3/9/11

ఆకు లో అకునై...

నీల హంస బ్లాగు లో ఆకు కవితా వస్తువుగా నిర్వహిస్తున్న పోటీ కి పంపిన నా కవితలు ఇక్కడ
తోచిన రాతలు రాయటం తప్ప ఒక అంశం మీద రాయటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నీలహంస బ్లాగ్ నిర్వహిస్తున్న సత్య గారి ఆహ్వానంతో కాస్త ఉత్సాహం వచ్చి ఇలా ప్రయత్నించాను.


ఆత్మ ఘోష


నునులేత చిగురు సొగసులకు పులకించి కవితలల్లిననాడు
మౌనం గానే వుంది...
తన నీడన సేద తీరి చల్లని తల్లివన్ననాడు
మౌనం గానే వుంది...
ప్రాణవాయువునిచ్చిన నీవే దేవతవన్ననాడు
మౌనంగానే వుంది...
నేల రాలటానికి సిధ్ధమైన తనని చూసి మొహం తిప్పుకున్ననాడూ
మౌనం గానే వుంది...
చివరి శ్వాస వరకూ తన పని తను చేస్తూనే వుంది అచ్చు అమ్మలాగ
కాని తన తల్లివేరును నిర్దాక్షిణ్యం గా నరికిన నాడు
నేలకొరిగిన ఎండుటాకులు ఎగిరెగిరి పడ్డాయి...
గోల గోల చేశాయు...
బహుశా అది
మనిషి అజ్ఞానాన్ని చూసి చేస్తున్న వికటాట్టహాసం కావొచ్చు
జాగ్రత్తపడు నాయనా అని చేస్తున్న హెచ్చరిక కావొచ్చు...
ఆకు ఆత్మఘోష కావచ్చు...



మౌన సాక్షులు


వాన చినుకుల్లో తడిసిపోతూ మురిసిపోతున్నాయి చిగురు రెమ్మలు
తడి ఆకుల మీంచి రాలి పడుతున్న నీటి ముత్యాలని దోసిళ్ళలో నింపుకుంటోందొక ముద్దబంతి
ఆ ముద్దుగుమ్మ ముగ్ధత్వానికి మైమరచి, పారేసుకున్న మనసుని వెతుక్కుంటోందొక మొగలి రేకు
నాలుగు కళ్ళూ కలిసిన క్షణాన సిగ్గుల మొగ్గలైన ఆ జంట తడబాటుని చూసి...
ముసి ముసి నవ్వులు రువ్వాయా లేత చిగుళ్ళు

ప్రేమ జంట గుస గుసలకి గుబురుగా మారి తావునిచ్చాయి...
వారి సరాగాలకు తోడు రమ్మని కోయిలమ్మలకి కబురంపాయి
ఇరువురు ఒక్కటైన శుభవేళ, మంగళతోరణాలయ్యాయి...
చేతిలో చెయ్యేసి బాసలు చేసుకున్నవేళ, అరచేత కెంపులై పూసాయి
తలమీద చెయ్యి వేసి శ్రీరస్తూ..శుభమస్తూ అని దీవెనలందించాయి
పండువెన్నెల్లో పవళించిన రేయి, సద్దు చేయొద్దని చిరుగాలికి మనవి చేసాయి
ఆ జంట అన్యోన్యతకి గుర్తుగా తాంబూలమై పండాయి
జీవిత పోరాటం లో అలసి సొలసిన వేళ, వింజామరలై వీచాయి
జీవన సంధ్యకు చేరువైన వేళ సూరీడికి నచ్చ చెప్పి నీడగా మారాయి
జీవన గమనంలో అడుగడుగునా వెన్నంటి వుండి
అంతులేని వారి అనురాగానికి మౌన సాక్షులయ్యాయి

నీల హంస బ్లాగ్ లో మరిన్ని కవితలు చూడొచ్చు
http://neelahamsa.blogspot.com/2011/03/blog-post_05.html

3/8/11

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు




Happy woman's Day... ఉదయాన్నే శ్రీవారి అభినందనలు
చూసావా నేనెంత మంచివాణ్ణో...నువ్వేరోజైనా ఇలా గుర్తుంచుకుని చెప్పావా...వెన్నంటే ఆయన గారి చురక
364 రోజులు రోజూ చెప్పాలంటే కొంచెం కష్టం కదా... నా సమాధానం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

2/28/11

చిలకపలుకులు




చిన్నప్పుడు ప్రతీపిల్లలూ ముద్దు మాటలాడతారు...ప్రతీ బుడుగు మాటలు చాలావరకూ unique గానే వుంటాయి అనిపిస్తుంది నాకు. ఆ వయసులో వాళ్ళ సౄజనాత్మకి కొలతలు లేకపోవటం..మూసల్లో పోసి వారి తెలివితేటల్ని నియత్రించే బోధనా పధ్ధతుల్లో ఇంకా ఇరుక్కుపోకపోవటం కారణాలు కావొచ్చు. నా చిట్టి తల్లి ముద్దు మాటలు అది పెద్దదయ్యాక దానికి గుర్తు చెయ్యాలన్న ఆశతో ఇక్కడ దాచుకుంటున్నాను...మళ్ళీ మర్చిపోకుండా

వద్దా... మానై...

పగెడతానే...

నా నాన్న నిన్నే కొడతాడు.

మామ్మకి ఎన్ని మాటలొచ్చేసాయో!

hello అమానాన్నా తాతగారు అల్లరి చేస్తున్నారు కర్ర పెట్టి కొట్టెయ్

ఏం చేస్తున్నావ్ అని అడిగితే ...నేను బాగా అల్లరి చేస్తున్నాను(పాపం అస్సలు అబధ్ధమాడదు)

అదేంటి...దాని ప్రశ్న...అదీ table సమాధానం...టేబులా...మళ్ళీ అన్నీ confirm చేసుంటుంది


మౌక్తికా... అక్కడ నీళ్ళొంపేసింది( అది చేసిన పాడు పన్లన్నీ ఎవరో చేసినట్టు వాళ్ళ మామ్మకి కంప్లైంట్ లు)

పిల్లకి అస్సలు స్థిరం లేదు(వాళ్ళ మామ్మని imitate చేస్తూ)

మౌక్తిక కి కావాల్ట(దానికి ఏది కావాలన్నా, అది ఎం అల్లరి పనుకు చేసినా తోసెయ్యటానికి అది పెట్టుకున్న dummy...మళ్ళీ మౌక్తిక ఎవరూ అంటే నేనూ అని గుండెలమీద చెయ్యేస్కుని మరీ చూపించేస్కుంటుంది)

బావుందీ...(ఏం పెట్టినా నచ్చినా నచ్చకపోయినా మొదటి ముద్దకి మాత్రం పొగిడేస్తుంది...రెండో ముద్దనుంచీ ఆ తినిపించే వాళ్ళ పాట్లు ఇంక అడక్కండి)

కాకి బావా...కాకి బావా పాట బాగా పడతావేం అన్నాడు...ఏనుగూ తొండం తో బొబ్బ పోసేసిందీ...అనుమానూ(హనుమాన్) రాచ్చసి ముక్కూ చెవులూ కోసేత్తాడు(అది విన్న మూడు కథలు కలిపి తన సొంత కధ ఇలా అల్లింది...పైగా దాని ఉద్దేశం లో హనుమంతుడు సూర్ఫణఖ ముక్కూ చెవులూ కోసేస్తాడు)


జలుబు చేసి తగ్గాక...మళ్ళీ ice cream తింటావా అని కోప్పడితే...strawberry తిననా...(strawberry flavor తిననా) దాని సమాధానం

మామ్మా ice cream తినకూ, దగ్గొస్తుందీ...(మామ్మకి జాగ్రత్తలు బాగా చెబుతుంది)

చద్దక్కేది(శ్రధ్ధక్క)...బబ్బుంది...బబ్బుందా...దివ్యక్కేదీ...బబ్బుంది...బబ్బుందా
(రోజూ పడుకునే ముందు ఒక అరగంట సేపు దాని బుల్లి బుర్రలో వున్న database లో అందర్నీ తల్చుకుంటుంది...దాన్ని జోకొట్టే వాళ్ళు అలా అది పడుకునే దాకా సమాధానం చెప్తూనే వుండాలి)

2/24/11

నా కళాపోషణ - 3

పెయింట్ బ్రష్ తో వేసిన మరి కొన్ని చిత్రాలు...
కళ్ళు చెప్పే ఊసులు








2/17/11

కల కానిదీ...




అనగనగా ఒక మామూలు అమ్మాయి. ఆ అమ్మాయి కలలు కూడా తన లాగే సాదా సీదా. తనకి కాబోయే భర్త, తను ముగ్గేస్తే చూసి ముచ్చట పడాలి, పాట పాడితే విని మురిసిపోవాలి, వంట చేస్తుంటే కూడా తిరుగుతూ కబుర్లాడాలి, ఇద్దరూ కవితలు, కధలు చదివి వాదించుకోవాలి ఇలా...తన తోటి అమ్మాయిల "costly" కలలతో పోల్చుకుని తనవి గగన కుసుమాలేం కావులే అని తృప్తి పడేది. అవి నిజం కావటం అంత కష్టమేమీ కాదని సంబరపడేది. ఒక శుభముహూర్తాన పెద్దవాళ్ళు ఒక చక్కటి అబ్బాయిని చూసి ఆ అమ్మాయికి పెళ్ళి చేసారు.

ఆ అమ్మాయి ముగ్గేసాను చూడమంటే, coffee late అయ్యిందని అలిగాడు అబ్బాయి, కూనిరాగం తీస్తే TV volume వినిపించట్లేదని విసుక్కున్నాడు, తనతో కబుర్లు చెప్పొచ్చు కదా అంటే నాకు బోలెడు పని వుందని కసురుకున్నాడు, తనకి నచ్చిన పుస్తకాలు చూపిస్తే పనికొచ్చే books చదవచ్చు కదా అని సలహా చెప్పాడు.
తన
కలలు, అంత మామూలు కలలు కూడా కల్లలైపోయాయని ఆ అమ్మాయి బోలెడు బాధ పడిపోయింది. కొన్నాళ్ళకి తనకి లాగే ఆ అబ్బాయికి కూడా కలలుండేవని తెలుసుకుంది. తన భార్య పేధ్ధ వుద్యోగం చేసెయ్యాలని, మారిపోతున్న technology ని ఎప్పటికప్పుడు అందిపుచ్చేసుకుంటూ వుండాలని, తను కట్టుకుంటున్న ఆశా సౌధాలకి చేదోడు వాదోడు గా వుండాలని...లాంటి కలలు అబ్బాయివి. ఇద్దరికి తమ Qualification లు ఒకటే కాని కలలు కన్న జీవితాలు వేరని అర్ధమయ్యి చాలా చింతించారు...తమ ఆశలు ఆవిరైపోయాయని దఃఖించారు...ఇద్దరికి ప్రపంచం శూన్యం అనిపించింది...ప్రపంచం లో తమంత దురదృష్టవంతులు లేరనిపించింది...తాము తప్ప అందరు సుఖసంతోషాలతో కళ కళలాడిపోతున్నారనిపించింది...ఫలితంగా పొరుగింటి గోడలకి బోలేడు చెవులు మొలిచాయి.

ఇదంతా గతం...ప్రస్తుతం లోకి వస్తే...

ఇప్పుడు ఆ అమ్మాయి పాట పాడితే చప్పట్లు కొట్టే ఒక చిన్నారి వుంది, కబుర్లు చెప్పుకోవటానికి తనకంటూ ఒక "circle" వుంది, తనకి నచ్చిన పుస్తకాలు చదివి చర్చించుకోవటానికి ఒక group వుంది. తన భార్య వుద్యోగం వేన్నీళ్ళకి చన్నీళ్ళలా తోడైంది కదా అని సర్దుకున్నాడు అబ్బాయి. వాళ్ళ ఇల్లు ప్రశాంతమైన ముంగిలి అయ్యింది...ఈ పరిణామానికి కారణం వాళ్ళిద్దరికి ఇప్పుడు యుధ్ధం కన్నా సంధి గొప్పదని, మాట కన్నా మౌనం లోనే శాంతి వుందని, గెలుపు కన్నా శాంతి మనసుకి ఎక్కువ హాయిని ఇస్తుందనీ తెలుసు. నవ్వుతూ కనిపించిన వాళ్ళందరూ సంతోషం గా వున్నట్టు కాదని తెలుసు. కష్టం అన్నది ప్రతీ జీవితం లో భాగమని తెలుసు. కలిసి బతకాలంటే ఇద్దరి కలలూ ఒకటి కావఖర్లేదనీ, ఒకళ్ళ కలల్ని ఇంకొకరు గౌరవిస్తే చాలని తెలుసు. కళ్ళు తెరిచి కనే కలలు తియ్యగావుంటాయి గాని అవి నిజం అయ్యి తీరాలనుకోకూడదని తెలుసు...జీవితం అంటే కల కాదని తెలుసు...

12/18/10

స్పందన మరిచిన హృదయం


అమ్మ మొదటి సారి Hostel లో వదిలి వెళ్ళినరోజు...గుండె గొంతుకలోకి వచ్చినట్టనిపించి కళ్ళలో నీరు తప్ప నోట మాట రాని తను...అందరినీ వదిలి US వెళ్ళే రోజు అమ్మకే ధైర్యం చెప్పి Flight ఎక్కుతూ తనకి ధైర్యం పెరిగిపోయిందని మురిసి పోయింది

కళ్ళు మూస్తే చాలు భారత్ లో తను తిరిగిన చోట్లు, తనవాళ్ళు గుర్తుకొచ్చిన రోజుల్లోంచి...ఇవాళ్టి గురించిన అలోచన...రేపటి గురించిన బెంగలు తప్ప నిన్నటి సంగతులు కూడా గుర్తు రావట్లేదని తట్టి తను practical ఐపోయానని సంతోషించింది

తను చెయ్యని తప్పుకు boss తిట్టిననాడు తిండీ నీళ్ళు మాని ఏడ్చిన తను...తన తప్పు కూడా పక్కవాడి మీద తోసేసిన రోజు బతకటం నేర్చేసుకున్నా అని సంబరపడిపోయింది

విజయం సాధించడం కన్నా...దాని కోసం మనం ఎంచుకున్న మర్గమే ముఖ్యమని నాన్న చెప్పిన సూక్తులు మర్చిపోగలిగిన నాడు గెలుపు సూత్రాలు వంటబట్టించుకున్నానని గర్వపడిపోయింది

కానీ ఈరోజు...Traffic jam కి కారణం ఏవిటా అని car window లోంచి చూసిన తనకి పెద్ద accident, రక్తం మడుగులో పడివున్న మనిషి కనపడగానే...oh shit...today I am gonna miss the meeting అనుకున్న వెంఠనే ఒక్క క్షణం గుండె కలుక్కు మన్నట్టనిపించింది...

సెలవలకి వూరెళుతూ తను పెంచిన మొక్కకేమవుతుందో అని బెంగెట్టుకున్న తన చిన్ని గుండె...TV లో ప్రమాదం చూసినా కళ్ళు మూసేసుకునే తన గుండె...చిన్ననాటి స్నేహితురాలి మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపించిన తన సున్నితమైన గుండె...స్నేహితుడి interview sucess కావాలని దేవుణ్ణి ప్రార్ధించిన తన వెన్నలాంటి గుండె...ఇంత బండరాయైపోయిందా అని తల్చుకోగానే...భగవంతుడా ఎదగడమంటే గుండె బండబారిపోవటమే ఐతే ఇంక చాలు అనుకుంది...
స్పందన మరిచిన హృదయం ఒక్కసారిగా కరిగి కను సన్నల్లో కన్నీటి చుక్కైంది...

8/12/10

నా మనసుకి మరో ప్రపంచం కావాలి


గుండె నుండి పొంగే నవ్వు కావాలి
స్వేఛ్ఛా విహంగం రెక్కలు కావాలి
అత్మీయత నిండిన పలకరింపు కావాలి
నిజం నిండిన మాట కావాలి
నేనున్నాననే తోడు కావాలి
ప్రకృతిని ఆస్వాదించే సమయం కావాలి
ఒత్తిడి తెలియని ఉద్యోగం కావాలి
పోటీ పడని సహోద్యోగి కావాలి
పోలిక ఎరుగని స్నేహం కావాలి
అంతస్తు పట్టని బంధం కావాలి
సహజత్వం నిండిన మనిషి కావాలి
అబధ్ధం తో అవసరం లేని బాధ్యత కావాలి
అవసరంతో పని లేని నమ్మకం కావాలి
గుప్పిట ముయ్యని మనసు కావాలి
నా మనసుకి మరో ప్రపంచం కావాలి