చిన్నప్పుడు నా స్నేహితులంతా ఎవరో హీరో నో , హీరోఇన్ నో ఆరాధించేస్తుంటే చూసి నవ్వుకునేదాన్ని. నా classmate ఒకడు తన అభిమాన హీరో పుట్టినరోజు అని క్లాసు రూములో నే కేకు కటింగ్ గట్రా చెయ్యబోతే చాలా తీవ్రం గా అడ్డుకున్నాను. అలాంటి అభిమానులని చూసి సదరు సినెమా వాళ్ళకి కూడా మనకిలాగే రెండు కాళ్ళు, రెండు చేతులే గా వున్నాయి అని వెక్కిరించేదాన్ని. నన్నెవరైనా నువ్వెవరి fan అని అడిగితే చచ్చేంత కోపం వచ్చేది. ఎవరు తీసినా, రాసినా, వేసినా బావుంటే చూస్తాం, చదువుతాం, అది వాళ్ళ పని అనే సమాధానం వచ్చేది నా దగ్గరనుంచి. నేనేంటి అలా ఒకళ్ళని follow అవ్వటమేమిటి అని కాస్త పొగరు కూడా వుండేది. ఇలాంటి so called పెద్దవాళ్ళంతా వాళ్ళు రాసినట్టు, వేసినట్టు నిజం గా వుండరనేది కూడా నా అభిప్రాయం.
మా ఆఖరు పిన్నికీ నాకు వయసులో మరీ అంతరం లేకపోవటం తో స్నేహితుల్లా వుండేవాళ్ళం. తను ఒక రచయిత ని బాగా అభిమానించేది. ఒక సారి అతను వూళ్ళో ఏదో సభకి వచ్చాడని తెలిసి ఆ సభకి వెళ్ళాం. అక్కడ నిర్వాహకుల్లో తనకి తెలిసిన ఆయన్ని పట్టుకుని ఆ రచయిత తో మాట్లాడే అవకాశం సంపాదించింది తను. తన కూడా వెళ్ళి వెనకాల నుంచున్నానే గానీ అతన్ని చూసి చిన్న ప్లాస్టిక్కు నవ్వుకూడా నవ్వలేదు. మా పిన్ని మాత్రం చాలా excite అయిపోయి ఆయనకి తను ఎంత పెద్ద అభిమానో, ఆయన రచనలు ఎందుకు నచ్చుతాయో తన excitement అంతా మాటల్లోకి, మొహం లోకి transfer చేసేసి మరీ చెప్పేస్తోంది...ఆయన మాత్రం ఒక నిర్వికారమైన మొహం పెట్టి ఆహా అలాగా అని పొడి పొడి గా రెండు ముక్కలు అనేసి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తర్వాత సభలో కూచున్నాం గానీ మా పిన్ని మొహంలో ఒకలాంటి నిరాసక్తత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంటికి వెళ్ళే దార్లో నెమ్మదిగా తనతో చెప్పాను...ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళు రాసే రచనల్లో పాత్రలంత గొప్పగా ఏం వుండరు అని. తనకి ఎందుకో నా మాటలు వూరటనిచ్చాయి. తన మనసులో పడుతున్న ఘర్షణ చెప్పకుండానే నేను తెల్సుకున్నందుకో..ఆ సదరు రచయిత మీద తనకి వచ్చిన కోపం సరైనదే అని నేను justify చేసినందుకో తెలీదు గాని తను కాస్త చల్లబడిందనిపించింది నా మాటలతో. ఆ సంఘటన తర్వాత నా అభిప్రాయం ఇంకాస్త బలపడింది...తర్వాత ఎప్పుడూ ఒక brand name కి ఆకర్షితురాలినయ్యిన గుర్తులేదు.
అమెరికాకి వచ్చాక ఒక రోజు అసలు internet లో తెలుగు రచనలు వుంటాయా అని వెతికితే మొదటగా నా కంట పడినది, ఈమాట అనే ఈ పత్రిక. నేను చూసిన సంచికలో నాకు బాగా నచ్చినది మాలతి గారి(మాలతి నిడదవోలు) కధ. అలా ఈమాట సంచికల్లో ఆవిడవి రెండు మూడు కధలు చదివాక ఆవిడ రచనా సైలి ఎందుకో తెలీదు గానీ బాగా ఆకట్టుకుంది. ఆవిడ కధలు చదువుతూ నేను వూహించుకున్న ఆవిడ రూపం చీర కట్టుకుని, సిగ వేసుకుని, పెద్ద కళ్ళజోడు పెట్టుకుని ఇంచుమించు గుప్పెడు మనసు సినిమాలో సుజాతలా :). ఈమాట లో ఆవిడ పేరుతో వెతికి ఆ పత్రిక లో ప్రచురించబడ్డ ఆవిడ కధలన్నీ చదివేసాను. తర్వాత ఆవిడ పేరుతో internet లో వెతికితేనో అని ఉపాయం తట్టి అలా వెతికితే ఆవిడ కధల PDF దొరికింది ముందుగా. అది కూడా చదివాక ఆవిడ బ్లాగు తూలిక నా కంట పడింది. ఆ రకంగా తెలుగులో నేను చూసిన మొట్ట మొదటి బ్లాగు మాలతి గారిదే. ఆవిడ బ్లాగులో లంకెలు పట్టుకునే బ్లాగు ప్రపంచంలోకి అడుగు పెట్టాను. కొన్నాళ్ళు ఆ ప్రపంచంలో విహరించాక నేనూ రాస్తే అన్న వూహ చిగురేసి, మొగ్గేసి ఆఖరికి పువ్వులు పూసింది. రాద్దామన్న ఆలోచన వచ్చాక నన్ను ఎక్కువ భయపెట్టింది కూడా మాలతిగారి రచనలే.
మొత్తానికి ఒక రోజు తెగించి నేను కూడా ఒక బ్లాగు మొదలెట్టేసాను. మొదలు పెట్టిన కొన్నాళ్ళకి ధైర్యం చేసి మాలతి గారికి నా బ్లాగు చూడమని ఒక మైల్ పంపాను. ఎందు చేతో ఆవిడ ఆ mail చూడలేదు. ఆ అంత పెద్ద రచయిత్రికి నా రాతలేం నచ్చుతాయి లే అని సరిపెట్టుకున్నాను. కొన్నాళ్ళకి ఆవిడ బ్లాగులో నేను పెట్టిన కామెంటు చూసి అనుకుంటా నా బ్లాగులోకి వచ్చి వ్యాఖ్య రాసారు. ఆ రోజు నా ఆనందం చెప్పలేను. ఇంటికి ఫోను చేసి అమ్మకి, నాన్నగారికి...ఇక్కడ మావారికి అందరికీ చెప్పేసాను. తరవాత ఆవిడ నా టపాలన్నీ ఇంచుమించు చదువుతూ వ్యాఖ్య రాస్తూ వుండేవారు. కొన్నాళ్లకి ఆవిడ బ్లాగు రోలు లో నా బ్లాగు చూసిన రోజు నా రాతల మీద మొదటి సారి కాస్త నమ్మకం ఏర్పడింది.
ఈ మధ్య మాలతి గారు రాస్తున్న మార్పు ద్వారా Dallas వచ్చారని తెల్సుకుని..మా వారూ అక్కడే వుండడంతో ఈ సారి వచ్చినప్పుడు కలవొచ్చా అని మైల్ పెట్టాను తటపటాయిస్తూనే. ఆవిడనుంచి వెంటనే తప్పకుండా అని తన నంబరు తో సహా ప్రత్యుత్తరం చూసి ఆశ్చర్యపోయాను. గత వారాంతం లో అనుకోకుండా డల్లస్ వెళ్ళిన నేను ఆవిడకి పొద్దున్నే ఫోను చేస్తే రెండు నుంచి నాలుగు వరకూ తెలుగు క్లాసు వుంది...దానికి ముందు గాని వెనక గానీ రండి అన్నారు. సరే సాయంత్రం వస్తాం అని చెప్పి ఫోను పెట్టేసాను. మా సంభాషణ ముక్కలు ముక్కలు గా విన్న మా వారు ఇప్పుడే రమ్మన్నారని అర్ధం చేస్కుని బండి కట్టేసారు. ఎక్కడికి అని అడగకుండానే కారెక్కి కూచున్నాను నేను. సాయంత్రం మాలతి గారిని కలిసినప్పుడు ఏమి మాటాడాలి అని ఇప్పట్నుంచే అలోచించేస్తూ మధ్యదార్లో అడిగాను మా వారిని ఎక్కడికెళ్తున్నాం అని. వచ్చినప్పట్నుంచీ మాలతి గార్ని కలవాలని జపం చేస్తున్నవ్, తీరా వెళ్తుంటే ఎక్కడికంటావేంటి అన్నారు, అది సాయంత్రం కదా అనేసి, తనకి ఆ ముక్క చెప్పలేదని గుర్తొచ్చి నాలిక్కరుచుకుని మళ్ళీ మా వారు నరసిమ్హావతారం ఎత్తకముందే పోన్లే ఇప్పుడే వెళ్దాం, రెండింటి వరకూ వుంటా అన్నారు కదా అనుకునీ నోరు మూస్కుని కూచున్నాను. మధ్యలో మళ్ళీ ఆవిడకి కాలు చేసి ఇప్పుడే వస్తున్నాం అని చెబ్దామని కూడా తట్టలేదు ఆ కంగారులో. తీరా వాళ్ళింటి ముందుకి వెళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. నాకు చెప్పలేనంత నీరసం వచ్చేసింది, నా ఆలోచనలకి విరుధ్ధం గా నేను అంతగా అభిమానించిన ఆవిడని చూడనేలేకపోయాను అని. మా వారు ఏదయినా ఒకసారి fail అయితే మళ్ళీ ఆ పని అంత త్వరగా చెయ్యరు. ఇంక తను మళ్ళీ ఇక్కడికి తీస్కురారని అర్ధమైపోయింది. నీ planning ఇంత అందం గా వుంటుంది అని అక్షింతలు వేస్తూనే దగ్గర్లో వున్న ఆంజనేయ స్వామి గుడికి లాక్కెళ్ళారు. కొంచెం సేపు బుర్ర పని చెయ్యలేదు. ఇద్దరం పక్క పక్కనే కూచుని ఇంత miss communication ఎలా సాధ్యం అని ఒక పక్కా. నేను ఆశ పడ్డదేది జరగదు లాంటి ఆలోచన ఒక పక్కా...గుడిలో హనుమాన్ చాలీసా పారాయణ, అక్కడే భోజనం అన్నీ అయ్యాక silent mode లో వున్న ఫోను చూస్కుంటే మూడు Voice messages. ఏమనుకున్నారో ఏమో పోనీ ఇప్పుడు మళ్ళీ ఫోను చేసి చూడు వుంటే వెళ్దాం అన్నారు. అప్పటికే 1:15. మధ్యలో ట్రాఫిక్కు జాము దాటుకుని వెళ్ళేసరికి పావుతక్కువ రెండు అయింది. ఇంకేముంది...నాకు టైము అయిపోయంది అని వెళిపోతారు అనుకుంటూనే వెళ్ళాను.
నా సందేహాలన్నీ పటా పంచలు చేస్తూ బయ్టకి వచ్చి మరీ నవ్వుత్తూ స్వాగతం పలికారు. అప్పటివరకూ నా మీద రుస రుసలాడిన మావారు, మాది విశాఖపట్నం అనగానే నాకంటే ఎక్కువగా ఆవిడతో కబుర్లలో పడిపోయారు. ఆవిడని కలిస్తే ఇలా మాట్లాడాలి, ఇవి చెప్పాలి, ఇవి అడగాలి అని తయ్యారు చేకున్నవేమీ గుర్తు రాలేదు. నాకు బాగా పరిచయం వున్న వాళ్ళింటికి వెళ్ళినట్టే అనిపించింది. ఇప్పుడే భోజనం చేసాం అంటున్నా వినకుండా మా ఇంటికి వచ్చి కాఫీ వద్దంటారా అని కమ్మటి కాఫీ రుచి చూపించారు. మీకు క్లాసుకి time అయిపోతోందేమో అంటే ఫరవాలేదు లే కాస్త late అయినా అని మాకోసం అరగంట late గా వెళ్ళారు. ఆవిడ ఇంకా కూచోండి అంటున్నా ఆవిడకి క్లాసుకి time అయ్యిందని మా కర్మ యోగి గారు( తనవైనా పక్కవాళ్ళవైనా సరే పనులు సమయానికి అవ్వాలనుకోవటం, అయ్యేలా చూడటం చేసేవాళ్ళని అలా అంటారని ఎక్కడో చదివాను) లాక్కొచ్చేసారు. మళ్ళీ వచ్చినప్పుడు తీరిగ్గా కలుద్దాం అని చెప్పుకుని విడిపోయాం.
మొత్తానికి అలా నేను మాలతిగారిని కలిసానోచ్(కొంచెం గర్వం నిండిన స్వరం తో)
14 comments:
హ్మ్ బాగుంది స్ఫురిత గారు మీరు కలిస్తే మేము కలిసినంతటి ఆనందం తెప్పించారు .. :)
@ స్ఫురితా, నాక్కూడా అంత ఆనందంగానూ ఉంది. నేను గుప్పెడుమనసులో సుజాతలా లేనందుకు విచారిస్తూనూ, మీ పిన్నిగారి రచయితహీరోలా లేనందుకు సంతోషిస్తూనూ.. ఇంతకీ మీరు నాతో ఏం మాటాడాలనుకున్నారో కనీసం ఫోనులో కూడా చెప్పలేదు. మీటపా నాకు చాలా నవ్వు తెప్పించింది. మీరు రాతశూరులే కానీ వాక్శూరులు కాదనుకుంటా.. :p
Luck you :)
మాలతిగారూ,
ఇదిగో ఇక్కడ రాసినవన్నీ మీతో చెప్పాలనుకున్నాను మా పిన్ని అంత excite అయిపోతూ...నా inspiration మీ రచనలే అని చెప్పాలనుకున్నాను. కానీ మీరు మాట్లాడిన తీరు ఏదో అలా దూరంగా interview చేస్తున్నట్టు మాట్లాడనివ్వలేదు. మీరన్నది నిజమే రాసినంత తేలిగ్గా మాట్లాడలేను. ఇంకా ఇప్పుడు చాలా మెరుగు, మావారితో సహవాస దోషం :)
మీ వ్యాఖ్యకి ఆతిధ్యానికి ధన్యవాదాలు. త్వరలోనే మళ్ళీ కలవాలని ఆశిస్తూ
స్ఫురిత
మీ బ్లాగును నేను ఇదే మొదటిసారి చూడట౦.
గమ్మత్తే౦ట౦టే, నాకు తెలుగు బ్లాగులు పరిచయట౦ కావటానికి కారణ౦ మాలతి గారే(అబ్బే, నాకు పరిచయ౦ లేదు లె౦డి). Late 2007 లో నేను నెట్ లో ఏదో వెతుకుతూ౦టే ఒకే రోజు మాలతి గారి తూలికా, కల్పన గారిదీ కనపడ్డాయి. వీళ్ళిద్దరూ నాకు చిన్నప్పటి ను౦చీ తెలిసిన వాళ్ళే కాబట్టి, చదవట౦ మొదలెడితే అమెరికా లోనే ఉన్నారని తెలియట౦ మరి౦త ఆశ్చర్య౦. అదే రోజు ఆ ఆశ్చర్యాన్ని వీళ్ళకు తెలియచేద్దామని ఓ పొడుగాటి లేఖను సిద్ద౦ చేసాను కానీ, వాళ్ళ అదృష్ట౦ బాగు౦డట౦తో, నా హోటల్ లోని నెట్ కనెక్షన్ వాళ్ళను ఆ రోజు కాపాడి౦ది. మీ వారి లాగే నాకు మొదటి ప్రయత్న౦లో సీదాగా పనులు కాలేదు అనుకో౦డి, ఎహె చీ, అని వదిలిపెట్టట౦ అలవాటు, ముఖ్య౦గా కష్టపడి రాసిన ఈమెయిల్స్ కి, మళ్ళీ కష్టపట్ట౦ అనేది మన వల్ల కాని పని.
వాళ్ళ సైటు, బ్లాగు ల్లో౦చి, తెలుగు బ్లాగు ల్లోకొచ్చి పడ్డాను. హి హి హి (అదృష్టమా, దురదృష్టమా?!!! :-))))))
చాలా సార్లు మిల్వాకి కి వెళ్ళినప్పుడు అనుకున్నాను, మాలతి గారిని కలిస్తే బాగు౦టు౦దేమో అని...కాని, మన అరకొర, మిడిమిడి పుస్తక జ్ణాన౦ తో ఆవిణ్ణి కలిసి, అభాసు పాలయ్యి, ఆవిడ టైము వేస్టు చేయట౦ ఎ౦దుకు అని ఊరకు౦డిపోయా.
మొత్తానికి, మాలతి గారు మాట్లాడే టైప౦టారు, ఊరికే రాసే టైపే అనుకున్నా :-))(జస్ట్ కిడ్డి౦గ్)
మొత్తానికి మీ కోరిక తీరింది మేము కుడా హాపి మీరు హాపి కదా అందుకు....-:)
బాగుందండి మీ కలయిక . ఒకసారి ఇలాంటి అభిమాని కలయిక గురించి మిత్రుడు చెప్పాడు . అతని మిత్రుడు మల్లాది వెంకటక్రిష్ణముర్తి అభిమాని ఒకసారి ఒక హోటల్లో మల్లాది, అతను ఉన్నారు ఇంతలు ఆ వ్యక్తి హోటల్ లో కనిపిస్తే అరె నువ్వు మల్లదికి వీరాభిమనివి కదా పేఇచయం చేయిస్తాను అని పిలిస్తే ఆటను పట్టించు కోకుండా వీగంగా వెళ్లి పోయాడు. తరువాత కారణం అడిగితే అతను చెప్పిన విషయం ఆచార్యం కలిగించింది. నేను మల్లాది కి అభిమానిని నిజాం కానీ నేను అతన్ని ఒక రకంగా ఉహించు కుంటున్నాను . ఇప్పుడు నేను మల్లదిని కలిసి పరిచయం చేసుకుంటే అతను నీను ఉహించినట్టుగా ఉండక పొవచు అప్పుడు నేను బాధ పడవచు . అందుకే నా ఉహల్లో మల్లాది ఎలా ఉన్నదో అలానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. దాని కోసమే నివు పరిచయం చేస్తానని పిలిచినా వెళ్లి పోయానని చెప్పాడు. మీ పోస్ట్ చదివాకా గుర్తుకోచింది.
నమస్తే స్ఫురిత గారూ !ఒక అభిమాన రచయిత్రిని కలుసుకొని మీరు పొందిన ఆనందానికి జోహార్లు.నేను కూడా చెన్నైలో హాస్య బ్రహ్మ భమిడిపాటి రాధా క్రిష్ణ గార్ని కలిసినప్పుడు కూడా ఇంత ఆనందం పొందాను.ఆయన "ఎదురీత" వంటి ఎన్నోసినిమా కళా ఖండాలకి రచయిత.అయినా ఒక సామాన్య వ్యక్తినైన నన్ను మాలతి గారి లాగానే ఆదరించి ఆశ్శీర్వదించారు.నిజానికి ఈ రోజుల్లో ఇలాంటి వారి అరుదేనండీ!
కావ్యా, లలితా, మంజూ, మురళీ వ్యాఖ్యకి ధన్యవాదాలు
సో మా ర్క గారు మీ ప్రేరు భలే విచిత్రం గా వుందండీ...వ్యాఖ్యకి ధన్యవాదాలు
కుమార్ గారూ నేనూ మీకు లాగే చాలా తటపటాయించానండీ...కలిసి ఆవిడ సమయం వృధా చేసినట్టు అవుతుందా అని...కానీ ఎందుకో కలవాలని చాలా బలం గా అనిపించింది. కొందరితో పరిచయం వల్ల కూడా కాస్త జ్ఞానం సంపాదించొచ్చు కదా అనిపించింది. మొత్తానికి మీ వ్యాఖ్యతో మాలతి గారి చేత కూడా టపా రాయించేసారు. ఇక్కడ చూడండి http://tethulika.wordpress.com/2011/04/13/%e0%b0%8a%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8b%e0%b0%95-%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b0%be/
ఇంకో మాట మీరు నా బ్లాగుకి రావటం ఇదే మొదలు కాదండోయ్. ఇంచుమించు ఏడాది క్రితం నేను బ్లాగు మొదలెట్టి బుడి బుడి అడుగులేస్తున్నప్పుడు(అంటే ఇప్పటికీ అలానే వుందనుకోండి నా పని) ఒకసారి వచ్చారు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు
వావ్. నిజమేన౦డోయ్..మాలతి గారి దృష్టిలో నా పేరు పడి౦ది. నేనూ మీలాగే సెలబ్రేట్ చేసుకోవాలేమో. మా ఊరి ను౦చి హ్యుస్టన్ కి వెళ్ళటమ్ నాకు బాగా అలవాటే, మధ్యలో ఆగి డల్లాస్ లోని ఇర్వి౦గ్ లో ఓ చాయ్ కొట్టట౦ కూడా అలవాటే. కలవమ౦టారా మరి? :-) ము౦దు చెప్పెళ్ళమ౦టారా, చెపితే తాళ౦ పెట్టి వెళ్ళిపోతారేమో :-)))
ఎనీవే, థా౦క్స్.
యా, ఇప్పుడే వెదకి చూసా, అ౦తకు ము౦దో సారి వచ్చినట్లున్నాను మీ బ్లాగుకి. గుర్తులేదు. స౦తోష౦.
ఉ.స: మీరో కార్ తీసేసుకొని, డ్రైవి౦గ్ కి ఎవరి మీదా ఆధారపడకు౦డా అయ్యారనుకో౦డీ, అది మీకు ఉపయోగ౦, ముఖ్య౦గా మా మగజాతి మనిషి, మా సోదరుడూ అయిన మీ వారికి ఎక్కువ ఉపయోగ౦గా ఉ౦టు౦ది. వారి కోస౦ చెపుతున్నా, మీ కోస౦ కాదు సుమీ :-)))) నాకు డ్రైవి౦గ్ చేయని ఆడవాళ్ళ౦టే కి౦చిత్తు కోప౦ లె౦డి. ఎ౦త కష్టమ్ మా మగవాళ్ళ పరిస్థితి, లేద౦టే కొత్తిమీరకీ, కరివేపాకుకీ, తుమ్ముకీ, దగ్గుకీ, ప్రతి చిన్నదానికీ మేమే పరిగెట్టాల్సి వస్తు౦ది కదా. చక్కగా మీరు నేర్చుకున్నారనుకో౦డి, మాలతి గారి౦టికి, ఇక రావద్దనే దాకా వెళ్తూ ఉ౦డొచ్చు :-))
మీ సంతోషపు కాంతుల్లో మా జ్ఞాపకాల నీడలూ రూపు దిద్దుకుంటున్నాయి. మాలతి గారి తూలిక.నెట్ ద్వారా మొదలైన మా పరిచయం, తదుపరి మా ఉత్తరాల్లోని సంభాషణలతో వ్రాయాలన్న సంకల్పాన్ని కలిగించటం నా బ్లాగు మొదలుపెట్టటానికి నాందీ. వారికి చెప్పలేదు నా బ్లాగు/మొదటిమాట ని గూర్చి, కానీ చిత్రంగా మాలతిగారిదే మొదటివ్యాఖ్య. అదే సంకల్పసిద్ది కి నిరూపణ అనుకుని సాగిపోయాను. పొద్దు పత్రిక కి మాలతిగారు రాసిన "కథా మాలతీయం" లో నా పేరు ప్రస్తావించినపుడూ సంతోషపడ్డాను. ఇక కలవటమే మిగిలుంది.
:-) మాలతిగారి పోస్ట్ ద్వారా ఈ లింక్ లోకి వచ్చి మీ పోస్ట్ చదువుతున్నా స్ఫురిత గారు. మాలతి గారిని మొదటిసారి కలవడానికి ఇంచుమించు మీలాగే తత్తరపడ్డాను. నాకసలు రాయడమే రాదు, ఎదో బ్లాగు మొదలెట్టి కొక్కిరి గీతలు తప్ప..
కాని ఇవేమి ఆవిడ ఆప్యాయతకి అడ్డు కావని ఆవిడని కలిసిన తరువాత తెలిసింది. ఆనందంగా చురుకుగా మాట్లాడతారు. ఆవిడ కలిసిపోయే మనస్థత్వం నాకు చాలా నచ్చింది.
సో.. చివరాఖరుగా నేనూ చెప్పే విషయమేమిటంటే నేను ఆవిడని కలిసానోచ్.. ఒకేసారి ఒకే ఒక్కసారి..
మళ్ళీ ఇంకోసారంటే ...;-) ఆవిడకి నేను గుర్తున్నానో లేదో... :(
mee peru bavundi...me blog kuda...eppativaraku ela miss ayyanu...
anyway mottam chadivi malli coment pedatanu
elopu meru okasari vachhi na blog kuda chusi me viluvina abhiprayam chepte santoshistanu maro vishayam meru facebook lo account unte akkada konni literary groups unnayi...akkaa join ayite me rachanalu inka entomandi chadive avakasam undi...
http:/kallurisailabala.blogspot.com
మీ excitement అంతా కనిపించింది టపాలో..
Post a Comment