12/28/20

కలల తీరం

"మహీ .... కాఫీ పెట్టావా? మగ్ లో పోసెయ్. వెళ్తూ కార్ లో తాగుతాలే. " హడావిడి గా రెడీ అవుతూ బెడ్ రూమ్ లోంచే అరిచి చెప్పాడు కార్తిక్.

"కాఫీ ఇక్కడ పెట్టాను."

"నేనేం చెప్పాను? వొక సారి చెప్తే వినిపించుకోలేనంతలా ఏం చేస్తున్నావ్?"

"ఏం చెప్పావ్ నువ్వూ?"

"మగ్ లో పొయ్యమన్నాను కదా!"

" ఓ అవునా... సరే పోస్తాను లే."

"ఏంటీ వొక పక్కన టైమ్ అయిపోతుంటే అంత తాపీగా చెప్తున్నావ్." మహీ ఎక్కడా కంగారు పడకపోవడం కార్తీక్ ని ఇంకా చిరాకు పెడుతోంది.

"ఇదిగో మగ్."

"నీకు నేనెవన్నా పట్టడం లేదు ఈ మధ్య."

"సరే టైమ్ అయిపోయిందన్నావ్ కదా. ఇంక వెళ్ళు."

"డాడ్, కెన్ యూ డ్రాప్ మీ ఎట్ మై స్కూల్? ఇట్స్ గెటింగ్ లేట్ ఫర్ మీ." కార్తీక్ లాగానే హడావిడి గా పరిగెడుతూ వచ్చాడు వరుణ్.

"అమ్మని అడగచ్చు కదరా. నాకే టైమ్ అయిపోతుంటే వొకపక్క."

"ఓహ్ నో. అమ్మ నా. నన్ను నా పని చేసుకోనివ్వదు. వంద ప్రశ్నలడుగుతుంది వెళ్తున్నంత సేపూ".

"వరుణ్ దట్స్ బాడ్. నువ్వు చాలా రూడ్ గా మాట్లాడుతున్నావు రా" కొడుకుని మందలిస్తూనే మహి మొహం లోకి చూసాడు కార్తీక్.

మహి ని చూస్తే వరుణ్ అన్న మాటలకి ఏమీ బాధ పడ్డట్టు లేదసలు. వీళ్ళు వెళితే తలుపేసుకుందాం అన్నట్టు నిర్లిప్తం గా చూస్తోంది.

వరుణ్ ఇలా  అన్నప్పుడల్లా మహీ ఎప్పుడూ పెద్ద గొడవ చేసేది. వాడికి తనంటే కొంచెం కూడా గౌరవం లేదనీ, తను చెప్పినది వినిపించుకోడనీ బోల్డు కంప్లెంట్లు చెప్పేది. దానికి కార్తీక్ కొడుకునే వెనకేసుకొచ్చేవాడు. వాడికి ఇంకా ఇంపార్టెంట్ పనులు చాలా వున్నాయ్ అని మహీ వాదనని తేలిగ్గా తీసి పారేసే వాడు. కానీ కొన్నాళ్ళుగా మహీ దగ్గరనుంచి ఎటువంటి కంప్లెయింట్లూ రావడం లేదసలు.

మహీ గొడవపడితే బావుణ్ణనిపించింది వొక్కసారి కార్తీక్ కి.

డ్రైవ్ చేస్తుంటే కూడా మహీ నిర్లిప్తమైన మొహమే గుర్తొస్తూ వుంది. ఇవాళే కాదు, కొన్నాళ్ళుగా గమనిస్తున్నాడు.

"వరుణ్, ఈ మధ్య అమ్మ నాతో అసలు దేనికీ గొడవ పడట్లేదు రా ...!"

"ఓహ్ దట్స్ కూల్ దెన్" ఐ పాడ్ లోంచి తల తిప్పకుండానే సమాధానం చెప్పాడు వరుణ్.

"అది కాదురా. అబ్సర్వ్ చేసావా, కొన్ని రోజులుగా తను చాలా సైలెంట్ గా వుంటోంది."

"నాకవన్నీ అబ్సర్వ్ చేసే టైమ్ లేదు డాడ్...హావ్ అ గుడ్ డే...సీ యూ" స్కూల్ రాగానే హడావిడి గా కార్ దిగి పరిగెత్తాడు వరుణ్.

 వాడిదంతా నా పోలికే అని పొంగిపోయేవాడు కార్తీక్ ఎప్పుడూ. పదిహేనేళ్ళకే తనకి ముఫ్ఫైల్లో వచ్చిన ఆ నిర్లక్ష్యం వచ్చేసిందా సందేహం ముల్లులా గుచ్చింది.

       ***

"మహీ ఇవాళ పొద్దున్న ఆరింటికే వెళ్ళాలని చెప్పాను. గుర్తుందా."

"ఆ... నీ కాఫీ, బ్రేక్ ఫాస్ట్ టేబుల్ మీద పెట్టేసాను."

"అబ్బా అది కాదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగవా?"

"ఎక్కడికి వెళ్తున్నావ్?"

మహి మొహం లో నిరాసక్తత చూసాకా కార్తీక్ చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పాలనిపించలేదు. అనూ ని డైరెక్ట్ గా చూస్తే సర్ప్రైస్ అవుతుందిలే అనిపించింది.

అనూ కార్తీక్ కి పిన్ని కూతురు. అంతకంటే ఎక్కువ, మహి కి ప్రాణ స్నేహితురాలు. ముగ్గురూ వొకే స్కూల్, ఇంటర్ వరకూ వొకే కాలేజ్. ఇంటర్ తర్వాత ముగ్గురూ మూడు దార్లు ఎన్నుకున్నారు. కార్తిక్, మహీ ఇంజనీరింగ్ వైపు వెళ్తే, అనూ మెడిసిన్ చదివి తర్వాత సైకాలజీ లొ స్పెషలైజ్ చేసింది. అనూ ఇండియాలో సెటిల్ ఐతే, కార్తీక్, మహీ అమెరికాకి వలస వచ్చేసారు. కాన్ఫరెన్స్ పని మీద యూ.ఎస్ లో మీ వూరే వస్తున్నా అని క్రితం వారం మైల్ పెట్టింది. 

***

"అడ్రెస్ మైల్ చేసావు కదా, నేనే కాబ్ లో వచ్చేద్దామనుకున్నాను. లేకపోతే మహీ వస్తుందనుకున్నా. నువ్వే స్వయంగా వస్తావని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు రా..." సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అంది అనూ.

"మహి కి అసలు చెప్తే కదా నువ్వొస్తున్నట్టు."

"చెప్పలేదా? అదేం?"

"వూరికే. చిన్న సర్ప్రైజ్ ఇద్దామని."

"అబ్బో నీకిలాంటి ఆలోచనలెప్పట్నుంచీ వస్తున్నాయి బాబూ..." అనూ గొంతులో కాస్త వెటకారం తొంగి చూసింది.

"అదీ కాక చూసి చాలా రోజులయ్యింది కదే..."

"రోజులు కాదురా. ఏళ్ళయింది. రెండేళ్ళ ముందు వరకూ కనీసం మహీ అయినా అప్పుడప్పుడూ ఫోన్ చేసేది, నీ మీద కంప్లెయింట్లు చెప్పడానికి. ఈ మధ్య అదీ మానేసింది. పిల్లాడేం చేస్తున్నాడు? ఎలా వున్నాడు?"

కారు అద్దంలోంచి బయటకి చూస్తూ గల గలా మాట్లాడుతోంది అనూ.

"వాడిప్పుడు లెవెంత్ గ్రేడ్. ఎప్పుడూ అబ్బాయిగారు బిజీ బిజీ. నాకే అప్పుడప్పుడూ దర్శనమిస్తూ వుంటాడు."

"నీకులాగే అనమాట. రోజులెంత గిర గిరా తిరిగిపోతున్నాయో కదా! నిన్న గాక మొన్నేమహీ వాడినెత్తుకుని అన్నం తినిపిస్తున్నది కళ్ళ ముందు మెదులుతోంది. అప్పుడే అంత పెద్దాడైపోయాడు. అవునురా మహీ ఎలా వుంది?"

"............."

బయటకి చూస్తున్నదల్లా, అవతలవైపు నుంచి సమాధానం ఎంతకీ రాకపోయే సరికి కార్తీక్ వైపు తిరిగింది. కార్తీక్ మొహం సీరియస్ గా వుంది.

కాస్సేపు మౌనం తర్వాత కార్తీకే అన్నాడు.

"మహీ గురించే నీతో కాస్త మాట్లాడాలి."

"ఏం? ఏమయిందీ? ఏదయినా సమస్యా దానికీ?"

"..........."

కార్తీక్ ఇంతలా ఆలోచిస్తున్నాడంటే విషయం ఏదో పెద్దదే అనిపించి ఏం చెప్తాడా అని అతనికేసే చూస్తోంది అనూ.

"దానికసలు కోపమే రవట్లేదు అనూ..."

"నీ కోపం చూసి దానికి వైరాగ్యం వచ్చి వుంటుంది లే. అయినా అదా నీ సమస్యా? ఇది చెప్పడానికా ఇంతలా ఆలోచించావు?" తేలిగ్గా నవ్వేసింది.

"ఇలా తీసి పడేస్తారనే ఎవరితో అయినా చెప్పడానికి కూడా భయపడుతున్నాను. నువ్వంటే చిన్నప్పట్నుంచీ మా ఇద్దరికీ తెలుసున్నదానివని నీతో చెప్పాలని పనికట్టుకుని ఎయిర్ పోర్ట్ కి వస్తే ఆఖరికి నువ్వు కూడా..." నిష్టూరంగా అన్నాడు కార్తిక్.

"పొద్దున్నే లేచి మరీ నాకోసం వచ్చావంటే ఏదో వుందనుకున్నాలే గానీ... అందులో సమస్య ఏంటో నాకర్ధం అవ్వట్లేదు. మరీ వొక్క ముక్కలో చెబితే ఏం తెలుస్తుంది రా?"

"మహీ నాతో అసలు గొడవపడ్డం లేదు. నేను ఏమన్నా ఎదురు చెప్పడం లేదు. ఇంతకన్నా ఏం చెప్పాలో నాకూ అర్ధం కావట్లేదే. చెప్పాలంటే నాతోనే వున్నా అది నాతో వున్నట్టనిపించట్లేదు."

"ఉమ్... ఎన్నాళ్ళుగా అలా వుంటోంది?"

"నేనొక నెలగా గమనిస్తున్నా..."

"సరేలే ఏదో విషయం ఎక్కువగా ఆలోచిస్తూ వుండి వుంటుంది. నేను ఈ కాన్ఫరెన్స్ అయ్యాకా వీకెండ్ ఇంట్లోనే వుంటానుగా అప్పుడు మాట్లాడి చూస్తాలే. కంగారు పడకు."

                                                               ***

"కార్తీక్, వరుణ్ ఏరీ?" లేటుగా నిద్ర లేచొచ్చి కాఫీ కలుపుకుంటూ అడిగింది అనూ.

"కార్తీక్ ఆఫీస్ కి వెళ్ళాడు. వరుణ్ కి ఏదో క్లాస్ ట..."

"వీకెండ్ కూడానా...!"

"ఊ..."

"నీకూ కాఫీ కలపనా?"

"సరే..." ఏదో ధ్యాసలో వున్నట్టు వస్తున్నాయి మహీ దగ్గరనుంచి సమాధానాలన్నీ.

"పదా కాఫీ తాగుతూ కాస్సేపు పాటియో లో కూచుని కబుర్లు చెప్పుకుందాం. వచ్చినప్పటినుంచీ ఏదో హడావిడే అయిపోతోంది. ఈ వీకెండ్ కి ఇంకేం పనులు పెట్టుకోలేదు. నీతోనే గడపాలనీ " అనూ వెనకే నడిచింది మహీ.

పొద్దుటి నీరెండ వెచ్చగా తగుల్తోంది. ఏదో తనది కాని చోట వున్నట్టు దిక్కులు చూస్తూ కూచుంది మహి. తనతో మాట్లాడ్డం పెద్ద ఆసక్తి వున్నట్టు కూడా అనిపించలేదు అనూకి మహిని చూస్తుంటే.

వరుణ్ చదువు గురించీ, కార్తీక్ ప్రోజెక్ట్స్ గురించీ ఏవో ప్రశ్నలు వేస్తూ, మహీనే గమనిస్తోంది అనూ. ఎటో చూస్తూ ఊ, ఆ అన్న పదాలు దాటకుండా జవాబులు చెప్తోంది మహి.

"మహీ, మనం కాలేజీ దగ్గర సమోసాలు తినే వాళ్ళం ఆ బండి గుర్తుందా?"వున్నట్టుండి టాపిక్ మార్చింది అనూ.

"అవునే. చాలా బావుంటాయి కదా సమోసాలక్కడ. ఆ బండి ముందు కూచుని ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్లం. రోజూ మనం అక్కడ సమోసాలు తినేటప్పుడే ఆ రోడ్ లో కార్తీక్ వెళ్ళేవాడు. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే వెనక్కి తిరిగి దొంగ చూపులు చూసే వాడు. స్కూల్లో మనతో కలిసే తిరిగినా, కాలేజీకొచ్చేసరికి అబ్బాయిల గ్రూప్ వేరయిపోయింది కదా!

నీకు గుర్తుందా, ఇంజనీరింగ్ లో వుండగా అందరం సెలవలకి వచ్చినప్పుడు, ఇంట్లో ఫ్రెండ్స్ దగ్గరకెళ్తున్నా అని మనిద్దర్నీ సినిమాకి తీస్కెళ్ళాడు. మీ బాబాయ్ చూసేసారు. ఇంటికెళ్ళాక పెద్ద గొడవ.

ఏయ్ అనూ నీకు గుర్తుందా, న్యూయర్ కి నాకొక్కదానికే గ్రీటింగ్ పంపాడు. నీకు పంపడం మర్చిపోయాడని నీకెంత కోపమొచ్చిందో. "

అప్పటిదాకా మాటలే మర్చిపోయినట్టున్న మహి, కట్టలు తెంచుకున్న సెలయేరులా గల గలా మాట్లాడటం మొదలెట్టింది. మధ్యలో హాయిగా నవ్వుతోంది. ఆ నవ్వు అచ్చూఅనూకి తెలుసున్న మహిదే. అవునూ, కాదూ అనడానికి తప్ప అనూ కి ఏ అవకాశం ఇవ్వలేదు. అనూ వున్న రెండు రోజులూ మహీ అలా కబుర్లు చెబుతూనే వుంది. ఆ కబుర్ల నిండా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలూ, ఆ జ్ఞాపకాల నిండా అప్పటి కార్తీక్ వుండటం అనూ దృష్టి దాటిపోలేదు.
    
***


"వచ్చి అరగంట గడిచిపోతోంది. ఇంకో గంట ఆగితే నీ ఫ్లైట్ టైమ్ కూడా అయిపోతుంది. ఏదో కనిపెట్టేస్తానన్నావుగా ఈ రెండ్రోజుల్లో.  వచ్చినదగ్గర్నుంచీ ఎటో చూస్తూ కూచున్నావ్?" చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది కార్తీక్ మొహం లోనూ, స్వరం లోనూ.

అనూ ప్రశాంతం గా నవ్వింది.

"నేనలా అన్నానా? నీకలా అర్ధం అయ్యిందా? "

"...."

"సరే ఈ రెండు రోజుల ఎనాలిసిస్ కి రిసల్ట్ కావాని నీకు అంతే కదా. నేనొకటి అడుగుతాను చెప్పు. మనం కాలేజీలో వున్నప్పుడు, నువ్వు మహీ వెంటపడేటప్పుడు నువ్వు చెప్పిన అందమయిన కబుర్లేమయినా నీకు గుర్తున్నాయా?"

"అవన్నీ ఎప్పటి రోజులో... ఇంకా అవన్నీ తల్చుకుంటూ కూచుంటామా?"

"దానికవన్నీ గుర్తున్నాయి. మీ పెళ్ళయ్యాకా, నీ కెరీర్ లో స్ట్రగుల్ అయ్యే రోజుల్లో మీకు రోజూ గొడవలయ్యేవి కదా... అప్పట్లో అది ఫోన్ చేసినప్పుడల్లా చెప్పుకునే విషయాలవే వుండేవి. నీ వర్క్ టెన్షన్స్ అన్నీ దానితో చిన్నచిన్న విషయాలక్కూడా పెద్ద గొడవ చేస్తున్నావనీ. తను నీకు వొక స్ట్రెస్ బస్టర్ లా మాత్రమే కనపడుతున్నాననీ చెప్పుకుని బాధ పడుతూ వుండేది. ఆ విషయాలేవన్నా నీకు గుర్తున్నాయా?

"ఊ... ఎంత స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్ కి వచ్చానో గుర్తొస్తూ వుంటుంది. "

"అవన్నీ దాదాపు అది మర్చిపోయింది.అవి బాధపెట్టినన్నాళ్ళూ నీతో గొడవ పడేది. నాతోనో మరొకళ్ళతోనో చెప్పుకుని బాధ పడేది."

"ఏమంటున్నావ్ నువ్వూ...?"

"అది నీతో జీవితాన్నిముడేసుకున్నప్పుడు నువ్వే తన జీవితం అనుకుంది.ప్రతీ విషయం నీతో చెప్పాలనుకునేది. నువ్వూ దానితో అన్నీ పంచుకోవాలనుకునేది. దానికి పెద్దగా అనిపించే సమస్యలు నీకు చిన్నగా అనిపించి తీసి పారేసేవాడివి. వోదార్పు ఆశించిన చోట ఎగతాళి ఎదురవడంతో అది నెమ్మదిగా నీకు దూరమవడం మొదలెట్టింది. అది దూరం జరగడం కూడా నువ్వు గమనించలేదు."

"కమాన్ అనూ! చిన్నప్పుడు చెప్పినట్టే కబుర్లు చెపుతూ కూచుంటే కుదురుతుందా. నేనేదో నాకోసమే అంతా చేసినట్టు మాట్లాడతున్నావ్ నువ్వు కూడా..."

"ఎందుకు అంత తొందరగా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళిపోతావ్? నన్ను పూర్తిగా చెప్పనివ్వు." అనూ గొంతులో తీవ్రత చూసి కార్తీక్ నోరు మెదపలేదు.

నువ్వే లోకమనుకున్న మహీ నెమ్మదిగా తన టైమ్ అంతా బాబు కి ఇచ్చేసింది. ఇప్పుడు వాడూ అమ్మ కొంగట్టుకుని తిరిగే దశ దాటిపోయాడు. నీ పరుగులు చూసి, తనూ అలా పరిగెడితే పిల్లాడేమయిపోతాడో అని ఎప్పుడూ కెరీర్ బిల్డ్ చేస్కోవాలనుకోలేదు. దానికంటూ వ్యాపకాలేవీ లేవు. నువ్వు దానితో మాట్లాడ్డవంటే, నీ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టూ అదేపనయినా చెయ్యలేకపోతే దాని గురించిన దెప్పి పొడుపులే. అవునా?

"నువ్వూ చూస్తున్నావ్ కదా నేనెంత బిజీ గా వుంటానో. నా చిరాకు లో నాకు టైమ్ కి ఏది అందకపోయినా ఇంకా లేట్ అవుతుంది కదా?"

"నేను బిజీ అని ఎవరితోనయినా చెప్పడం అంటే ఏంటో తెలుసా? నాకు నీకన్నా ముఖ్యమైన పని వుంది అని.

చూడు కార్తీక్, చాలా జంటల్లో వొకళ్ళు ఎక్కువ యాంబిషియస్ గా వుంటారు. మిగిలిన భాగస్వామికి దాని వల్ల తమ జీవితం వెలితి గా అనిపించొచ్చు. అలా అనిపించినప్పుడు ఫ్రెండ్స్ తోనో, పిల్లలతోనో, హాబీలతోనో ఆ వెలితిని నింపేస్తారు. కనీసం నింపేసామన్న భ్రమలో అయినా బతికేస్తారు.

మహీ కూడా ఆ వెలితిని పూడ్చేసుకుంది."

"దేనితో?" కార్తీక్ మొహం లో ఆశ్చర్యం, అసహనం పోటీ పడుతున్నాయ్.

"కలలతో"

"అంటే? నాకేం అర్ధం కావట్లేదు."

"నువ్వనుకుంటున్నట్టూ నిద్రపోతూ కనే కలలు కాదు. కళ్ళు తెరుచుకుని కనే కలలు."

"వాట్!?"

"ఫాంటసీ అంటుంటారు తెలుసు కదా. మనకి నచ్చినవి అందుకోలేకపోయి నిరాశ ఎదురైనప్పుడు అది మనకి అందినట్టు వూహించుకుంటే కొంతవరకూ మనసుకి తృప్తి కలుగుతుంది. మొదట్లో అది కాస్సేపు మనసు సేదతీరటానికే ఆ వూహల ఆసరా తీసుకునుండొచ్చు. నెమ్మదిగా ఆ కలలే దాని ప్రపంచం, దాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ నిజం వొక కలా అయ్యాయి. నువ్వు విసుక్కున్నా, కసురుకున్నా తాత్కాలికమే కదా అని  నవ్వుతూ వూరుకుంటోంది. చదువుకునే రోజుల్లో మహీ కి కోపం, చిరాకూ అన్నవి ఏమయినా తెలుసా? నాకు తెలిసి అది ఆ ప్రపంచంలోనే బతుకుతోంది. ఇది కేవలం వొక సైకాలజిస్ట్ గా ఎనలైజ్ చేసి చెప్పడం లేదు. చిన్నప్పట్నుంచీ దాంతో దగ్గరగా వున్న ప్రాణ స్నేహితురాలిగా, దాని సున్నితమైన మనసు తెలుసున్నదానిగా చెప్తున్నా.

నువ్వన్నది నిజమే రా. అది నీతో వుంటున్నా నీతో వుండటం లేదు. ఎప్పుడూ విజయాన్నే చూసిన నీకు ఎంత చెప్పినా ఈ పరిస్థితి అర్ధం అవకపోవచ్చు."


"తప్పంతా నాదే అంటావు. అంతేనా?"

"నీది తప్పనో, దానిది తప్పనో ఏవీ అనడం లేదు. అసలు నేనెవరు అది తేల్చటానికి? తప్పూ, వొప్పూ అనే త్రాసులో ఇమడని విషయాలు ఈ ప్రపంచం లో చాలా వుంటాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంతే.

కార్తీక్, మనం చదువుకునేటప్పుడో, వుద్యోగం చేసేటప్పుడో కొంతమంది పరిచయం అవుతారు. చాలా దగ్గరగా అనిపిస్తారు. కొన్ని రోజులు చనువుగా మసులుతాం. కొన్నాళ్ళకి ఏదో రకంగా దూరం అయిపోతాం. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మైల్ వచ్చినా, కాల్ వచ్చినా టైమ్ వున్నప్పుడు చూద్దాం లే అని ఇగ్నోర్ చేస్తాం. వాళ్ళని మన ప్రయారిటీ లిస్ట్ లో చివరికి తోసేస్తాం.

అలా తోసేసినది జీవిత భాగస్వామే అయితే? అవతలవాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లో తమ నంబర్ ఏంటో వాళ్ళకి అర్ధమైపోతే? నువ్వే ఆలోచించి చూడు."

"............."

"ఫ్లైట్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేసారు. వస్తాను మరీ..." కార్తీక్ భుజం మీద చెయ్య వేసి మెత్తగా నొక్కి వదిలి చెప్పింది అనూ.

"అనూ... నా మహీ నాకెప్పటికీ దొరకదా?" తనకి తెలిసి మొదటిసారి తన గొంతు బేలగా వినబడింది కార్తీక్ కి.

చెకిన్ వైపు వెళుతున్న అనూ తల తిప్పుకుండానే చెప్పింది.

"దొరకచ్చు. తన కలల తీరం కన్నా మంచి ప్రపంచం దానికి దొరికినప్పుడు."

కనుమరుగైపోతున్న అనూ కేసే చిన్నపిల్లాడిలా బెంగగా చూస్తూ వుండిపోయాడు కార్తీక్.




















No comments: