2/2/15

పదవ తరగతి జ్ఞాపకాలు కౌముది లో

ఈ నెల కౌముది లో నా పదవ తరగతి జ్ఞాపకాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కిరణ్ ప్రభగారికీ, రాయమని ప్రోత్సహించిన మధుర కీ ధన్యవాదాలు.

http://www.koumudi.net/Monthly/2015/february/feb_2015_tenthclass.pdf

10/2/14

కడలి కెరటాలు

నా రెండవ కథ 'కడలి కెరటాలు' ఈ నెల కౌముది లో వచ్చింది. చదివి ఎలా వుందో చెప్పండి....

http://www.koumudi.net/Monthly/2014/october/oct_2014_kadhakoumudi_4.pdf

4/14/14

చిలకపలుకులు - 4 - పెద్దాళ్ళకో పరీచ్చ!




హాఆఆఆఆయ్ పెద్దోళ్ళూ నమత్తే! నేను పొద్దున్నే మా కూల్లో ఇంత పొడుగ్గా హాయ్ చెప్తా తెల్సా. ఏంటీ అలో నా? అలో అని చెవిదెగ్గిర పెట్టుకుని మాట్లాడతాం కదా దాన్లోనే అనాలి. అమ్మ అలో నేను తీసేసుకుని భలే ఏడిపిస్తాలే తెల్సా?

మరేమో ఇప్పుడూ మీకో చిన్న పరీచ్చ అన్నమాట. ఎప్పుడూ మీరు మాకు పెట్టెయ్యడమే అనుకుంటున్నారేంటమ్మా!

నేనేమో నా టోరీ చెప్తా అన్నమాట. నా భాష మా అమ్మకీ, నాన్నకీ మా అక్కకైతే సూపల్ గా అర్ధమైపోతుందనుకో. మీలో ఎంతమంది నేను చెప్పినవి కలెక్ట్ గా డీకోడ్ చేత్తాలో చూద్దామే. మొత్తం నా భాషలో చెప్పేత్తే మీరు బుల్ల గోక్కుంటారు కదా. అందుకే మధ్యలో అండర్ లైన్ చేసినవే నా ఓన్ భాషన్నమాట. అవి చెప్తే చాలు. సరేనా స్టార్ట్ మరిప్పుడు.

నేను పొద్దున్నే లేచి బబ్బ పోచుకునీ, కీమ్ రాసేస్కునీ రెడీ ఐపోతూ వుంటానా. ఇంతలోనే అక్కేమో నేను సూ వేసేసుకున్నా అని పలిగెట్టుకుంటూ వచ్చేత్తుంది. అమ్మో నేనింకా లెడీ అవ్వనే లేదని నాకు కంగారొచ్చేత్తుంది. మమ్మీదాయీ  సూ సూ అని గోల మొదలెడతా. అమ్మేమో వుండమ్మా తల దువ్వేసుకుని అప్పుడేస్కుందువు అంటూ నా బుర్ర భరతం పడుతూ వుంటుందా... ఈ అక్కేమో నేను చూడూ మిల్క్ కూడా తాగేస్తున్నా అని గ్లాసు పట్టుకుని వచ్చేస్తుంది. నాకూ అప్పుడు పాల్ గుర్తోచ్చేస్తాయ్. పాల్ పాల్ అని అడుగుతానా. లేవగానే తాగేచాగా పాల్. అమ్మ చెప్పాగ్గానీ గుర్తురాదు ఆ సంగతి.
నేను నా పోడూగు జుట్టు దువ్వించుకోడానికి అటూ ఇటూ పగేడుతూ వుంటే అక్కేమో అమ్మ పార్టీ లో చేరిపోయి దువ్వెన్నా, రబ్బర్బాండ్ అందిస్తూ వుంటుంది. నాకప్పుడు కోపమొచ్చేసి మాతికా...పిల్లా అని గాఠిగా కోపాడేస్తా.

చరే సూ వేసేస్కున్నాకా జాకీట్ అమ్మ మర్చిపోయినా నేను మర్చిపోను తెల్సా. ఇంక అన్నీ వేసేస్కున్నాకా నేను ముందు కాలెక్కేస్తానా. దాయీ ఎంతకీ రాడూ. నాకప్పుడు భలే కంగారొచ్చేత్తుందిలే. అసలే టా టా లేట్ ఐపోతుంటే దాయీ రాకపోతే కారెవరు నడుపుతారూ అని. దాయీ దాయీ అని పిలుస్తుంటే మొత్తానికి చేతిలో కోఫీ పట్టుకుని వత్తాడు. మీకోటి తెలుసా నాకు కూడా కోఫీ అంటే భలే ఇష్టం. అందుకే కోఫీ అనడం నేర్చేస్కున్నా ముందు.

స్కూల్ కి వెళ్ళగానే ఇంక నేను ఆపీ.  అక్కడ నాకులాగే బోల్డు బుల్లి బుల్లి నేస్తాలుంటారుగా... వాళ్ళందరికీ హాఆఆఅయ్ గుమానింగ్ చెప్తానా. ఇంకా బోల్డు చాలా ఆటలాడుకుంటానా. మాంమాం ఇంచక్కా కిందా మీదా పోస్కుంటూ నేనే తీస్కుని తింటానా. ఇంట్లో అమ్మ అస్సలూ నన్ను తిన్నివ్వదూ. ఇంకా నేనూ ఏబీసీ నేర్చుకున్నానా... ఏబీసీ తర్వాతేంటా. నాకంతే వచ్చు మరి ఇప్పుడూ. తర్వాతవి మీరంటుంటే, నాకప్పుడూ మూడ్ బావుంటే నేనూ మీతో అంటానన్నమాట. ఇంకా మీరు వన్, టూ అంటే నేను తీ, ఫోర్ అని కూడా అంటా. ఇంకా నాకు ఊనో, డోచ్, తేచ్, టింకో కూడా వచ్చు. ఇవి చాలా స్పీడుగా చెప్పేస్తా తెలుసా. నేను కరెక్ట్ చెప్తున్నానో తప్పు చెప్తున్నానో మా ఇంట్లో మాతికకి వొక్కత్తికే తెలుసు :)

మౡ సాయంత్రం ఇంటికొచ్చేసాకా నేనూ, అక్కా ఆడుకుంటూ వుంటామా, ఇంతలో ఏపేన్ చప్పుడు వినపడుతుంది. లూక్ లూక్ ఏపేన్ సుయ్ అని చెయ్యి వూపి చూపిస్తున్నా ఈ పిల్ల అస్సలూ చూడదూ. మయూ తప్పుకో అని సైకిల్ తొక్కేత్తూనే వుంటుంది పేద్ద. ఇంకప్పుడూ లోపలకొచ్చీ "ఫ ఫీ ఫు హా హి" అని నేను అమ్మకి బోల్డు కబుర్లు చెప్పేస్తా. అమ్మకేమీ అర్ధమవ్వకపోయినా నీ "ఫా" భాషేంట్రా బాబూ అని ఎత్తుకుని గాట్టిగా ముద్దు పెట్టేసుకుంటుంది.

అప్పుడేమో అమ్మ నాకు పాల్ ఇస్తుందా. కుంచెం తాగాక డన్. అక్కా పేతై  అని ఇచ్చేత్తా. పాల్ మొత్తం ఏం తాగుతాం చెప్పండీ. అదే చిప్స్ ఐతే అక్కతో పోట్లాడి మరీ లాక్కుని తినొచ్చు. ఇంకా నాకూ తాబెయీ కూడా ఇష్టం. ఇంకా బనాన్నా కూడా. మొన్నేవయిందో తెలుసా. శుక్రవారం రాత్రి నాకు బనాన్నా కనపడింది నిద్రపోతున్నప్పుడూ. ఇంక లేచి బనన్న బనన్న అని ఏడవడం మొదలెట్టా. అప్పుడేమో ఇంట్లో కూడా ఐపోయాయ్. కాస్సేపాగీ సాప్ కి వెఌ తెచ్చుకుందాం అని చెప్పారనుకో. నేనూరుకుంటానేంటీ. శనివారం కదా బాగా బబ్బుద్దాం అనుకున్నారు అందరూ. అందర్నీ లేపేసే దాకా ఏడిచి తర్వాత పాల్ తాగి ఆపీ గా ఆడుకున్నా.

అమ్మేమో మాం వండుతూ అన్నీ అలమారా తలుపులూ తీసేస్తూ వుంటుంది. నాకు అస్సలు నచ్చదు అలాగా. అందుకే తపేచెయ్ అని వేసేస్తూ అమ్మకి బోల్డు సాయం చేత్తూ వుంటాను. ఇంకా మేడ మెట్లు స్పీడుగా ఎక్కేత్తానా. అమ్మకి ఎందుకో బోల్డు గాబరా వచ్చేత్తుంది. నాకు ఎక్కడం, దిగడం కూడా వచ్చు ఐనా ఈ అమ్మేంటో దిగమ్మా, కూచుని దిగమ్మా అని తెగ జాగర్తలు చెప్పేస్తూ వుంటుంది. నన్ను దింపుదామని నా వెనకాలే ఎక్కిందనుకో ఇంకా పీడుగా ఎక్కేసి నవ్వుతా అని అమ్మకి బయ్యం. పాపం అందుకే కిందే నించునీ బతిమాలుతూ వుంటుంది.

ఎప్పుడైనా నేను డాం పపోయా అనుకో లేచి వెంటనే అన్న అన్న అన్నా అని కొట్టేత్తా. అప్పుడెౡ అమ్మకి అక్కా దాం. అల అలా డాం పపోయా అని చూపిస్తానా. మౡ అమ్మకూడా అన్న అన్నా కొట్టేత్తుంది అక్కడ. అమ్మ ఏదన్నా పన్లో వుంటే అక్క కూడా అన్న అన్నా కొడుతుంది. అప్పుడు గానీ నాకు నెప్పి తగ్గదు కదా మరి.

నాకెంచక్కా మెట్లమీద కూచినీ మాం తినడమే ఇష్టం. అమ్మ కూచున్న మెట్టుకి పైన వొక మెట్టు ఎక్కుతూ, ఒక మెట్టు దుగుతూ తింటా. ఎప్పుడైనా అమ్మ అలా కాదని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూచోపెట్టిందనుకో ఇంక చూడూ దిగన్ దిగన్ అని అక్కడనించి దింపేదాకా పేచీ పెట్టేత్తా.

ఇంకా నేను అక్కెలా ఏడుత్తుందమ్మా అంటే "ఈఈఈఈ" అని ఏడిచి చూపిస్తా తెలుసా. అలా చేస్తే అక్క కూడా నవ్వేత్తుంది. కానీ ఎప్పుడన్నా అక్క నిజ్జంగా ఏడుత్తుంటే నాకస్సలు తోచదు. దగ్గరకెఌపోయి అక్కకి ఒక హగ్ ఇచ్చేసి, ఒక కిస్ పెట్టేత్తానా అక్క కూడా ఏడుపాపేస్తుంది. అలాగే అక్కకి కూడా నేనేదైనా కాలా కాలా అంటే మమ్మీదాయీ ఇవ్వడం లేట్ చేస్తుంటే భలే చాలా కోపం వచ్చేత్తుంది లే. పాపం బేబ్బీ  అడుగుతున్నాడా అని గాఠిగా ప్రైవేట్ చెప్పేస్తుంది.

చాలా కబుర్లు చెప్పేసాగా. ఇంక నేను బబ్బునే టైమ్ ఐపోయింది. నేను లాయి లాయి వెల్తానే. లేకపోతే మమ్మీ మౡ దాగీ ని పిలిచేత్తుంది. నాకు దాగీ భౌ భౌ అంటుందని తెలుసు తెల్సా. కానీ భౌ భౌ అంటే నాకు భయ్యం. అద్దు న్నో న్నో అని చెప్తా అందుకే. సరే ఇంక నేను బబ్బుంతానే. నా కబుర్లన్నీ చదువుతున్నందుకు మీకి తాక్కూ.

అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇవన్నీకరెక్ట్ చెప్పేసినవాళ్ళకి మతూక్ బోల్డు ఫ్లయింగ్ కిస్సు లు పంపేత్తాడు. బాఆఆఆఅయ్!








4/8/14

మా తాతగారి సుందరకాండము








ఎన్నాళ్ళు గానో రాయాలనున్నా ఎలా మొదలు పెట్టాలో తెలియక వాయిదా వేస్తూ వస్తున్నాను.
మొదటిగా నేను కొంచెం కన్ఫెస్ చెయ్యాలి. మన మధ్యే మనతోనే వున్న వాళ్ళ విలువ మనకి అంతగా తెలియదు. మనకి చాలా ఆక్సెసిబిల్ గా వుండే సరికి ఎప్పుడన్నా తెలుసుకోవచ్చులే అన్న నిర్లక్ష్యం వచ్చేస్తుంది. తాతగారు సంస్కృతం పాఠాలు చాలా బాగా చెప్పేవారు. నా చిన్నప్పుడు బాచ్ లు బాచ్ లు గా ఇంటర్మీడియట్ పిల్లలు ప్రైవేట్ కి వస్తూ రోజంతా ఎక్కడా ఖాళీ లేకుండా వుండే తాతగారు బాగా గుర్తే. సంస్కృతం పాఠాలు ఎంత బాగా చెప్పేవారో, ఇంగ్లీష్ పాఠాలు కూడా అంత బాగా చెప్పేవారు.

నేను ఇంటర్ కి వచ్చాక ఇంగ్లీష్ పొయెట్రీ బాగా చెప్పించుకునేదాన్ని గానీ సంస్కృతం అంటే మాత్రం మహా నిర్లక్ష్యం గా వుండే దాన్ని. సంస్కృతం లో ప్రశ్నలకి మొత్తం జవాబు తెలుగులో రాసేసి అక్కడక్కడా సంస్కృతం కొటేషన్ లు రాసేవాళ్ళం. మాతో నాలుగు రోజులు వుందామని వచ్చిన తాతగారు అలా కాదని ఒక పాఠం మొత్తానికి సంస్కృతంలోనే నోట్స్ ప్రిపేర్ చేసి నేను కాలేజీ నుంచి వచ్చేసరికి నాకు చెప్పాలని ఎదురు చూస్తున్నారు. నాకు ఆయన చెప్పేది ఛాదస్తం లాగే అనిపించింది అప్పుడు. అవతల నా బుర్రకెక్కని లెక్కలు, ఫిసిక్స్, కెమిస్ట్రీ భయంకరంగా భయపెడుతుంటే సంస్క్రుతం కోసం ఇంత టైమ్ వేస్ట్ చెయ్యాలా అనిపించింది. ఆయనకేదో సాకు చెప్పి తప్పించేసుకున్నాను.

నేను ఎంత మంచి అవకాశాలు వదిలేసుకున్నానో. ఎన్ని తెలుసుకోకుండా అందరితో పాటూ కొట్టుకుపోవడానికే మొగ్గు చూపించానో తెలుసుకునే పరిపక్వత నాకు వచ్చేసరికి తాతగారు నాకు అందనంత దూరం వెఌపోయారు.

ఇంక ప్రస్తుతంలోకి వస్తే రెండేళ్ళ క్రితం అనుకుంటా మా నాన్నగారు చాలా సంబరంగా చెప్పారు తన బాల్య మితృడు, తాతగారి శిష్యుడూ తనని చూడడానికి వచ్చారనీ, మాటల మధ్యలో తాతగారు రాసిన సుందర కాండ పుస్తకం చూసి దీనిని పునర్ముద్రిద్దాం అన్నారనీ.

నాకెంత, నాకేంటీ అనే మనుషుల మధ్య, ఇంచుమించు అదే మనస్తత్వం ఆకఌంపు చేసేసుకుని అదే సరైన పధ్ధతి అన్న మైండ్ సెట్ లోకి వెఌపోయిన నాకు, "ఆ ఏదో అంటారు గానీ" అనే అనిపించింది.

కానీ నేననుకున్నట్టూ కాకుండా, నా ఆలోచనా ధోరణి తప్పని నిరూపిస్తూ ఆ ప్రోజెక్ట్ ని చాలా వేగంగానే కార్యాచరణ లోకి తీసుకొచ్చారు. అప్పటివరకూ రిటైర్ ఐపోయాను, ఇంకేముందిలే అన్నట్టు కాస్త నిరుత్సాహంగా వుండే నాన్నగారు కూడా వుత్సాహంగా దీనికోసం పని చెయ్యడం మొదలెట్టారు. ఎప్పుడు ఫోన్ చేసినా చాలా చెలాకీగా పుస్తకం విశేషాలు చెప్పేవారు.

ఈ మొత్తం ప్రోసెస్ లో ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటి తో, లుక్ తో పుస్తకం రూపు దిద్దడంలో ప్రముఖంగా చెప్పుకోవలసినది శ్రీ తులసి సుబ్బారావు గారి గురించి. 8 వాల్యూములుగా వచ్చినదాన్ని 3 పుస్తకాలుగా మార్చారు. అలోచనా, ఆచరణా ఆయనవైతే, మా నాన్నగారి ఇంకొక మితృలు శ్రీమాన్ తూపురాణి నమ్మళ్వార్ మరియూ మా నాన్నగారివి సహాయ సహకారాలు.

చాలా అందంగా ముస్తాబు చేసిన ఆ పుస్తకాన్ని గత ఫిబ్రవరి లో హైదరాబాద్ లో శ్రీ తులసి సుబ్బారావు గారి ఇంట్లో చక్కటి ఆత్మీయ వాతావరణం లో ఆవిష్కరించారు.

500 కాపీలు వేసి అందులో 150 నాన్నగారికి ఇచ్చారు. అవి ఇంటికి తీసుకొచ్చాక వస్తున్న స్పందన కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. చాలా మంది ఎంతో ఆసక్తి తో వచ్చి అడిగి తీసుకుంటున్నారు. చాలా కష్టపడితే గానీ అప్పాయిమెంటు కూడా దొరకని కొందరు కూడా ఈ పుస్తకం ఇవ్వాలని వెఌతే చాలా సేపు మాట్లాడి,  అభినందిస్తున్నారని అమ్మా, నాన్నగారూ మురిసిపోతూ చెబుతున్నారు.

తాతగారు అప్పట్లో అంత కష్టపడి రాసినా, 8 వాల్యూములు ఒకేసారి ముద్రణ జరగకపోవడం వల్ల రావలసినంత ఆదరణ రాలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు అనుకున్నకన్నా చాలా మంచి స్పందన వస్తోంది. ఇంత మంచి శిష్యులని సంపాదించారూ అంటే తాతగారు ఎంత గొప్ప గురువో కదా అనిపిస్తోంది ఇప్పుడు.

అమ్మా నాన్నగారూ చెప్తున్న విశేషాలు వింటుంటే కలుగుతున్న ఆనందాన్ని మీతో పంచుకోవాలనీ. ఈ పుస్తకం విషయం లో శ్రీ తులసి సుబ్బారావు గారూ, శ్రీమాన్ తూపురాణ్ నమ్మాళ్వార్ గారూ చేసిన కృషికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనీ ఈ టపా రాస్తున్నాను.

ఈ పుస్తకం గురించి నాన్నగారి మాటలు ఇక్కడ..












11/18/13

చిలక పలుకులు - 3 - బుడ్డిగాడి మనోభావాలు



మయూ... మయూ...మయూ

నన్నేనా... అమ్మ గొంతులాగే వుందీ...ఇంత చిన్నాగా వినపడుతోంది??

వోహ్ మౡ పొద్దున్నయిపోయిందా. అదిగో వెలుగ్గా ఐపోయిందిగా నా గదీ.  హే హై. ఇవాళయినా వీళ్ళకి నేను పెద్దవాడినని తెలియాలి. దేవుడా ప్లీచ్ వీళ్ళు నేను చెప్పిన మాట వినాలి.

మమ్మీ.... టాటా...

ముందు అమ్మా అనే నేర్చుకున్నాననుకో. నా టాటా (అదే నా డే కేర్) లో నేర్పారు కదా మమ్మీ అని. అప్పట్నుంచీ అలా కంటిన్యూ అవుతున్నా అనమాట. నేను ఎన్ని రకాలుగా పిలవగలనో తెలుసా మమ్మీ అని. అదిక్కడ చెప్పడం కష్టం లే...

లేస్తూనే టాటా ఏవిటిరా బాబూ అని అమ్మ విసుక్కుంటుందనుకో కానీ నాకు చాలా బోలెడు ఇష్టం కదా. నా సైజు ఫ్రెండులు  బోల్డు మంది వుంటారు కదా అక్కడ.

......................

అదుగో చేతిలో నూనె పోసుకుని వచ్చేస్తోంది బాబోయ్. నేను అరిజెంటు గా పారిపోవాలి. ఛ ఎంత స్పీడు గా పగెట్టినా రోజూ నా బుర్ర భరతం పట్టేస్తుంది. హు.

ఎప్పుడయినా అమ్మ మర్చిపోతుందా నూని రాయడం.. హమ్మయ్య అనుకుంటానా... ఈ న్నాన్నున్నాడే అసలూ వెంఠనే అమ్మకి గుర్తు చేసేస్తాడు. వాడి బుర్రకి నూని రాసావా అనుకుంటూ.

ఇప్పుడయినా నా బుజ్జి కుక్క బొమ్మనీ, ఇంకా నా బోల్డు చిట్టీ పొట్టీ బొమ్మల్నీ పలకరించి వద్దాం.

అరే అప్పుడే మౡ టవల్ పట్టుకుని తయ్యారైపోయింది. ఈ సారయినా తప్పించుకోవాలి. మ్.. ఈ గదిలోకి పారిపోదాం.

అయ్యో ఐనా పట్టేసుకుంది. వా....

నాకూ ఎంచక్కా టబ్బులో కూచుని నీళ్ళు పోసుకోడం బావుంటుందనుకో...కానీ అమ్మకి నన్నలా పట్టుకోడం సరదాగా బావుంటుంది కదా అని కాస్సేపు అలా ఆడిస్తా అన్నమాట.

కానీ ఒక్కోరోజు నవ్వదు. టైమ్ అయిపోతుంటే ఏవిటి నీ ఆటలు అని విసుక్కుంటుంది. నాకు టైమ్ చూడ్డం వచ్చేంటీ పేద్ద...

.......................

ఈ పిల్లేమో అప్పటిదాకా నాతో బాగా ఆడుతుందా. కార్ ఎక్కేసరికి మొహం సీరియస్సుగా పెట్టేస్తుంది.

పిల్లెవరా.. అదే అదే అక్క... అక్క అనాలి తనని. మొదట్లో కక్కా...కుక్కా అనేవాడినా చేతకాక... అబ్బో చాలా బోల్డు కోపం వచ్చేసేది.

మా ఇంట్లో తనే నా బెస్ట్ ఫ్రెండ్. కానీ అబ్బో భలే చక చకా పార్టీలు మార్చేస్తుంది. నాతో ఆడుతూనే వుంటుందా... వెంఠనే అమ్మ పార్టీ లో చేరిపోయి తిను తమ్మూ...తప్పు తమ్మూ అని మొదలెడుతుంది.

నేను చక్కగా ఏ పేపర్ లో చింపుకుందామా... బియ్యం అన్నీ బయట పోద్దామా అనుకుంటానా... టింగు మని నాన్నకి కంప్లైంట్ ఇచ్చేస్తుంది.

హ్మ్...ఇంతకీ ఈ అక్క కి టాటా వెళ్ళడం అంత ఇష్టం వుండదు ఎందుకో. నాకు లేని వొక పెద్ద బాగ్ వుంటుంది తనకీ. అది మొయ్యడం నచ్చక అనుకుంటా అలా పెడుతుంది మొహం.

............................

అహ్ అప్పుడే వచ్చేసారా... బబ్బుని లేచాకా, ఇంకా నా ఫ్రెండులతో బాగా ఆడుకోనేలేదే. ఇక్కడ నన్ను దించేసాక వీళ్ళు ఇద్దరూ ఎక్కడికి వెళతారో? నేను ఎప్పటికయినాకనిపెట్టాలి. అక్కకి తెలుస్తుందేమో అడగాలి...

మీకొకటి తెలుసా... మొన్నటిదాకా నేను నా భాషలో వీళ్ళకి బోల్డు కబుర్లు చెప్పేవాడిని. కానీ మట్టిబుర్రలు వీళ్ళకి వొక్క ముక్క కూడా నా భాష రావట్లేదు. అందుకే పోన్లే పాపం అని నేనే వాళ్ళకొచ్చిన భాష నేర్చుకుంటున్నా.

ఇప్పుడు నాకు మరేమో జుట్టు వెనక్కి తోస్కోమ్మా అంటే ఇస్టైల్ గా జుట్టు తోసుకోడం తెలుసా... ఇంకా ఆ జంప్ అంటే కాలుతో గట్టిగా తన్నడం తెలుసా... ఇంకేమో మరీ బర్డ్స్ ఎలా ఫ్లై చేస్తాయమ్మా అంటే చేతులూపి చూపిస్తానా... 'వేడి' అంటే 'ఈ హా' అని కూడా అంటాను. చూసారా నాకెన్ని తెలుసో....నేను చాలా బోల్డు షార్ప్ కదా....

ఈ నాన్నొకడూ, చెప్పులు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాడు. పోన్లే పాపం అని పట్టికెఌ ఇద్దామనుకుంటే దానికీ నన్నే కేకలేస్తాడు.

అమ్మా అంతే. ఆ గిన్నెలు కడుక్కునేదేదో వుంటుంది కదా. ఆ అదే అదే డిష్ వాషర్. అందులో గిన్నెలు పెడుతూ వుంటుందా. తీసి మౡ బయట పెట్టీ సాయం చేద్దామనుకుంటానా. నన్ను చూసి టప్ అని మూసేస్తుంది.

అమ్మా అయినా నేను వదులుతానా. నాకు మాం మాం పెట్టడానికి అందులోంచి స్పూన్ తీసేటప్పుడూ నన్ను కూడా వొక స్పూన్ తీసుకోనివ్వకపోతే వూరుకుంటానేంటమ్మా...నా దగ్గర కూడా స్పూన్ వుంది కదా నేనూ కుంచెం కుంచెం తీసుకుని తింటే స్పీడు గా అవుతుంది కదా అంటే నన్నస్సలూ గిన్నెలో స్పూన్ పెట్టనివ్వదు. వొక్కోసారి నాకు తోపం వచ్చేసి మాం గిన్నిలో చెయ్యి మొత్తం పెడదామనుకుంటానా.. అప్పుడు మాకిద్దరికీ భలే గొడవవుతుందిలే.

మయూ... అని గాఠిగా అరుస్తుంది. నన్నేవన్నా అంటే వూరుకుంటానేంటి? బుంగ మూతి పెట్టీ...సీరియస్సు గా చూస్తానా...ఇంతలో నా కళ్ళల్లో నీళ్ళు డింగ్ డింగ్ డింగ్ అని వచ్చేస్తాయా...

అంతే అమ్మ ఖోపం అంతా ఢమాల్... పాపం అమ్మ, నన్ను ఎత్తేసుకుని...లేదమ్మా...లేదే అని వూరుకోపెట్టేస్తుంది.

నాకు తెలీదేంటీ వీళ్ళని ఎలా మాయ చెయ్యాలో...:)

.......................


అయ్యో అయ్యో ఇంకా అక్కతో చాలా బోల్డు ఆడుకునే పనుంది. అలా ఎత్తుకుని తీసుకెఌపోతుందేవిటీ? అస్సలు నా మాటంటే విలువా, గౌరవం ఇంకా బోల్డు ఏవీ లేవు ఈ ఇంట్లో.

అందరికన్నా చిన్న సైజులో వున్నా కదా అని అందరికీ లోకువే...:(

అదిగో అదే.... అలాగే రోజూ పాట మొదలెట్టేస్తుంది. ఏంటో పాట వినగానే భుజం మీద తల పెట్టేస్తానా.... ఇంక అంతే జోకొట్టడం మొదలెట్టేస్తుంది.

హాయ్.. ఆ...నాకూ బావుంటుందనుకో...

అర్రే...కళ్ళు మూతలు పడిపోతున్నాయ్.

ఏం అనుకున్నా అమ్మ జోకొడుతుంటే భలే మెత్తగా వుంటుంది లే. వొక్కోసారి నాన్న బబ్బో పెడతారా... కుంచెం గాఠిగా కోప్పడతారు నేను పడుకోకుండా అల్లరి చేస్తే.. అయినా నాన్న కూడా భలే బాగా జోకొడతాడ్లే...

హాయ్...ఇంక నాకు నిద్దరొచ్చేస్తోంది. ఇంక నా వల్ల కాదు.

హ్మ్.... ఈ రోజు కూడా ఈ పెద్ద శాల్తీలు నా మాత వినలేదు. ప్చ్... రేప్పొద్దున్నే చూస్కుందాంలే వీళ్ళ పని...

(ఉపసంహరణ : మా బుడుగు చూపించే హావభావాల వెనక మాటలు ఇవయ్యుంటాయని అనిపించి రాసాను.

చంటి పిల్లలు ఏ భాషలో అలోచిస్తారా అని ఎప్పూడూ నాకు సందేహం. వాళ్ళెలా అలోచించినా అది మనం చెప్పాలనుకున్నప్పుడు రమణ గారి బుడుగు భాష కన్నావేరే ఏదీ గుర్తు రాదు కదా!

బుడుగుని సృష్టించి ప్రతీ తెలుగింటి బుడుగుకీ వొక భాష ని ఇచ్చిన బాపూ రమణలకి నమస్కారాలతో)







11/12/13

అడుగులు తెలియని పరుగులు



ఒరేయ్ నీకు 10 లో 90% వచ్చిందిరా అబ్బాయ్. చాలా సంతోషం.

హమ్మయ్యా...ఇప్పుడూ కాస్త తీరిగ్గా కూచునీ

ఏవిటలా చతికిలపడ్డావ్. మా కొలీగ్ కొడుకు విజయవాడ లో చేరుతున్నాడు. ఇంకొకావిడ కూతురు గూడవల్లిలో చేరుతోంది. నిన్నూవిజయవాడలో చేరుద్దామనుకుంటున్నా. కావలసినవి అన్నీ చూసుకో.

............

ఫరవాలేదురా బానే వచ్చింది ర్యాంక్. మూడేళ్ళు వేస్ట్ ఐతే అయ్యాయి గానీ మొత్తానికి నేననుకున్నది సాధించావ్.

ఫ్..కాస్త స్థిమితంగా కూచునీ

ఎప్పుడూ అలా బధ్ధకంగా కూచుంటావేమిట్రా. ఎక్కడ ఎందులో సీట్ వస్తుందో నలుగుర్ని కలిసి కనుక్కునేడు. నీ వయసు వాళ్ళంతా ఎంత తెలివిగా ముందు చూపుతో వుంటున్నారో చూసి నేర్చుకో కనీసం. హైదరాబాద్ లో చేరుద్దామనుకుంటున్నా. అక్కడయితే తరవాత జాబ్ తెచ్చుకోడం కూడా తేలికవుతుంది.

...................


హెల్లో..హెలో ఆ మంచి కంపెనీలోనే సంపాదించావ్ రా. వెరీ గుడ్. మీ అమ్మకి చెప్తా వుండు.

అదీ నేనూ...

ఏవిట్రా ఎప్పుడూ అలా నీళ్ళు నవులుతూ వుంటావ్. ఇది చాలా మంచి ఎమ్.ఎన్.సీ. మన రాఘవరావ్ అంకుల్ వాళ్ళబ్బాయి కఓంపెనీ కన్నా మంచి కంపెనీ.  ఇంకేవీ ఆలోచించకు నువ్వు.

....................

వొరేయ్ నాన్నా...ఇంకా ఎప్పుడు పెఌ చేసుకుంటావు రా. నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడనగా కోడళ్ళని తెచ్చేసుకున్నారు రా. నువ్వేమిట్రా అంటే ఇలా అన్నీ నానుస్తావ్.

అదీ మనం అందరం కలిసి కూచునీ.

నువ్వేమన్నా సరేరా ఈ ఏడాదిలో నీ పెఌ అయ్యి తీరాలి అంతే.

....................

ఏవండీ.. మరీ...

రా రా మనిద్దరం అలా చల్లటి చెట్టు నీడలో కూచునీ

అబ్బా ఏవిటండీ కూచునే తీరికెక్కడా.. నా ఫ్రెండ్ మొన్న డైమండ్ నెక్లెస్ కొనుక్కుంది. మా ఆఫీస్ లో కొత్తగా పెళ్ళయిన అమ్మాయి కెంపుల సెట్ కొనుక్కుంది. ఏదయినా ఫంక్షన్ కి వెఌనప్పుడూ వాళ్లందరి మధ్యలో ఈ పాత చిన్న చిన్న నగలు వేసుకుని నేను కంఫర్టబుల్ గా వుండలేను. మీకిది చెప్దామనే పిలిచింది. నాకవతల చచ్చేంత పనుంది.

..................

హలో హలో ఆ వినపడుతోందా. నీతో వొక ముఖ్యమయిన విషయం మాట్లాడాలి రా అబ్బాయ్.

సరే నాన్నా. నేను వచ్చే నెలలో వచ్చినప్పుడూ తీరిగ్గా మనమందరం మాట్లాడదాం..

నీ మొహం అప్పటిదాకా ఎందుకురా. నీ తర్వాత విదేశాలకి వెఌనవాళ్ళంతా రెండేసి అపార్ట్మెంట్లూ, నాలుగు స్థలాలు కొని పడేస్తున్నారిక్కడ. వాళ్ళంతా మీ వాడేం కొనలేదా అంటే నాకు తల కొట్టేసినట్టుంటోంది. నేనిక్కడ కొత్త వెంచర్స్ అన్నీ రీసెర్చ్ చేస్తున్నా గానీ నువ్వు ప్లాన్ చేస్కో త్వరగా. ఇక్కడకి వచ్చేలోపు ఫైనలయిజ్ చేసేద్దాం.

.....................

వొరేయ్ నాన్నా. నీతో పాటు పెళ్ళయిన వాళ్లంతా ఇద్దరేసి పిల్లల్ని కనేసారు తెలుసా.

అమ్మా అదీ మేమిద్దరం కాస్త ఆలోచించుకునీ....

నీ గురించి నాకు తెలీదా. అన్నీ నాన్పుడు బేరాలే. ఈ ఏడాత్తిరిగే లోపు నా చేతిలో మనవడుండాలి అంతే.

.....................

నాన్నా నా క్లాస్ లో అందరి దగ్గరా లేటెస్ట్ వెర్షన్ పిఎస్3 వుంది తెలుసా

సరే రా. చూద్దాం.

చూసేదేం లేదు డాడీ. నా ఫ్రెండ్స్ అందరూ అవి ఆడుతుంటే నేను ఖాళీ గా వుంటే నాకు ఎంత ఇంసల్టో తెలుసా అసలు. నాకు ఈవినింగ్ కి కొనేసెయ్.

.......................
.......................
........................

నాకన్నా నాలుగేళ్ళు చిన్నవాడు. అమ్మో అప్పుడే ఇక్కడ ఇల్లు కొనేసాడు. నేనింకా కొనకపోతే ఏమయినా వుందా? సొసైటీ లో నా పరువేం కావాలీ.

....................

ఓహ్...ఇంక నుంచీ ఆఫీసుకెళ్ళక్కర్లేదు కదా...ఏవిటో ఇన్నాళ్ళూ ఇంకో ఐదు నిమిషాలు పడుకుందాం అనుకునే వాడిని. ఇవాళ ఇలా మెలుకువొచ్చేసి చచ్చింది. హు

ఒరేయ్ బుచ్చిబాబూ.

ఎవరదీ???

నేనురా అబ్బాయ్. ఇన్నాళ్ళూ నీతోపాటే వురకలూ పరుగులూ పెట్టిన నీ మనసుని. ఇదే సినిమాల్లో ఐతే అంతరాత్మ అని పిలుస్తారు నన్ను.

నా పేరు బుచ్చిబాబు కాదే!?

సర్లేవోయ్. ఏదో చనువు కొద్దీ అలా పిలిచాను.

ఏవిటింత పొద్దున్నే వచ్చావ్.

నీకెలాగూ నిద్దరపట్టదని తెలుసుగా నాకూ.

నీకెలా తెలుసూ??

నీతో పాటు లేచి, నీతో పాటు పరిగెట్టి, నీతో పాటే పడుకున్నదాన్ని. నాకు గాక ఈ భూప్రపంచం మీద ఇంకెవరికి తెలుస్తుందిటా?

సర్లే ఇప్పుడేమంటావ్ ఇంతకీ?

అది కాదురా బుచ్చీ నాకో అనుమానం.

అంతలోనే బుచ్చీ!? సర్లే ఏం చేస్తాం. ఏవిటొ అది?

అస్తమానూ అందరితో అలా కూచునీ, నెమ్మదిగా ఆలోచించీ అనే వాడివి కదా. ఆ తర్వాత ఖాళీని ఎవరూ పూర్తిచెయ్యనివ్వలేదు. అసలేవి పెట్టి ఆ తర్వాత ఖాళీ ని పూర్తిచేద్దామనుకునేవాడివా అని నాకెప్పట్నుండో గొప్ప సందేహంరా అబ్బీ.

పోనీలే నువ్వయినా అడిగావ్.

అదీ నెమ్మదిగా కూచుని బాగా, కూలంకషం గా అలోచించి తర్వాత అడుగులు ఎలా వెయ్యాలా, ఎటు వెయ్యాలా నిర్ణయించుకుందాం అనుకునే వాడిని. ప్చ్...ఏం లాభం ప్రతీ మళుపులోనూ ఇంకెవరో పరిగెట్టేస్తున్నారని వాళ్ళతో పోటీకో...కంపారిజన్ కో అడుగులు వెయ్యకుండా సరాసరి పరుగులే పెట్టేసాను. వొక్కోసారి తలకి బొప్పి కట్టినా వెనక్కి వెళ్ళే ధైర్యం, సమయం కూడా లేక అలాగే పరిగెడుతూనే వున్నా. తీరా ఇప్పుడు చూస్తే ఎప్పుడూ ఇంకొకళ్ళ అడుగుజాడల్లో పరిగెట్టినట్టే వుంది బతుకంతా..హ్మ్...

సర్లే...నువ్వేసిన అడుగుజాడల సొంత దారులు ఎవరి వెనకాల పరిగెట్టారో మనకేం తెలుసూ...

ఇప్పుడింక తీరిగ్గా కూచునీ...

కూచునీ ఇంకేం చేస్తావ్ లే ఇప్పుడింక...వూరికే అలా కూచో...ఇంక నే వుంటా...

.
.
.
.

హ్మ్... నీకు తెలీదే వెర్రి మనసా మనిషి ఆశా జీవి అనీ...





10/23/13

పుస్తకాలతో నాన్నగారి కబుర్లు - 2

అమ్మ కడుపు చల్లగా

రచన -శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారి ఆత్మ కథ

పరిచయం - మైలవరపు యజ్ననాధం



అభిమాన రచయితకొక ఆత్మీయ లేఖ



మాన్య శ్రీ  గొల్లపూడి మారుతీ రావుగారికి,

నమస్తే, ఉభయకుశలోపరి.

ఈమధ్య మీ ఆత్మకథ 'అమ్మ కడుపు చల్లగా' చదివే అవకాశం లభించింది. మీ ఆ రచన వెలువడి సుమార 5 సం ॥ లు గడిచిపోయినా నాకు అది చదివే అవకాశం ఈ మధ్యే దొరికింది. నాకు వచన రచనల్లో ముఖ్యంగా ఆత్మకథలు చాలా ఇష్టం. ఇదివరలో తిరుపతి వేంకట కవుల కథలు - గాథలు, టంగుటూరి వారి నా జీవిత యాత్ర, తిరుమల చంద్ర గారి హంపీ నుండి హరప్పా దాకా, శ్రీపాద వారి అనుభవాలూ - జ్నాపకాలూ, డా. ఉప్పల లక్ష్మణ రావుగారి బ్రతుకు పుస్తకం, బాల్యం లో చిలకమర్తి వారి స్వీయ చరిత్ర, కందుకూరి వారి స్వీయ చరిత్ర కూడా చదివాను. వీరిలో కొందరి రచనా శైలీ, గడుసుతనం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి విలక్షణమైన రీతిమ, తీరూ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వారి రచనలో భేషజం కనపడదు. అత్మాయతా స్పర్శ కనపడుతుంది. ఆ లక్షణం మళ్ళీ మీ రచనలో కాన వచ్చింది. మీ రచన ద్వారా మీరు ఆత్మీయులు గా కనిపించారు. అందుకే మీకీ ఆత్మీయ లేఖ.

'గద్యం కవీనాం వికషం వదన్తి ' అన్నారు పెద్దలు. వచనం రాసి మెప్పించడం కొద్దిమందికే సాధ్యం అయిన విషయం. ఏ రచన గానీ మధ్య లో వొక పేజీ తీసి చదివినా 'ఇది ఫలానా వారి రచన ' అని గుర్తించగలిగిన నాడు, ఆ రచయితకి తిరుగు లేని గుర్తింపు లభించినట్టే. ఆ ముద్ర వేయడం ఏ కొద్దిమందికో గానీ సాధ్యం కాదు. వచన రచనల్లో, స్వీయ చరిత్రలు, నవలలు, కథలు, కథానికలు పలువురివి చదివాను. వాటిలో బేరీజు వేసి చూసినప్పుడు, మీ వొక్కరి రచనా శైలి మాత్రమే శ్రీపాద వారి రచనల సరసన చేరగలదనిపించింది. ఇది మెనమెచ్చు కాదు. నిజాయితీ గా చెప్పిన మాట.

మహా పురుషుల జీవిత చరిత్రలూ, సమాజం లో కొంత పేరు సంపాదించిన వారి చరిత్రలు గ్రంధస్తం చేయబడ్డాయి. కానీ వాటిలో అతిశయోక్తులూ, భట్రాజు పొగడ్తలూ,కొండొకచో విసురులూ చేరి, వాస్తవాలు మరుగున పడవచ్చు.
కానీ స్వీయ చరిత్ర నిజాయితీ గా రచించిన నాడు, అందులో ఆ వ్యక్తి సమగ్ర జీవిత స్వభావ చిత్రణ, వానితో పాటే సమకాలీన సమాజ చిత్రణా - ఇత్యాది అంశాలను చక్కగా గమనించడానికి మంచి అవకాశం దొరుకుతుంది. 

స్వీయ చరిత్రలలో ఆత్మస్తుతి, పరనిందా కాకుండా నిజాయితీగా తమ బలహీనతలను, వోటములనూ కూడా వదలకుండా గ్రంధస్తం చేసినప్పుడు, ఆ మనిషి విలువ మరింత పెరుగుతుంది. మీ జీవిత చరిత్ర కేవలం మీ జీవిత చరిత్ర మాత్రమే కాకుండా ఇటీవలి ఆంధ్ర సారస్వత నాటకచరిత్రలో వచ్చిన పరిణామ క్రమాల దిక్సూచి కూడా.

నిజాయితీగా మీ బలహీనతలనూ, పరాజయాలనూ గ్రంధస్తం చెయ్యడం ద్వారా మీ విలువను మరింత పెంచుకున్నారు.లబ్ధప్రతిష్ఠులయిన వ్యక్తులతో మీ పరిచయాన్నీ, సాన్నిహిత్యాన్ని అలవోకగా ప్రస్తావించి తప్పుకున్నారు. వాటిని hilight చేయడానికి ఎక్కడా ప్రయత్నించలేదు. మీరు సాధించిన విజయాలను కూడా నమ్రతతోనే ప్రస్తావించడం నన్ను మరింత ఆకట్టుకుంది.

మీ శ్రీమతి యెడల, మీ చిరంజీవుల యెడల మీరు చూపే చిరాకూ, ఒకప్పటి చిత్తూరు నాటక ప్రదర్శనలో స్థానిక తహసిల్దారు మీద మీరు ప్రకటించిన చిరుకోపం, దానిపై శ్రీ బి.కె. రావు (రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి) మిమ్మల్ని సున్నితంగా మందలించిన తీరు - ఇటువంటివి కూడా విడిచిపెట్టకుండా మీ ఆత్మకథ లో స్థానం కల్పించడం మీ సమగ్ర ఆలోచనా విధానానికి మచ్చు తునక.

ముఖ్యంగా మీ కుటుంబం మీద మీకుగల గాఢమైన అనుబంధం చాలా ముచ్చటగొలిపింది. అమ్మగారి యెడల మీకున్న అచంచలమైన భక్తి, చాలామంది మా వంటి వారికి ఆదర్శప్రాయం. అలాగే సహోద్యోగుల మీదా, మీ అభిమానుల మీదా మీకుగల అభిమానం ప్రశంశనీయం.

 అన్నింటికంటే ఎక్కువ నా మనసుని హత్తుకున్నది, స్వర్గస్తులయిన మీ కుమారుడు, శ్రీనివాసుగారిని స్మరిస్తూ, ప్రతిసంవత్సరం మీరు నిర్వహించే స్మారక బహుమతి ప్రదానోత్సవాలు, మొక్కుబడిగా కాకుండా, వారి యెడల మీకుగల ఆప్యాయత చాటుతూ, చలన చిత్ర రంగంలో తెరవెనుక కృషి చేసే సాంకేతిక నిపుణులూ, దర్శకులూ అయిన పలువురు మేధావులను మీరు సత్కరించే విధానం, స్వర్గం నుంచి మీ చిరంజీవి సహస్ర చక్షువులతో చూసి ఆనందిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం.

చలనచిత్ర నటుడిగా, నాటక ప్రయోక్త గా,రంగస్థల నటుడిగా ఇప్పటికే మీరు ఎంతో మంది అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. కోట్లాది అభిమానులని సంపాదించుకున్నారు. మిమ్మల్ని రచయిత గా ఆరాధించినా, విలక్షణమయిన మీ నటన, సాహితీ సేవకు ఎంతమాత్రం తీసిపోదు.

చాలా మంది ఏదో ఒక రంగంలో కృషి చేసి పేరు తెచ్చుకుంటారు. కానీ మీరు రచయితగా, నాటక ప్రయోక్తగా, రంగస్థల నటుడిగా, చలన చిత్ర రంగంలో మాటల రచయితగా, చలనచిత్ర దర్శకునిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చందోబధ్ధమయిన కవితలల్లారు. నాట్యరంగంలో- శాస్త్రీయ సంగీతంలో కూడా తగుపాటి అవగాహన వున్నట్లు మీరు పాల్గొన్న కవిసమ్మేళనాల వల్ల తెలుస్తోంది.

బహుముఖంగా విస్తరించిన, ఇంకా విస్తరిస్తున్న మీ ప్రతిభా సంపత్తులను ఆసక్తిగా గమనిస్తూ, ముందు ముందు సాహితీ సాంస్కృతిక రంగాలలో మీరు చేస్తున్న కృషి మరింత వెలుగొందాలని ఆశిస్తూ మీ అభిమాని అత్మీయ లేఖ.



-యజ్ఞనాధం

గమనిక: ఈ పుస్తకం ప్రస్తుతం కినిగె లో లభ్యం.
             http://kinige.com/kbook.php?id=1355&name=Amma+Kadupu+Challaga