11/18/13

చిలక పలుకులు - 3 - బుడ్డిగాడి మనోభావాలుమయూ... మయూ...మయూ

నన్నేనా... అమ్మ గొంతులాగే వుందీ...ఇంత చిన్నాగా వినపడుతోంది??

వోహ్ మౡ పొద్దున్నయిపోయిందా. అదిగో వెలుగ్గా ఐపోయిందిగా నా గదీ.  హే హై. ఇవాళయినా వీళ్ళకి నేను పెద్దవాడినని తెలియాలి. దేవుడా ప్లీచ్ వీళ్ళు నేను చెప్పిన మాట వినాలి.

మమ్మీ.... టాటా...

ముందు అమ్మా అనే నేర్చుకున్నాననుకో. నా టాటా (అదే నా డే కేర్) లో నేర్పారు కదా మమ్మీ అని. అప్పట్నుంచీ అలా కంటిన్యూ అవుతున్నా అనమాట. నేను ఎన్ని రకాలుగా పిలవగలనో తెలుసా మమ్మీ అని. అదిక్కడ చెప్పడం కష్టం లే...

లేస్తూనే టాటా ఏవిటిరా బాబూ అని అమ్మ విసుక్కుంటుందనుకో కానీ నాకు చాలా బోలెడు ఇష్టం కదా. నా సైజు ఫ్రెండులు  బోల్డు మంది వుంటారు కదా అక్కడ.

......................

అదుగో చేతిలో నూనె పోసుకుని వచ్చేస్తోంది బాబోయ్. నేను అరిజెంటు గా పారిపోవాలి. ఛ ఎంత స్పీడు గా పగెట్టినా రోజూ నా బుర్ర భరతం పట్టేస్తుంది. హు.

ఎప్పుడయినా అమ్మ మర్చిపోతుందా నూని రాయడం.. హమ్మయ్య అనుకుంటానా... ఈ న్నాన్నున్నాడే అసలూ వెంఠనే అమ్మకి గుర్తు చేసేస్తాడు. వాడి బుర్రకి నూని రాసావా అనుకుంటూ.

ఇప్పుడయినా నా బుజ్జి కుక్క బొమ్మనీ, ఇంకా నా బోల్డు చిట్టీ పొట్టీ బొమ్మల్నీ పలకరించి వద్దాం.

అరే అప్పుడే మౡ టవల్ పట్టుకుని తయ్యారైపోయింది. ఈ సారయినా తప్పించుకోవాలి. మ్.. ఈ గదిలోకి పారిపోదాం.

అయ్యో ఐనా పట్టేసుకుంది. వా....

నాకూ ఎంచక్కా టబ్బులో కూచుని నీళ్ళు పోసుకోడం బావుంటుందనుకో...కానీ అమ్మకి నన్నలా పట్టుకోడం సరదాగా బావుంటుంది కదా అని కాస్సేపు అలా ఆడిస్తా అన్నమాట.

కానీ ఒక్కోరోజు నవ్వదు. టైమ్ అయిపోతుంటే ఏవిటి నీ ఆటలు అని విసుక్కుంటుంది. నాకు టైమ్ చూడ్డం వచ్చేంటీ పేద్ద...

.......................

ఈ పిల్లేమో అప్పటిదాకా నాతో బాగా ఆడుతుందా. కార్ ఎక్కేసరికి మొహం సీరియస్సుగా పెట్టేస్తుంది.

పిల్లెవరా.. అదే అదే అక్క... అక్క అనాలి తనని. మొదట్లో కక్కా...కుక్కా అనేవాడినా చేతకాక... అబ్బో చాలా బోల్డు కోపం వచ్చేసేది.

మా ఇంట్లో తనే నా బెస్ట్ ఫ్రెండ్. కానీ అబ్బో భలే చక చకా పార్టీలు మార్చేస్తుంది. నాతో ఆడుతూనే వుంటుందా... వెంఠనే అమ్మ పార్టీ లో చేరిపోయి తిను తమ్మూ...తప్పు తమ్మూ అని మొదలెడుతుంది.

నేను చక్కగా ఏ పేపర్ లో చింపుకుందామా... బియ్యం అన్నీ బయట పోద్దామా అనుకుంటానా... టింగు మని నాన్నకి కంప్లైంట్ ఇచ్చేస్తుంది.

హ్మ్...ఇంతకీ ఈ అక్క కి టాటా వెళ్ళడం అంత ఇష్టం వుండదు ఎందుకో. నాకు లేని వొక పెద్ద బాగ్ వుంటుంది తనకీ. అది మొయ్యడం నచ్చక అనుకుంటా అలా పెడుతుంది మొహం.

............................

అహ్ అప్పుడే వచ్చేసారా... బబ్బుని లేచాకా, ఇంకా నా ఫ్రెండులతో బాగా ఆడుకోనేలేదే. ఇక్కడ నన్ను దించేసాక వీళ్ళు ఇద్దరూ ఎక్కడికి వెళతారో? నేను ఎప్పటికయినాకనిపెట్టాలి. అక్కకి తెలుస్తుందేమో అడగాలి...

మీకొకటి తెలుసా... మొన్నటిదాకా నేను నా భాషలో వీళ్ళకి బోల్డు కబుర్లు చెప్పేవాడిని. కానీ మట్టిబుర్రలు వీళ్ళకి వొక్క ముక్క కూడా నా భాష రావట్లేదు. అందుకే పోన్లే పాపం అని నేనే వాళ్ళకొచ్చిన భాష నేర్చుకుంటున్నా.

ఇప్పుడు నాకు మరేమో జుట్టు వెనక్కి తోస్కోమ్మా అంటే ఇస్టైల్ గా జుట్టు తోసుకోడం తెలుసా... ఇంకా ఆ జంప్ అంటే కాలుతో గట్టిగా తన్నడం తెలుసా... ఇంకేమో మరీ బర్డ్స్ ఎలా ఫ్లై చేస్తాయమ్మా అంటే చేతులూపి చూపిస్తానా... 'వేడి' అంటే 'ఈ హా' అని కూడా అంటాను. చూసారా నాకెన్ని తెలుసో....నేను చాలా బోల్డు షార్ప్ కదా....

ఈ నాన్నొకడూ, చెప్పులు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాడు. పోన్లే పాపం అని పట్టికెఌ ఇద్దామనుకుంటే దానికీ నన్నే కేకలేస్తాడు.

అమ్మా అంతే. ఆ గిన్నెలు కడుక్కునేదేదో వుంటుంది కదా. ఆ అదే అదే డిష్ వాషర్. అందులో గిన్నెలు పెడుతూ వుంటుందా. తీసి మౡ బయట పెట్టీ సాయం చేద్దామనుకుంటానా. నన్ను చూసి టప్ అని మూసేస్తుంది.

అమ్మా అయినా నేను వదులుతానా. నాకు మాం మాం పెట్టడానికి అందులోంచి స్పూన్ తీసేటప్పుడూ నన్ను కూడా వొక స్పూన్ తీసుకోనివ్వకపోతే వూరుకుంటానేంటమ్మా...నా దగ్గర కూడా స్పూన్ వుంది కదా నేనూ కుంచెం కుంచెం తీసుకుని తింటే స్పీడు గా అవుతుంది కదా అంటే నన్నస్సలూ గిన్నెలో స్పూన్ పెట్టనివ్వదు. వొక్కోసారి నాకు తోపం వచ్చేసి మాం గిన్నిలో చెయ్యి మొత్తం పెడదామనుకుంటానా.. అప్పుడు మాకిద్దరికీ భలే గొడవవుతుందిలే.

మయూ... అని గాఠిగా అరుస్తుంది. నన్నేవన్నా అంటే వూరుకుంటానేంటి? బుంగ మూతి పెట్టీ...సీరియస్సు గా చూస్తానా...ఇంతలో నా కళ్ళల్లో నీళ్ళు డింగ్ డింగ్ డింగ్ అని వచ్చేస్తాయా...

అంతే అమ్మ ఖోపం అంతా ఢమాల్... పాపం అమ్మ, నన్ను ఎత్తేసుకుని...లేదమ్మా...లేదే అని వూరుకోపెట్టేస్తుంది.

నాకు తెలీదేంటీ వీళ్ళని ఎలా మాయ చెయ్యాలో...:)

.......................


అయ్యో అయ్యో ఇంకా అక్కతో చాలా బోల్డు ఆడుకునే పనుంది. అలా ఎత్తుకుని తీసుకెఌపోతుందేవిటీ? అస్సలు నా మాటంటే విలువా, గౌరవం ఇంకా బోల్డు ఏవీ లేవు ఈ ఇంట్లో.

అందరికన్నా చిన్న సైజులో వున్నా కదా అని అందరికీ లోకువే...:(

అదిగో అదే.... అలాగే రోజూ పాట మొదలెట్టేస్తుంది. ఏంటో పాట వినగానే భుజం మీద తల పెట్టేస్తానా.... ఇంక అంతే జోకొట్టడం మొదలెట్టేస్తుంది.

హాయ్.. ఆ...నాకూ బావుంటుందనుకో...

అర్రే...కళ్ళు మూతలు పడిపోతున్నాయ్.

ఏం అనుకున్నా అమ్మ జోకొడుతుంటే భలే మెత్తగా వుంటుంది లే. వొక్కోసారి నాన్న బబ్బో పెడతారా... కుంచెం గాఠిగా కోప్పడతారు నేను పడుకోకుండా అల్లరి చేస్తే.. అయినా నాన్న కూడా భలే బాగా జోకొడతాడ్లే...

హాయ్...ఇంక నాకు నిద్దరొచ్చేస్తోంది. ఇంక నా వల్ల కాదు.

హ్మ్.... ఈ రోజు కూడా ఈ పెద్ద శాల్తీలు నా మాత వినలేదు. ప్చ్... రేప్పొద్దున్నే చూస్కుందాంలే వీళ్ళ పని...

(ఉపసంహరణ : మా బుడుగు చూపించే హావభావాల వెనక మాటలు ఇవయ్యుంటాయని అనిపించి రాసాను.

చంటి పిల్లలు ఏ భాషలో అలోచిస్తారా అని ఎప్పూడూ నాకు సందేహం. వాళ్ళెలా అలోచించినా అది మనం చెప్పాలనుకున్నప్పుడు రమణ గారి బుడుగు భాష కన్నావేరే ఏదీ గుర్తు రాదు కదా!

బుడుగుని సృష్టించి ప్రతీ తెలుగింటి బుడుగుకీ వొక భాష ని ఇచ్చిన బాపూ రమణలకి నమస్కారాలతో)No comments: