3/11/10

నా తొలి చూపుల్లో అమెరికా


ఈ పోస్ట్ మొదలు పెట్టే ముందు చాలామంది ఇలా వాళ్ళ అనుభవాలు రాసేసి వుంటారు కదా అనిపించింది, కానీ ఎవరి పిల్ల వాళ్లకి ముద్దు అన్నట్టు నా అనుభవాలు నాకూ అని మొదలు పెట్టేసా.

చాలా మంది అమ్మాయిలలాగా నేను కూడా పెళ్లి చేస్కోవటం అనే కారణం చేత మాత్రమే అమెరికా కి వచ్చాను. చెప్పొచ్చేదేంటంటే నాకు అమెరికా మీద విపరీతమైన ప్రేమ గాని, కనీసం ఆకర్షణ గాని ఏమి లేవూ అనీ, కేవలం అబ్బాయి నచ్చడం చేతనే గానీ, అమెరికా లో ఉన్నాడన్న కారణం చేత మాత్రమే పెళ్లి చేస్కున్న జాబితాకి చెందననీ అన్నమాట. వచ్చిన మొదటి రోజే ఎప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతానురా బాబూ అనిపించింది చాలా మందికి లాగానే. ఇక్కడికి రావటమే తమ జీవితాశయం అనుకుని వచ్చిన వాళ్లకి కూడా అలాగే అనిపిస్తుందిట లెండి అది వేరే విషయం.

వచ్చిన కొత్తల్లో ఒకసారి restaurant కి వెళ్ళాం. అక్కడ ఎవరో ఇండియన్స్ కనపడగానే ఆహా మనవాళ్ళూ అనుకుని హి హి హి అని ఒక నవ్వు నవ్వేసా. నేనేమో మన దేశం వదిలేసి ఇంత దూరం లో వున్నాం కదా,  ఇంక మనవాళ్ళు కనపడగానే ఎప్పుడొచ్చావ్, మా ఇంటికి రండి వీలు చూస్కుని అని పలకరించేస్తారు అనుకునేదాన్ని. వాళ్ళు నన్ను ఒకసారి పైనించి కిందకి విచిత్రం గా చూసి వెళ్ళిపోయారు. ఇంకొంచెం ముందుకి వెళ్ళగానే అక్కడ ఒక అమెరికన్ నన్ను చూసి hello, how are you? అంటూ పలకరించేసాడు. వీడిని ఈ జన్మ లో చుసిన జ్ఞాపకం నాకెక్కడా రావట్లేదే. నా క్షేమ సమాచారాలన్నీ అడుగుతున్నాడు అనుకుని ఒక నవ్వు నవ్వానో లేదో తెలియకుండా ఒక expression ఇచ్చి వచ్చేసా. తర్వాత మా వారు చెప్తే తెలిసింది అలా ఎదురుపడిన వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళ కష్టం సుఖం కనుక్కోవటం వాళ్ళ సంప్రదయంట. ఇంక మనవాళ్ళ చూపుకి అర్ధం ఏమిటి అంటే ఇక్కడవాళ్ళని చూసే నవ్వలేక చస్తున్నాం ఇంకా నిన్ను చూసి కుడా నవ్వాలా తల్లీ అనిట. ఆ restaurant నుంచి బయటకు వస్తుంటే మా వారు తలుపు పట్టుకుని ఆగారు, నేను తర్వాత ఆ తలుపు వదిలేసి మామూలుగా వచ్చేస్తే నా వెనక వస్తున్నవాడు పడబోయి ఆపుకుని నానా తంటాలు పడ్డాడు. నేను పట్టుకున్నా కదా నువ్వెందుకు వదిలేసావ్ అంటారు ఆయన. నాకేం తెలుసు అది కూడా వాళ్ళ సంప్రదాయమని. తనేదో నా మీద ప్రేమతో పట్టుకున్నారని అపోహ పడ్డాను. అరిటిపండు వొలిచి పెట్టినట్టు చెప్తే కదా తెలిసేది అనే టైపు నేనైతే చూసి అల్లుకు పోవాలి అనే తత్త్వం ఆయనది. ఎం చేస్తాం. ఇలాంటి వాళ్ళ సాంప్రదాయాలు, చిలక పలకరింపులు, ఐనదానికి కాని దానికి చెప్పేసే Sorry లు Thank you లు చూసి ఆహా వీళ్ళెంత సంస్కార వంతులో, ఎంత నెమ్మదస్తులో అనుకునేదాన్ని మొదట్లో.

మధ్యాహ్నం నువ్వు ఇచ్చిన స్వీట్ తినేసి, చేసిన పని పొగిడేసి అదే రోజు సాయంత్రం అబ్బాయి ఇంక నీతో పని ఐపోయింది, రేపట్నుండి ఆఫీసు కి రానవసరం లేదు, నీ భవిష్యత్తు మూడు పువ్వులు ఆరు కాయలు గా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాఅని చల్లగా చెప్పగలిగేటంత మంచి వాళ్ళని తర్వాత్తర్వాత తెలిసింది. లేదు, కాదు, బాగాలేదు లాంటి పరుషమైన మాటల్ని కూడా గొంతులో పంచదార పోస్కున్నంత తియ్యగా నవ్వుతూ చెప్పేస్తారు. వీళ్ళకి emotions ఉండవో లేక పొతే అందరూ ఏమైనా మాస్కు లు వేస్కుని తిరుగుతారో తెలియదు మరి.

మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత లో సామాన్లన్నీ మోస్కుని మా తొలి గృహ ప్రవేశం చేసిన రోజు తెలిసింది మొదటి సారిగా dignity of labor కి అర్ధం ఏమిటో. ఆ తర్వాత చాలా సార్లే తెలిసిందనుకోండి. ఆఫీసు అయ్యాక ఇంటికి వచ్చి ఈ ఇంటి పన్లన్నీ చెయ్యలేక పోతున్నాను బాబోయ్ అంటే మీ దేశం లో లాగ ఇక్కడ బానిసలు దొరకరు అంటారు తను ( మా వారికి అసలు తను అమెరికన్ ని అనీ తప్పిపోయి ఇండియా లో వుండేవాణ్ణనీ ఒక బలమైన అభిప్రాయం లెండి). బానిసలు అని ఎందుకు అనుకోవాలి ఇంకొకళ్ళకి మనకి చేతనైనంతలో జీవనోపాధి కల్పిస్తున్నాం అనుకోవచ్చుగా అంటాను నేను. ఇక్కడ కూడా కల్పించొచ్చు అనుకోండి కాని మాలాంటి వలస జీవుల వల్ల అయ్యే పని కాదు.

ఇంక ఇండియా కి call చేసినప్పుడు, అక్కడకి వెళ్ళినప్పుడు చూడాలి వాళ్ళ కుతూహలం. అక్కడ అదెలా వుంటుంది, ఇదెలా వుంటుంది అని ఎవరి ఇంటికి వెళ్లినా చిన్న చిన్న interview లు చేసి పడేసేవారు. వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నప్పుడు అనిపించేది అబ్బో నాకూ ఇంత తెలుసా అమెరికా గురించి అని. కాని చాలా మంది మాటల్లో అనిపించింది ఏంటంటే వాళ్ళ దృష్టి లో అమెరికా అంటే ఇంకా భూతల స్వర్గమే, బంగారు లోకమే.

కాని ఇక్కడ కూడా ఆర్ధిక అసమానతలు, జాతి, మత వైషమ్యాలు వున్నాయి. 200 అంతస్తుల భవంతుల ఎదురుగుండానే అడుక్కునే వాళ్ళూ వున్నారు. పోలీసు వ్యవస్థ ఎంత బలంగా వుందో అని సంతోష పడే లోపు నేర వ్యవస్థ ఎంత బలం గా వుందోనూ కనబడుతూనే వుంటుంది. school bus ఆగగానే వెనకాల, ముందు traffic అంతా ఆగి పోయి పిల్లలకి రోడ్ మీద కల్పిస్తున్న భద్రత చూసి సంబరపడిపోయే లోపే ఇంట్లోనే వాళ్లకి వుండే అభద్రత గురించి తెలిసి మనసు చివుక్కుమంటుంది. పోనీ ఇక్కడ traffic rules ని ఎంత బాగా follow అవుతున్నారో అని మురిసిపోయే లోపే accident లు వెక్కిరిస్తూనే ఉంటాయి. అబ్బో ఎన్ని medical facilities ఉన్నాయో అనుకుందాం అంటే insurance లేందే Doctor చూడడు, ఒక వేళ చూసినా వాడి బిల్లు జీవితాంతం తీర్చినా తరగదు. insurance ఉండాలంటే ఉద్యోగం వుండాలి, పొద్దున్న లేస్తే అది వుంటుందో వూడుతుందో తెలియదు. ఆ tentions తో ఇంకొన్ని కొత్త రోగాలు... ఇవన్నీ ఉన్నాక అది స్వర్గం ఎలా అవుతుంది. నా దృష్టిలో స్వర్గం అంటే మనుషులందరికీ సమానం గా డబ్బు, సంతోషం వుండాలి. భయం అన్నది వుండకూడదు. పసిపాపలు పంజరాల్లోను, పెద్దల కనుసన్నల్లోను కాకుండా స్వేచ్చగా హాయిగా ఆడుకోగలగాలి. ఇక్కడ పెద్దవాళ్ళతో సహా అంతా పంజరాల్లోనే వున్నారనిపిస్తింది. భౌతికమైన సుఖాలు కొన్ని వున్నప్పటికీ దాన్ని మించిన మానసిక ఆందోళనా, అశాంతీ. కముకు దెబ్బల్లాగ అనమాట. అన్ని దేశాల్లాగా ఈ దేశం కూడా సుఖః దుఃఖాలు, కలిమి లేములు, మంచీ చెడుల సమ్మేళనం అంతే అనిపిస్తుంది నాకు.

ఇవన్నీయిక్కడ నా తొలి రోజుల్లో అనుభవాలు. అంటే ఇప్పుడు నీకు అంతా బాగానే అన్పిస్తోందా అంటే ఏమో మరి, బహుశా అలవాటు అయిపోయి వుంటుంది. నన్ను మొదటిసారి హైదరాబాదు లో project work కోసం అని దింపటానికి వచ్చి ఇది ఇక్కడ ఈ ఉరకలూ పరుగుల మధ్య ఎలా నెగ్గుకొస్తుందో అని మా అమ్మ కంగారు పడిపోతుంటే, అమీర్ పేట లో ప్రతీ institute కి కట్టిన banner ని వింతగా చూస్కుంటూ నడిచే ప్రతి అమ్మాయి, అబ్బాయి నీ కూతురు లా కొత్తగా వచ్చిన వాళ్ళే వదినా అన్నారు మా బాబాయ్ ఒకాయన. అదే బాబాయ్ తో ఈమధ్యే మా పిన్ని, తన కూతురు గురించి మా అమ్మ లాగే కంగారు పడిపోతుంటే నీకు లాగే, వదిన కూడా బోల్డు కంగారు పడిపోయింది స్ఫురిత ని దింపడానికి వచ్చినపుడు, ఇప్పుడు చూడు అది అమెరికా లో కుడా ఏలేస్తోంది అన్నారట. మా అమ్మ గర్వం గా నాతో చెప్పింది ఈమధ్య. అంతేనేమో ఏదైనా కొత్తలో భయం గాను, వింతగాను అనిపిస్తుంది. నిన్నటి దిన పత్రిక లాగే ప్రతీది రేపటికి పాత బడి పోతుంది. ఒక్కటి మాత్రం అనిపిస్తుంది, ఇక్కడ ఎన్నాళ్ళు వున్నా ఇండియా కి వెళ్లిపోయినపుడు,ఇక్కడికి వచ్చాక ఇండియా మీద బెంగ పడినట్టు అమెరికా మీద బెంగ పెట్టేసుకోమేమో అని. కన్నతల్లి మీద ప్రేమ , మాతృ భూమి మీద మమకారం అంటే అదేనేమో.

17 comments:

Maddy said...

chaala baaga chepparandi
nijam adhi...

Anonymous said...

ఎక్కడా 'హిపోక్రసీ' అన్నది లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా వ్రాయడానికి చాలా ధైర్యం కావాలి.అది మీలో ఉన్నందుకు,చాలా సంతోషం.!!

అబ్రకదబ్ర said...

>> "ఎన్నాళ్ళు వున్నా India కి వెళ్లిపోయినపుడు,ఇక్కడికి వచ్చాక India మీద బెంగ పడినట్టు America మీద బెంగ పెట్టేసుకోమేమో అని. కన్నతల్లి మీద ప్రేమ , మాతృ భూమి మీద మమకారం అంటే అదేనేమో"

కాదేమో. ఇండియా అమ్మైతే, అమెరికా భార్య (ఎన్నారైలకేననుకోండి). ఎవరెక్కువంటే ఏం చెబుతారు?

ఎక్కడుండాల్సిన సమస్యలు, సంతోషాలు అక్కడున్నాయి. దూరమయ్యాకే విలువ తెలిసేది - ఇప్పుడు మీకు ఇండియా విలువ తెలిసినట్లు.

'Padmarpita' said...

బాగున్నాయి మీ అనుభవాలు!!

hanu said...

nijame kadaa,

బ్లాగాగ్ని said...

చాలా బాగా వ్రాశారు. చాలామందిలా అమెరికా అంటే భూతలస్వర్గం అని వ్రాసి సరిపెట్టేయ్యకుండా మరో కోణాన్ని చూపే ప్రయత్నం చేశారు. అభినందనలు.
>> India మీద బెంగ పడినట్టు America మీద బెంగ పెట్టేసుకోమేమో
ఇది సత్యం. నాకీ వాక్యం చాలా నచ్చింది.

savitri said...

excellent ga rasavu akka......very touching and true.........naa janmabhumi..........ani padukunna......

స్ఫురిత said...

Maddy మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.

ఫణి బాబు గారూ, నాకు ధైర్యం వుంది అన్నందుకు చాలా సంతోషం. చాలా విషయాల్లో చాలా పిరికి దాన్నని నాకే అనిపిస్తుంది.

హను గారూ, పద్మార్పిత గారు కృతజ్ఞతలు.

ఫణి కుమార్ గారూ మీకు నచ్చినందుకు సంతోషం.

అబ్రకదబ్రగారూ,

స్ఫురిత said...

అబ్రకదబ్రగారూ,

America నుంచి India కి వెళిపోతే మహా ఐతే అబ్బా ఇక్కడలా అక్కడ power cut ఉండేది కాదు. Traffic jam అయ్యేది కాదు, ఇంత Polution ఉండేది కాదు అనిపిస్తుందేమో. అవి బెంగపెట్టేసుకొవడం లోకి రావేమొనండీ.

ఐనా నేను India విలువ తెలియక, America అంటే అద్భుతం అనే అభిప్రాయం తో ఇక్కడికి రాలేదండీ. ఆ విషయం మొదటి పేరా లోనే విన్నవించుకున్నాను.

America ని పెళ్ళాం తో పోల్చడం మాత్రం నాకు నచ్చలేదండీ. ఇక్కడికి వచ్చేవాళ్ళు 90% వాళ్ళు బాగుపడదాం అనుకుని వస్తారు గానీ America ని ఏదొ వుద్ధరిద్దామని రారు కదా. పెళ్ళి అంటే ఒకరికి ఒకరు అని నా వుద్దేశం మరి. పోనీ పెళ్ళామే అనుకున్నా తల్లి స్థానం ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువే గా. మంచి చెడు లక్షణాలతో సంబంధం లేకుండా మనల్ని ప్రేమించేది, మనం ప్రేమించగలిగేది కూడా తల్లే గదా...

ఇంకా రాసేస్తే ఇంకో టపా ఐపొతుందేమో కాబట్టి ఇంక అపేస్తున్నా.

ఏది ఏమైనా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు...

KumarN said...

చెప్పే ఏ అభిప్రాయమైనా, ఎలాంటిదైనా సిన్సియర్ గా, అవతలి కోణం లోంచి చెప్పే వాళ్ళని ఎగతాళి చేయకుండా చెపితే ఎవరైనా వింటారు, ఇష్టపడతారు. మీరు అలాగే రాసినందుకు పోస్ట్ బాగుంది.

కాపోతే నా మటుకు అమెరికా లో ఉన్నంత కంఫర్టబుల్ గా నాకు ఇండియాలో ఉండదు ఎందుకో. అక్కడ ఉన్నన్ని రోజులు బానే ఉంటాను కాని, ఒక్కసారి ఫ్లైట్ ఇక్కడ లాండ్ అయ్యి, కస్టంస్ అన్నీ క్లియర్ చేసి బయటకి రాగానే ఫ్రెష్ గా ఊపిరి పీల్చుకొని ఎంత హాయిగా ఉంటుందంటే, I feel AT HOME all over again. I love this country, not for what it has given me, because it hasn't given me anything more than what I didn't have back in India(I didn't come here for better job, I had the best one back home, giving it up was very tough).

ఎనీవే ఎందుకు రాసానంటే, మీర్రాసిందానికి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, దానికి నేనే ఉదాహరణ అని చెప్పడానికి.

గుడ్ షో, తరచూ రాస్తూండండి.

స్ఫురిత said...

కుమార్ గారూ,

Thanks for the comment. నేను ఇక్కడ రాసినవి కేవలం నా అభిప్రాయాలు, అనుభవాలు. I know many people who feel more comfortable here when it compared to India. But I am not one of them. that's it. అందరి అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు కదండీ.

ఈ పోస్ట్ చదివి వినిపించాక మా నాన్నగారు, ఎవరూ hurt కాకుండా చుస్కుని రాయమ్మా అన్నారు. మీ Comment చూసాక హమ్మయ్య అనుకున్నాను. :)

స్ఫురిత

సుజాత said...

చక్కగా రాశారు! ఈ రెండో కోణం అక్కడ ఉన్న దాదాపు అందరి మనసుల్లోనూ ఉంటుంది(మీరు చెప్పిన రీతిలో కాకపోయినా మరో రకంగా). మీరు దాన్ని ప్రతిభావంతంగా వ్యక్తీకరించారు.


కుమార్,
ఏళ్ళతరబడి అక్కడ ఉండి ఆ జీవిత విధానానికి, అక్కడి సమాజానికి అలవాటు పడ్డవారు ఇక్కడికొచ్చి డిస్ కంఫర్ట్ ఫీలవడంలో ఆశ్చర్యం లేదు. డ్రైవింగ్ నుంచీ,కాలుష్యం వరకూ, ఇంకా మరెన్నో విషయాల్లో! ఎగ్రీడ్!

స్ఫురిత said...

సుజాత గారూ,

మీ అభిప్రాయానికి కృతజ్ఞతలండీ

sivaprasad said...

chala bagunnai mi jnapakalu

కొత్త పాళీ said...

Interesting.

"India మీద బెంగ పడినట్టు America మీద బెంగ పెట్టేసుకోమేమో"
ఇది నేనొప్పను. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. కాని తిరిగొచ్చిన ప్రతిసారీ, హమ్మయ్య, ఇంటికొచ్చి పడ్డాం అనే ఒక రిలీఫ్.

sunita said...

అమెరికా మీద బెంగ పెట్టుకుంటామండీ!పిల్లలు ఇక్కడ సర్దుకోలేక ఫ్రస్ట్రేటు ఐనప్పుడూ, మిస్ ఐన ఫ్రెండ్సూ ఎప్పటికప్పుడు కొత్తగా కుదురుకోవాలిసిరావడం,లైబ్రరీ మిస్ కావటం,అక్కడ మామూలుగా దొరికే ప్రతిదానికీ ఇక్కడ లెక్క లేనన్ని డబ్బులు ఖర్చు పెట్టాలిసిరావడం ఈ తలనొప్పి చాలా చికాగ్గా ఉంటుంది.ఇంకా చాలా తేడాలున్నాయి.అవన్నీ రాస్తే ఇదో పెద్ద పోస్ట్ అవుతుంది.

కొత్తావకాయ said...

చిత్రమేమిటంటే నేనూ మీలాగే వచ్చాను.కానీ మీరు చూస్తున్న నాణానికి రెండో వైపు నాకు కనిపిస్తోంది. :)

నేనయితే అమెరికా మీద బెంగ పెట్టుకుంటాను. నా కాఫీలో ఎక్ష్ట్రా షాట్ తో పాటూ చిరునవ్వూ కలిపిచ్చే బరిస్తా మీదా, పిల్లాడున్న స్ట్రాలర్ తోసుకుని వస్తూన్నా, ఒంటరిగా వస్తున్నా నాకు తలుపు పట్టుకుని తల చిన్నగా వంచి నవ్వే వారి మీదా, మంచులో లాక్డ్ అవుట్ అయినప్పుడు పదే పది నిముషాల్లో వచ్చి సాయం చేసిన వారి మీదా (అతని ఉద్యోగ ధర్మమే కావచ్చు),"అసలు విసుక్కోని హాస్పిటల్ నర్సుల" మీదా.. బోలెడు బెంగ పెట్టుకుంటాను. :)అవి ఉద్యోగ ధర్మాలో, అక్కర్లేని నవ్వులో అయినా నా రోజు హాయిగా గడిచేలా చేస్తున్నాయ్ మరి!