9/12/11

గుప్పెడంత ప్రపంచంస్కూల్లో చదివే రోజుల్లో హెడ్ మాస్టారితో మొదలుకుని...నాకన్నా పైన, కింద తరగతి విద్యార్ధుల వరకూ తెలుగు మాస్టారి అమ్మాయి అని పిలుస్తుంటే తెగ వుడుక్కునే దాన్ని...నాకు పేరు వుంది గా అని..బురద రోడ్డు మీద జారి పడ్డప్పుడో...మొయ్యలేక మొయ్యలేక ఏ కూరల సంచో మోసుకొస్తున్నప్పుడో అయ్యో నువ్వు మాట్టారి గారి పాపవి కదమ్మా అంటూ చూసి ఎవరైనా వచ్చి సాయం చేసినప్పుడు అడగకుండా అప్పనంగా వచ్చిన ఆ దన్ను గొప్పతనం అప్పుడర్ధం అయ్యేది కాదు..

అమ్మమ్మ వూరికి వెళ్ళినప్పుడు...వుయ్యాలా తాతగారి అమ్మాయీ మనవరాలూనూ...అని దార్లో నే మొదలయ్యే పలకరింపులూ......మామ్మ గారింటికి వెళ్ళేటప్పుడు  మీ  అబ్బాయిగారూ వాళ్ళూ వస్తున్నారండోయ్ అని మాకంటే ముందుగానే ఇల్లు చేరిపోయే కబురులు...ఇవన్నీ చూసినప్పుడు కాస్త గర్వం గానే అనిపించినా ఏమీ కష్టపడకుండా వచ్చేసిన ఆ గుర్తింపు విలువ మాత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదు

జీవితపు నిచ్చెన పైకి ఒక్కో మెట్టూ ఎక్కుతూ......ఇంటి నంబర్లు తప్ప ఫలానా వాళ్ళ ఇల్లు అంటే ఎగా దిగా చూసే metropolitan city లకి తరలి పోతున్న కొద్దీ, ఆప్యాంగా పలకరించే పక్కింటి అత్తయ్య గారూ....ఆపదలో మేమున్నామంటూ తొంగిచూసే ఎదురింటి పిన్ని గారూ.... కష్టం సుఖం విని పెట్టే వెనకింటి వదిన గారూ కనుమరుగైపోతుంటే కొంచెం కొంచెం గా తెలిసొచ్చింది రక్త సంబధాలతో పని లేని ఆ బంధాల విలువ. నాన్నగారు వూరెళితే రాత్రికి సాయం పడుకునే పక్కింటి పెద్దమ్మలూ...అమ్మకి పని పడితే చక్కగా జడలు వేసి స్కూలుకి పంపే పిన్నమ్మలు...ఈ హడావిడి ప్రపంచలో వాళ్ళ వాళ్ళ పనుల్లో పడి పరిగెడుతూ జ్ఞాపకాల్లోనే ఆగిపోయారు...ఆఫీసు నుంచి రావటం కాస్త ఆలస్యం ఐతే పిల్లని చూసుకునే పొరుగింటి అమ్మమ్మలూ...వొంట్లో నలత గా వుంటే కాస్త కూరో నారో వండిచ్చే ఇరుగింటి మామ్మలూ కనిపించక నేటి "ఆధునిక స్త్రీ" ఆఫీసు తలనొప్పులకి తోడుగా కొండంత insecurity ని మనసులో మోసుకుంటూ పైకి గుంభనగా తిరిగేస్తూ ముఫ్ఫై యేళ్ళకే అరవయ్యేళ్ళకి సరిపడా రోగాలన్నీ కొనితెచ్చేసుకుంటోంది.....

ఎక్కడెక్కడి friends నో ఈ social networking పుణ్యమా అని భలేగా కలుస్తున్నాం కదా అంటే.....ఎప్పటివాళ్ళనో కలవటం బానే వుంది గాని నీ పక్కింట్లో వున్న వాళ్ళెవరో నీకు తెలుసా అన్నాడు నా cousin. నిజవే మరి...ఏడాదిన్నర గా అదే ఇంట్లో వుండి నా చుట్టూ వున్న ఇళ్ళల్లో వున్న వాళ్ళ మొహాలు కూడా తెలియని పరిస్థితి..ఇది నా ఒక్క దానిదే కాదు దాదాపు నా generation లో చాలా మందిది. మునుపటి రోజుల్లో వూళ్ళు చదువులు...ఇళ్ళూ ఎన్ని మారినా ఎక్కడికక్కడ కొత్త ప్రపంచం ఏర్పరుచుకో గలిగే వాళ్ళం కాబట్టి పాత స్నేహితులని కొన్నాళ్ళు గుర్తొచ్చి బెంగపడినా నెమ్మదిగా మర్చిపోగలిగేవాళ్ళం ...మరి ఇప్పుడూ ఇంటి చుట్టూ వున్న మొహాల ఆనవాలు తెలియవు...ఆఫీసుకి వెళితే శత్రు సైన్యం తో కలిసి కూచుని చదరంగం ఆడటమే...ఎవరి నవ్వు ముఖం వెనక ఏ ఆపద దాగివుందో తెలుసుకోవటం బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు. పాత స్నేహితులని వెతికి వెతికి పట్టుకుని వాళ్ళతోనే ముచ్చట్లాడుకోవటం వెనక...social networking సైట్లు దిన దిన ప్రవర్ధమానంగా వెలిగిపోవటం వెనక వున్న కారణం పక్కనే వున్న వాడితో సర్దుకుపోలేకపోవటం...రేపు ఏదైనా గొడవొస్తే ఎల్లుండి వాడి మొహమెలా చూడటం అని ఇవాళ ఆ మొహమెలా వుంటుందో తెలుసుకోకపొవటమే మంచిదని వూరుకోవటం. కప్పు పాలు...రెండు స్పూన్ల పంచదార అప్పడగటానికి, శ్రావణ మంగళవారం నోముకి ముత్తైదువులకీ కూడా Networking సైట్లనే పట్టుకుని వేళ్ళాడుతున్నామంటే ...మనకి కరువైన ఇరుగుపొరుగు ప్రపంచం మనల్ని చూసి వెక్కిరించినట్టనిపిస్తుంది...

తాతగారిని మా ఇంట్లో ఇంకో నాలుగు రోజులు వుండమని బ్రతిమాలుతుంటే ఇల్లు ఏమైపోతోందో అని మూడో రోజునుండి నసగడం మొదలెట్టి నాలుగో రోజుకల్లా కట్టిన తిరుగు ప్రయాణాలు..అమ్మమ్మా వాళ్ళని మావయ్య తనుండే చోటుకి తీసుకెళితే అక్కడ వూపిరాడటం లేదని నెలలోనే సొంత గూటివైపు తీసిన పరుగులు...అమ్మని America తీసుకొస్తే...రోజూ నాన్నతో మాట్లాడుతున్నా ఆయన నేను బ్రహ్మాండంగా వున్నానని చెబుతున్నా కాని కిటికీ దగ్గరే నిలబడి బయటకి చూసే తన దిగులు చూపులూ...వైద్య సదుపాయం పేరు చెప్పి పట్టణవాసం లో ఎంతగా ఇమిడిపోయారనుకున్నా...మా వూరికి వెళ్ళాగానే కళకళ్ళాడిపోయే  అత్తగారి మొహం... వీటన్నింటి వెనక తరచి చూస్తే కనబడే మనసుకి నచ్చని నిజం ..... వురకలూ పరుగుల ప్రవాహం లో కొట్టుకుపోతున్న తమ  పిల్లల కాన్నా ఎక్కువగా వాళ్ళంతా "miss" అయ్యింది...అవుతున్నదీ.... ఇవ్వాళేం వండారూ అంటూ చనువుగా తలుపు తోసుకొచ్చే పొరుగింటి పుల్లమ్మలనీ...ఈనాడులో ఏమి రాసాడో చూసారా అని తనతో మాట కలిపే ఎదురింటి సుబ్బారావుల్నీ...తాము సంపాదించి పెట్టుకున్న తమ గుర్తింపుని...పోగుచేసి దాచుకున్న పరిచాయాల పొదరిళ్ళని....నాకేంటంట లాంటి ఆలోచనలెరగని ఆ అనుబంధాలని...

పనసపొట్టు కూర నుంచి పన్నీర్ బట్టర్ మసాలా వరకూ...internet లో వెతికేసుకుని చేసేసుకో గలుగుతున్నాం, గోడ మీదనుంచి కేకేసి వొదినగారిని ఈ కూరలో ఆవ పెడతారా అని అడిగే పనిలేకుండా...వార్తల మీదా...సినిమాల మీద... నచ్చని బాసు మీదా నెట్ లోనే వాదనలూ చర్చలూ చేసేసుకో గలుగుతున్నాం, అరుగుమీద అప్పారావులతో అవసరం పడకుండా...పక్కవాడి జీవితంలో వేళ్ళూ కాళ్ళూ పెట్టకుండా వుండటమే మా గొప్పతనం అని జబ్బలు చరుచుకున్నా...net connection తో పాటే స్ఠంబించిపోయే జీవన సరళి ఎంత ప్రమాదకరమో కూడా అలోచించడం అవసరం....ప్రపంచం కుగ్రామమైపోయింది కానీ...అంతా ఒకే కుటుంబం లా వుండే కుగ్రామాల చిరునామాలు మాత్రం ప్రపంచీకరణలో పడి కొట్టుకుపోతున్నాయి...మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే...

22 comments:

praveena said...

మనసును కదిలించేలా రాసారు.

madhu said...

you just touch the readers heart
very very nice writing

madishetty said...

Varthamana vaasthava sthithini adbhuthanga aavishkarincharu...

Anonymous said...

Baaga raasaru.

Anonymous said...

Good One.

మధురవాణి said...

Hmm.. very thoughtful post స్ఫురితా! దీని వల్ల కారణాలు ఇవని చెప్పలేని ఒక అయోమయమైన డిప్రెషన్ వస్తోంది. :(
<<net connection తో పాటే స్థంబించిపోయే జీవితాలు..
How true!

తృష్ణ said...

ఆలోచింపజేసేలాగ చాలా బావుందండి మీ టపా.well written.

small request: కామెంట్ బాక్స్ పేజీని ఫుల్ పేజ్ చేయండి. వ్యాఖ్య రాయటం ఈజీ అవుతుంది.

శ్రీనివాస్ పప్పు said...

మనసుని కదిలించే పోస్ట్,చాలా బాగా వ్రాసారు

MURALI said...

...ఆఫీసుకి వెళితే శత్రు సైన్యం తో కలిసి కూచుని చదరంగం ఆడటమే...ఎవరి నవ్వు ముఖం వెనక ఏ ఆపద దాగివుందో తెలుసుకోవటం బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు

రోజూ నాన్నతో మాట్లాడుతున్నా ఆయన నేను బ్రహ్మాండంగా వున్నానని చెబుతున్నా కాని కిటికీ దగ్గరే నిలబడి బయటకి చూసే తన దిగులు చూపులూ

...net connection తో పాటే స్ఠంబించిపోయే జీవన సరళి

ప్రపంచం కుగ్రామమైపోయింది కానీ...అంతా ఒకే కుటుంబం లా వుండే కుగ్రామాల చిరునామాలు మాత్రం ప్రపంచీకరణలో పడి కొట్టుకుపోతున్నాయి...

తలుచుకుంటే దిగులు రేకెత్తించే నిజాలివి :(

ఏకాంత్ said...

I experienced this very recently...calling some friend of mine for some help who is so far instead of calling my neighbour!!!!!! have been thinking about this...surely every one of us will feel n understand this and come out of it soon....

పెరుగుట విరుగుట కొరకే

వేణూశ్రీకాంత్ said...

కఠోరమైన వాస్తవాన్ని కళ్ళముందుంచారండీ...
>>మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే...<<
Sooo True...

రాజేష్ మారం... said...

ఇంకో పది పేజీలు రాసుంటే బాగుందనిపిస్తుంది..

Very Nice Post..

sphurita mylavarapu said...

ఏవిటో విచిత్రం ఇవాళ...నిన్న నేనొక కొత్త టపా రాస్తే ఎప్పుడో రాసిన టపాకి బోలెడు వ్యాఖ్యలొచ్చాయి.

ప్రవీణా, మధు, madishetty, మధురా మీకు నచ్చినందుకు సంతోషం...
తృష్ణా...మీ సలహా పాఠిస్తానండీ...ధన్యవాదాలు

స్రీనివాస్ పప్పు, ధన్యవాదాలు
మురళీ,...నా బ్లాగుకి స్వాగతం
వేణూ స్రీకంథ్, ధన్యవాదాలు
రాజేష్ మారం...నా బ్లాగు కి స్వాగతం...ఇప్పటికే నా అలవాటు కి విరుధ్ధం గా చాలా పెద్ద టపా రాసేశాననుకున్నానండీ...:)

మధురవాణి said...

మరేం లేదు స్ఫురితా.. నేను నిన్న మీ పోస్ట్ చూసాక చాలా బావుందని నా బజ్లో రీషేర్ చేసాను. అందుకని నాలాగా ముందు మిస్సయిన వాళ్ళు ఇప్పుడు ఆలస్యంగా చదివి ఉంటారేమో!
ఏమైనా.. మీరు రాతల్లో ఒక unique feel ఉంటుంది. I like it! :)

sphurita mylavarapu said...

అదీ సంగతి...మీ సహాయానికి కృతజ్ఞతలు...పొద్దున్నే లేచేసరికి పన్నెండు వ్యాఖ్యలు చూసి బోల్డు ఆనందపడిపోయాను...:)

జ్యోతిర్మయి said...

ఏమండోయ్ స్ఫురితగారూ..ఆగండాగండి...అవన్నీ మాకిప్పటికీ ఉన్నాయ్..తలుపు తోసుకుని రావడాలూ..నచ్చిన కూరో పులుసో పంపడాలు..సినిమా బావుందట రేపెళదామాలు..ఏంటి అసూయగా ఉందా..మా ఊరోచ్చేయండి. ఎంచక్కా ఓ పాతికేళ్ళు వెనక్కెళ్ళి పోవచ్చు.

sphurita mylavarapu said...

అవునా జ్యోతిర్మయి గారూ...మీరు చాలా అదృష్టవంతులండీ...మా వారూ నేను...సుబ్బరం గా ఒక పల్లెటూరికెళ్ళి నాలుగు గేదెలు కొనుక్కుని ఇంటిచుట్టూ కాసిన్ని కూరగాయలు పండించుకుంటూ బతికేద్దాం అనుకోని రోజు వుండదు...జరగక పోయినా ఆ వూహే కాస్త సంతోషాన్నిస్తుంది...ఐథే మా ప్లాను మీ వూళ్ళోనే అమలు పరిచేస్తాం...వచ్చెయ్యమంటారా...చిరునామా పంపండి మరి...:)

మధురవాణి said...

భలేవారే! మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలండీ చక్కటి టపా రాసినందుకు. నాకు చాలా నచ్చేసి ఇంత చక్కటి టపా మరింతమంది చూడాలని రీషేర్ చేసాను. :)

రసజ్ఞ said...

చాలా బాగా వ్రాశారండీ! నిజమే ఈ వైఖరి కనపడుతోంది. కానీ ఈ నాటికీ అవి ఎక్కడున్నా ఉంటూనే ఉన్నాయి నాకయితే ఖండాలు దాటినా అవే ఆప్యాయ పలకరింపులు.

సుభ/subha said...

చాలా బాగా వ్రాసారండీ.. ఒకే భాష మాట్లాడుకునే వాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే, ఊరు కాని ఊర్లో అంటే భాష రాని ఊర్లలో ఉంటే పరిస్థితి మరింత దయానకం అండీ..

Unknown said...

నిజ్జం మీరు చెప్పింది.
ఇవి అన్ని base చేసుకుని నేను ఇప్పుడు ఒక నవల రాయబోతున్నాను.చూడాలి ఎంత వరకు సక్సెస్ అవుతానో?

vijaya krothapalli said...

స్ఫురితా....
"గుప్పెడంత ప్రపంచం"...కధకి పేరైతే
"మన గుప్పెట్లోనే ప్రపంచం అని విర్ర వీగి గుప్పెట విప్పి చూసుకుంటే...కనిపించే మన ప్రపంచం ఆ గుప్పెడంతే..." ఇది దానికి ముగింపు.
నీ రాతల్లో నాకు బాగా నచ్చిన విషయం కధ కి నువ్వు పెట్టే పేరు + ముగింపులో రాసే వాక్యం. ఇవి రెండూ నీ రాతకి సరైన అర్ధాన్ని ఇస్తున్నాయి.
"అడగకుండా అప్పనంగా వచ్చిన ఆ దన్ను గొప్పతనం అప్పుడర్ధం అయ్యేది కాదు.."
"ఏమీ కష్టపడకుండా వచ్చేసిన ఆ గుర్తింపు విలువ మాత్రం అప్పుడు అంతగా పట్టించుకోలేదు." నువ్వన్న ఆ మాటలు
ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్న మీకు చుట్టూఉండే పరిస్థితులవలన అలా అనిపించి ఉండొచ్చు. సోషల్ నెట్ వర్కింగ్ ల పుణ్యం వలన ఇక్కడ కూడా కొంతవరకు నువ్వు రాసినట్టుగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ, ఇంకా మన ఊళ్ళలో పలకరింపులు, ఆప్యాయతలు మాయమై పోలేదు. మన పెద్దవాళ్ళ వలన మనకి వచ్చిన గుర్తింపు, గొప్పదనం మన తరవాత తరాల వారికి ఇవ్వగలమా...???? బాగా ఆలోచించేలా రాసావు.
విజయ.