11/21/11

కనువిందు చేసిన బాపూ గీసిన రామరాజ్యం
నేనెప్పుడూ సినిమా రివ్యూ రాయలేదు...రాద్దామని ఏనాడూ అనుకోనూలేదు. ఇప్పుడు రాస్తున్నది రివ్యూ అనికూడా అనుకోవడంలేదు...శ్రీరామరాజ్యం చిత్రం చూసిన తర్వాత రెండురోజులయినా విడిచిపెట్టని ఒక అనుభూతిని నా బ్లాగుచదివే కొంతమందితోనయినా పంచుకోవాలని రాస్తున్నానంతే

రమణ గారి హంసగీతం అని ఒకాయన రాసిన రివ్యూలాంటిది చదివాక చూసితీరాలనిపించి మావారిని బతిమాలి మరీ లాక్కెళ్ళాను శనివారం సాయంత్రం...మావారు పెద్దగా సినిమాలమీద research ఏమి చెయ్యరు నాలాగ. రాముడి పాత్రలో కూడా బాలకృష్ణ తొడగొడతాడు చూడు అని ఏడిపిస్తూనే వున్నారు సినిమా మొదలయ్యేవరకూ...

ఒక్కసారి సినిమా మొదలయ్యాక మాత్రం రాముడూ సీతలమధ్యకి మమ్మల్నీ లాక్కువెళిపోయింది...చూస్తున్నంతసేపూ పెద్దగా analysis ల వైపు పోలేదు బుర్ర. చాలాకాలం తర్వాత లీనమైపోయాననిపించిన సినిమా...తెలుసున్న సీతారాముల కథే ఐనా రెండు మూడు చోట్ల కళ్ళు చెమర్చాయి. ఒక సినిమా చూస్తూ ఆ పాత్రకి connect ఐపోయి ఆ పాత్ర కష్టానికి కంటతడి పెట్టిన సినిమా ఈమధ్య కాలంలో చూసిన గుర్తు లేదు.(కొన్ని పాత సినిమాలు మళ్ళీ చూసినప్పుడు ఆ అనుభూతి మళ్ళీ కలిగిన సందర్భాలు చాలానే వున్నాయనుకోండి)

చూసి ఇంటికొచ్చినదగ్గరనుండీ ఆ పాటలే వింటున్నాం. అదీ సంగీతం...వాటి సాహిత్యం గురించి చెప్పాలంటే. చిన్న చిన్న మాటలతో ఎంతో అర్ధవంతం గా రాసిన జొన్నవిత్తుల గారి సాహిత్యానికి ఇళయరాజా ఇచ్చిన సంగీతం నాకైతే చాలా నచ్చింది. ఎక్కడా వాయిద్యాలు సాహిత్యాన్ని మించిపోయి మాట వినపడకుండా చెయ్యలేదు. చిన్న పిల్లలు కూడా చక్కగా పట్టుకుని పాడుకునేలా వున్నాయి పాటలు. బొమ్మాళీ నిన్నొదలా వొదలా అని నా కూతురు TV చూసి పాడేస్తుంటే చూసి బెంగపడే నాలాంటి తల్లులకి ఒక చిన్న relief.  ఈ పాటలు కొన్నిరోజులైనా TV ల్లో మారుమ్రోగితే ఇవి కాస్తైనా వంటపట్టించుకుటారుకదా పిల్లలు అన్న ఆశ.

సినిమా చూస్తున్నంత సేపూ అందులో నటులెవ్వరూ గుర్తురాలేదు...ఆ పాత్రలే కనిపించాయి. ఒక image వచ్చేసిన నటులందరితో వాళ్ళ మ్యానరిజంస్ ఎక్కడా బయటకీ రాకుండా నటింపచేసిన బాపూ గారికీ ఆయనకి గౌరవం ఇచ్చి, తోచినట్టు కాకుండా చెప్పినట్టూ , ఆయన గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా నటించిన పెద్ద పెద్ద నటులందరికీ కూడా జోహార్లు చెప్పి తీరాలి.

ముఖ్యంగా చెప్పాల్సింది నయనతార గురించే. మిగిలిన వాళ్ళందరికీ పౌరాణికాల్లో కాస్తో కూస్తో అనుభవమైనా వుంది. నయనతార అనగానే ఇంక చూసినట్టే అనుకున్నవాళ్ళల్లో  నేనూ వున్నాను. కానీ చూస్తున్నంతసేపూ సీతమ్మే కనిపించింది. ఎంతో గౌరవం కూడా కలిగింది. చాలా హుందాగా తను సీత బాధని అనుభవించి మరీ చేసిందనిపించింది. అలాగే బాలహనుమంతుడిగా వేసిన చిన్నపిల్లాడు కూడా ఒదిగిపోయాడు. హనుమంతుడు మారువేషంలో సీతమ్మతో పాటే వుండిపోయాడని చేసిన మార్పు ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. పైపెచ్చు ఇలాగే చేసి వుంటాడేమో అనిపించింది. తాను గీసిన బొమ్మలతో పూర్వ రామాయణం మొత్తం పేర్లు పడుతున్నంత సేపూ చూపించటం కూడా ఎంతో చక్కగా వుంది.

మాటలగురించి చెప్పాల్సినదేముంది. రమణ గారి బుడుగు చదువుతూ పెరిగినదాన్ని. అది చిన్నపిల్లకోసం రాసినట్టే ఈ కాలం పిల్లలకి వాళ్ళకర్ధమవ్వటానికి ఆయన రాసిన సీతారాముల కధ అనిపించింది.

క్రితం సంవత్సరం మేము india వెళ్ళినప్పుడు దసరా రోజున  పండగ సందర్భంగా ఒక channel లోలవకుశ  వేస్తుంటే, పిల్లలకి ఆ సినిమా చూపించటానికి పెద్దవాళ్ళంతా నానా తంటాలు పడ్డారు. ఆఖరికి భయపెట్టి మరీ కూచోపెట్టాల్సొచ్చింది. కూచున్నారే గానీ బుంగమూతులు పెట్టుకుని ఎప్పుడైపోతుందిరా భగవంతుడా అన్నట్టు కూచుని మధ్యలో ప్రకటనలొచ్చినప్పుడు జాగ్రత్తగా ఒక్కొకళ్ళూ తుర్రుమన్నారు. వాళ్ళకి ఆ సినిమాలో మాటలు greek, latin లా అనిపించడంలో చిత్రమేమీ లేదు. లవకుశేగా మళ్ళీ తియ్యటమెందుకూ అనుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఇదేనేమో అనిపించింది. ప్రతీ తరంలో ఆ సమయానికి తగ్గట్టు ఒకసారి ఇలాంటి చిత్రాలు తీయటం మంచిదని. ఈ తరానికి కూడా తాము ఎంతగానో నమ్మిన సీతారాముల కధని చేర్చడమనే బాధ్యత తమ భుజాలపై వేసుకున్నారు బాపూరమణలు.

కనులకి విందు
చెవులకి ఇంపు
మనసుకి మధురానుభూతి...

ఇది రమణ రాసి...బాపూ గీసిన సీతారామ చరితం..
Post a Comment