4/14/14

చిలకపలుకులు - 4 - పెద్దాళ్ళకో పరీచ్చ!
హాఆఆఆఆయ్ పెద్దోళ్ళూ నమత్తే! నేను పొద్దున్నే మా కూల్లో ఇంత పొడుగ్గా హాయ్ చెప్తా తెల్సా. ఏంటీ అలో నా? అలో అని చెవిదెగ్గిర పెట్టుకుని మాట్లాడతాం కదా దాన్లోనే అనాలి. అమ్మ అలో నేను తీసేసుకుని భలే ఏడిపిస్తాలే తెల్సా?

మరేమో ఇప్పుడూ మీకో చిన్న పరీచ్చ అన్నమాట. ఎప్పుడూ మీరు మాకు పెట్టెయ్యడమే అనుకుంటున్నారేంటమ్మా!

నేనేమో నా టోరీ చెప్తా అన్నమాట. నా భాష మా అమ్మకీ, నాన్నకీ మా అక్కకైతే సూపల్ గా అర్ధమైపోతుందనుకో. మీలో ఎంతమంది నేను చెప్పినవి కలెక్ట్ గా డీకోడ్ చేత్తాలో చూద్దామే. మొత్తం నా భాషలో చెప్పేత్తే మీరు బుల్ల గోక్కుంటారు కదా. అందుకే మధ్యలో అండర్ లైన్ చేసినవే నా ఓన్ భాషన్నమాట. అవి చెప్తే చాలు. సరేనా స్టార్ట్ మరిప్పుడు.

నేను పొద్దున్నే లేచి బబ్బ పోచుకునీ, కీమ్ రాసేస్కునీ రెడీ ఐపోతూ వుంటానా. ఇంతలోనే అక్కేమో నేను సూ వేసేసుకున్నా అని పలిగెట్టుకుంటూ వచ్చేత్తుంది. అమ్మో నేనింకా లెడీ అవ్వనే లేదని నాకు కంగారొచ్చేత్తుంది. మమ్మీదాయీ  సూ సూ అని గోల మొదలెడతా. అమ్మేమో వుండమ్మా తల దువ్వేసుకుని అప్పుడేస్కుందువు అంటూ నా బుర్ర భరతం పడుతూ వుంటుందా... ఈ అక్కేమో నేను చూడూ మిల్క్ కూడా తాగేస్తున్నా అని గ్లాసు పట్టుకుని వచ్చేస్తుంది. నాకూ అప్పుడు పాల్ గుర్తోచ్చేస్తాయ్. పాల్ పాల్ అని అడుగుతానా. లేవగానే తాగేచాగా పాల్. అమ్మ చెప్పాగ్గానీ గుర్తురాదు ఆ సంగతి.
నేను నా పోడూగు జుట్టు దువ్వించుకోడానికి అటూ ఇటూ పగేడుతూ వుంటే అక్కేమో అమ్మ పార్టీ లో చేరిపోయి దువ్వెన్నా, రబ్బర్బాండ్ అందిస్తూ వుంటుంది. నాకప్పుడు కోపమొచ్చేసి మాతికా...పిల్లా అని గాఠిగా కోపాడేస్తా.

చరే సూ వేసేస్కున్నాకా జాకీట్ అమ్మ మర్చిపోయినా నేను మర్చిపోను తెల్సా. ఇంక అన్నీ వేసేస్కున్నాకా నేను ముందు కాలెక్కేస్తానా. దాయీ ఎంతకీ రాడూ. నాకప్పుడు భలే కంగారొచ్చేత్తుందిలే. అసలే టా టా లేట్ ఐపోతుంటే దాయీ రాకపోతే కారెవరు నడుపుతారూ అని. దాయీ దాయీ అని పిలుస్తుంటే మొత్తానికి చేతిలో కోఫీ పట్టుకుని వత్తాడు. మీకోటి తెలుసా నాకు కూడా కోఫీ అంటే భలే ఇష్టం. అందుకే కోఫీ అనడం నేర్చేస్కున్నా ముందు.

స్కూల్ కి వెళ్ళగానే ఇంక నేను ఆపీ.  అక్కడ నాకులాగే బోల్డు బుల్లి బుల్లి నేస్తాలుంటారుగా... వాళ్ళందరికీ హాఆఆఅయ్ గుమానింగ్ చెప్తానా. ఇంకా బోల్డు చాలా ఆటలాడుకుంటానా. మాంమాం ఇంచక్కా కిందా మీదా పోస్కుంటూ నేనే తీస్కుని తింటానా. ఇంట్లో అమ్మ అస్సలూ నన్ను తిన్నివ్వదూ. ఇంకా నేనూ ఏబీసీ నేర్చుకున్నానా... ఏబీసీ తర్వాతేంటా. నాకంతే వచ్చు మరి ఇప్పుడూ. తర్వాతవి మీరంటుంటే, నాకప్పుడూ మూడ్ బావుంటే నేనూ మీతో అంటానన్నమాట. ఇంకా మీరు వన్, టూ అంటే నేను తీ, ఫోర్ అని కూడా అంటా. ఇంకా నాకు ఊనో, డోచ్, తేచ్, టింకో కూడా వచ్చు. ఇవి చాలా స్పీడుగా చెప్పేస్తా తెలుసా. నేను కరెక్ట్ చెప్తున్నానో తప్పు చెప్తున్నానో మా ఇంట్లో మాతికకి వొక్కత్తికే తెలుసు :)

మౡ సాయంత్రం ఇంటికొచ్చేసాకా నేనూ, అక్కా ఆడుకుంటూ వుంటామా, ఇంతలో ఏపేన్ చప్పుడు వినపడుతుంది. లూక్ లూక్ ఏపేన్ సుయ్ అని చెయ్యి వూపి చూపిస్తున్నా ఈ పిల్ల అస్సలూ చూడదూ. మయూ తప్పుకో అని సైకిల్ తొక్కేత్తూనే వుంటుంది పేద్ద. ఇంకప్పుడూ లోపలకొచ్చీ "ఫ ఫీ ఫు హా హి" అని నేను అమ్మకి బోల్డు కబుర్లు చెప్పేస్తా. అమ్మకేమీ అర్ధమవ్వకపోయినా నీ "ఫా" భాషేంట్రా బాబూ అని ఎత్తుకుని గాట్టిగా ముద్దు పెట్టేసుకుంటుంది.

అప్పుడేమో అమ్మ నాకు పాల్ ఇస్తుందా. కుంచెం తాగాక డన్. అక్కా పేతై  అని ఇచ్చేత్తా. పాల్ మొత్తం ఏం తాగుతాం చెప్పండీ. అదే చిప్స్ ఐతే అక్కతో పోట్లాడి మరీ లాక్కుని తినొచ్చు. ఇంకా నాకూ తాబెయీ కూడా ఇష్టం. ఇంకా బనాన్నా కూడా. మొన్నేవయిందో తెలుసా. శుక్రవారం రాత్రి నాకు బనాన్నా కనపడింది నిద్రపోతున్నప్పుడూ. ఇంక లేచి బనన్న బనన్న అని ఏడవడం మొదలెట్టా. అప్పుడేమో ఇంట్లో కూడా ఐపోయాయ్. కాస్సేపాగీ సాప్ కి వెఌ తెచ్చుకుందాం అని చెప్పారనుకో. నేనూరుకుంటానేంటీ. శనివారం కదా బాగా బబ్బుద్దాం అనుకున్నారు అందరూ. అందర్నీ లేపేసే దాకా ఏడిచి తర్వాత పాల్ తాగి ఆపీ గా ఆడుకున్నా.

అమ్మేమో మాం వండుతూ అన్నీ అలమారా తలుపులూ తీసేస్తూ వుంటుంది. నాకు అస్సలు నచ్చదు అలాగా. అందుకే తపేచెయ్ అని వేసేస్తూ అమ్మకి బోల్డు సాయం చేత్తూ వుంటాను. ఇంకా మేడ మెట్లు స్పీడుగా ఎక్కేత్తానా. అమ్మకి ఎందుకో బోల్డు గాబరా వచ్చేత్తుంది. నాకు ఎక్కడం, దిగడం కూడా వచ్చు ఐనా ఈ అమ్మేంటో దిగమ్మా, కూచుని దిగమ్మా అని తెగ జాగర్తలు చెప్పేస్తూ వుంటుంది. నన్ను దింపుదామని నా వెనకాలే ఎక్కిందనుకో ఇంకా పీడుగా ఎక్కేసి నవ్వుతా అని అమ్మకి బయ్యం. పాపం అందుకే కిందే నించునీ బతిమాలుతూ వుంటుంది.

ఎప్పుడైనా నేను డాం పపోయా అనుకో లేచి వెంటనే అన్న అన్న అన్నా అని కొట్టేత్తా. అప్పుడెౡ అమ్మకి అక్కా దాం. అల అలా డాం పపోయా అని చూపిస్తానా. మౡ అమ్మకూడా అన్న అన్నా కొట్టేత్తుంది అక్కడ. అమ్మ ఏదన్నా పన్లో వుంటే అక్క కూడా అన్న అన్నా కొడుతుంది. అప్పుడు గానీ నాకు నెప్పి తగ్గదు కదా మరి.

నాకెంచక్కా మెట్లమీద కూచినీ మాం తినడమే ఇష్టం. అమ్మ కూచున్న మెట్టుకి పైన వొక మెట్టు ఎక్కుతూ, ఒక మెట్టు దుగుతూ తింటా. ఎప్పుడైనా అమ్మ అలా కాదని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూచోపెట్టిందనుకో ఇంక చూడూ దిగన్ దిగన్ అని అక్కడనించి దింపేదాకా పేచీ పెట్టేత్తా.

ఇంకా నేను అక్కెలా ఏడుత్తుందమ్మా అంటే "ఈఈఈఈ" అని ఏడిచి చూపిస్తా తెలుసా. అలా చేస్తే అక్క కూడా నవ్వేత్తుంది. కానీ ఎప్పుడన్నా అక్క నిజ్జంగా ఏడుత్తుంటే నాకస్సలు తోచదు. దగ్గరకెఌపోయి అక్కకి ఒక హగ్ ఇచ్చేసి, ఒక కిస్ పెట్టేత్తానా అక్క కూడా ఏడుపాపేస్తుంది. అలాగే అక్కకి కూడా నేనేదైనా కాలా కాలా అంటే మమ్మీదాయీ ఇవ్వడం లేట్ చేస్తుంటే భలే చాలా కోపం వచ్చేత్తుంది లే. పాపం బేబ్బీ  అడుగుతున్నాడా అని గాఠిగా ప్రైవేట్ చెప్పేస్తుంది.

చాలా కబుర్లు చెప్పేసాగా. ఇంక నేను బబ్బునే టైమ్ ఐపోయింది. నేను లాయి లాయి వెల్తానే. లేకపోతే మమ్మీ మౡ దాగీ ని పిలిచేత్తుంది. నాకు దాగీ భౌ భౌ అంటుందని తెలుసు తెల్సా. కానీ భౌ భౌ అంటే నాకు భయ్యం. అద్దు న్నో న్నో అని చెప్తా అందుకే. సరే ఇంక నేను బబ్బుంతానే. నా కబుర్లన్నీ చదువుతున్నందుకు మీకి తాక్కూ.

అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇవన్నీకరెక్ట్ చెప్పేసినవాళ్ళకి మతూక్ బోల్డు ఫ్లయింగ్ కిస్సు లు పంపేత్తాడు. బాఆఆఆఅయ్!
No comments: