1/25/10

మొదటి టపా

చిన్నప్పుడు అన్నం తింటూ కంచం చుట్టూ మెతుకులు పోస్తుంటే, అది చూసి మా నాన్నగారు అలా మెతుకులు పోస్తే తాతగారు కొట్టేస్తారు, ఆయనకి రెండు బెల్టులు వున్నాయ్ తెలుసా అన్నారుట. అప్పుడు నేను నాకు రెండు వీపులు లేవుగా అన్నానుట. అది విని మా తాతగారు ఇది పెద్దయ్యాక పెద్ద రచయిత్రి ఐపోతుంది అని తెగ మురిసిపొయారుట.(నా మాతా మహులూ, పితా మహులూ ఇద్దరూ మంచి పండితులు, కవులు. ఎన్నో పుస్తకాలు రాసిన వారు. నాన్న గారు వృత్తి రీత్యా తెలుగు పండితులు, సాహిత్యాభిలాషి. నేనుమాత్రం పండిత పుత్రీ...అనే రకం లెండి) ఈ సంఘటన మా అమ్మ పదే పదే చెబుతూ వుండేది. అది వినీ వినీ నిజమే కాబోసు అనేసుకునీ Intermediate లో వుండగా కథో కాకరకయో ఎదో రాసి అదే తతగారికి చూపిస్తే, పునాది లేని ఇల్లులా వుంది, ధ్వజ స్తంభం లేని గుడిలా వుంది అని ఆయన పాండిత్యానికి తగ్గట్టు ఏవో విమర్శలు చెసేశారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి రాతల జోలికి పొకుండా ఎదో నాకు ఎక్కిన చదువులు చదివి శత కోటి లింగాల్లో ఒక బోడి లింగం లాంటి software engineer (మా అమ్మ software engineer ల కి పెట్టిన పేరు) ఐపోయాను.

కొన్ని ఏళ్ళ తర్వాత ఒక మధ్యాహ్నం భోంచేస్తూ office లో అసలు తెలుగు లో కథలు, బ్లాగులు మైనా వుంటాయా అని వెతికితే(నమ్మండి ఆ నిముషం వరకూ తెలుగులో బ్లాగింగు ఇంత విస్త్రుతం గా సాగుతోందన్న విషయమే తెలియని అజ్ఞానిని) కొన్ని e-పత్రికలూ, బ్లాగులు కనిపించాయి. దాంతో మళ్ళీ నాకు వంశ పారంపర్యం గా వచ్చిన తెలుగాభిమానం చిగురించి రోజూ కొంత సమయం వెచ్చించి కొన్ని వ్యాసాలు, కథలు, పత్రికలు చదివాను. కొన్నాళ్ళకి అది నాకొక వ్యసనం లా కూడా తయ్యారైంది. మళ్ళీ రాయాలనే కోరిక కూడా మొగ్గలు వెయ్యడం మొదలైంది.



రాద్దామన్న ఆలోచన వచ్చాక కూడా చాలా రోజులు ధైర్యం చెయ్యలేకపొయాను. నేను చదివిన బ్లాగుల రచయితలందరూ తెలుగుమీద, సాహిత్యం మీదా చాలా పట్టు వున్నవాళ్ళాయె. నేనా పదవ తరగతి తర్వాత తెలుగుని ముట్టుకుంది లేదు. ఐనా కానీ ఈ ఏడాది నా నూతన సంవత్సర తీర్మానాల్లో అనుకున్న పనికి ముందే భయపడి వెనకడుగు వేయరాదు అన్నది ఒకటి. కనీసం అదైనా చేద్దాం అని మొత్తానికి మొదలు పెట్టేసాను.

ఈ బ్లాగు మొదలు పెట్తడానికి ప్రధానంగా ఇంకొన్ని కరణాలు వున్నాయ్. USA కి వచ్చాక మనసారా కబుర్లు చెప్పుకోవడానికి మంచి స్నేహితులే దొరకలేదు. ఎవరితో ఎమంటే ఏమి గొడవో అనే భయం. ఒక సారి ఒకావిడతో ఎదో హీరో పాట వస్తూంటే ఇతన్ని జనాలు ఎలా భరిస్తున్నారో ఇంకా అనేసాను, పక్కనుండి వళ్ళాయన ముసి ముసి నవ్వులు. ఆవిడ ఆ హీరో కి fan ట, తరవాత తెల్సింది. ఇలాంటి కొన్ని సంఘటనల తర్వాత ఎవరితోనైనా ఇవాళ ఏం వండారు, మీ అమ్మాయ్ నాకొద్దూ అనకుండా అన్నం తినటానికి ఏం వుపాయాలు వాడతారు లాంటి కబుర్లతోటే సరి. కనీసం ఇలగైనా మనసుకి తోచిందల్లా మొహమాట పడకుండా రాసుకోవచ్చేమో అన్నది ఒక కారణం. రోజూ ఆఫీసూ, ఇల్లూ ఇవే పనులతో జీవితం అంటే ఇంతేనా అనే వైరాగ్యం వచ్చేస్తుందేమో అనిపించి నాకోసం నాకు నచ్చిన పని అంటూ ఎదైనా చెయ్యాలి అనిపించడం ఇంకో కారణం.

చిన్నప్పుడు నేనూ, మా నాన్నగారూ ఒక ఆట ఆడుకునేవళ్ళం. ఒక గంట సేపు అస్సలు English పదాలు వడకుండా మట్లాడాలి అనీ. ఇక్కడ కూడా అలాగే ప్రయత్నిద్దాం అనుకున్నా గాని నా వల్ల కాలేదు. Office అనటానికి కార్యాలయం అంటారు, మరి Company కి తెలుగేమిటో చచ్చినా తట్టలేదు. కనీసం అక్షరాలైనా తప్పులు లేకుండా టైపు చెయ్యాలని చాలా ప్రయత్నం చేసాను కాని ఇది చూస్తే మా నాన్నగారు ఎన్ని ఎర్ర ఇంకు గుర్తులు పెడతారో మరి...

6 comments:

Unknown said...

sphurita....u r posting ur blog very nicely. Pl. continue ..... ramani.

మధురవాణి said...

నేనా పదవ తరగతి తర్వాత తెలుగుని ముట్టుకుంది లేదు.
నేనూ మీలాగేనండీ.! కొద్దో గొప్పో తేడాతో అచ్చం మీలాగే మొదలయింది నా బ్లాగు ప్రయాణం కూడా.!
ఆనంద బ్లాగ్ప్రయాణ ప్రాప్తిరస్తు! ;-)
మీర్రాసే మంచి మంచి పోస్టుల కోసం ఎదురు చూస్తాను.

Sai Praveen said...

నేను కూడా దాదాపు ఇలాంటి ఆలోచనలతోనే నా బ్లాగు మొదలు పెట్టాను. ఆశ్చర్యంగా చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి మీకు నాకూ. :)
మా నాన్నగారు ఇంగ్లీష్ లెక్చరర్ అయినా కాని తెలుగు మీద మంచి పట్టు ఉంది. నేను కూడా ఈ మధ్యే ఆఫీసు లో ఉండగా బ్లాగులు చదవడం అలవాటయ్యి, వ్యసనంగా మారి మొత్తానికి ధైర్యం చేసేసాను (అమ్మ నాన్నల నుంచి వచ్చిన భాషాభిమానం తోనే). మీరు U.S లో నేను U.K లో. ఇక్కడ నాతొ తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ.
ఆంగ్ల పదాలు వాడకుండా ఆడే ఆట నేను నా స్నేహితుడితో ఆడేవాడిని :). ఆ ఆట లో మనకి అలవాటు లేని పదాలు బోలెడన్ని వాడుతూ ఉంటె గొప్ప హాస్యం పుడుతుంది మన సంభాషణలో. (హమ్మయ్య ఈ రెండు ముక్కలు ఆంగ్లం వాడకుండా రాసేసా :) )

sphurita mylavarapu said...

@ ప్రవీణ్, ఐతే మీరు UK లో నేను US లో తెలుగు మీద బెంగెట్టుకుని, బ్లాగుల మీద పడ్డామన్నమాట :).
కానీ ఒక రకం గా మనం అదృష్టవంతులం. తెలుగు TV channels అన్నీ కలిసి తెలుగు నె ఖూనీ చెసెస్తుంటే చూస్తూ, వింటూ బాధ పడాల్సిన పని లేదు :)
మీ వ్యాఖ్య కి చాలా ధన్యవాదాలు.

Sai Praveen said...

బాగా చెప్పారు. ఆ రకంగా మనం చాలా అదృష్టవంతులం :)

స్థితప్రజ్ఞుడు said...

నాది సరిగ్గా మీ కేసే. అసలు తెలుగు లో టైపు చెయ్యడం అంటే చాలా కష్టం అని అనుకునే వాడిని. తెలుగు లో బ్లాగులు ఉంటై అని ఈ నాడు ద్వారా తెలిసింది. ఒకసారి మన మనసులో మాట బ్లాగు గురించి పడింది కదా.