11/29/11

తూర్పు వెళ్ళే మనసు
నల్లటి మెట్లు, మెట్లపక్కన పిట్టగోడ మీదుగా పాకిన సన్నజాజి పందిరి, మెట్ల మళుపుకి పక్కగా నల్లటి ఇనప చువ్వల కటకటాలు, దాని మీదుగా పాకిన రాధా మనోహరాల చెట్టు, వాటి మీదుగా ఇంకాస్త ముందుకి వెళితే బల్లల గది.
గచ్చు బదులు బల్లలు పేర్చి కట్టిన డాబా పైన గది. నాకూ నాతో పాటూ నా cousines ముగ్గురూ, మాతో సమానం గా అల్లరి చేసిన పిన్నిలు, చిన్న మావయ్యా...మా అందరి వూహలకీ రెక్కలొచ్చిన పొదరిల్లు ఆ బల్లల గది.

మా కలల ప్రపంచానికి తలుపులు తెరిచి స్వాగతం పలికిన హరివిల్లు ఆ గది.

కాస్త గట్టిగా నడిచినా పెద్దగా చప్పుడు చేసి, కింద నుంచి పెద్దవాళ్ళ చేత "ఏవిటా అల్లరి?" అని అక్షింతలు వేయించి నవ్వుకున్న చిలిపి కిట్టయ్య లాంటి గది.

చీమల్లా అలికిడి కాకుండా ఆ గదిలో దూరి, కట్టుకున్న పేక మేడలు, చెప్పుకున్న కబుర్లూ, కలబోసుకున్న స్కూలు అనుభవాలూ, చదివిన చందమామ కథలని నాటికలుగా మార్చి రాసుకుని, పెద్దవాళ్ళంతా చాయ్ తాగే వేళకి వాళ్ళముందు మా రాతలకి దృశ్య రూపం ఇచ్చేసి.. బుల్లి నటీ నటులుగా కొట్టించుకున్న చప్పట్లు, పోటా పోటీలుగా ఆడుకున్న అంత్యాక్షరులూ, తాతగారి పందిరి మంచం ఎదురుగా వుండే పెద్ద వుయ్యాలాతో చేసిన ఫీట్లూ, తగిలించుకున్న దెబ్బలూ, తాతగారితో కలిసి పెద్దవాళ్ళకి తీసిపోకుండా ఆడిన పేకాటలు, ఆయన పెద్ద విస్తరాకు కంచం...వెండిపువ్వుల పీట కోసం పడ్డ పోటీలూ, వాటిని తీర్చడానికి పెద్దాళ్ళ ఆపస్సోపాలూ, సంజె వేళ పెరట్లో చేసిన భోజనాలు, ఆటల మధ్య మా అలకలూ,పేచీలూ...మర్నాడు ఉదయానికి ఏమీ ఎరగనట్టు కలిసిపొయిన చిన్నారి స్నేహాలూ...

ఇంచుమించు ఇరవై మంది పూటకో గంట మాత్రం వదిలే కుళాయి నీళ్ళతో సద్దుకుని మహదానందంగా గడిపిన ఎర్రటి ఎండాకాలం సెలవలు...ఆశా సౌధాలకి పునాదులు వేసుకున్న అమ్మమ్మ గారింటి జ్ఞాపకాలు...


                                *******************************************

పెరటి వేపు నల్లటి పెద్ద గేటు మీద పాకిన రాధామనోహరాలు...

డాబా మీదుగా చూస్తుంటే కనబడే హరేరాం మైదానం, దాని మధ్యలో వుండే రాములవారి కోవెలా, దాని వెనకాలే వుందని నేను చాలా రోజులు భ్రమపడినా, దూరం గా వుండే నరసిమ్హస్వామి కొండ...

డాబాపైన చెక్క కటకటాళ్ళ వరండా...ఒక్కో గోడకీ పది కిటికీలు వాటికి బుల్లి బుల్లి తలుపులూ వుండే కిటికీల గదీ...గది చుట్టూ బీరువాల్లో పేర్చిపెట్టిన తాతగారి అపురూపమైన ఆస్తి ...ఆయన పుస్తక సంపద.

ఇంటి వెనకాల పెద్ద బావీ, పెరడంతా నీడనిస్తూ మావిడి చెట్టూ. పొద్దున్నే పలకరిస్తూ తులసమ్మ ఎదురుగా ముద్దమందారాల చెట్టూ.

సెలవలకి ఎప్పుడొస్తానని నాలుగురోజుల ముందునుంచే వాకబు చేస్తూ , నేను వచ్చిన ఐదునిమిషాల్లో ప్రత్యక్షమయ్యి వాళ్ళతో ఆటలకి లాక్కెళ్ళిపోయే నా బుల్లి నేస్తాలూ.

మధ్యాహ్నం గాళుపు కొడుతోందని ఇంట్లో పెట్టి ఎన్ని గడియలు వేసినా చల్లగా జారుకుని చెట్ల నీడలో ఆడిన గుజ్జినగూళ్ళు, పప్పు బెల్లాలతో చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు.

మామ్మ చెలులతో కలిసి ఆడిన గవ్వలాటలూ.

తాతగారిని మధ్యాహ్నం వేళ కునుకు తియ్యనివ్వకుండా వేసిన యక్ష ప్రశ్నలూ, ఆయన చెయ్యి  పట్టుకుని గర్వం గా చేసిన సాయంత్రం షికార్లూ.

వీధరుగు మీద మామ్మ వడిలో తల పెట్టుకుని నూట యాభయ్యో సారి కూడా విసుగు లేకుండా రామాయణ కధ చెప్పించుకున్న వెన్నెల రాత్రులు.

నా కోసం ప్రత్యేకం గా ఫ్రిజ్జు లోంచి గడ్డ పెరుగు తీసి చక్కెర చల్లి ఇచ్చే పక్కవాటాలో అద్దెకుండే ఆంటీ, నన్ను చూసి కేరింతలు కొట్టే ఆంటీ వాళ్ళ చిచ్చరపిడుగూ.

మనసులో మెదిలినప్పుడల్లా కళ్ళలోకి సన్నటి నీటిపొరని మోసుకొచ్చే మామ్మ గారింటి జ్ఞాపకాలు...


                                       *******************************************


ఇప్పుడా బల్లల గది లేదు. కిటికీల గది వుందో లేదో తెలీదు.

భౌతికంగా శిధిలమైపోయినా జ్ఞాపకాల వాకిట్లో మాత్రం ప్రాణం పోసుకుని సజీవంగా వున్నాయి. ఆ రోజులు తిరిగి రాకపోవచ్చు. చెదరని ఆ జ్ఞాపకాల జల్లులు మాత్రం మనసు మీద దాడి చేసినప్పుడల్లా వాటితో పాటుగా బోలెడంత వుత్సాహాన్ని కూడా మూటకట్టుకుని తీసుకొస్తాయి.

మనిషి ప్రయాణం పడమటికే ఐనా మనసు ఎప్పటికప్పుడు తూరుపు వెళ్ళే రైలు ఎక్కేస్తూనే వుంటుంది ఉదయ సంజె వెలుగుల్ని పలకరించి రావటానికి.

మనిషి time machine ఎక్కి వెనక్కి వెళ్ళలేకపోవచ్చు. మనసు మాత్రం ఏ technology తో పని లేకుండా తనకి కావల్సినప్పుడల్లా రోజు వారీ పనుల్లోంచి విరామం తీసుకుని  రెక్కలు కట్టుకుని వెనక్కి ఎగిరిపోగలదు. జ్ఞాపకల వీధుల్లో షికార్లు కొట్టి తాజా పరిమళాలనద్దుకుని వర్తమానం వాకిట్లో వాలిపోగలదు...


 జ్ఞాపకాలు...కాస్త పరుగాపి చతిగిలబడి కళ్ళు మూసుకుంటే తలపుల ముంగిట్లో ప్రత్యక్షమయ్యే చెక్కు చెదరని  స్మృతుల తేనె చినుకులు. ఎప్పటికప్పుడు మనసుకి కొత్త వుత్తేజాన్ని ఇచ్చి పరుగులు పెట్టించడానికి దొరికే పని విరామాలు. తరవాతి తరాలకి "మా చిన్నప్పుడు" అని చెప్పుకోడానికి మనసుపొరల్లో నిక్షిప్తమయ్యే నిధి నిక్షేపాలు. విరగబూసిన రాధామనోహరాల సుగంధాన్ని తమతో పాటు మోసుకొచ్చే సీతాకోక చిలుకలు...

(ఈ మధ్యే అమ్మమ్మ వూరు వెళ్ళొచ్చిన cousine ముఖపుస్తకం లో పెట్టిన update తో...మనసులో మెదిలిన జ్ఞాపకాల పరంపర కి అక్షర రూపం.)

11 comments:

మధురవాణి said...

రాధామనోహరాలు చూడగానే పరిగెత్తుకొచ్చాను స్ఫురితా.. నాకు చాలా ఇష్టం ఆ పువ్వులు.. :)
మీ జ్ఞాపకాలు ఆ పువ్వులంత అందంగా ఉన్నాయి. Beautiful post! :)

తృష్ణ said...

మా తాతగారి ఇంటి గురించి ఓసారి బ్లాగ్లో రాసాను అలా ఉందండి మీ వర్ణన కూడా.రాధామనోహరాలు నాకు ఇష్టం.చిన్నప్పుడు మా ఇంటి గుమ్మలో ఉండేదీ తీగె. వెరీ నైస్.

Manasa said...

enta bagundandi, mammalni andarini mee ammamma gari intiki teesukellaru mee varnanato..

ammamma gari illu ki manasulo enta manchi stanam untundo kada..toorpu velle manasu -chala bagundi.

sunita said...

మీ టపాలన్నీ (అంటే బ్లాగంతా)చదివేసానోచ్చ్!బాగున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కరలేదుగా? మధుర చెప్పినట్లే ఒక యునీక్ ఫీల్:)))

గీతిక బి said...

చాలా చాలా బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు.

అంత అద్భుతమైన బాల్యాన్ని సొంతం చేసుకున్న మీరు అదృష్టవంతులు.

కొత్తావకాయ said...

చాలా చాలా చక్కగా రాసారు. నిజం! టైం మెషీన్ అవసరం లేదు. మనసుకి రెక్కలున్నాయ్, చిన్నతనంలోకి ఎగిరి వెళ్ళిపోడానికి. :)

స్ఫురిత said...

మధురవాణీ, నాకూ ఆ పువ్వులన్నా వాటి పేరన్నా చాలా ఇష్టం...ధన్యవాదాలు
తృష్ణా అవునండీ మీ టపా నాకూ గుర్తుంది...ధన్యవాదాలు
మానసా..ధన్యవాదాలు...మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం..అమ్మమ్మ ఇంటికి మనసులో ప్రత్యేక స్థానం వుంటుంది.
సునీతా నిజమా...చాలా చాలా సంతోషం...గాల్లో తేలాను మీ వ్యాఖ్య చొశాక కాస్సేపు...:) బోల్డు ధన్యవాదాలు...
గీతికా నిజమేనండీ...మా తర్వాత తరంలో అంటే ఒక ఐదు పదేళ్ళ తర్వాత పుట్టిన మా cousines కీ ఈ అదృష్టం దొరకలేదు..అప్పటికే అమ్మమ్మా తాతగారు వెళ్ళిపోవడంతో...
కొత్తావకాయా...మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...

Goparaju Radhakrishna said...

poola vanam la mee blog chala nachindi.

- Goparaju Radhakrishna

vijaya krothapalli said...

హాయ్ స్ఫురితా....

నీ బ్లాగ్స్ లో ఒక్కటి చదివినందుకే నాకు ఇంత ఆనందం అనిపించింది. అన్నీ ఒక్కరోజు లోనే చదవేయకుండా రోజూ ఒక్కొక్కటిగా చదవాలనుకున్నాను. ఆ చదివినదానికి నాకు వచ్చిన సంతోషాన్ని వెంటనే నీతో పంచుకోవాలనిపించి రాసేస్తున్నాను. ఏమీ అనుకొవుకదూ..
స్ఫురితా ...
నిన్ను ఏ విధం గా ప్రసంసించాలో తెలియడం లేదు. నీ రాతలు చదువుతుంటే కన్నీళ్లు ఆపడం నాకు చేత కావడం లేదు.. అంటే నీ రాతలు ఏడుపు తెప్పించాయనుకోకు. బాధ కలిగినపుడు ఏడుపు రావడం ఒకరకమైతే, పట్టలేని ఆనందానికి కూడా అవధి లేకుండా కన్నీళ్లు రావడం రెండో రకం. నీ రాతలు అలా రెండో రకానికి చెందినవి. అందరి జీవితాల్లో జరిగిపోయిన బాల్యపు రోజులు, చేసిన అల్లరులు, ఇంకా మరెన్నో జ్ఞాపకాలు... ఉంటాయి. వాటిని ఇంత మనసుకు హత్తుకొనేలా వ్రాయడం అందరికీ చేతకాదు. నువ్వు నాకు బంధువువి అవ్వడం నా లక్ అయితే, ఇంతవరకు నిన్ను నేను కలవలేక పోవడం నా బాడ్ లక్. ఫ్యామిలీ రీయూనియన్ ఫొటోస్ లో నిన్ను చూసేవరకు నాకు తెలియలేదు. ఒక మంచి అవకాశాన్ని మిస్ అయ్యానని.
అమ్మా,నాన్నకి కూతురిగా , మామ్మకి మనవరాలుగా, నీ భర్త కి అందమైన భార్యగా , నీ కూతురికి అపురూపమైన తల్లిగా , అత్తా,మామలకి మంచి కోడలిగా, ఎందఱో నీ అభిమానులకు నచ్చినదానివిగా ఉండేనిన్ను నిండు నూరేళ్ళు సుమంగళిగా, సకల సౌభాగ్యాలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో, చల్లగా ఉండమని దీవించడం తప్ప నీకేమి ఇవ్వగలను.
నీ రాతలు చదువుతుంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత మధురం గా ఉంటాయో కదా....అనిపించింది. ఇకనించి ఎప్పటికప్పుడు నీ కలం నించి ( మౌస్ నించి కూడా ) వచ్చే ప్రతీ అక్షరం చదువుతాను. ఇంతగా మనసుని కదిలించే శక్తి నీరాతలకు ఉందని నీకు తెలియదేమో... నీలాంటి కవితా చాతుర్యం నాకు లేకపోయినా స్పందిచే మనసు ఇచ్చినందుకు భగవంతునికి సర్వదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ.......
విజయ.

vijaya krothapalli said...

స్ఫురితా...
"కనులకి విందు
చెవులకి ఇంపు
మనసుకి మధురానుభూతి...
ఇది రమణ రాసి...బాపూ గీసిన సీతారామ చరితం..."
శ్రీ రామరాజ్యం గురించి ఎంత చక్కటి విశ్లేషణ ఇచ్చావు. నీ బ్లాగు చదివాక అయ్యో చూడలేదే.. అనుకున్నాను. బాపూ, రమణల సినిమా అయినా నటీనటుల వల్ల మనసు పడలేకపోయాను. అప్పుడు ముంబై లో ఉన్నాము. ఆ పాటలు వినే అవకాశం కూడా లేకపోయింది. మా ఫ్రెండ్స్ కొందరు బాగుందని అన్నారు కానీ, నీలా విశదంగా చెప్పలేకపోయారు. నువ్వన్నట్టు ఈరోజుల్లో , ఈతరం పిల్లలకి మన మహా గ్రంధాలయిన రామాయణ, మహాభారతాల గురించి తెలియాలంటే అది ఈ రోజులకి తగ్గట్టు సినిమాల వల్లనే అవుతుంది. వాటిని సరైన దర్సకత్వం చేయగలిగినవాళ్ళు తీసినప్పుడే ఆ మానవతా విలువలు కలకాలం అందరికీ గుర్తు ఉంటాయి. నీకంటే నూటయాభాయ్యోసారి కూడా చెప్పగలిగే మామ్మ ఉంది. అందరికీ అంతటి అదృష్టం ఉండదు కదా.... కనీసం ఇప్పుడైనా అవి చదివి రాబోయే నా మనవలకి చెప్పగలిగితే నేను కూడా అదృష్టవంతురాలిని అవుతాను.
విజయ.

డేవిడ్ said...

స్ఫురిత భలే ఉందొ నీ పేరు......నీ పోస్టులు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి...