడు శంకిచింది. ఆ జనాలందరినీ చూస్తూ నడుస్తున్న చిట్టికి ఆ గుంపు మధ్యలోనుంచి ఎవరినో చాప మీద పడుకోబెట్టినట్టు కనపడుతోంది. కాళ్ళూ, చీర మాత్రం కనపడుతున్నాయి.
ఆ చీర...ఆ చీర తనకి చాలా పరిచయమున్నదే...ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నదే...
గుండె చాలా వేగంగా కొట్టుకోవడం చిట్టికి తెలుస్తూనే వుంది. కడుపులో తిప్పుతున్నట్టనిపించింది ఒక్కసారిగా. ఇంటికి వొక్క పరుగున వచ్చింది. తనకి తెలిసిపోతున్న నిజమే అయినా ఎందుకో వస్తూనే కంగారుగా అమ్మని అడిగింది ఏమయిందమ్మా? అని. తననుకుంటున్న జవాబు, అమ్మ నోట్లోంచి రాకూడదని ఆ చిన్నిగుండె ఆరాట పడుతోంది. కానీ రాకూడదని తననుకున్నదే అమ్మ నోట్లోంచొచ్చింది. "పాపం ఇవాళ మధ్యాన్నం పోయిందే మీసాలాడి పెళ్ళాం" అని. వెళ్ళు వాళ్ళ పక్కనుంచి వచ్చావ్ గా వెళ్ళి స్నానం చేసి బట్టలు తడిపెయ్ అంటోంది అమ్మ. తనకేవిటో బాధ ఆగట్లేదు. కళ్ళమ్మట నీళ్ళూ రావడం లేదు. గుండె పట్టేసినట్టు ఒకలాగ వుంది.
చిట్టి స్నానం చేస్తుంటే, మార్చుకోవడానికి తెచ్చిన బట్టలు పట్టుకుని వాళ్ళమ్మ స్నానాల గది ముందు నుంచుంది. అప్పుడే పెరట్లోకొచ్చిన ఇంటిగల మామ్మగారూ, అమ్మా మాట్లాడుకోటం చిట్టికి వినపడుతూనే వుంది. "వొంట్లో నల్తగా వుందనిపించి పొద్దున్న పదింటికి ఆసుపత్రికి వెళ్ళొచ్చిందటమ్మాయ్, బాగా నీరసంగా వున్నావ్, రక్తం లేదు, మంచి తిండి తిను అని చెప్పి బలానికేదో టానిక్కు రాసిచ్చిందిటా డాట్రమ్మ. ఆ చీటీ తెచ్చి కోడలికి చూపించి పక్కన పడేసి, ఇంత వుడకేసి వాడికి పెట్టిందిట. వాడు బయటకి పోయాక మంచం మీద వాలిందిట. ఎంతకీ లేచి నాలుగు మెతుకులు తిన్న అలికిడి కాకపోటం తో కోడలు లేపిందిట. అప్పటికే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయిట... హ్మ్" అని నిట్టూర్చింది మామ్మగారు. పుణ్యాత్మురాలు, సునాయాస మరణం. బతికున్నన్నాళ్ళు ఎన్ని పడ్డా పాపం అంటోంది చిట్టీ వాళ్ళమ్మ.
ఆ రోజంతా చిట్టి చాలా దిగులుగా వుండడం చూసి ఎలా బతుకుతుందో వెర్రి పిల్ల అనుకున్నారు వాళ్ళ అమ్మా నాన్నా.
ఆవిడ పోయిన పదోరోజు సెలవు కావడం తో కిటికీ లో కూచుని ఎదురింట్లో హడావుడి చూస్తోంది చిట్టి. వూరంతా పిలిచి భోజనాలు పెడుతున్నారు. మధ్యాన్నం మూడింటికి రెండు కావెళ్ళనిండా కొత్త చీరలు పట్టుకొచ్చి, పునిస్త్రీ గా పోయింది పుణ్యాత్మురాలు అని పదే పదే చెబుతూ వాళ్ళ చుట్టాలకీ, వూళ్ళో కావలసిన వాళ్ళకీ అందరికీ మీసాలాడి చేతులమీద గానే కొడుకులు చీరలు ఇప్పిస్తున్నారు. వొక్క సారి చిట్టికి వొళ్ళో కొత్త చీర పెట్టుకుని తడుముతున్న మీసాలాడి పెళ్ళాం మొహం మనసులో మెదిలింది. కళ్ళల్లోంచి నీళ్ళు తన్నుకొచ్చాయి. టప్ మని ఆ కిటికీ తలుపులు మూసేసొచ్చి లోపలకెళ్ళి పడుకుంది. ఆ వూర్లో వున్నన్నాళ్ళల్లో మళ్ళీ ఎప్పుడూ ఆ కిటికీ లోంచి చూడాలనిపించలేదు చిట్టికి.