12/29/20

మనసు పలికే...
బానెట్ ఎత్తి కాస్సేపు కుస్తీ పట్టిన డ్రైవర్, వాన్ డోర్ తీసి వొక కాలు లోపల పెట్టి "ఏటయ్యిందో నాకు తెలీడం లేదమ్మా. సూత్తుంటే బాగా పల్లెటూరిలా వుంది. వూళ్ళోకెళ్ళి ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో సూసొత్తాను. కూసింత టైమ్ పట్టేలాగే వుంది మరి. ఇక్కడ రోడ్డుపక్కన ఏదో చిన్న వొటేలు వుందమ్మా. మనాళ్ళందరూ అక్కడే కూసున్నారు" అని వ్యాన్ లో వంటరిగా మిగిలిపోయిన కిరణ్ తో చెప్పి వూరి వైపు వెఌపోయాడు డ్రైవర్.


ముందురోజు మొత్తం మెడికల్ కాంప్ లో పనిచేసి అలిసిపోడం వల్ల అతను మాట్లాడుతున్నది తనతోనే అని తెలుస్తున్నా కనురెప్పలు పైకి లేవడానికి ససేమిరా అన్నాయి. కాస్సేపు అలాగే బధ్ధకంగా కిటికీకి తలవాల్చికూచుండిపోయింది. అటుగా వెళుతున్న పిల్ల తెమ్మెర చెంపలు నిమిరి పలకరించి వెళ్ళింది. ఆ స్పర్శతో ఏదో పరిచయమున్నట్టనిపించి కళ్ళు విప్పి చుట్టూ చూసింది కిరణ్. 

ఆ పరిసారాలు కూడా తనకి బాగా తెలుసున్నట్టనిపించాయి. నెమ్మదిగా వాన్ దిగి, చుట్టూ చూస్తూ అందరూ కూచుని వున్న పాక హోటల్ వైపు నడిచింది. ఒక పక్కగా వున్న టేబుల్ దగ్గర కూచుని కాఫీ చెప్పింది. తన కేసి పలకరింపుగా వొకసారి చూసి మిగిలిన స్టాఫంతా ఎవరి కబుర్లల్లో వాళ్ళు మునిగిపోయారు.

చుట్టూ చూస్తూ కాఫీ సిప్ చేస్తుంటే, రోడ్డుకవతలి వైపు చిన్న బస్ స్టాప్, సూరయ్య దంపతుల జ్ఞాపకార్ధం అని సగం చెరిగిన అక్షరాలు. ఆ పేరు తనకి బాగా పరిచయమే. కోపమొచ్చినప్పుడల్లా రవిని సూరయ్యా అని పిలిచేది కదూ. అలా పిలిచినప్పుడల్లా, ఎర్రగా మారిపోయే రవి మొహం గుర్తుకొచ్చి తనకి తెలియకుండానే పెదాలు సన్నగా విచ్చుకున్నాయి. 

ఆ బస్ స్టాప్, ఆ వూరూ కూడా తనకి పరిచయమే అన్న విషయం మనసులో మెదలగానే, పెదవులమీద చిరునవ్వు కాస్తా మాయమయ్యింది. సుగర్ లెస్ కాఫీ లో చేదు ఇప్పుడు బాగా తెలుస్తోంది. 

                                                  *****

దాదాపు పదేళ్ళై వుంటుంది. కిరణ్ రవి చేతిలో చెయ్యి కలిపి ఇదే బస్ స్టాప్ లో బస్ దిగింది. ఐదేళ్ళ స్నేహాన్ని ఎప్పటికీ విడిపోని బంధం గా మార్చుకోవాలని ఇద్దరి కళ్ళల్లో కలలు. ఎప్పటికీ నీ కలలకి తోడుంటా అని మాటిస్తూ వెచ్చగా నొక్కుతున్న రవి చేతి స్పర్శ. నీకింక అన్నింటిలో తోడుంది... ఏ భయం లేదు, అని కిరణ్ మనసు గట్టిగా చెబుతోంది.

రెండవ రోజు, అదే బస్సు తిరిగి వెళ్ళే వేళకి కిరణ్ ని బస్ ఎక్కించడానికి వచ్చాడు రవి. ఇద్దరూ చెరో వేపూ చూస్తున్నారు. మాట్లాడాలి. కానీ ఎలా మాట్లాడాలో, ఎలా మొదలెట్టాలో ఎవరికీ తెలియడం లేదు. ఇన్నేళ్ళ పరిచయంలో ఇంత సేపు ఇద్దరూ మౌనంగా వున్న సందర్భం ఎప్పుడూ రాలేదు. బస్ రావడానికి ఎంతసేప్పడుతుందీ అని పక్కనే వున్న కిళ్ళీ కొట్టులో అడిగి వచ్చాడు రవి.

ముందుగా రవే నోరు విప్పాడు. 

"నువ్వు మా ఇంట్లో వుండలేవు కిరణ్. మనిద్దరి వూహలూ, కలలూ వొకటే అనుకున్నాం. కానీ ఇద్దరి దారులూ కలవడం కష్టం."

ఈ మాటలు చెప్పి ఎటో చూస్తున్నాడు రవి. 

తనూ ఇంచు మించు ఇదే చెప్పాలనుకుంది, కానీ అవే మాటలు రవి నోటి వెంట వినడం కష్టంగా అనిపించింది.                                      **************************

రవి తండ్రి ఆ వూరి సర్పంచ్. వూరిని చాలా బాగా చూసుకుంటాడని పేరు. ఇరవై ఏళ్ళుగా ఎప్పుడూ ఏకగ్రీవంగా ఎన్నికవడమే ఆనవాయితీ. అది రవి తాత గారినుంచి కొనసాగిన వారసత్వం.

ఆ వూళ్ళో బస్ స్టాప్ మీదున్న సూరయ్యగారే, రవి తాతగారు.ఆ పేరునే రవి అని మార్చి తాత పేరు పెట్టారు.

రవి తన తండ్రి గురించీ, ఆయన పలుకుబడి గురించీ చెప్పే కబుర్లు విని, పెద్ద జమీన్దార్ లా వుంటారనీ, పెద్ద ఇల్లూ, ఇంటినిండా పని వాళ్ళూ, అంతా కోలాహలం గా వుంటుందని కాస్త బెరుకుగా అనిపించేది కిరణ్ కి.

కానీ రవి ఇల్లు చాలా మామూలుగా వుంది. అమ్మా నాన్నలూ మామూలుగానే వున్నారు. రవీ వాళ్ళమ్మ కిరణ్ ని చాలా బాగా పలకరించారు. వాళ్ళ నాన్నగారు రిజర్వుడుగా వున్నారనిపించింది.
రోజంతా వూరు చూడ్డం, వూరివంటలు రుచి చూడ్డంతో సరదాగానే గడిచిపోయింది.

రాత్రి కరెంటు పోయి నిద్ర పట్టక, డాబా పైకి చేరి పచార్లు చేస్తోంది కిరణ్. చుట్టూ చీకటి. 

కింద వాకిట్లో, రవి తండ్రి మంచం వాల్చుకుని కూర్చుని వున్నారు. తల్లి, అరుగుమీద లాంతరు వెలుగులో ఏవో ఆకు కూర వొలుస్తూ కూచుంది. ఆమె పక్కనే రవి. 

"పిల్ల కళగా వుంది కదండీ..." రవి తల్లి గొంతు.

పక్కవాళ్ళ మాటలు చాటుగా వినకూడదు అన్న మర్యాద కాస్త పక్కకి జరిపి అక్కడే నిలబడింది. 

"ఆ పిల్లని పెళ్ళిచేస్కుందావనుకుంటున్నావా రా...?" రవి తండ్రి ఏ ఉపోద్ఘాతంతో పని లేకుండా విషయంలోకొచ్చేసారు.

"అవును నాన్నా. మీకు చూపిద్దామనే తీసుకొచ్చాను. తనంటే నాకు చాలా ఇష్టం." రవి కూడా ఏమీ మొహమాట పడలేదు.

"నువ్వు పట్నం వెళ్ళి పై చదువులు చదువుతానంటే, నేనడ్డెట్టలేదు. కానీ నువ్వు పట్నం లోనే వుంటానంటే వొప్పుకోలేను. మా బాబు తరవాత నేనెలాగ వూరి పగ్గాలు తీసుకున్నానో, నా తరవాత నువ్వూ అలాగే ఈ వూరి బాగోగులు సూసుకోవాలని నా ఆశ. నీ సదువు కూడా ఈ వూరి బాగుకే వుపయోగపడాల."

"తను డాక్టరైనా కానీ తనకి పట్నాల్లో వుండాలని లేదు నాన్నా. చిన్న వూళ్ళల్లో జనాలకి అందుబాటులో వుండాలనే అనుకుంటోంది. తన చదువు కూడా మన పల్లెకి...." రవి మాట పూర్తి కాకుండానే, రవి తండ్రి లేచి నుంచున్నాడు.

"మన ఇంటి కోడలు ఏనాడు గడపదాటి వూళ్ళో తిరగలేదురా. అది ఇప్పుడు జరగడం నాకిష్టం లేదు. తనూ నీతో పాటు ఈ వూరొచ్చి, అమ్మలాగానే ఇంటిపట్టున గుట్టుగా సంసారం చేస్తుందీ అంటావా నాకే అభ్యంతరం లేదు." వేరే ఏ చర్చకీ అవకాశం ఇవ్వకుండా కండువా దులిపి ఇంట్లోకి నడిచాడాయన.

కరెంటు వచ్చేసరికి, రవి తల్లి ఆకుకూర పళ్ళెం పట్టుకుని భర్త వెనకాలే లోపలకి వెళ్ళిపోయింది, తను చెప్పడానికి వేరే అభిప్రాయాలేవీ లేవని తేల్చేస్తూ. అక్కడే కూచున్న రవి మొహం లో ఏం రంగులు మారుతున్నాయో డాబా మీదకి కనపడలేదు.

వూరంతా దీపాలు వెలుగుతున్నాయి. కిరణ్ మనసులో మాత్రం మొత్తం శూన్యం.

                                          ****

హారన్ శబ్దానికి వులిక్కి పడి చూసింది. రవి అప్పటికే తన బాగ్ బస్ లో పెట్టేశాడు. మౌనంగా బస్ ఎక్కి కూచుంది. వీడుకోలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కిటికీల్లో కి చేతులు జాపి మరీ జాగర్తలు చెపుతున్నారు. తను రవి కేసే చూస్తోంది. రవి మాత్రం జేబులో చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. కిరణ్ మాత్రం చూపు తిప్పకుండా అతన్నే చూస్తోంది. అతనింకా ఏం చెప్పాలని మనసు ఆరాట పడుతోందో మాత్రం తనకే అర్ధం కావడం లేదు.

కాబోయే అత్తా, మామలని పరిచయం చేస్తానని ఆ వూరు తీసుకొచ్చేముందు చెప్పాడు. తనని మాత్రం వాళ్ళకి కోడలిగా పరిచయం చెయ్యలేకపోయాడు.

నెమ్మదిగా రవి రూపం మసకబారిపోతోంది. ఇంక ఈ ప్రయాణంలో తను వంటరిదే, నీకు నువ్వే తోడు అని రెండు చేతులు కలిపి బిగించి గట్టిగా వూపిరి తీసుకుంది.

                                          ****

కప్పులో కాఫీ ఐపోయింది. చేదు రుచి నాలిక మీదే మిగిలిపోయింది. 

దూరంగా బుల్లెట్ మీద వచ్చేది.. అతనేనా? తనలాగే వున్నాడు.

అప్పట్లో ఎప్పుడూ బ్రాండెడ్ బట్టల్లో వుండేవాడు. ఇప్పుడు మామూలు పాంటూ, షర్టూ. రూపం లో పెద్ద మార్పేవీ రాలేదు. చూస్తుండగానే దూరం తగ్గి దగ్గరయ్యింది. బండి వెనకాల, వ్యాన్ డ్రైవర్.

బండి దిగి డ్రైవర్, కిరణ్ దగ్గరకొచ్చి చెపుతున్నాడు.. మెకానిక్ షాపులో ఇలా మెడికల్ క్యాంపు నుంచి వస్తుంటే బండి వూరిపొలిమేరల్లో ఆగిపోయిందని సెప్పానమ్మా, ఈ వూరి సర్పంచ్ గారికి డాక్టర్లంటే చాలా గౌరవమని సెప్పి, షాపులో కుర్రోడినిచ్చి ఆయన్ని కలవమని పంపాడమ్మా. విసయం సెప్పగానే, బండి బాగయ్యేదాకా మనందరికీ వసతి ఏర్పాటు సెయ్యడానికి ఆయనే సొయంగా వొచ్చేరమ్మా. సంబరంగా చెప్పుకుపోతున్నాడు డ్రైవర్.

ఎక్కడ బస ఏర్పాటు చెయ్యాలి, భోజనాలెవరింట్లో చూడాలి అని తన వెనకే వచ్చిన వ్యక్తికి పనులప్పగిస్తున్నాడు రవి. 

తనని గుర్తుపట్టాడో లేదో, లేక చూసి చూడనట్టు తప్పుకుంటున్నాడో అర్ధం కాక అతన్నే గమనిస్తోంది కిరణ్.

పదండమ్మా, ఇక్కడ దగ్గర్లో వొక ఇంట్లో కాస్సేపు రెస్టు తీసుకుందాం అని నర్సు వచ్చి పిలిచేవరకూ అతని వెంటే తన చూపులు పరిగెడుతున్నాయన్న సంగతే మర్చిపోయింది.

ఇల్లు చక్కగా అమర్చి పెట్టి వుంది. ఇంట్లో వొక పెద్దావిడ వున్నారు. ఆవిడ అందరికీ ఏం కావాలో చెక చెకా చూసుకుంటోంది. వొక చక్కటి గది చూపించి ఇది మీరు వాడుకోండమ్మా అందావిడ. ఆ గదిలో రవి అమ్మా నాన్నల ఫోటో చూసాక అర్ధమయ్యింది అది అతనిల్లే అని. 

మధ్యాన్నం వేడి వేడి పప్పూ కూరా తో రుచిగా భోజనాలు పెట్టింది ఆవిడే. భోజనాలయ్యాక, అందరూ తలో చోటూ చూసుకుని కునుకు తీస్తున్నారు.

వంటింట్లో అన్నీ సద్దుకుంటున్న పెద్దావిడ దగ్గరకెళ్ళి, ఇది సర్పంచ్ గారిల్లేనా అని అడిగింది కిరణ్.

"అవునమ్మా."

"వాళ్ళమ్మా నాన్నగారూ...?" 

"ఆళ్ళు ఏడాదిలో ఆర్నెల్లు తీర్థ యాత్రల్లోనే వుంటారమ్మా..."

"మీరు...?"

"నా కొడుకూ కోడలూ రోడ్డు పెమాదం లో పోయారమ్మా. వొక్కదానివే ఏం సేత్తావ్ అని అయ్యగారు ఇక్కడకి తీసుకొచ్చేశారమ్మా. చాలా మంచి మనిషి. ఆయన పెళ్ళెందుకు సేసుకోలేదో మాత్రం మాకెవ్వరికీ తెలవదమ్మా." కిరణ్ అడగాలనుకోని ప్రశ్నకి కూడా సమాధానం చెప్పేసి, సద్దిన అంట గిన్నెలి పట్టుకుని పెరటి వైపు వెళ్ళిపోయింది.

తనకిచ్చిన గదిలో మంచం మీద ఎంత సేపు కళ్ళు తెరిచే పడుకుందో తెలియదు, ఆయమ్మ మెల్లగా తలుపు తోసి వాన్ రెడీ అంటమ్మా అని పిలిచే వరకూ.

లేచి మొహం కడుక్కుని రెడీ అవుతుంటే గుర్తొచ్చింది, రవి మళ్ కనపడనే లేదు అని.

బయటికొచ్చి వాన్ ఎక్కుతుంటే డోర్ తీసి పట్టుకున్నాడు. తన సీట్ లో కూచున్నాక, కిటికీ వైపు వచ్చి చెప్పాడు, నువ్వు వెళ్ళాలనుకున్న దారి వదలలేదు, గుడ్ అని. వాన్ కదిలిపోయింది.

కిరణ్ కనుమరుగయ్యేవరకూ చూసి, తన గదిలోకి వచ్చి తలుపు వేసుకుని, పదేళ్ళ క్రితం తన డైరీ లో కిరణ్ తో చెప్పనీ, ఎప్పటికీచెప్పాలనుకోని మాటలని చేత్తో తడిమాడు.

"కిరణ్, నాన్న ఏనాడూ నేనడిగినది కాదనలేదు. ఇవాళ ఆయన్ని ఎదిరించి, పోరాడి నీతో వచ్చెయ్యొచ్చు. కానీ అది న్యాయమని అనిపించడం లేదు.

నిన్ను, ఈ వూళ్ళో మామూలు ఇల్లాలుగా వచ్చి నాతో బతకమని కన్విన్స్ చెయ్యొచ్చు. అదీ న్యాయమనిపించడం లేదు.

నేను నిన్ను వొక అందమయిన చదువుకున్న అమ్మాయిగా మాత్రమే ఇష్టపడలేదు. నీ కలలనీ, ఆశయాలనీ కలిపి వొక వ్యక్తిగా ఇష్ట పడ్డాను. ప్రేమించడం కంటే ఎక్కువ గౌరవించాను.

అన్ని ఆశయాలు వదిలేసి వొక మామూలు అమ్మాయిగా నాతో వుంటే, నీమీద ఏ రోజయినా ఆ గౌరవం తగ్గిపోతే...అది నేనే భరించలేను.

నా దృష్టిలో ఎప్పుడూ ఎత్తులోనే వుండాలి నువ్వు.

ఇవన్నీ నీతో చెప్పి, నీ సానుభూతితో మనం దూరమవ్వొచ్చు. కానీ నేనొక మనసులేని మనిషి గా గుర్తుండిపోతేనే నీకు తక్కువ బాధ కలుగుతుందనిపిస్తోంది........"

పుస్తకం మూసి గుండెలమీద పెట్టుకుని మంచం మీద వాలాడు.

నేనాశ పడ్డట్టూ తలెత్తుకుని చూసేలాగే వున్నావు... ప్రౌడ్ ఆఫ్ యూ... మనసు మెత్తగా చెప్పింది.

                                            ****

సాయంకాలం నీరెండ వెచ్చగా మొహానికి తగులుతోంది. ఎర్రటి సూర్యుడినే చూస్తోంది కిరణ్.

నువ్వు తీసుకున్న నిర్ణయం నాకోసమే అని నాకు తెలియదనుకున్నావు కదూ. నువ్వు చూపు తిప్పుకున్నంత మాత్రాన, నీ మనసు చదవలేననుకున్నావా?

మనం కలిసి ప్రయాణం చెయ్యక పోవచ్చు. కానీ మన గమ్యం వొకటే రవీ...

కంటికి కనపడకపోయినా నీతోనే వుంటా అని చెబుతూ ఆ రోజుకి సెలవు తీసుకుంటున్న ఎర్రటి 'రవి' నే కన్నార్పకుండా చూస్తోంది డా. కిరణ్మయి. 
No comments: