నేనెప్పుడూ సినిమా రివ్యూ రాయలేదు...రాద్దామని ఏనాడూ అనుకోనూలేదు. ఇప్పుడు రాస్తున్నది రివ్యూ అనికూడా అనుకోవడంలేదు...శ్రీరామరాజ్యం చిత్రం చూసిన తర్వాత రెండురోజులయినా విడిచిపెట్టని ఒక అనుభూతిని నా బ్లాగుచదివే కొంతమందితోనయినా పంచుకోవాలని రాస్తున్నానంతే
రమణ గారి హంసగీతం అని ఒకాయన రాసిన రివ్యూలాంటిది చదివాక చూసితీరాలనిపించి మావారిని బతిమాలి మరీ లాక్కెళ్ళాను శనివారం సాయంత్రం...మావారు పెద్దగా సినిమాలమీద research ఏమి చెయ్యరు నాలాగ. రాముడి పాత్రలో కూడా బాలకృష్ణ తొడగొడతాడు చూడు అని ఏడిపిస్తూనే వున్నారు సినిమా మొదలయ్యేవరకూ...
ఒక్కసారి సినిమా మొదలయ్యాక మాత్రం రాముడూ సీతలమధ్యకి మమ్మల్నీ లాక్కువెళిపోయింది...చూస్తున్నంతసేపూ పెద్దగా analysis ల వైపు పోలేదు బుర్ర. చాలాకాలం తర్వాత లీనమైపోయాననిపించిన సినిమా...తెలుసున్న సీతారాముల కథే ఐనా రెండు మూడు చోట్ల కళ్ళు చెమర్చాయి. ఒక సినిమా చూస్తూ ఆ పాత్రకి connect ఐపోయి ఆ పాత్ర కష్టానికి కంటతడి పెట్టిన సినిమా ఈమధ్య కాలంలో చూసిన గుర్తు లేదు.(కొన్ని పాత సినిమాలు మళ్ళీ చూసినప్పుడు ఆ అనుభూతి మళ్ళీ కలిగిన సందర్భాలు చాలానే వున్నాయనుకోండి)
చూసి ఇంటికొచ్చినదగ్గరనుండీ ఆ పాటలే వింటున్నాం. అదీ సంగీతం...వాటి సాహిత్యం గురించి చెప్పాలంటే. చిన్న చిన్న మాటలతో ఎంతో అర్ధవంతం గా రాసిన జొన్నవిత్తుల గారి సాహిత్యానికి ఇళయరాజా ఇచ్చిన సంగీతం నాకైతే చాలా నచ్చింది. ఎక్కడా వాయిద్యాలు సాహిత్యాన్ని మించిపోయి మాట వినపడకుండా చెయ్యలేదు. చిన్న పిల్లలు కూడా చక్కగా పట్టుకుని పాడుకునేలా వున్నాయి పాటలు. బొమ్మాళీ నిన్నొదలా వొదలా అని నా కూతురు TV చూసి పాడేస్తుంటే చూసి బెంగపడే నాలాంటి తల్లులకి ఒక చిన్న relief. ఈ పాటలు కొన్నిరోజులైనా TV ల్లో మారుమ్రోగితే ఇవి కాస్తైనా వంటపట్టించుకుటారుకదా పిల్లలు అన్న ఆశ.
సినిమా చూస్తున్నంత సేపూ అందులో నటులెవ్వరూ గుర్తురాలేదు...ఆ పాత్రలే కనిపించాయి. ఒక image వచ్చేసిన నటులందరితో వాళ్ళ మ్యానరిజంస్ ఎక్కడా బయటకీ రాకుండా నటింపచేసిన బాపూ గారికీ ఆయనకి గౌరవం ఇచ్చి, తోచినట్టు కాకుండా చెప్పినట్టూ , ఆయన గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా నటించిన పెద్ద పెద్ద నటులందరికీ కూడా జోహార్లు చెప్పి తీరాలి.
ముఖ్యంగా చెప్పాల్సింది నయనతార గురించే. మిగిలిన వాళ్ళందరికీ పౌరాణికాల్లో కాస్తో కూస్తో అనుభవమైనా వుంది. నయనతార అనగానే ఇంక చూసినట్టే అనుకున్నవాళ్ళల్లో నేనూ వున్నాను. కానీ చూస్తున్నంతసేపూ సీతమ్మే కనిపించింది. ఎంతో గౌరవం కూడా కలిగింది. చాలా హుందాగా తను సీత బాధని అనుభవించి మరీ చేసిందనిపించింది. అలాగే బాలహనుమంతుడిగా వేసిన చిన్నపిల్లాడు కూడా ఒదిగిపోయాడు. హనుమంతుడు మారువేషంలో సీతమ్మతో పాటే వుండిపోయాడని చేసిన మార్పు ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. పైపెచ్చు ఇలాగే చేసి వుంటాడేమో అనిపించింది. తాను గీసిన బొమ్మలతో పూర్వ రామాయణం మొత్తం పేర్లు పడుతున్నంత సేపూ చూపించటం కూడా ఎంతో చక్కగా వుంది.
మాటలగురించి చెప్పాల్సినదేముంది. రమణ గారి బుడుగు చదువుతూ పెరిగినదాన్ని. అది చిన్నపిల్లకోసం రాసినట్టే ఈ కాలం పిల్లలకి వాళ్ళకర్ధమవ్వటానికి ఆయన రాసిన సీతారాముల కధ అనిపించింది.
క్రితం సంవత్సరం మేము india వెళ్ళినప్పుడు దసరా రోజున పండగ సందర్భంగా ఒక channel లోలవకుశ వేస్తుంటే, పిల్లలకి ఆ సినిమా చూపించటానికి పెద్దవాళ్ళంతా నానా తంటాలు పడ్డారు. ఆఖరికి భయపెట్టి మరీ కూచోపెట్టాల్సొచ్చింది. కూచున్నారే గానీ బుంగమూతులు పెట్టుకుని ఎప్పుడైపోతుందిరా భగవంతుడా అన్నట్టు కూచుని మధ్యలో ప్రకటనలొచ్చినప్పుడు జాగ్రత్తగా ఒక్కొకళ్ళూ తుర్రుమన్నారు. వాళ్ళకి ఆ సినిమాలో మాటలు greek, latin లా అనిపించడంలో చిత్రమేమీ లేదు. లవకుశేగా మళ్ళీ తియ్యటమెందుకూ అనుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఇదేనేమో అనిపించింది. ప్రతీ తరంలో ఆ సమయానికి తగ్గట్టు ఒకసారి ఇలాంటి చిత్రాలు తీయటం మంచిదని. ఈ తరానికి కూడా తాము ఎంతగానో నమ్మిన సీతారాముల కధని చేర్చడమనే బాధ్యత తమ భుజాలపై వేసుకున్నారు బాపూరమణలు.
కనులకి విందు
చెవులకి ఇంపు
మనసుకి మధురానుభూతి...
ఇది రమణ రాసి...బాపూ గీసిన సీతారామ చరితం..
15 comments:
Lucky you! :) అబ్బా.. మీరందరూ చూసేసి ఇలా వర్ణించి వర్ణించి చెప్పి ఊరించేస్తుంటే.. నాకు మహా దిగులొచ్చేస్తోంది.. మాకిక్కడ చూసే అవకాశం లేనందుకు.. :(
చాలా బాగా రాశారండీ.. కరెక్ట్ గా చెప్పారు ప్రతి తరానికి చేరే విథంగా ఎపిక్స్ ని తీయవలసిన బాధ్యత ఉంది. మాయాబజార్ చూస్తారు కానీ పిల్లలకు లవకుశ చూపించడం కష్టమే..
సరిగ్గా ఇలాంటి సందేహాలే, అంటే, తొడ కొట్టడం, ఇమేజు ఉన్న నటులు వగైరాలతో అటూ ఇటూ ఉగుతున్న నాకు బాగానే నివృత్తి చేశారు. చాలా సంతోషం. కాని మాకు చూడడానికి ఇంకొంతకాలం పడుతుంది. మరి మేమెక్కడో సప్త సముద్రాల అవతల ఉన్నాం కదా!
gksraja.blogspot.com
ఇది బాపు రమణ ఇళయరాజా గార్ల సృష్టి, పాత లవకుశతో పోల్చి చూడకూడదు. నయనతార చాలా బాగా నటించింది..కాదు కాదు..జీవించింది అన్నా అతిశయోక్తి కాదేమొ..
బాలకృష్ణ కూడా బాగానే నటించారు, కాని కొన్ని సన్నివేశాలలో అతని కంగారు మాత్రం ఎప్పటిలానే, అది కాక వయసు మీదపడిన ముడతలు బొజ్జ కొట్టొచినట్టు కనిపించాయి, అతని పరిధికి చాలా కష్టపడినట్టె!!
ee magic ila
Bapu + Ramana + Ilayara tho
create avutundani anukoledu.
May be future lo inka jaragadu.
Ramana gaaru leru kaabatti.
Sridhar
నేను ఈ సినేమాని నిన్న ఈ వేళా చూసాను. ఈ సినేమా పాత లవకుశ కన్నా బాగా ఉందనిపించిది. పాత లవకుశలో పాటలు ప్రతి శ్రీరామనవమికి విని విని మనకి అదోక గొప్ప చిత్రం గా మనసులో నిలచి పోయింది. ఈ సినేమా కన్నుల పండుగగా ఉంది. ఇక బాలకృష్ణ నటన చాలా బాగా చేశాడు. రాముడు సల్మాన్ ఖాన్ గారిలా వయసు మీదపడుతున్నా కండలు మైంటైన్ చేయలన్నుట్టు ఉంది కొంతమంది అభిప్రాయం. శ్రీరాముడు పెళ్లి చేసుకొని పెళ్ళాం ఉన్నవాడు చిరు బొజ్జ ఉండటం వారికి సహజమే! అని సరి పెట్టుకొండి. నయనతార సీతగా బాగుంట్టుందని నిర్ణయించిది బాలకృష్ణ అని చదివాను. అతని జడ్జ్ మేంట్ చాలా కరేక్ట్. అయినా, ఆయన కాబట్టి వొంటికంతా నీలం రంగు పూసుకొని నటించాడు, ఆయన ఓపికకు హాట్స్ ఆఫ్. నేను బాలకృష్ణ అభిమానిని కాదు. కానిబాలకృష్ణ నటనని గత సినేమాలతోనో, ఆయన వీక్ పాయింట్స్ తో పోల్చి దక్కాల్సిన క్రేడిట్ ఇవ్వక పోవటం అనేది బాగా లేదు. చాలా రివ్యూలు బ్లాగులో చదివాను, ప్రతి వారుగొప్ప విశ్లేషకులు గా భావించుకొని బాలకృష్ణ నటనను ప్రస్తావించకుండా, నయనతారను ఆకాశానికి కెత్తటం ఎమీ బాగా లేదు. నాగర్జున,చిరంజీవి,పవన్, రాం చరణ్, మోహన్ బాబు మొద|| వారిని పెట్టి రాముడిగా తీసి ఉంటే బాపుగారి చిత్రమైనా ఒక్కరు రివ్యూ రాసి ఉండేవారు కాదు.
చాలా చక్కని విశ్లేషన ఇచ్చారు. ఇందులో నటీనటులందరినీ ఆ పాత్రల్లో బాపు గారు ఒద్దికగా తన గీతల వలె ఇమిడ్చి చూపారు. విమర్శలకు తావులేని చక్కని చిత్రం. బాపు బొమ్మని ఎవరైనా ఇలా గీసి ఉంటే బాగుండేది అనటాకికి తావే ఉండదు. ఒక గీత తగ్గినా, ఒక గీత పెరిగినా అందులోని అందమే తరిగిపోయేంత చక్కని చిత్రకారుడు. అలానే ఈ సినిమా కూడా అంత ఒద్దికగానూ, చక్కగానూ వచ్చింది...మీ విశ్లేషణ బాగుంది.
స్ఫురిత,
బాగా రాశారు. ముఖ్యంగా పాత లవకుశ ని ఈ కాలం పిల్లలు మనలా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇక నాదీ, మధురవాణి గారి మాటే. శనివారం దాకా ఆగి మళ్లీ మీ అందరి రివ్యూలు చదవాలి.
పైన అజ్ఞాత చెప్పిన అంశం .. నాకు పాయింటే అనిపిస్తుంది..
ఉత్తర రామాయణ కాలం నాటికి రాముడు నడిమి వయసు వాడు. సో కండలు మెయింటెయిన్ చేయక్కరలేదు. ఆవిధం గా ఆ పార్ట్ కి బాలకృష్ణ రూపు రేఖలు ఓకే నేమో.. ఇలాగ నేను ఇప్పటి దాకా ఆలోచించలేదు. :)
మీ టపా నాకు నచ్చింది :)...నిజమే ఈ తరం కోసమే తీసారేమో :)
ఇది రమణ రాసి...బాపూ గీసిన సీతారామ చరితం..-- sooper :)...ఈ మాటకి అయిన నేను వెళ్లి చూస్తాను :)
మధురా...వీలైనప్పుడు తప్పకుండా చూడండి
వేణు శ్రీకాంత్ నచ్చినందుకు ధన్యవాదాలు
రాజా నా టపా మీ అనుమానాలు నివృత్తి చేసినందుకు సంతోషం.
శర్మా...వ్యాఖ్యకి ధన్యవాదాలు.
అజ్ఞాత1...ధన్యవాదాలు
అజ్ఞాత2...బాలకృఇష్ణని పొగడతానికీ ఆకాశానికెత్తెయ్యటానికి బోల్డు మంది వున్నారులెండి...ఐనా నాది విశ్లేషణ కాదు నా అనుభూతి మాత్రమే... వ్యాఖ్యకి ధన్యవాదాలు
కృఇష్ణప్రియా చూశాక మీ అనుభూతి కూడా చెప్పండేం
కిరణ్...నా టపా చదివి సినిమా చూస్తా అన్నావ్...నా వుడత సాయం వృధా పోలేదని తుత్తి నాకిప్పుడు :)
బాలకృష్ణ నటనని ప్రశంసించకపోవడం తప్పే. జనాలందరికీ రామారావు అంటే ఉన్న మితిమీరిన భక్తే దీనికి కారణమని నేను అనుకుంటున్నా. లవకుశ సినిమాలో రామారావు నటన ఇంతకంటే గొప్పగా లేదు కచ్చితంగా. బాలకృష్ణ తనకి అలవాటైన పిచ్చిపోకడలని కట్టిపెట్టి చాలా ఒద్దికగా చేశాడు, పాత్రోచితంగా చేశాడు. కండల విషయానికి వస్తే లవకుశలో రామారావు ఈ సినిమాలో బాలకృష్ణ ఉన్న సైజుకి రెట్టింపు ఉన్నాడు. నాకు తోచిన గొప్ప తేడా - రామారావు రాముడు చాలా ఉదాత్తంగా ఎక్కడో మనకి అందని దూరంలో ఉన్నాడు. బాలకృష్ణ రాముడు మనకి దగ్గరగా మనవాడే అనిపించేట్లుగా ఉన్నాడు. అందుకనే సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు గుండె చిక్కబట్టింది, కంతతడి పెట్టించింది అని చెప్పుకున్నారు. బాలకృష్ణకి ఇది చాలా గొప్పవిషయమని నేననుకుంటున్నా.
@కొత్తపాళీ, అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు...
పై అజ్ఞాత తప్పు పట్టినట్టు నేను బాలకృష్ణ శరీరాకృతి గురించి నేను ఎక్కడా రాయలేదు. అది ఒక పాఠకుడు తన అభిప్రాయం లో మాత్రం వ్యక్తం చేశారు...మరొక విషయం నేను ఎక్కడా లవకుశ తో పోల్చీ చూడలేదు...రామారావు గారి అభిమానిని అంతకన్న కాదు.
బాల కృష్ణని మెచ్చుకోలేదని కోప్పడ్డవాళ్ళంతా నేను నాగేశ్వర్రాఒ నటనని కూడా ప్రత్యేకం గా పొగడలేదని గుర్తించాలి. వాళ్ళిద్దరివీ ముఖ్య పాత్రలే...
ఈ వాక్యాలు అందరు సీనియర్ నటులనీ వుద్దేశించి రాసినవే
ఒక image వచ్చేసిన నటులందరితో వాళ్ళ మ్యానరిజంస్ ఎక్కడా బయటకీ రాకుండా నటింపచేసిన బాపూ గారికీ ఆయనకి గౌరవం ఇచ్చి, తోచినట్టు కాకుండా చెప్పినట్టూ , ఆయన గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా నటించిన పెద్ద పెద్ద నటులందరికీ కూడా జోహార్లు చెప్పి తీరాలి.
yes.I agree each and every word in your blog. natulu kakunda patralu kanipinchayi...ekkuva takkuva lekunda imidipoyaru...
baga rasaru.
maanasaa, Thank you...
chinni aasa...i missed you in my earlier response...Thanks for your appreciation...
చాలా బాగా రాశారండీ..సంక్రాంతి శుభాకాంక్షలు.
Post a Comment