6/1/15

కలల ప్రపంచం

మొన్న ఆదివారం విజయవాడ రేడియో లో బాలల కార్యక్రమం లో చదివిన కథ. వెనకాల అడవి ఎఫెక్టు వచ్చే సౌడ్స్ కూడా కలిపారుట. :)



కలల ప్రపంచం


"మాతికా మాతికా.... రా మనం అజ్జున్ వాళ్ళింటికి వెళదాం" పరిగెట్టుకుంటూ వచ్చి అక్క చెయ్య పట్టుకుని లాగడం మొదలెట్టాడు మూడేళ్ళ మయూఖ్.

"నా పేరు మౌక్తిక రా బాబూ... అయినా నన్ను అక్కా అని పిలవాలని చెప్పానా" విసుక్కుంది ఏడేళ్ళ మౌక్తిక.

"అబ్బా తొందరగా రా అజ్జున్, మేఘనా వాళ్ళింటికి రమ్మన్నారు కదా ఆడుకోడానికీ?" హడావిడి పడుతూ పరిగెట్టాడు మయూఖ్. వాడికింకా అర్జున్ అని అనడం రాదు మరి.

మౌక్తిక వచ్చి రిమోట్ నొక్కగానే వాళ్ళింటి తలుపులు తెరుచుకున్నాయి.

ఇంటి ముందే పెద్ద రెడ్ కార్ ఆగి వుంది. 

తను రోజూ చేతులతో పట్టుకుని ఆడుకునే కార్ ఎంత పెద్దగా అయ్యిందో అని ఆశ్చర్యంగా చూసాడు మయూఖ్. 

మౌక్తిక తన ప్రిన్సెస్ బాగ్ లోనుంచి మళ్ళీ రిమోట్ తీసింది. ఈ సారి ఈ రిమోట్ వేరేది. ఇదీ కార్ లాగానే ఎరుపు రంగు లో వుంది. మౌక్తిక ఆ రిమోట్ నొక్కగానే కారు తలుపు తెరుచుకుంది.

మౌక్తిక మయూఖ్ చెయ్య పట్టుకుని, కారులోకెక్కించింది. మౌక్తిక కూడా మయూఖ్ పక్కనే కూచుంది. ఇప్పుడు కారు నడపడానికెవరొస్తారా అని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు మయూఖ్.

"ఎక్కడికి వెళ్ళాలో ఎడ్రెస్ చెప్పండీ?" అని వినపడింది హఠాత్తుగా.

మయూఖ్ కి భయమేసి మౌక్తిక చెయ్య గట్టిగా పట్టుకున్నాడు. మౌక్తిక, భయపడకు తమ్మూ. ఇది మన రెడ్ కార్ మాట్లాడుతోంది. దీని పేరేంటో తెలుసా? మెరుపు.  అదే మనల్ని తీస్కెళిపోతుంది తెలుసా అని నవ్వింది.

మౌక్తిక ఎడ్రెస్ చెప్పగానే, మెరుపు మెరుపులాగే జుయ్య్ మని దూసుకు పోయింది. వొక పెద్ద అడవి ముందుకి వచ్చి ఆగిపోయింది.

మౌక్తికా, మయూఖ్ వొకళ్ళ మొహాలు వొకళ్ళు చూసుకున్నారు.

"మీరు చెప్పిన అడ్రెస్ లో నేను ఇక్కడిదాకానే తీసుకురాగలను." అని చెప్పింది మెరుపు.

మౌక్తిక ముందు కారు దిగింది. మయూఖ్ మౌక్తిక వెనకాలే దిగి చుట్టూ చూస్తూ నుంచున్నాడు. 

"మీరు వెళ్ళి వచ్చేదాకా నేనిక్కడే వుంటాను." అని చెప్పి మెరుపు వెళ్ళి వొక చెట్టుకింద ఆగింది.

ముందు మౌక్తిక నడుస్తుంటే, అక్క చెయ్యి పట్టుకుని దిక్కులు చూసుకుంటూ వెనకాలే నడుస్తున్నాడు మాయూఖ్.

చెట్లూ పొదలూ తప్పించుకు వెళ్ళగానే అక్కడ ఆకుపచ్చటి చెట్లూ, ఆ చెట్ల నీడల్లోంచి చొచ్చుక్కుని వస్తున్న సూర్యుడి బంగారు కిరణాలు, కిందంతా తలలూపి పలకరిస్తూ రంగు రంగుల పువ్వులూ. ఆ పూలమీద వొకదాని మీద నుంచి వొక దానిమీదకి వాలుతూ అల్లరి చేస్తూ తిరుగుతున్న పంచె వన్నేల సీతాకోక చిలికలూ.

వాటిని ఆనందంగా చూస్తూ నడుస్తున్న మౌక్తిక భుజం మీద ఏదో వాలినట్టనిపించి చూసింది. వొక బుజ్జి వుడత వచ్చి కూచుంది అక్కడ.

దాన్ని చూసి కాస్త కంగారు పడింది మౌక్తిక.

"భయపడకు నేస్తం. ఈ అడవిలో కొత్తగా కనిపించేసరికి ఏదయినా సాయం కావాలేమో అడుగుదామని వచ్చాను" అంది బుజ్జి వుడత.

ఆ వుడత చాలా ముద్దొచ్చేసింది మయూఖ్ కి. వాడు చెయ్య జాపగానే బుడుంగు మని వాడి చెయ్యమీదకి దూకేసింది.

"నీ పేరేంటీ?" అనడిగాడు దాన్ని.

"నా పేరూ ఖుషీ. ఎప్పుడూ ఆనందంగా వుంటాననీ అలా పిలుస్తారు ఇక్కడందరూ" అని చెప్పిందది.

"అసలెప్పుడూ ఆనందంగా ఎలా వుంటావు?" అడిగాడు మయూఖ్. 

"వాడికన్నీ ప్రశ్నలే. " అంది మౌక్తిక.

"నేనెవ్వరికీ చెడు చెయ్యనూ. చెడు జరగాలని కోరుకోను. అందుకే నాకే దిగులూ వుండదు. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ వుండగలను." అని చెప్పి గబుక్కున కిందకి దిగి వొక చిన్న పండు తెచ్చుకుని మళ్ళీ మయూఖ్ భుజం మీదకి గెంతింది ఖుషీ.

"భలే భలే" అంటూ చప్పట్లు కొట్టింది మౌక్తిక.

"మేము మా నేస్తాలు అజ్జున్, మేఘనా వాళ్ళింటికి వెళదామని బయలుదేరాం. మా కారు మెరుపు కి ఇక్కడిదాకానే దారి తెలుసుట. నువ్వు సాయం చేస్తావా మరీ? " అన్నాడు మయూఖ్ ఖుషీ తో.

"మరి మీకు అడ్రెస్ తెలుసా?" అడిగింది ఖుషీ.

"వో నాకు తెలుసుగా." గడగడా చెప్పేసింది మౌక్తిక.

"హ్మ్...మీరు చెప్పిన వూరు అడవికి ఆ చివర వుంది. మనం అడవికి ఈ చివర వున్నాం. అంత దూరం నడవాలంటే మీకు కాళ్ళు నెప్పెడతాయే" అని ఆలోచనలో పడింది ఖుషీ.

"ఊ... వుండండి ఇప్పుడే వస్తా" అని చెట్ల మధ్యలోకి తుర్రుమంది.

అక్కడ పువ్వులన్నీ నవ్వుతూ వీళ్ళకేసి చూస్తున్నాయనిపించి వాటినే కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డారు ఇద్దరూ.

వెళ్ళినంత వేగంగానే పరిగెట్టుకుంటూ వచ్చింది ఖుషీ. దాని వెనకాలే వొక యేనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది.

ఏనుగుని చూసి భయపడిపోయిన మౌక్తికా, మయూఖ్ చెట్టువెనక్కి పారిపోయారు అమ్మో ఏనుగు ఏనుగు అని అరుస్తూ.

"అయ్యో భయపడకండి. ఇతని పేరు సహాయ్. ఎప్పుడూ అందరికీ చాలా సాయం చేస్తూ వుంటాడు. మిమ్మల్ని మీ నేస్తాల దగ్గరకి తీసుకెళతాడని పిలుచుకొచ్చాను." చెప్పింది ఖుషీ.

నెమ్మదిగా చెట్టు వెనకనుంచి ముందుకొచ్చి నుంచున్నారు మయూఖ్, మౌక్తికా.

ఎక్కడికి వెళ్ళాలో ఖుషీ చెప్పగానే, "పదండి పిల్లలూ పోదాం" అన్నాడు సహాయ్.

మౌక్తికా, మయూఖ్ వొకళ్ళ మొహాలు వొకళ్ళు చూసుకున్నారు.

"వోహో ఎలా ఎక్కాలని ఆలోచిస్తున్నారా? నేను సాయం చేస్తాగా..." అని తొండం ముందుకి చాపింది.

అది పట్టుకోగానే వొక్కొక్కళ్ళనీ తన వీపు మీదకి జాగ్రత్తగా తీసుకెళ్ళి కూచోబెట్టుకుంది.

మరి వెళ్దామా అనగానే ఇద్దరూ నవ్వుతూ తలూపారు. ఖుషీ కి టా టా చెప్పి ముగ్గురూ అక్కడ నుంచి బయల్దేరారు.

అడవిలో ప్రతీ చెట్టు పుట్టా, కొమ్మా రెమ్మా గురించీ చెపుతూ వాటిని పలకరిస్తూ వాళ్ళిద్దరినీ తీసుకెళుతోంది సహాయ్. 

"అక్కా మరేమో నాకు ఆకలేస్తోంది" మౌక్తిక చెవిలో రహస్యంలా చెప్పాడు మయూఖ్.

వాడెంత నెమ్మదిగా చెప్పాననుకున్నా ఏనుగు చెవులు పెద్దవికదా చక్కగా వినపడిపోయింది.

"ఏంటి పిల్లలూ ఆకలేస్తోందా? కాస్సేపు ఆగండి. ఒక మంచి చోటుకి తీసుకెళతా." అని చెప్పాడు సహాయ్.

అన్నట్టుగానే వొక పావుగంట లో వొక చోటకి తీసుకెళ్ళాడు. అక్కడకెళ్ళగానే పిల్లలిద్దరూ కళ్ళూ నోరూ తెరుచుకుని వుండిపోయారు.

అక్కడ చెట్లకి రక రకాల చాక్లెట్లూ, బిస్కట్లూ విరక్కాసి వున్నాయి. చిన్న చిన్న కొలనుల నిండా రక రకాల ఐస్ క్రీములు వున్నాయి.

"అలా చూస్తే కడుపు నిండి పోతుందా? మీకు నచ్చినవన్నీ తినెయ్యండి" అన్నాడు సహాయ్.

"అమ్మ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందంటుంది." దిగులుగా చెప్పాడు మయూఖ్.

"ఇవి ప్రకృతి తల్లి ఇచ్చిన ఐస్ క్రీములు. ఇవి తింటే ఏమీ కాదు." అనగానే ఇద్దరూ వాళ్ళకి నచ్చినవన్నీ తినేసారు. ఎన్ని తిన్నా మయూఖ్ కి లాలీ పాప్ కూడా తింటేగానీ తృప్తిగా లేదు. అది చూస్తే వొక చిటారు కొమ్మకి వుంది.

సహాయ్ దగ్గరకెళ్ళి మరేమో నాకా లాలి పప్ తినాలనుంది అన్నడు మయూఖ్. సహాయ్ తన తొండం ఎత్తి ప్రయత్నించినా అది అందలేదు.

బుంగ మూతి పెట్టిన మయూఖ్ ని చూసి ఏమీ ఫరవాలేదు అని చెప్పి "అల్లరీ" అని గట్టిగా అరిచాడు. ఎక్కడనుంచి వచ్చిందో వొక ఎర్రటి కోతి గబుక్కున వురికింది.

"ఏంటీ నీ పేరు అల్లరా? భలే విచిత్రంగా వుందే?" అన్నారు పిల్లలిద్దరూ.

"మరి నేనెప్పుడూ చేసేది అదే కదా. ఇంతకీ నన్నిప్పుడు దేనికి పిలిచారు?" అని అడిగింది అల్లరి.

"ఈ పిల్లలకి అన్నీ అందాయి గానీ ఆ లాలీ పాప్ అందడంలేదోయ్. నాక్కూడా అందలేదూ. నీ వల్ల మాత్రమే అవుతుందని పిలిచాను." చెప్పాడు సహాయ్.

"ఓహ్ అదెంత పనీ ఇప్పుడే తెచ్చిస్తా" అని కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి దూకుతూ కోతి కొమ్మచ్చి ఆడేసి ఇద్దరికీ రెండు లాలీ పాప్ లు తెచ్చి ఇచ్చేసింది అల్లరి.

"పిల్లలూ మరి బయల్దేరదామా?" అనడిగాడు సహాయ్.

అందరూ అల్లరికి టా టా చెప్పి అక్కడ నుంచి బయల్దేరారు.

దార్లో నారింజ రసం వున్న జలపాతం కూడా చూపించాడు సహాయ్. అక్కడ కాస్సేపు ఆ జ్యూస్ తాగి ఆడుకుని మళ్ళీ బయల్దేరారు.

వొక పెద్ద వాగు దగ్గరకి రాగానే ఇదిగో ఇది దాటితే అవతల వైపున్నదే మీరెళ్ళాలనుకున్న వూరు అని చెప్పి ఇద్దర్నీ కిందకి దించాడు.

"మరిది దాటడం ఎలా?" ఇద్దరూ బిక్కమొహాలేసుకుని అడిగారు సహాయ్ ని.

"అది మాత్రం నా వల్ల కాదు పిల్లలూ. ఈ వాగు లోతు నా పొడవుకన్నా ఎక్కువ" అని చెప్పాడు.

మరిప్పుడెలా అని ఆలోచిస్తుంటే, అక్కడకొక పెద్ద జిరాఫీ వచ్చింది.

"ఏంటీ అందరూ అంతలా ఆలోచిస్తున్నారు?" అనడిగింది సహాయ్ ని.

"అరే అభయ్ నువ్వా? నీ సంగతే మర్చిపోయి తెగ ఆలోచిస్తున్నాం. ఇంక మా సమస్య తీరిపోయినట్టే." అన్నాడు సహాయ్.

"ఇదిగో మౌక్తికా, మయూఖ్ ఇతని పేరు అభయ్. చక్కగా ఈ యేరు దాటించేస్తాడు" అని చెప్పేసాడు సహాయ్.

"వో అదెంత పనీ. కానీ వొకసారి వొకళ్ళని మాత్రమే ఎక్కించుకోగలను. ముందెవరు ఎక్కుతారో చెప్పండి." అన్నాడు అభయ్.

మౌక్తికా మయూఖ్ ఇద్దరూ ముందు నేను వెళతా అంటే నేను వెళతా అని కాస్సేపు పేచీ పడ్డారు. వాళ్ళ గొడవ ఎంతకీ తేలకపోవడం చూసి, సహాయ్ "సరే మీ ఇద్దరిలో ఎవరి దగ్గరైనా వొక రూపాయి వుందా?" అనడిగాడు.

"నా దగ్గరుందిగా." అని మౌక్తిక తీసిచ్చింది.

"సరే ఇది బొమ్మ పడితే మౌక్తిక ముందు వెళ్తుంది, బొరుసు పడితే మయూఖ్ ముందర వెళ్తాడు. సరేనా?" అనడిగాడు సహాయ్.

ఇద్దరూ వొప్పుకున్నాక తన తొండంతో పైకి ఎగరేసాడు. కింద పడగానే చూస్తే బొమ్మ పడింది.

మయూఖ్ మొహం ముడుచుకునే మౌక్తిక ని ముందు పంపించాడు. మౌక్తిక ఎక్కడం కోసం తన మెడని వంచి తనని పట్టుకోగానే తల ఎత్తింది అభయ్. అభయ్ తలెత్తగానే జారుడు బల్ల మీద నుంచి జారినట్టు జారి వీపు మీదకి వెళ్ళి పడింది మౌక్తిక. అది చూసి భలే వుందే అని మయూఖ్ చప్పట్లు కొట్టాడు.

" చూడు మౌక్తికా, వాగు మధ్యలో వొకచోట చాలా లోతుగా వుంటుంది. అక్కడ మాత్రం నా తల మీదకి వచ్చేసి పట్టుకోవాలి. లేకపోతే మునిగిపోతావు జాగ్రత్త." అని బయల్దేరే ముందే చెప్పాడు అభయ్.

జాగర్తగా మౌక్తిక ని దించేసి కాస్సేపట్లో వెనక్కి వచ్చి మయూఖ్ ని కూడా తీసుకెళ్ళాడు. సహాయ్ ఇద్దరికీ టాటా చెప్పాడు.

మయూఖ్ ని మౌక్తిక దగ్గర దింపి "అదిగో ఆ కనపడేదే మీ నేస్తాల ఇల్లు." అని చెప్పాడు అభయ్.

కొంచెం దూరం లో మేఘనా, అర్జున్ వాళ్ళ తోటలో ఆడుతూ కనపడుతున్నారు వాళ్ళకి.

*****

"మయూఖ్ మయూఖ్ మయూఖ్ లేవరా... చూడు మనతో ఆడుకోడానికి ఎవరొచ్చారో? వాళ్ళప్పుడే బొబ్బ పోసేస్కుని రెడీ అయిపోయారు. నువ్వు చూడు ఇంకా నిద్ర పోతున్నావు. " మౌక్తిక గట్టిగా అరిచినట్టు మాట్లాడుతోంది.

"అంత దూరం నుంచి ఇంత పొద్దున్నే ఎలా వచ్చేసారు?" కళ్ళు నులుముకుంటూ అడిగాడు మయూఖ్.

"నడిచే వచ్చాం. మీకూ మాకూ మధ్యలో వొకిల్లేగా వుందీ?" అంది మేఘన.

కాస్సేపు వాళ్ళిద్దరికేసి తేరి పార చూసి నవ్వడం మొదలెట్టాడు మయూఖ్. వాడెందుకలా నవ్వుతున్నాడో మాత్రం వాళ్ళెవరికీ అర్ధం కాలేదు.

                                                                                       *****

కలలకీ వూహలకీ హద్దులు లేవు. కానీ ఆ స్వేఛ్చ వుండేది కూడా మన కలలకి పరిమితులుండాలని తెలియని తియ్యటి బాల్యం లోనే.